Coconut Day: కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- పద్మ మీనాక్షి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Independent Picture Service
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వివాహం, గృహ ప్రవేశాలలో, హోమాలు, యజ్ఞాలు, పూజలు, పేరంటాలు లాంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయకి ప్రముఖ స్థానం ఉంది. ఆఖరికి ప్రతి నిత్యం వండుకునే వంటల్లో కూడా ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలలో కొబ్బరి వాడకం ఎక్కువగా ఉంటుంది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం 2018 నాటికి కేరళ కొబ్బరి ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉండగా ఆంధ్ర ప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం జిల్లాలు కొబ్బరి పంటకు ప్రసిద్ధిగా ఉన్నాయి.
కొబ్బరి చరిత్ర ఏమిటి?
భారతీయ వేదాలలో ఎక్కడా కొబ్బరి గురించి ప్రస్తావన లేనప్పటికీ రామాయణ, మహాభారత పురాణాలలో, పురావస్తు శాఖ తవ్వకాలలో లభించిన విశేషాలలో, ఆయుర్వేదంలో, బుద్ధుని జాతక కధలలో.. చైనా, అరేబియా, ఇటలీ యాత్రీకుల యాత్రానుభవాలలో కూడా కొబ్బరికాయ గురించి ప్రస్తావన ఉన్నట్లు పరిశోధనా పత్రాలు చెబుతున్నాయి.
హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుభాష్ చందర్ అహుజా, వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీలో ఫార్మసాలజీ విభాగంలో పని చేస్తున్న ఉమా అహుజా సంయుక్తంగా కొబ్బరి చరిత్ర గురించి రాసిన పరిశోధన పత్రంలో వివరాలు ఇలా ఉన్నాయి.
కొబ్బరి పంట ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, ఇండోనేషియా, ఇండియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ దీవులు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, కరీబియన్ దీవుల్లో, అమెరికాలోని దక్షిణ భాగంలో పండుతుంది.
కొబ్బరి చరిత్ర పట్ల పూర్తిగా స్పష్టత లేనప్పటికీ అమరకోశ కావ్యం (500-800 క్రీస్తుశకం)లో నారికేళ ప్రస్తావన ఉన్నట్లు అహుజా రాసిన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
బహుశా 1 - 2 వ శతాబ్దం ప్రారంభంలో కొబ్బరి కాయ ధార్మిక కార్యక్రమాలకు వాడటం మొదలై ఉండవచ్చని అంచనా. ఇది నెమ్మదిగా నిత్య జీవితంలో భాగంగా మారి పూజా కార్యక్రమాలలో వాడే ఫలంగా మారిపోయి, వివాహం లాంటి శుభ కార్యాలలో అతిధులకు బహుమతిగా ఇచ్చే సంప్రదాయంగా మారి ఉండవచ్చని ఈ పత్రం పేర్కొంది.
మనిషి ఆవిర్భావానికంటే ముందే 2 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే కొబ్బరి ఉందని పురావస్తు శాఖకి లభించిన శిధిలాల ప్రకారం అంచనా వేసినట్లు ది కోకోనట్ పామ్ వ్యాస రచయతలు, ఇండియన్ సెంట్రల్ కోకోనట్ కమిటీ కి చెందిన కె పి వి మీనన్ , కె ఎం పండలై 1958 లో ఒక పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
దిల్లీలో ఒక గుడి ముందు పూజా సామగ్రి దుకాణం
మధ్య యుగంలో రాసిన శిలాశాసనాల మీద కూడా దేవాలయ ఆస్థులుగా ఉన్న కొబ్బరి తోటల గురించి ప్రస్తావన ఉంది.
బాపట్లలోని భావనారాయణ స్వామి దేవాలయానికి కుళోత్తుంగ రాజేంద్ర చోళుని ఖజానాకు అధిపతిగా పని చేసిన ఎర్రమనాయక 229 కొబ్బరి చెట్లున్న తోటను దానంగా ఇచ్చినట్లు 1163 - 1180 మధ్య ప్రాంతంలో రాయించిన శిలా శాసనంలో కనిపిస్తుంది.
