రామ్‌గోపాల్ వర్మ నిజ జీవితంతో మూడు సినిమాలు.. హీరో ఎవరంటే... - ప్రెస్ రివ్యూ

రాంగోపాల్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నిజ జీవితం సినిమా తెరకెక్కనున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నిజ జీవితం తెరపైకి రానుంది. అది కూడా ఒక్క సినిమా కాదు.. మూడు సినిమాలు కావడం విశేషం.

రామ్‌గోపాల్‌ వర్మ ఆధ్వర్యంలో దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

బొమ్మాకు క్రియేషన్స్‌ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మించనున్నారని సాక్షి రాసింది.

ఇందులో మొదటి సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారని తెలిపింది.

ఈ సందర్భంగా బొమ్మాకు మురళి మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్‌ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలుగా నిర్మించనున్నాం. ఒక్కొక్క భాగం 2 గంటలుంటుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం" అన్నారు.

మొదటి భాగంలో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నారు. రెండో భాగంలో వేరే నటుడు నటిస్తారు. ఇక మూడో భాగంలో ఆర్జీవీ పాత్రలో స్వయంగా ఆర్జీవీయే నటించబోతుండటం విశేషం’’ అని తెలిపారని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, K.KESHAVARAO/FACEBOOK

కేంద్ర పథకం పేరిట ఎంపీ కేకేకు మోసగాళ్ల ఫోన్ కాల్

కేంద్ర పథకం పేరుతో ఎంపీ కేకేనే మోసం చేయాలని కొందరు మోసగాళ్లు ప్రయత్నించినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

సామాన్యులనే కాదు ఎంపీలను వదలడంలేదు మోసగాళ్లు. ఎంపీ కేకేకు సోమవారం ఓ ఫోన్‌ కాల్‌వచ్చింది. కేంద్ర పరిశ్రమలశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్‌గా పరిచయం చేసుకున్నాడు.

కేంద్రం.. సెంట్రల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ స్కీంను ప్రవేశపెట్టిందని, 25 మందికి రూ.25 లక్షల చొప్పున రుణం ఇస్తున్నదని తెలిపాడు.

ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పాడు. ‘ఎంతోమంది ఎంపీలు పోటీపడుతున్నా, మంత్రి కేటీఆర్‌ సిఫారసుతో మీకే మంజూరుచేయించాలని భావిస్తున్నాం. పేర్లు పంపితే రుణాలిస్తాం’ అని వివరించాడని పత్రిక చెప్పింది.

విషయాన్ని కేకే.. తన కుమార్తె గద్వాల్‌ విజయలక్ష్మికి చెప్పారు. ఆమె.. మహేశ్‌కు ఫోన్‌చేయగా దరఖాస్తుకు ఈ రోజే చివరితేదీ అని, ఒక్కొక్కరికీ రూ.1.25 లక్షల దాకా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని, అకౌంట్‌కు డబ్బు పంపిస్తే దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తానని చెప్పాడు.

విజయలక్ష్మి తన డివిజన్‌లో కొంతమందికి పథకం గురించి వివరించారు. అనుమానం వచ్చిన ఎంపీ కేకే.. మహేశ్‌ అనే వ్యక్తికి కాల్‌ చేయగా తాను మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో ఉన్నట్టు సమాధానం చెప్పాడు.

ఆయన నేరుగా కేటీఆర్‌కు ఫోన్‌చేయగా.. ఢిల్లీలో ఉన్నట్టు పీఏ ద్వారా తెలిసింది. మహేశ్‌ చెప్పింది అబద్ధమని గుర్తించి కుమార్తెను, ఇతరులను కేకే అప్రమత్తం చేశారు.

అప్పటికే అఖిల్‌ అనే వ్యక్తి ఆ ఖాతా కు రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.దీనిపై అఖిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, Khalid Chougle/facebook

కుప్పకూలిన భవనంలో మృత్యుంజయుడు

మహరాష్ట్రలో కుప్పకూలిన భవనం శిథిలాల్లో చిక్కుకుపోయిన నాలుగేళ్ల బాలుడు మృత్యుజయుడుగా నిలిచాడని ఈనాడు కథనం ప్రచురించింది.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

శిథిలాల కింద 18 గంటలపాటు ఉన్న బాలుడిని సహాయక బృందాలు కాపాడాయి.

మహద్‌ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పదేళ్ల నాటి ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.

75 మందికిపైగా శిథిలాల్లో చిక్కుకుపోగా.. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇప్పటి వరకు 60 మందిని రక్షించారు.

మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది.

భవనం కూలిన 18 గంటల తరువాత శిథిలాల కింద ఉన్న మహ్మద్‌ నదీమ్‌ బంగి(4) అనే బాలుడిని సహాయక బృందాలు రక్షించాయి.

కాంక్రీట్‌ స్లాబ్‌ కింద చిక్కుకున్న ఆ చిన్నారిని గ్యాస్‌ కట్టర్ల ద్వారా కడ్డీలను తొలగించి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇంత ప్రమాదం జరిగినా మృత్యుంజయుడిగా ఆ బాలుడు ప్రాణాలతో బయటపడటం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే ఈ ఘటనలో అతని తల్లి నౌషిన్‌ నదీమ్‌ (30), సోదరీమణులు ఆయేషా(7), రుకియా(2) ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలచివేసిందని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

దళితులపై దాడులు సహించం: ఏపీ సీఎం జగన్

దళితులపై దాడులు, ఇతర ఘటనలపై ఏపీ సీఎం జగన్ పోలీసుల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

తప్పు ఎవరు చేసినా తప్పేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పోలీసు శాఖకు స్పష్టం చేశారు.

దళిత యువకుడికి శిరోముండనం వంటి సంఘటనలను ప్రశ్నించారు.

స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

దళితులపై దాడులు సహా ఇతర ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు ఆంధ్రజ్యోతి చెప్పింది.

గత ప్రభుత్వానికీ.. ఇప్పటి ప్రభుత్వానికీ తేడా ఉందన్నారు. ఏదైనా తప్పు చేస్తే ఎస్సైను పోలీసు స్టేషన్‌లో పెట్టిన ఘటన గతంలో జరగలేదని.. తప్పు చేసింది సీఐ అయినా.. ఎస్సై అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే ఉపేక్షిస్తామా అని పోలీసు అధికారులను ప్రశ్నించారు.

కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైలు తదితర స్థాయుల్లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ నిర్వహించాలని ఆదేశించారని కథనంలో తెలిపారు.

మానవత్వంతో వ్యవహరించడంతో పాటు ప్రజలకున్న హక్కులేంటి.. మనం ఎంత వరకూ వెళ్లాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

రాష్ట్ర హోం మంత్రి దళితురాలని, డీజీపీ ఎస్టీ అని వారికి ఆయన గుర్తు చేశారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)