హైదరాబాద్‌లో కరోనావైరస్ గత 35 రోజుల్లో 6 లక్షలకు పైగా ప్రజలకు సోకిందన్న సీసీఎంబీ

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై సంచలన పరిశోధన చేసింది సీసీఎంబీ సంస్థ. మురుగు నీటిలో వైరస్ వ్యాప్తి ఆధారంగా ఈ పరిశోధన సాగింది. ఈ పరిశోధన ప్రకారం హైదరాబాద్లో 6 లక్షల మందికి పైగా వైరస్ సోకి ఉండొచ్చని సీసీఎంబీ చెబుతోంది. అయితే మురుగునీటి ద్వారా వైరస్ రాదని ఆ సంస్థ ప్రకటించింది.

సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సంస్థలు కలసి హైదరాబాద్‌లో మురుగు నీటిలో కరోనా వైరస్ జాడపై పరిశోధన జరిపాయి.

నిజానికి నోరు, ముక్కు నుంచే కాకుండా, మల, మూత్రాల నుంచి కూడా కరోనా వైరస్ విసర్జితమవుతుందని తొలుత పరిశోధకులు గుర్తించారు.

ఒకసారి వ్యాధి సోకిన వారి నుంచి సుమారు 35 రోజుల వరకూ విసర్జితాల్లో వైరస్ ఉంటుంది. అయితే ఈ మురుగునీటిలోని వైరస్ వల్ల మనుషులకు వ్యాధి సోకదని సీసీఎంబీ తెలిపింది.

ప్రస్తుతం 2 లక్షల 60 వేల యాక్టివ్ కేసులు ఉండచ్చు

హైదరాబాద్ నగరంలో రోజుకు 180 లక్షల లీటర్ల మురుగు నీరు విడుదల అవుతుంది. అందులో 40 శాతం మురుగు నీటిని వివిధ ప్లాంట్లలో శుద్ధి చేస్తారు.

నగరంలోని 80 శాతం శుద్ధి ప్లాంట్ల దగ్గర సీసీఎంబీ శాంపిల్స్ తీసుకుంది. నీరు శుద్ధి చేసిన తరువాత వైరస్ కనిపించలేదనీ, తద్వారా నీరు శుద్ధి బాగా జరుగుతోందనీ సీసీఎంబీ వ్యాఖ్యానించింది.

ఈ పరిశోధన వల్ల గత 35 రోజుల్లో ఎందరికి వ్యాధి సోకిందో ఒక అంచనా వేసింది సీసీఎంబీ. సుమారు 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ జాడ ఉన్నట్టు సీసీఎంబీ తెలిపింది. వారు తీసుకున్నది మొత్తం హైదరాబాద్లో 40 శాతం ప్రాంత శాంపిలే కాబట్టి, ఆ లెక్కన మొత్తం హైదరాబాద్లో సుమారు 6 లక్షల 60 వేల మందికి వైరస్ సోకి ఉండొచ్చని ఆ సంస్థ అంచనా చెబుతోంది.

ఈ ఆరున్నర లక్షల్లో గత 35 రోజుల్లో వైరస్ సోకి లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేనివారు, అలాగే కోలుకున్న వారూ ఉన్నారు.

ఫొటో క్యాప్షన్,

రాకేశ్ మిశ్రా

అలాగే, సంప్రదాయ పద్ధతిలో చేసే విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం నగరంలో 2 లక్షల 60 వేల యాక్టివ్ కేసులు ఉండొచ్చని సీసీఎంబీ చెబుతోంది.

సీసీఎంబీ ఐఐసీటీ పరిశోధనలను మెడ్ రెక్సివ్ అనే సైన్సు పత్రికకు పంపించారు. వాటిపై ఇంకా సమీక్ష జరగాల్సి ఉంది.

''ముందు నుంచీ చెబుతున్నట్టే, లక్షణాలు లేకుండా ఎక్కువ మందిలో వైరస్ ఉంటోంది. వారికి ఆసుపత్రి అవసరం లేదు, మరణాల శాతం కూడా తక్కువ అన్న వాదనను మా పరిశోధన బలపరిచింది.

స్థానిక ప్రభుత్వాలతో కలసి ఈ పరిశోధనలు చేయడం ద్వారా ఏఏ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికీ, దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికీ ఉపయోగపడుతుంది అని చెప్పారు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)