కరోనావైరస్: భారత్‌లో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఇకపై ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?

  • అలోక్ జోషి
  • సీఎన్‌బీసీ ఆవాజ్ మాజీ ఎడిటర్, బీబీసీ కోసం
ఉద్యోగాలపై కోవిడ్ ప్రభావం లేకున్నా, ప్రాణాలకే ముప్పు ఉన్న రంగాలు కొన్ని ఉన్నాయి

ఫొటో సోర్స్, VIJAYAWADA MUNICIPAL CORPORATION

కరోనావైరస్ వ్యాప్తి మొదలు కాకముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై చర్చ జరుగుతూ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తమ జనాభాకు చేయూత అందించడంపై దృష్టిపెట్టాలని, అందరికీ ఉపాధి కల్పించడం సాధ్యపడకపోవచ్చని ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన దంపతులు అభిజిత్ బెనర్జీ, ఏస్తర్ దూఫ్లో అప్పుడే హెచ్చరించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటివి ఏయే రంగాల్లో ఉద్యోగాలకు ఎసరు తెస్తాయోనన్న ఆందోళన అప్పుడు ఉంది. కానీ, ఇదంతా 2020 మార్చికి ముందు సంగతి.

ఎవరూ ఊహించినది అప్పుడు జరిగింది. కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. విమాన సేవలు, హోటళ్లు, పర్యాటకం, రైళ్లు, ఆఖరికి బస్సులు కూడా నిలిచిపోయాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జనాలు ఉపాధి కోల్పోయారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి వరకూ) ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఇవన్నీ పూర్తి స్థాయి (ఫుల్‌టైమ్) ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలే.

ఇక రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకూ) ప్రపంచ జనాభాలో 14 శాతం మంది అంటే, 48 కోట్ల మందికి ఉపాధి లేకుండా పోయిందని ఐఎల్ఓ లెక్కగట్టింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్... ఇలా దక్షిణాసియా దేశాలన్నింటిలో కలిపి రెండో త్రైమాసికంలో ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య 13.5 కోట్ల వరకూ ఉండొచ్చని ఐఎల్ఓ నివేదిక అంచనా వేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

‘వ్యాపారాలు తిరిగి, మొదలయ్యాకే నిరుద్యోగానికి సంబంధించి అసలు పరిస్థితిని అంచనా వేయగలం’

మరి రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?

దీనిపై ఐఎల్ఓ మూడు రకాల అంచనాలను వేసింది.

ఒకవేళ కరోనావైరస్ సంక్షోభం సద్దుమణిగి, ఆర్థికవ్యవస్థ తిరిగి గాడినపడితే కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల ఉద్యోగాలు కోల్పోవచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ పరిస్థితి మరింత దిగజారకుండా, ఇప్పటిలాగే కొనసాగితే 14 కోట్ల ఉద్యోగాలు పోవచ్చని అంచనా వేసింది. అదే, పరిస్థితి మరింత తీవ్రమైతే, 34 కోట్ల మంది ఉపాధి కోల్పోవచ్చని లెక్కగట్టింది.

ఈ మూడింటిలో ఏ పరిణామం మనం చూడబోతున్నామో అంచనా వేసే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు.

‘ఎక్కువ మంది ప్రాణాలు ఎలా కాపాడగలం?’ అన్నదే ప్రస్తుతం అందరి ముందు ఉన్న ప్రశ్న. దీని తర్వాతే ‘ఉద్యోగాలు ఎలా కాపాడగలం?’ అన్న ప్రశ్న వస్తుంది.

కరోనావైరస్ సంక్షోభం వల్ల చాలా రంగాల్లో కార్యకలాపాలు ఆగిపోయాయి. అవి తిరిగి ఎప్పుడు మొదలవుతాయన్నదానిపై సందేహాలు తొలగడం లేదు. ఇక, నడుస్తున్న రంగాల్లో, కొత్తగా ఎంతవరకూ ఉద్యోగాలు కల్పించవచ్చనే విషయంపై ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది.

‘కోవిడ్ ప్రూఫ్ జాబ్స్’ గురించి చాలా అధ్యయన నివేదికలు వస్తున్నాయి. ఇవి కరోనావైరస్ వల్ల దుష్ప్రభావం పడని రంగాల్లోని ఉద్యోగాలు. ఎఫ్ఎంసీజీ, అగ్రో కెమికల్, ఈ కామర్స్, వైద్య రంగం, పరిశుభ్రత, లాజిస్టిక్స్, ఆనలైన్ ఎడ్యుకేషన్, ఐటీ వంటి రంగాలు కోవిడ్ ప్రూఫ్ జాబ్స్ కిందకు వస్తాయి. భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రమాదం లేదనే అనుకోవచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

‘ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు’

ఉద్యోగాలపై కోవిడ్ ప్రభావం లేకున్నా, ప్రాణాలకే ముప్పు ఉన్న రంగాలు కొన్ని ఉన్నాయి. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, టెస్టింగ్ సిబ్బంది... ఈ విభాగంలోకి వస్తారు. ఈ రంగంలో సిబ్బంది అవసరం కూడా ఎక్కువగా ఉంటోంది. తగినట్లుగా వేతనాలు కూడా పెరుగుతున్నాయి.

