NEET - JEE పరీక్షలు వాయిదా వేయాల్సిందేనా? విద్యార్థులు, తల్లిదండ్రులు ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం ఏం చెబుతోంది?

నీట్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ ప్రణాళికలు తారుమారయ్యాయి. అన్నింటినీ మించి విద్యా రంగంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే 2020-21 విద్యా సంవత్సవరం విషయంలో సందిగ్దత కొనసాగుతోంది.

అదే సమయంలో జాతీయ స్థాయిలో కీలకమైన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) జేఈఈ( మెయిన్స్), నీట్ పరీక్షల విషయంలో వాయిదా లేదని స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన తేదీలలో పరీక్షలు జరిపి తీరుతామని వెల్లడించింది.

దాని ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్‌ను సెప్టెంబర్ 13న జరపబోతున్నారు.

ఇప్పటికే ఈ పరీక్ష తేదీలు పలుమార్లు వాయిదా పడ్డాయి. మే లో జరగాల్సిన వాటిని కరోనా లాక్‌డౌన్ కారణంగా నిర్వహణ సాధ్యం కాకపోవడంతో పదే పదే వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

ఈసారి నీట్ పరీక్షలకు 15,97,433 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ హాల్ టికెట్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో పలుమార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు.

భౌతిక దూరం పాటిస్తూ, పరీక్ష హాల్లో విద్యార్థుల సంఖ్యను కుదించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా పరీక్షా కేంద్రాలను పెంచే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి తోడుగా పరీక్షకు ముందూ, తర్వాత కూడా శానిటైజేషన్ చేసేందకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్‌టీఏ ప్రకటించింది. విద్యార్థులకు మాస్కులు, అవసరం అయినా వారందరికీ హ్యాండ్ గ్లౌజులు కూడా అందిస్తామని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థుల, తల్లిదండ్రుల ఆందోళన ఎందుకు

ఇప్పటికే పరీక్షల వాయిదా విషయం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఈ రెండు పరీక్షల తేదీలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్లపై విచారణ సాగించిన సుప్రీంకోర్ట్ వాటిని తోసిపుచ్చింది. పరీక్షల వాయిదాకి నిరాకరించింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాయిదా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. తగిన ఏర్పాట్లతో ఇంతకుముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ జరుగుతుందని తీర్పునిచ్చింది. త్వరలో వ్యాక్సిన్ రాబోతున్న నేపథ్యంలో మరికొంత కాలం ఈ పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని కోరిన వాదనలు కొట్టివేసింది.

పరీక్షల నిర్వహణ సంస్థ అంగీకరించకపోవడం, సుప్రీంకోర్ట్ తమ పిటీషన్‌ను తోసిపుచ్చడంతో ఇక పరీక్షల నిర్వహణ అనివార్యం అనే అభిప్రాయం బలపడింది. అయినప్పటికీ పలువురు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 3వేల కేసులున్న సమయంలో పరీక్షలను వాయిదా వేసి ఇప్పుడు 30లక్షల పాజిటివ్ కేసులున్న సమయంలో పరీక్షలు నిర్వహించడం సమంజసమా అని వారు ప్రశ్నిస్తున్నారు.

శ్రీకాకుళం నగరానికి చెందిన పి గణేష్ బీబీసీ తో మాట్లాడారు. ''మా అమ్మాయి నీట్‌కు సిద్ధమవుతోంది. గత ఏడాది ఇంటర్మీడియట్ చదివి, లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకుంది. సకాలంలో పరీక్షలు జరుగుతాయని సన్నద్ధమైంది. కానీ చివరి నిమిషంలో కోవిడ్-19 కారణంగా వాయిదాల మీద వాయిదా పడడం చాలా టెన్షన్ పెట్టింది. మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యింది. చివరకు సెప్టెంబర్‌లో పరీక్షలు అని చెబుతున్నా సిద్ధం కాలేకపోతోంది. కోవిడ్-19 భయంతో ఆందోళనలో ఉంది. మా ఇంటి సమీపంలో కొన్ని కేసులున్నాయి. బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇప్పుడు పరీక్షలకు వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. ఓవైపు సెప్టెంబర్‌లో స్కూళ్లు తెరవడానికి అనుమతి లేదని చెబుతూ, మరోవైపు ఇలా పరీక్షల నిర్వహణ ఎలా చేస్తారు. ఇది ప్రభుత్వానికి తగదు. ఇప్పటికే జరిగాల్సిన నష్టం జరిగింది. మరో రెండు నెలల వాయిదాతో పోయేదేముంది'' అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

పరీక్షకు వెళ్లాలా లేదా అని ఆలోచిస్తున్నాను..

నీట్ పరీక్షకు సిద్ధమయిన తమకు ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షా కేంద్రానికి చేరడమే పెద్ద సమస్య అంటున్నారు కొందరు విద్యార్థులు. గణేష్ కుమార్తె సృజన బీబీసీతో మాట్లాడుతూ ''నేను విజయవాడలో ఇంటర్ చదివాను. ఇప్పుడు మా కుటుంబం శ్రీకాకుళంలో ఉంది. పరీక్షా కేంద్రంలో శానిటైజ్ చేస్తారు..సరే మేము శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ వెళ్లాలంటే ఎలా. పరీక్షా కేంద్రం వరకూ వెళ్లడం ఎలా. ఓవైపు రైళ్లు లేవు. అయినా పరీక్షలు జరగాల్సిందేనంటున్నారు. పరీక్షకు వెళ్లి వస్తే ఇంట్లో పెద్ద వాళ్లున్నారు. వాళ్లకు ఏమవుతుందోననేది ప్రశ్నగా మారింది. అందుకే పరీక్షకు వెళ్లాలా లేదా అన్నది ఆలోచిస్తున్నాను. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాయిదా వేయాలని కోరుతున్నాను. లేదంటే నేను పరీక్షకు హాజరుకావడం ప్రశ్నార్థకమే. నాలాంటి వాళ్లు లక్షల మంది ఉన్నారు'' అంటూ తెలిపింది.

