చైనా - భారత్ సరిహద్దు ఉద్రిక్తతలు: చైనాను ఎదుర్కోవడంలో భారత్‌ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?

  • జుగల్ ఆర్.పురోహిత్
  • బీబీసీ ప్రతినిధి
సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

భారత చీఫ్ ఆఫ్ మార్షల్ జనరల్ బిపిన్ రావత్ ఆగస్టు 24న చేసిన ఒక వ్యాఖ్యకు చాలా పత్రికల్లో మొదటి పేజీల్లో చోటు లభించింది. అంతేకాదు దీనిపై జోరుగా చర్చ కూడ జరుగుతోంది.

ఆ రోజు ఆయన “లద్దాఖ్‌లో చైనా సైన్యం ఆక్రమణను ఎదుర్కోడానికి సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే దానిని అవలంబిస్తామ”ని ఏఎన్ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు.

రక్షణ, సైనిక రంగాల్లో పనిచేసిన దిగ్గజాలు బహుశా ఈ ప్రకటనకు విస్తుపోయుంటారు.

“సైనిక ప్రత్యామ్నాయాలు లేవని సీడీఎస్ చెప్పగలరా, ఆయన వాస్తవాలే చెబుతున్నారని నాకు అనిపిస్తోంది” అని సైన్యం ఉత్తర కమాండ్ చీఫ్‌గా పనిచేసిన జనరల్ (రిటైర్డ్) డీ.ఎస్.హుడా అన్నారు.

దీనిపై భారత వైమానిక దళం డిప్యూటీ చీఫ్‌గా రిటైరైన ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా కూడా స్పందించారు.

“సీడీఎస్ చెప్పినదానిలో ఏదైనా తప్పు ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. అది చాలా ఆచితూచి చేసిన ప్రకటన. ఇది కాస్త ముందు చేసుంటే బాగుండేదని నాకు అనిపిస్తోంది” అన్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్,

ఇండియన్ ఆర్మీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్

చైనా సైన్యం ఎంత బలమైనది?

జనరల్ రావత్ మాటల్లో గూడార్థాలు వెతికేముందు మనం చైనా గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.

చైనా భూ సరిహద్దు 22 వేల కిలోమీటర్లు, తీర సరిహద్దు 18 వేల కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది కాకుండా అది విదేశాల్లో కూడా మౌలిక సదుపాయాలు సిద్ధం చేసి ఉంచింది. వీటిలో జిబూతీలో ఉన్న సైనిక స్థావరం కూడా ఉంది.

భారత్‌లో రక్షణ శాఖ, హోం శాఖ విడివిడిగా ఉంటే. చైనాలో ఒకే ఒక సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) ఉంటుంది. సీఎంసీని ఆర్మీలో ప్రధాన భాగంగా, సైనిక బలగాలకు కమాండర్‌గా చెబుతారు. దీనికి చైర్మన్, వైస్ చైర్మన్ నేతృత్వం వహిస్తారు.

ఫొటో సోర్స్, STR

సీఎంసీ చైర్మన్ షీ జిన్‌పింగ్

సీఎంసీ చైనాలో ప్రతి సైనిక బలగాన్ని నియంత్రిస్తుంది. వీటిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), పీఎల్ఏ నేవీ, పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్, పీఎల్ఏ రాకెట్ ఫోర్స్, పీఎల్ స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్, పీఎల్ఏ జాయింట్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఫోర్స్ ఉన్నాయి.

మరోవైపు భారత్‌లో ప్రతి దళానికి తమ కమాండ్ ఉంటుంది. అదే చైనా ఆర్మీలో భౌగోళికంగా నిర్వచించిన ఐదు థియేటర్ కమాండ్(టీసీ) ఉంటాయి. వీటిలో ఈస్టర్న్ టీసీ, సదరన్ టీసీ, వెస్టర్న్ టీసీ, నార్తర్న్ టీసీ, సెంట్రల్ టీసీ ఉన్నాయి.

2019లో భద్రతపై జారీ చేసిన శ్వేతపత్రంలో 2012 తర్వాత నుంచి సైన్యంలో జరిగిన మార్పుల గురించి చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. అందులో.. దేశంలో యాక్టివ్ సైనికుల సంఖ్య 20 లక్షలు కాగా, సంయుక్త సైన్యం తమ సామర్థ్యాన్ని 3 లక్షల మంది జవాన్లకు తగ్గించింది.

ఆర్మీలో సైనికుల సంఖ్యను తగ్గించినా, ఎయిర్ ఫోర్స్ లో మాత్రం సైనికుల సంఖ్య అలాగే కొనసాగుతోంది. ఇక నేవీ, పీఎల్ఏఆర్ఎఫ్‌లో సైనికుల సంఖ్యను పెంచారు. పీఎల్ఏఆర్ఎఫ్ దగ్గర చైనా అణు, సంప్రదాయ క్షిపణుల నిల్వ ఉంది. దీనిని గతంలో సెకండ్ ఆర్టిలరీ ఫోర్స్ అని కూడా అనేవారు.