కొబ్బరి గురించిన ప్రస్తావన మత్స్య పురాణంలో (1000 క్రీస్తు శకం), బ్రహ్మ వైవర్త పురాణం (8వ శతాబ్దం) బ్రహ్మ పురాణం (1000 - 1200 క్రీస్తు శకం)లో కూడా ఉంది. అగ్ని పురాణం కొబ్బరిని ఔషధ మొక్కగా పేర్కొంటోంది. చరక సంహితంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది.
దక్షిణాదిలో సంగం సాహిత్యంలో కూడా కొబ్బరి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.
కొబ్బరి కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా దానికున్న ఇతర ఆరోగ్య, ఔషధ, సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా దీనికి జీవనాన్నిచ్చే వృక్షం', స్వర్గానికి చెందిన వృక్షం, సమస్తం చేకూర్చే కల్పవృక్షం లాంటి అనే రక రకాల పేర్లు ఉన్నాయి.
అయితే, 1831 వ సంవత్సరం వరకు కొబ్బరి గురించి ఉష్ణ ప్రాంతాల అవతల నివసించేవారికి తెలియదు.
ఐని అక్బరీ గ్రంధంలో అక్బర్ పరిపాలనా కాలంలో ఒక కొబ్బరి కాయ ధరను 4 డాం లుగా పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
భారతదేశంలో చాలా ప్రాంతాలలో పూజా పునస్కారాలలో, శంఖు స్థాపనలలో, వివాహాలలో, గృహ ప్రవేశాలలో కొబ్బరికాయని తప్పని సరిగా వాడతారు.
దీని వెనుకనున్న అంతరార్ధాన్ని దిల్లీకి చెందిన పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర శర్మ వివరించారు.
కొబ్బరి కాయకు సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉందని చెప్పారు.
“కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియచేసారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి, నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరి కాయను కొట్టడం వెనుక పరమార్ధం.”
కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు, అని ఆయన చెప్పారు.
అయితే కొబ్బరిని ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు వాడటం వెనుక ఒక ఆర్ధికపరమైన ఆలోచన ఉందని హైదరాబాద్ కి చెందిన సోషియో ఇకాలజిస్టు, స్వతంత్ర పరిశోధకులు సత్య శ్రీనివాస్ అంటారు.
కొబ్బరికి, వ్యాపారానికి గల సంబంధాన్ని విశ్లేషిస్తూ, “నాగరికత అభివృద్ధి చెందుతున్న కొలదీ ఆరాధనా పద్ధతులు మారాయి. మనిషి ప్రక్రతి ఆరాధన నుంచి నెమ్మదిగా విగ్రాహారాధనకు మారారు. అందులోకి క్రమేపీ వ్యాపార ధోరణి ప్రవేశించింది”, అని ఆయన అన్నారు.
కొబ్బరిలో ఉండే ప్రతి పదార్ధమూ నీరు, గుజ్జు, పీచుతో సహా ఉపయోగకరం కావడం వలన దానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
“పల్లెటూర్లలో వివాహాల సమయంలో కొబ్బరి ఆకులతో పందిళ్లు వేసేవారు. చిన్న పిల్లలు కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసుకుని బొమ్మల పెళ్లిళ్ల ఆటలు ఆడుకునే వారు. ఆఖరికి అంటువ్యాధులు ప్రబలిన సమయంలో మృతదేహాలను కొబ్బరి మట్టల పై వేసి ఈడ్చుకుంటూ వెళ్లేవారు” అని శ్రీనివాస్ చెప్పారు.
“కొబ్బరికుండే బహుముఖ ప్రయోజనాలు మాత్రమే కాకుండా నిల్వ ఉండే గుణం వలన అది నాగరికతలో ఒక భాగంగా మారిపోయింది. కొబ్బరికాయకి ఒక వస్త్రం కప్పి, బొట్టు పెడితే దానిని దైవ స్వరూపంగా చూసే నమ్మకం ప్రజలలో స్థిరపడిపోయింది. ఒక నమ్మకం బలంగా స్థిరపడిపోయినప్పుడు దానిని మార్చడం చాలా కష్టమైన పనని” ఆయన అంటారు.