ఇప్పుడు పరిస్థితి దిగజారింది కదా..

నీట్ , జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం జూలై 3న నోటిఫికేషన్ ఇచ్చారు. సెప్టెంబర్‌లో పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు దేశంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది కదా అంటున్నారు విజయవాడకు చెందిన మానస. ఆమె జేఈఈ మెయిన్స్ కి సిద్ధమవుతోంది. బీబీసీతో మాట్లాడుతూ ''ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమయ్యాం. కానీ అనుకోని ఉపద్రవం మాకు ఆటంకంగా మారింది. మొదటి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిపి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు. ఇప్పుడు కేసులు పెరిగిన తర్వాత, పరీక్షలు జరుపుతామని పట్టుబట్టడం అర్థంకావడం లేదు. ఇప్పుడు పరీక్షలకు వెళ్లి రావాలంటే ఎలా అన్నది అంతుబట్టడం లేదు. పరీక్షలు నిర్వహించినా, విద్యాసంవత్సరం విషయంలో స్పష్టత లేనప్పుడు ఆతృత ఎందుకు. పునరాలోచన చేయాలి. మా ఆందోళనను అర్థం చేసుకోవాలి. మానసికంగా పరీక్షలకు సిద్ధం కావాలా..కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించాలా అన్నది మాకు పెద్ద సమస్య అయ్యింది'' అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నిసార్లు వాయిదా వేస్తారు..

పదే పదే పరీక్షలు వాయిదా వేస్తూ పోతుంటే విద్యార్థులమే నష్టపోతాం...కాబట్టి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరపడమే ఉత్తమమని కొందరు కోరుతున్నారు. విశాఖకి చెందిన జి అభినయ్ తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు.

''ఇప్పటికే రెండు తేదీలు ప్రకటించినా జరపలేదు. ఎంతో ఒత్తిడికి గురయ్యాం. ఓవైపు కోచింగ్ సెంటర్లు మూసివేశారు. ఇంట్లోనే ఉండి చదవాలి. ఎలా సాధ్యం అవుతుంది ఎన్నాళ్లని అలా. తల్లిదండ్రుల నుంచి కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంలో సుప్రీంకోర్ట్ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడమే మాకు మంచిది. ఒక్క రోజు జాగ్రత్తలు పడితే, ఇన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఈ టెన్షన్ అంతా తగ్గిపోతుంది. అందుకు సిద్ధమయ్యి ఉన్నాం. పరీక్షలు సకాలంలో జరుగుతాయని వంద శాతం నమ్ముతున్నాను'' అంటూ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వానికి కూడా సవాల్

జాతీయ స్థాయిలో కీలకమైన ఈ రెండు ప్రధాన పరీక్షల విషయంలో ఇంత పెద్ద చర్చ సాగుతోంది. దానికి ప్రధాన కారణం ఎక్కువ మంది విద్యార్థులు హాజరుకావడం ఒకటైతే ఆయా రంగాల్లో ప్రతిష్ఠాత్మక పరీక్షలు కావడం మరో కీలకాంశంగా చెబుతున్నారు. వచ్చే వారంలో జరగబోతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా చేపడితేనే నీట్‌కి విద్యార్థులు ధైర్యంగా హాజరవుతారని విద్యావేత్త కే రామకృష్ణ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''ఇప్పటికే కోవిడ్ నిర్వహణ చాలా పేలవంగా ఉంది. చెప్పిన దానికి, చేస్తున్న దానికి పొంతన ఉండడం లేదు. ఉదాహరణకు ఆర్టీసీ బస్సు సర్వీసులలో నిబంధనలు పాటించడం లేదు. దాంతో ప్రయాణాల ద్వారా ఎక్కువగా వైరస్ వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు పరీక్షల విషయంలో కూడా శానిటైజేషన్, మాస్కులు విషయంలో నిర్వాహకులు చెబుతున్నవి ఆచరించాలి. చిన్న చిన్న లోపాలు కూడా పెద్ద నష్టాలకు కారణమవుతాయి. కాబట్టి పటిష్టంగా వ్యవహరించాలి. లేదంటే పిల్లలు పరీక్షా గదులకు హాజరుకావడమే పెద్ద పరీక్ష అవుతుంది. మానసిక ఒత్తిడి మూలంగా చాలామంది వెనకడుగు వేసే ప్రమాదం ఉంటుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన పరీక్షలు ఇలాంటి స్థితిలో శ్రేయస్కరం కాద''ని పేర్కొన్నారు.

జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఏపీలో 20 కేంద్రాలు, తెలంగాణాలో ఆరు కేంద్రాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలివారంలో జరగబోతున్న ఈపరీక్షల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠతో కనిపిస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులపై తల్లిదండ్రులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)