చైనా 2012 నుంచి సైన్యంపై ఎక్కువ నిధులు వ్యయం చేస్తోంది. మంచి వేతనాలు, జవాన్లకు శిక్షణ, వారికి పనిచేసే వాతావరణం ఏర్పాటు, పాత ఆయుధాలను కొని కొత్తగా మార్చడం, సైనిక సంస్కరణలు, వివిధ భద్రతా బలగాల మధ్య సామరస్యం ఉండేలా వీటిని ఖర్చు చేస్తున్నారు.

అయితే, చైనా వాదనలపై చాలామంది భారత రక్షణ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చైనా టెక్నిక్ నిరూపితం కాలేదని, వారి భద్రతా బలగాలకు యుద్ధ అనుభవం కూడా లేదని అంటున్నారు..

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

భారత సైనిక ప్రత్యామ్నాయాలు అంటే?

చైనాతో 3488 కిలోమీటర్ల పొడవునా ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) దగ్గర తాము స్వయంగా రక్షణాత్మక యుద్ధంలో ఉన్నట్టు భారత సైన్యం చూస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చైనాపై మన సైనిక వ్యూహాలు పాకిస్తాన్‌కు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్ విషయంలో మనం దూకుడుగా ఉంటాం. చాలా ప్రాంతాల్లో వారిని బెదిరిస్తాం కూడా. కానీ చైనాను బెదిరించే విషయంలో మనం రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరిస్తాం. యుద్ధాన్ని మనం అసలు ఊహించం. అంటే, మనం ఎల్ఏసీ దాటి దాడి చేయలేమని కాదు. అవసరమైతే మనం చేయాలి. భారత్ ‘మౌంటెన్ స్ట్రైక్ కార్ప్స్’ ఏర్పాటు చేసింది దానికోసమే” అంటారు జనరల్ హుడా

చైనా చొరబాట్లకు సమాధానంగా భారత్ ‘టిట్ ఫర్ టాట్’ వ్యూహంతో ఆ దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించి బేరసారాలు జరపవచ్చా?

సమాధానంగా “ఇలాంటి ప్రత్యామ్నాయాలు బహుశా ముందే అనుసరించి ఉంటే బాగుండేది. టిట్ ఫర్ టాట్ వ్యూహం ప్రకారం బేరసారాలు ఆడే ప్రత్యామ్నాయం, రెచ్చగొట్టేలా అనిపించవచ్చు. కానీ మనం మంచి స్థితిలో ఉన్నామని, వారికి సమాధానం ఇవ్వగలిగే సైనిక సామర్థ్యం మనకు ఉందని నాకు అనిపిస్తోంద”ని లెఫ్టినెంట్ జనరల్ హుడా చెప్పారు.

లద్దాఖ్ భౌగోళిక స్థితి భారత్‌కు అనుకూలంగా ఉంటుందా అని నేను ఆయన్ను అడిగాను.

“తూర్పు లద్దాఖ్‌లో ప్రాంతం సమతలంగా ఉంటుంది. చాలా ఎత్తులో ఉంది. ఎల్ఓసీలా ఇది పర్వతం కాదు. రహదారి నెట్‌వర్క్ బాగుంది. చాలా పోస్టుల దగ్గరకు వాహనాల రాకపోకలు ఉంటాయి. అక్కడ మనకు ఎలాంటి సవాలు లేదు. కానీ, లద్దాఖ్ భౌగోళిక స్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పడం పొరపాటే అవుతుంది. చైనా మౌలిక నిర్మాణాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అవి ఆ ప్రాంతాన్ని దానికి అనుకూలంగా మారుస్తాయి” అన్నారు హుడా.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

భారత నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎంత బలంగా ఉన్నాయి?

చైనాతో సముద్ర జలాల్లో మన పరిస్థితి దిగజారితే ఏం జరుగుతుంది?

“అలాంటి పరిస్థితుల్లో భారత్ తాము ఎక్కడ బలంగా ఉన్నామో ఆ ప్రాంతంలోకి, అంటే హిందూ మహాసముద్రంలోకి వెళ్తుంది” అని ఒక నేవీ మాజీ చీఫ్ చెప్పారు.

“చైనాపై దాడి చేయడానికి నావికా దళాన్ని దక్షిణ చైనా సముద్రంలోకి పంపించాలని ఎవరైనా చెబితే, నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. మనం హిందూ మహాసముద్రంలో మాత్రమే చైనాపై పైచేయి సాధించగలం. మనకు ఆ ప్రాంతం గురించి తెలుసు. ముఖ్యంగా అక్కడ మన దగ్గర ఎక్కువ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి” అన్నారు.

భారత్ సైనిక ప్రత్యామ్నాయాలను గమనిస్తే, భారత వైమానిక దళాన్ని ఉపయోగించడం అత్యంత మెరుగ్గా ఉంటుందని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు.

