ఆంధ్రప్రదేశ్‌లో వరుస వివాదాల్లో పోలీసులు: ఆగడాలు ఎక్కువయ్యాయా? లేక అక్రమాలపై చర్యలు పెరిగాయా?

  • వి.శంకర్
  • బీబీసీ కోసం
ఏపీ పోలీస్

ఫొటో సోర్స్, AP Police

‘‘నువ్వంటే ఇష్టం. మా ఇంటికి రావాలి’’ అంటూ ఓ పోలీస్ ఎస్సై మహిళను వేధిస్తున్న ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఆ ఎస్సై సస్పెండ్ అయ్యారు.

ఓ గ్రామంలో జరిగిన వివాదానికి సంబంధించి స్టేషన్‌కి తీసుకొచ్చిన దళిత యువకుడికి మరో ఎస్సై గుండు కొట్టించారు. ఆ వ్యవహారం ముదిరి... సదరు ఎస్సై మీద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఆయన అరెస్టై, జైలుకు కూడా వెళ్లారు.

కరోనా సమయంలో మాస్క్ కట్టుకోలేదని మరో యువకుడిని వేధించి, గాయపరిచి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇంకో ఎస్సై సస్పెండ్ అయ్యారు.

ఇక ఓ ఎస్సై ఏకంగా అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తూ దొరికిపోయారు. పక్క రాష్ట్రం నుంచి మద్యం తరలిస్తుండగా పట్టుబడి, అరెస్ట్ అయ్యారు.

ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా చాలా విషయాల్లో పోలీసులు నేరుగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

మైనింగ్ మాఫియా దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నందుకు, కేసులో బాధితులకు న్యాయం చేసేందుకు లంచాలు గుంజినందుకు, చివరకు అరెస్టుల సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు.. ఇలా పలు కేసుల్లో పలువురు పోలీసు అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి రావడం ఈ ఆరోపణలను బలపరుస్తున్నాయి.

చట్టాలను పరిరక్షించాల్సినవారే వాటిని ఉల్లంఘిస్తూ వివాదాల్లోకెక్కుతున్నారు.

మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించకుండా, వెంటనే చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

దళిత యువకుడికి గుండు కొట్టించిన వ్యవహారమైతే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది

అన్ని జిల్లాల్లోనూ అదే తంతు..

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ యంత్రాంగం నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. వరుసగా పోలీస్ అధికారుల అక్రమాలు, ఇతర వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఎస్సై కె.రామకృష్ణ అక్రమ మద్యం అమ్మకాలపై ఓ కేసు నమోదు చేశారు. ఆ కేసు మాఫీ చేయడం కోసం తనను సంతృప్తి పరచాలంటూ ఓ మహిళను ఆయన వేధించినట్టు ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి.

ఈ విషయం చివరకు ఉన్నతాధికారులకు చేరడంతో సదరు ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎస్సై ఎం.విజయ్ కుమార్‌ మరో ఎక్సైజ్ సీఐతో కలిసి అక్రమ మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డారు. లింగగూడెం చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో వారి వద్ద 557 మద్యం దొరికాయి. వాళ్లిద్దరూ తెలంగాణ నుంచి మద్యం తరలిస్తూ, ఏపీలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇక చీరాలలో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎస్సై కె.విజయ్ కుమార్ తీరు వివాదాస్పదమైంది. దళిత యువకుడు కిరణ్‌ కుమార్ పోలీసు కస్టడీలో మరణించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. చివరకు పోలీస్ అధికారులు ఆ ఎస్సైని సస్పెండ్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

సీతానగరంలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన దళిత సంఘాలు (పాత చిత్రం)

హనీ ట్రాప్ మర్డర్‌ కేసులో ఆరోపణలు

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హనీ ట్రాప్‌తో హత్య జరిగినప్పటికీ గుర్తుతెలియని మృతదేహం అంటూ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు.

చివరకు మృతుడి సన్నిహితులు కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణ అదృశ్యంపై కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రామకృష్ణ కాల్ డేటా ఆధారంగా ఆ హత్య వ్యవహారంలో భాగమైన యువతిని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి, నిందితులకు అండగా నిలిచారంటూ ముమ్మిడివరంలో ఎస్సైగా పనిచేసిన ఎం పండుదొరని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

అదే జిల్లాలోని గండేపల్లిలో ఆయిల్ ట్యాంకర్‌ను పట్టుకుని డబ్బులు వసూలు చేసిన కేసులో ఎస్ఐ తిరుపతి రావు సహా ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ అయ్యారు.

తూర్పు గోదావరిలోనే సీతానగరం ఎస్సై ఆనంద్ కుమార్ నకిలీ డీఎస్పీ ద్వారా వ్యాపారులను బెదిరించి, అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి రావడంతో... ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

గత రెండు నెలల్లోనే దాదాపు 20 మంది పోలీసు అధికారులపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది

హైకోర్టు జోక్యంతో కొందరిపై చర్యలు

పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది. ఏలేశ్వరం మండలానికి చెందిన న్యాయవాది పైల సుభాష్ చంద్రబోస్ అరెస్టు విషయంలో పోలీసుల తీరుని తప్పుబట్టింది.

ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహించారంటూ ఏలేశ్వరం ఎస్ఐ కె.సుధాకర్, రాజమహేంద్రవరం త్రీ టౌన్ ఎస్ఐ హరిపై పోలీస్ అధికారులు సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చింది.

