పండిట్‌ జ‌శ్‌రాజ్‌ మృతి: తొలి ప‌ద‌నిసలు హైద‌రాబాద్‌లోనే.. న‌గ‌రంతో ఆయ‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం

పండిట్ జశ్‌రాజ్

ఫొటో సోర్స్, Getty Images

ప్ర‌ముఖ‌ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ జ‌శ్‌‌రాజ్ క‌న్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు.

జ‌శ్‌‌రాజ్ సోమ‌వారం సాయంత్రం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. జ‌శ్‌‌రాజ్ మ‌న‌వ‌రాలు మీనాక్షి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు.

ఆమె బీబీసీ ప్ర‌తినిధి మ‌ధు పాల్‌తో మాట్లాడారు. మ‌రోవైపు న్యూజెర్సీలోని ఇంటిలోనే గుండె పోటుతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న కుటుంబం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

జ‌శ్‌‌రాజ్ ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును అందుకున్నారు. ఆయ‌న‌ది సంగీత నేప‌థ్య‌మున్న కుటుంబం.

ఆయ‌న తండ్రి పండిట్ మోతీరామ్ ఆయ‌న‌కు సంగీతాన్ని ప‌రిచ‌యం చేశారు.

జ‌శ్‌‌రాజ్‌కు నాలుగేళ్ల వ‌య‌సున్న‌ప్పుడే ఆయ‌న తండ్రి మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత సోద‌రుడైన‌ గురు పండిట్ మ‌ణిరామ్.. జ‌శ్‌‌రాజ్‌కు సంగీత పాఠాలు నేర్పించారు.

బాలీవుడ్ సినిమాలకూ జశ్‌రాజ్ సంగీతం అందించారు. అయితే శాస్త్రీయ సంగీత కళాకారుడిగానే ఆయన అందరికీ సుపరిచితం.

మార్చిలో భారత్‌లో లాక్‌డౌన్ విధించినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారు. ఆంక్షలు ఎత్తివేసే వరకూ ఆయన అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబ సభ్యలు తెలిపారు.

మేవాతీ ఘారానా సంగీతంతో జ‌శ్‌‌రాజ్‌కు మంచి సంబంధ‌ముంది. ఈ ఘారాను జోధ్‌పుర్‌కు చెందిన పండిట్ ఘ‌గ్గే న‌జీర్ ఖాన్ మొద‌లుపెట్టారు. వారి శిష్యుడు పండిట్ నాథులాల్ నుంచే ఈ సంగీతాన్ని జ‌స్‌రాజ్ తండ్రి నేర్చుకున్నారు.

జ‌శ్‌‌రాజ్ మ‌ర‌ణంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు. "భార‌త శాస్త్రీయ సంగీతానికి ఇది తీర‌ని లోటు. ఆయ‌న అద్భుత‌మైన సంగీతం అందించారు. ఎంతో మంది సంగీత క‌ళాకారుల‌ను ఆయ‌న మార్గ‌నిర్దేశం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అభిమానుల‌కు సానుభూతి ప్ర‌క‌టిస్తున్నా"అని మోదీ ట్వీట్ చేశారు.

మ‌రోవైపు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా సంతాపం వ్య‌క్తం చేశారు. "ఎనిమిది ద‌శాబ్దాల నుంచి జ‌శ్‌రాజ్ సంగీతం ఆల‌పిస్తున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్నాను"అని ఆయన ట్వీట్ చేశారు.

జశ్‌రాజ్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.

అద్నాన్ సమీ, శంకర్ మహదేవన్, జావెద్ అక్తర్ తదితర సినీ ప్రముఖులూ సంతాపం ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images

2005లో బీబీసీ హిందీతో పండిట్ జ‌శ్‌‌రాజ్ మాట్లాడారు. త‌న సంగీత ప్ర‌స్థానానికి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు.

"ఎన్ని శ్వాసలు తీసుకోవాలి? ఎన్ని కార్యక్రమాలు చేయాలి? అని చెప్పడం చాలా కష్టం. సంగీత రంగంలో నేను కాంట్రిబ్యూషన్ చేశానని అనుకోను. నేను ఏమీ చేయలేదు. నేను కేవలం ఒక మాధ్యమం మాత్రమే. అ‍ంతా నా సోదరుడు, ఆ దేవుడి దయే. ప్రజల ప్రేమ నాకు దక్కింది" అని ఆయన వివరించారు.

"చాలా సార్లు నేను పాడటానికి మంచి స్వరం కోసం వెతకాల్సి వస్తుంది. నాకు అది దొరికిన రోజు, జనాలు నేను దేవుడిని చూశాను అంటారు. ఏ రోజైతే నేను బాగా పాడాను అనుకుంటానో, ఎవరో ఒకరు "ప‍‍ండిట్ జీ ఏమైంది ఈ రోజు ఏమైంది" అని అంటారు".

"అవును, ఈ దేశంలో జన్మించిన ప్రతి క‌ళాకారుడూ త‌న కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. వారంతా సంగీతానికి ఎంతో కొంత సేవ చేశార‌ని భావిస్తాను. దీనిలో వారి పాత్రేంటో ప్ర‌జ‌లే చెప్పాలి. క‌ళాకారుడికి అత‌డి సేవేంటో తెలియ‌డం క‌ష్టం‌".

"శాస్త్రీయ సంగీతంలో ప్ర‌యోగాల గురించి మాట్లాడుతూ.. కొత్త క‌ళాకారులు నేడు కొత్త‌కొత్త ప్ర‌యోగాల‌తో ఎంతో శ్ర‌మిస్తున్నారు. వారి సంగీతాన్ని ప్ర‌జ‌లు కూడా వింటున్నారు".

"చాలా మంది త‌మ ప్ర‌యోగాల‌తో శాస్త్రీయ సంగీత ప‌రిధిని పెంచారు. అలాంటి వారిని నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదరిస్తున్నారు. ఇది శుభ‌ప‌రిణామం".

ఫొటో సోర్స్, Getty Images

హైద‌రాబాద్‌తో అనుబంధం

జ‌శ్‌‌రాజ్ హ‌రియాణాలో జ‌న్మించారు. అయితే ఆయ‌న పెరిగింది మాత్రం హైద‌రాబాద్‌లోనే. అంబ‌ర్‌పేట‌లో ఆయ‌న నివ‌సించేవారు.

ఆయ‌న చివ‌రి కార్య‌క్ర‌మం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా గ‌త ఏప్రిల్‌లో సాగింది. వార‌ణాసిలో నిర్వ‌హించిన హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌ల కోసం ఆయ‌న ఫేస్‌బుక్ లైవ్ ద్వారా సంగీతం వినిపించారు.

జ‌శ్‌రాజ్ తండ్రి హైదరాబాద్‌లోనే మ‌ర‌ణించారు. ఆయ‌న జ్ఞాపకార్థం ఏటా ఇక్క‌డ‌ జ‌శ్‌రాజ్ ప్ర‌త్యేక సంగీత క‌చేరీలు చేసేవారు. చౌమ‌హ‌ల్లా ప్యాలెస్‌లోనూ ఆయ‌న చాలా క‌చేరీలు ఇచ్చారు.

ఇక్క‌డి రోట‌రీ క్ల‌బ్ ఆయ‌న పేరుతో ప్ర‌వేశ‌పెట్టిన అవార్డును ప్ర‌దానం చేసేందుకు ఏటా ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)