“ఈ పద్ధతులన్నీ ప్రకృతితో వర్చువల్ గా అవినాభావ సంబంధం కలుగ చేస్తాయి”, అని ఆయన అన్నారు.
కోనసీమ కొబ్బరి పంటలకు ప్రసిద్ధిగా ఎలా మారింది?
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొబ్బరి పంటల గురించి చెబుతూ యానాం ఒకప్పుడు నౌకా నిర్మాణ కేంద్రంగా ఉండేదని, నౌకా నిర్మాణానికి కొబ్బరి పీచు అవసరం అవడం వలన ఆ ప్రాంతంలో కొబ్బరి పంటలు పెరిగి ఉండవచ్చని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
కాటన్ ధవళేశ్వరం బ్యారేజి కడుతున్నపుడు గోదావరి డైరీలో, “ ఈ ప్రాంతంలో బ్యారేజి నిర్మాణం జరగగానే వరి పంట పండిస్తారు. ఆవుల బదులు గేదెలు పెరుగుతాయి, నల్ల బియ్యం పంట తగ్గిపోతుందని” రాసినట్లే జరిగిందని ఆయన అన్నారు.
“కోన సీమ లో వరదలు వచ్చినప్పుడు కొబ్బరి తోటలు యజమానులు నష్టపోతారు. మడ అడవులను, తాటి చెట్లను వినాశనం చేశారు. గాలి తీవ్రతను తట్టుకునే శక్తి తాటి చెట్లకే ఉంటుంది కానీ, కొబ్బరి చెట్లకు ఉండదు. సహజ సిద్ధంగా ఉండే పంటలను నాశనం చేయడం వలన ప్రక్రుతి వైపరీత్యాలకు కూడా దారి తీస్తుంది”, అని ఆయన అన్నారు..
కొబ్బరి వెనుక దాగిన ఆర్థిక రహస్యం
“కొబ్బరి చుట్టూ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలంటే దానికి దైవత్వాన్ని, నమ్మకాన్ని ఆపాదించాలి. అప్పుడే వ్యాపారం పటిష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు చుట్టూ నమ్మకం, దైవత్వం ఆపాదిస్తే ఆ సంస్కృతిని ఇక మార్చడం కుదిరే పని కాదు”, అని శ్రీనివాస్ అన్నారు.
గుడిలో కొట్టే కొబ్బరికాయలో సగ భాగం తిరిగి నూనె తయారీకి , హోటల్ లో ఆహార పదార్ధాల తయారీకి వెళతాయి.
ఉదాహరణకు ఏదైనా కోరిక నెరవేరితే 101, 1001 కొబ్బరికాయలు ఎందుకు కొడతారని ప్రశ్నించారు. కోరిక ఒకటే అయినప్పుడు ఒక కొబ్బరికాయకు, 100 కొబ్బరి కాయలకు తేడా ఏమిటని ప్రశ్నించారు. ఇందులో లాభపడేది వ్యాపారస్థుడే తప్ప మరెవరూ కాదని, ఆయన అంటారు.
కొబ్బరి చుట్టూ అల్లుకున్న నమ్మకాలు ఏమిటి?
కొబ్బరి కాయను దృష్టి తీయడానికి, హోమాలకు, వ్రతాలకు మాత్రమే కాకుండా కొత్త వాహనం కొనుక్కున్నప్పుడు కూడా ఎందుకు కొడతారు?
కారు కొనుక్కుంటే ప్రమాదాలు ఏమి జరగకుండా కాపాడటానికి కొబ్బరికాయ కొట్టాలి అనే కారణం వెనుక భయం, నమ్మకం తప్ప మరేదీ లేదని శ్రీనివాస్ అన్నారు.