ఒక కేసు విషయంలో విచారణ నిమిత్తం ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో నిందితుడి ఇంటిపై దాడి చేయడాన్ని తప్పుగా పరిగణిస్తూ వారిని విధుల్లో నుంచి తొలగించారు.

మరో కేసులు ముగ్గురు వ్యక్తులను నిర్బంధించి గుంటూరు పోలీసుల వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏకంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

ఇక ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్ట్, జైలు పాలయిన పోలీస్ ఎస్సై ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ప్రసాద్ అనే ఓ దళిత యువకుడికి గుండు కొట్టించిన వ్యవహారమైతే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విషయం రాష్ట్రపతి వరకూ వెళ్లింది.

ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్సైని ఇప్పటికే అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉంచారు.

ప్రసాద్‌ను పోలీసు స్టేషన్‌లోనే నిర్బంధించి తీవ్రంగా కొట్టి గాయపరచడమే కాకుండా, గుండు కొట్టించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. సదరు పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ఇన్‌ఛార్జి ఎస్సై ఎస్.కే ఫిరోజ్ షాను సస్పెండ్ చేసి రిమాండుకు తరలించారు. దీనిలో నిందితులుగా లేకున్నా, విధి నిర్వహణలో అలసత్వం వహించిన హెడ్ కానిస్టేబుల్ ఎం.అప్పారావు, మరో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

వీడియో క్యాప్షన్,

సునీతా యాదవ్: ‘మంత్రి అయితే నాకేంటి?’

‘పోలీసు శాఖలో సంస్కరణలు రావాలి’

చట్టాల పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన పోలీసులే అదుపు తప్పి వ్యవహరించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ విషయంపై ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సురేష్ బీబీసీతో మాట్లాడారు.

‘‘పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకురావాలి. ఈ విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా, అమలు కావడం లేదు. ఫిర్యాదులు చేసే అవకాశం ఉండాలి. శాఖాపరంగా పర్యవేక్షణ పెరగాలి. ఇప్పుడైతే ఇలాంటి అవకాశమే లేదు. కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అదుపు చేయాలి. పోలీసు విభాగంగాలో మార్పులు తీసుకొచ్చి, విధులు విభజించాలి. క్రమశిక్షణ పెంచేందుకు, నిత్యం వారికి అవసరమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. పౌర హక్కులు, ఇతర అంశాలలో వారికి తర్ఫీదునివ్వాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. దాన్ని ఆచరణలో చూపించాలి. నిజానికి పోలీసుల నేరాలు వెలుగులోకి వస్తున్న కేసులు కొన్నే. కాబట్టి వాటి పట్ల సీరియస్‌గా స్పందించాలి’’ అని అన్నారు.

వీడియో క్యాప్షన్,

కరోనా రోజుల్లో పోలీస్ డ్యూటీ: ఒక లేడీ కానిస్టేబుల్ అంతరంగం

స్పందించని డీజీపీ కార్యాలయం

గత రెండు నెలల్లోనే దాదాపు 20 మంది పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. పైగా పోలీసుల తీరు మీద, నిబంధనావళి ఉల్లంఘించడంపైన ఏపీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో సస్పెన్షన్ల పర్వం మీద రాష్ట్ర డీజీపీ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ, డీజీపీ కార్యాలయం స్పందించేందుకు నిరాకరించింది.

పోలీస్ నిబంధనావళి అమలులో భాగంగానే ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసుల్లో గతంతో పోలిస్తే కొంత క్రమశిక్షణా లోపం కనిపిస్తోందని రిటైర్డ్ డీఎస్పీ ఎం.సత్య నారాయణ అభిప్రాయపడ్డారు.

‘‘గతంలో పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా నిబంధనావళి విషయంలో కఠినంగా ఉండేది. రాను రాను పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోందని అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. దాన్ని సరిదిద్దే పరిస్థితి రావాలి. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఎస్సై స్థాయి నుంచి అధికారుల అందరూ విధుల విషయంలో నిబద్ధత చాటుకునేలా స్ఫూర్తి పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది’’ అని అన్నారు.

అందరికీ శిక్షణ అవసరం.. మానవత్వం ముఖ్యం: సీఎం జగన్

పోలీస్ శాఖలో సిబ్బందికి తగిన శిక్షణ అవసరం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.

పోలీస్ స్టేషన్ లోనే దళిత యువకుడికి శిరోముండనానికి పాల్పడిన ఘటనపై ఆయన స్పందించారు. ‘‘తప్పు చేస్తే ఎస్సైని జైలులో పెట్టిన ఘటన గతంలో లేదు. ఎస్సై అయినా, సీఐ అయినా తప్పు చేస్తే చర్యలు తప్పవు. ఇలాంటి ఘటనలో బాధితులు మన బంధువులయితే ఉపేక్షిస్తామా..’’ అని ఆయన స్పష్టంచేశారు.

‘‘కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైలు సహా అందరికీ శిక్షణ అవసరం. ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించాలి. మానవత్వంతో వ్యవహరించేలా చూడాలి. మానవ హక్కులు, మనం ఎంతవరకూ వ్యవహరించాలనే దానిపై వారికి స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్,

కరోనా లాక్‌డౌన్: తెలంగాణ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా వాడుతున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)