ఎయిర్ బేస్ నుంచి తక్కువ ఎత్తులో ఎగరడం వల్ల భారత యుద్ధ విమానాల్లో ఎక్కువ ఇంధనం, ఆయుధాలు ఉంటాయి. అటు చైనా వైమానిక దళం టిబెట్ పీఠభూమి, మిగతా ఎత్తైన ప్రాంతాల నుంచి టేకాఫ్ కావాల్సి ఉంటుంది. గాలి తీవ్రంగా వీచే చోట ఎగరాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఆయుధాలు ఉండడం వల్ల వారికి ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు

మనం మరో విషయంలో కూడా పైచేయి సాధించగలమని మాజీ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేసిన ఎయిర్ మార్షల్(రిటైర్డ్) ఖోస్లా చెప్పారు.

“మనం టీ-3 ద్వారా పైచేయి సాధించగలం. అంటే టెక్నాలజీ, టెరైన్(భూభాగం), ట్రైనింగ్. టెక్నికల్‌గా వారు ముందున్నారు. కానీ వారి వాదన, వాస్తవిక సామర్థ్యంపై సందేహం ఉంది. భూభాగం, ట్రైనింగ్‌లో మనదే పైచేయి. కానీ వారు ఆ సమస్యలను గుర్తించారు. ఒక క్రమ పద్ధతిలో వాటిని పరిష్కరిస్తున్నారు. రెండు దేశాల మధ్య వ్యత్యాసం తగ్గించడానికి మన సామర్థ్యాన్ని మనం గుణాత్మకంగా, సంఖ్యాపరంగా పెంచాల్సిన అవసరం ఉంది” అన్నారు.

గత కొన్నేళ్లుగా పీల్ఎఎఎఫ్ తనకు తానుగా ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఆయన నాకు చెప్పారు.

“చైనా వైమానిక దళం పీఎల్ఏలో భాగంగా ఉంది. అది అవసరమైన అన్ని ఉపకరణాలూ ఉండే మిగతా సైన్యాల్లాగే ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత గల్ఫ్ యుద్ధం సమయంలో చైనా తన నావికాదళాన్ని, వైమానిక దళాన్ని వేగంగా ఆధునికీకరించడం ప్రారంభించింది. ప్రస్తుతం వారి వైమానిక దళం తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది” అంటారు ఖోస్లా.

ఫొటో సోర్స్, TWITTER/RAJNATH SINGH

భారత్ ఎక్కడ స్పీడు పెంచాలి?

భారత్‌పై చైనాకు ఉన్న అతిపెద్ద ప్రయోజనం వారి ‘దేశీయ రక్షణ తయారీ బేస్’ అంటారు ఖోస్లా.

తయారీ స్థావరాలు ఉండడం వల్ల దేశంలోంచే ఆయుధాల సరఫరా జరుగుతుంది. భారత్ ప్రస్తుతం ఆ దిశగా పనిచేస్తోంది. ఇప్పుడు అది దిగుమతి చేసుకున్న ఆయుధాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

అంతే కాదు, సైబర్, అంతరిక్ష సామర్థ్యాలను పెంచుకునే విషయానికి వస్తే, అందులో కూడా భారత్‌పై చైనా పైచేయి సాధిస్తోంది.

చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి నుంచి రిటైర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా దీని గురించి వివరంగా చెప్పారు.

“చైనా సైబర్ ఆర్మీని రూపొందించడంలో పట్టు సంపాదించింది. ఆ రంగంలో దాని సామర్థ్యాలను అందుకోడానికి మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం మన సైనిక బలగాలు అత్యుత్తమ టాలెంట్‌ను ఆకర్షించాలి. మన దేశంలో టాలెంట్ ఉంది. కానీ వారు మనతో పనిచేయడానికి బదులు వేరే వాళ్లతో కలిసి పనిచేస్తున్నారు” అన్నారు.

చైనా శ్వేత పత్రంలో సైనిక సంస్కరణల గురించి కూడా ప్రస్తావించింది. జనరల్ దువా భారత్‌లో సైనిక సంస్కరణల గురించి తన అనుభవాలు పంచుకున్నారు.

భారత్‌లో ఇప్పుడు సైబర్, స్పేస్ ఏజెన్సీ, ప్రత్యేక దళాల విభాగంలో ఉన్నాయి. ఆ కమాండ్ బలంగా, సన్నద్ధంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. 2013లో కూడా ఈ ప్రత్యేక దళాలను యాక్టివ్ చేయడానికి మాకు అనుమతి లభించింది. కానీ మేం వాటిని 2018 చివర్లో యాక్టివ్ చేయగలిగాం. ఆ పని చాలా బలహీనంగా ఉంటుంది. ఇలా పథకాల అమలును వేగవంతం చేసేలా సంస్కరణలు తీసుకురావాలి. మనం సెల్లార్లలో కూర్చుని పనిచేయడం మానేయాలి. యుద్ధంలో వ్యూహాలు నిరంతరం మారిపోతుంటాయి. అందుకే, పాత పద్ధతుల్లో నడవాలనే ఆలోచనను మార్చాల్సిన అవసరం ఉంది” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)