కొబ్బరి కుళ్ళగానే అశుభం అంటారు. దీని గురించి చెబుతూ కుళ్ళిన ఏ పదార్ధమైనా పనికి రాదు. దానితో అది మనిషికి కూడా ఉపయోగపడటానికి పనికి రానిదవుతుంది తప్ప మరొకరకమైన అశుభమేమి జరగదని అన్నారు.
ఫొటో సోర్స్, SEETHA ANAND
సీత ఆనంద్, ఎ గైడ్ టు గుడ్ ఫుడ్ రచయత
కొబ్బరితో ఉపయోగాలు ఏమిటి?
నువ్వు నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే, కొబ్బరితో కలిగే ప్రయోజనాలను కూడా లెక్కపెట్టగలవు - ఫిలిప్పీన్స్ నానుడి.
కొబ్బరి చెట్టులో ఏ భాగమూ నిరుపయోగంగా ఉండదు. కొబ్బరితో అనేక రకాల ఆహారాన్ని తయారు చేస్తారు. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కొబ్బరి లేని వంటలు అరుదుగా కనిపిస్తాయి. అక్కడ వంటకు కూడా కొబ్బరి నూనెనే వాడతారు. అలాగే, కొబ్బరి విరివిగా పండే ఆంధ్రప్రదేశ్ లోని కోన సీమ ప్రాంతంలో, తమిళనాడులో కొబ్బరి ఆహారంలో ఎక్కువగా చోటు చేసుకుంటుంది.
ఇటీవల కాలంలో కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బాగా ప్రాముఖ్యం పొందినట్లు రిమిడియల్ థెరపిస్ట్ , గుడ్ ఫుడ్, ఎ గైడ్ టు హెల్తి కుకింగ్ అండ్ ఈటింగ్ పుస్తక రచయత సీత ఆనంద్ బీబీసీ న్యూస్ తెలుగుకి చెప్పారు.
కొబ్బరితో ఆహారంలో ఎన్ని రకాలుగా వాడవాచ్చో వివరించారు.
సంప్రదాయ పద్ధతిలో తీసిన కొబ్బరి పాలను డైరీ ఉత్పత్తులకు బదులుగా వాడవచ్చు.
కొబ్బరి పాలను వాడి సూప్‌లు, కేకులు, మిఠాయిలు, పాయసం తయారు చేస్తారు.
కొబ్బరిని వివిధ రకాల ఆహార పదార్ధాలలో, కూరలలో, వేపుళ్లలో వాడతారు. దీనితో అన్నం కూడా వండుతారు.
ఎండు కొబ్బరిని డ్రై ఫ్రూట్ గా వాడతారు.
కొబ్బరితో ప్రయోజనాలు
పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనెలోఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలుంటాయి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం తల్లి పాలలో మాత్రమే ఉంటుంది. దీనికి బాక్టీరియా తో పోరాడే శక్తి ఉండి ఇమ్మ్యూనిటి పెంచేందుకు దోహద పడుతుంది.
కొబ్బరిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
అయితే, “ఈ నూనె తయారు చేసే విధానాన్నిబట్టీ ఆ నూనె మేలు చేస్తుందా, హాని చేస్తుందోననే విషయం ఆధార పడి ఉంటుంది”. ప్రాసెస్ చేసిన, అధిక ఉష్ణోగ్రతల్లో వేడి చేసిన కొబ్బరి నూనె మేలు కంటే హాని ఎక్కువగా చేస్తుంది అని , సీత ఆనంద్ చెప్పారు.
కొబ్బరి నూనెతో వంటలు చేయడం మాత్రమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా వాడతారు. కొబ్బరి నూనెని శిరోజాల సంరక్షణకు ఉపయోగిస్తారు.
కొబ్బరి నూనెకి చర్మ రంధ్రాల లోపలికి చొచ్చుకుని వెళ్లే గుణం ఉంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన నూనెలను వాడటం ప్రమాదకరమని ఆమె సూచించారు.
ఫొటో సోర్స్, Getty Images
కొబ్బరి - ఔషధ విలువలు
కొబ్బరికి ఉన్న ఔషధ విలువల గురించి ముంబయికి చెందిన కార్పొరేట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శుభ శ్రీ రే బీబీసీ న్యూస్ తెలుగు కి తెలిపారు.