మరోవైపు ఈ సమయంలో నిరుద్యోగ గణాంకాలను లెక్కించడమే తప్పని భారత్‌లోని అతిపెద్ద స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ ఛైర్మన్ మనీష్ సభర్వాల్ అంటున్నారు.

‘‘ఆదివారం మధ్యాహ్నం పూట లెక్కిస్తే, దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉంటుంది. లాక్‌డౌన్‌లో లెక్కించడమూ అలాంటిదే. వ్యాపారాలు తిరిగి, మొదలయ్యాకే అసలు పరిస్థితిని మనం అంచనా వేయగలం. అందుకు కరోనావైరస్ ముప్పు తొలగడం అవసరం. దాన్ని నయం చేసే చికిత్సో, లేక టీకానో రావాలి’’ అని ఆయన అన్నారు.

పరిస్థితులైతే ఇంతకుముందులా ఉండవన్నది సుస్పష్టం. కరోనావైరస్ ముప్పు సమసిపోయినా, జనాల జీవనశైలిపై రాబోయే 50 ఏళ్లపాటు దీని ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్యోగాలు, వ్యాపారాలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయనేది అంచనా వేయడం చాలా అవసరం.

కార్యకలాపాలు ఊపందుకున్న రంగాల్లోనే ఉద్యోగాలు ముందుగా, వేగంగా పెరుగుతాయి. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మే నెలలో దాదాపు 50 వేల మందిని తాత్కాలిక ఉద్యోగాల్లో నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. 2025 వరకు భారత్‌లో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇదివరకు ఆ సంస్థ ప్రకటించింది.

లాక్‌డౌన్ సమయంలో జనాలు ఇంట్లో ఉంటూనే ఆన్‌లైన్ కొనుగోళ్ల జరిపేందుకు మొగ్గుచూపారు. ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలపై దీని ప్రభావం తప్పకుండా ఉండేదే.

ఫొటో సోర్స్, Getty Images

ఆహార పదార్థాలు, సబ్బులు, వంటనూనెల వంటివి తయారు చేసే సంస్థల కార్యకలాపాలు కొనసాగకతప్పదు. ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నవారి (వర్క్ ఫ్రమ్ హోం) వల్ల ఇంటర్నెట్, ఫోన్‌ల వినియోగం బాగా పెరిగింది. టెలికాం సంస్థలకు ఇది శుభవార్తే. ఆయా రంగాల్లోనూ అవకాశాలు పెరుగుతాయి. చాలా సంస్థలు ఇప్పుడు డబ్బును ఆదా చేయాలనుకుంటున్నాయి. అలాంటివాటికి సూచనలు అందించే సలహాదారులు కూడా అవసరమవుతారు.

ఇప్పటికీ సిబ్బంది కొరత ఉన్న పది రకాల ఉద్యోగాల జాబితాను ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ లింక్డ్ఇన్ ఇటీవల వెల్లడించింది. ఆ జాబితాలో ఉన్న ఉద్యోగాలు... సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సేల్స్ రిప్రజెంటేటివ్, ప్రాజెక్ట్ మేనేజర్, ఐటీ అడ్మినిస్ట్రేటర్, కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటర్, ఐటీ సపోర్ట్ (హెల్ప్ డెస్క్), డేటా అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, గ్రాఫిక్స్ డిజైనర్.

ఈ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కాస్త నిశ్చింతగా ఉండొచ్చు. ఇతరులు ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంచుకోవచ్చు.

ఇకపై వైద్య రంగం, ఆన్‌లైన్ విద్య, ఈ కామర్స్ లాంటి రంగాల్లోనూ... ట్రక్కులు, రైళ్లు, విమన సేవలకు సంబంధించిన లాజిస్టిక్స్ రంగాల్లోనూ అవకాశాలు పెరగొచ్చు.

చైనా బయట కర్మాగారాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంస్థలు, ఆసియాలోని ఇతర దేశాలపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఫలితంగా ఇక్కడ తయారీ రంగంలో అవకాశాలు పెరగొచ్చు.

ఇప్పటివరకూ సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నవారికి చాలా రోజులు శిక్షణ ఇస్తూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఇకపై ఉండకపోవచ్చు. నైపుణ్యాలున్నవారిని నియమించుకోవడంపైనే సంస్థలు దృష్టి పెట్టొచ్చు.

మరోవైపు ఇకపై శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోతాయని, అసైన్‌మెంట్‌ను బట్టి నిర్ణీత వేతనానికి పనిచేసే పద్ధతి పెరగొచ్చని టాలెంట్ కామర్స్ వెబ్‌సైట్ సైకీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)