కొబ్బరి ముఖ్యంగా శరీరానికి కావల్సిన కొవ్వు పదార్ధాలను అందిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్, మాంగనీస్ లాంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి.
కొబ్బరిలో ఉండే రాగి, ఇనుము శరీరంలో రక్తం స్థాయిలను నిలిపి ఉంచేందుకు ఉపయోగపడతాయి.
కొబ్బరి గుజ్జు లో సెలీనియం, ఫెనోలిక్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంజ్యూరి నుంచి కాపాడతాయి.
కొబ్బరిలో ఉండే కొవ్వు పదార్ధాలు మీడియం చైన్ ట్రై గ్లిసరేడ్ల రూపంలో ఉంటాయి. ఇవి నేరుగా పేగుల్లోకి వెళ్లి శక్తిని సత్వరమే అందించగలవు.
మందులకు పని చేయని ఉన్న మూర్ఛ, అల్జీమర్ రోగాలలో మీడియం చైన్ ట్రై గ్లిసరైడ్లను ప్రత్యామ్న్యాయ చికిత్సగా వాడతారు. ఎంసిటిలలో కాప్రిలిక్, కాప్రిక్, లారిక్ ఆమ్లాలు ఉండటం వలన సూక్ష్మ జీవులకు, ఫంగస్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి.
ఎండుకొబ్బరి నుంచి సేకరించిన వర్జిన్ నూనె వలన పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అధిక కొవ్వు గుండె జబ్బులకు, చక్కర వ్యాధికి దారి తీస్తుంది.
కానీ, ఏదైనా కొబ్బరితో కూడిన పదార్ధాన్ని కానీ, కొబ్బరి నూనెని కానీ అధిక మోతాదులో వినియోగించే ముందు డయాబెటిస్, బిపి, అధిక కొలెస్టరాల్ ఉండే వ్యక్తులు, వైద్య సలహా తీసుకోవాలని ఆమె సూచించారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
కొబ్బరిని అనేక ఆహార పదార్ధాల తయారీలో వాడతారు.
కొబ్బరితో చిన్న తరహా పరిశ్రమలు
కొబ్బరి కున్న బహుముఖ ప్రయోజనాల వలన దీనికి సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్ధికంగా చాలా ప్రాముఖ్యత ఉందని, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి వి రామాంజనేయులు అన్నారు.
“కొబ్బరిని ఆహార పంటగా పరిగణిస్తే కొబ్బరిలో అనేక పోషకాలు ఉంటాయి. ఆర్థికపరంగా చూస్తే కొబ్బరి చెట్టులో ఉండే ప్రతి భాగమూ ఉపయోగకరంగా ఉంటుంది”, అని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో కొబ్బరి విస్తారంగా పండేటప్పటికీ కూడా దానికొచ్చే ధర చాలా తక్కువ. అంతే కాకుండా ఉత్పత్తి సేకరణకు తగిన పద్ధతులు లేవని చెప్పారు. ప్రాసెసింగ్ పరిశ్రమలతో పాటు, సేకరణ పై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక కొబ్బరి పరిశ్రమ శ్రీ లంక నుంచి మూల పదార్ధాలు తెప్పించుకోవడాన్ని ఉదాహరణగా చెప్పారు.
వర్జిన్ కొబ్బరి నూనె ఆలివ్ నూనె కంటే మేలు చేస్తుందని అన్నారు.
కొబ్బరి కోపరేటివ్ లను గనక అభివృద్ధి చేసి చిన్న తరహా పరిశ్రమలను గనక స్థాపించగల్గితే స్థానికుల జీవనాధారానికి పనికొస్తుంది, అని ఆయన అభిప్రాయపడ్డారు. కొబ్బరి పంట నుంచి మాత్రమే కాకుండా మిగిలిన ఉత్పత్తులన్నిటి నుంచి గరిష్టంగా ఆదాయం ఎలా సంపాదించవచ్చో కూడా ఆలోచించాలని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)