జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రస్థానంలో ఎన్నో వివాదాలు: మోదీపై ప్రశంసలు.. ప్రశాంత్ భూషణ్‌కు జరిమానా

జస్టిస్ అరుణ్ మిశ్రా

ఫొటో సోర్స్, Supreme Court Of India

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్

కోర్టు ధిక్కార కేసులో సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తీర్మానిస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఈ త్రిసభ్య ధర్మాసనానికి జస్టిస్ అరుణ మిశ్రా అధ్యక్షత వహించగా జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలు సభ్యులుగా ఉన్నారు.

జస్టిస్ అరుణ మిశ్రా బుధవారం (సెప్టెంబర్ 2న) పదవీ విరమణ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన జస్టిస్ మిశ్రా విజ్ఞానశాస్త్రంలో ఎంఏ పట్టా పొందిన తరువాత న్యాయశాస్త్రం మీద మక్కువతో న్యాయవాద వృత్తి చేపట్టారు. దాదాపు 21 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారు. గ్వాలియర్‌లోని జివాజీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని బోధించారు.

ఆయన కుమార్తె కూడా దిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, STR

ఫొటో క్యాప్షన్,

జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు భవనంలో గత ఏడాది అగ్నిప్రమాదం జరిగింది

న్యాయమూర్తిగా ప్రస్థానం

1999లో మధ్యప్రదేశ్ హై కోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అదే సంవత్సరం ఆయన రాజస్థాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

2012లో కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అప్పట్లోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందవలసి ఉండగా, మూడు సార్లు అవాంతరాలు రావడంతో 2014లో ఆ పదవి చేపట్టారు.

2018లో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు.. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ మదన్ భీమారావ్ లోకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు న్యాయ విచారణపై విమర్శలు గుప్పించారు.

ఈ విషయంలో జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమావేశంలో సీనియర్ న్యాయమూర్తులు, జస్టిస్ మిశ్రా పేరు ప్రస్తావించనప్పటికీ.. వారంతా ఇలా విలేకరుల సమావేశం నిర్వహించడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, The India Today Group

ఫొటో క్యాప్షన్,

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్ కాన్ఫరెన్స్

వివాదాల్లో చిక్కుకుంటూ...

రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న కేసులను, ఇతర ముఖ్య కేసులను కూడా జూనియర్ న్యాయమూర్తులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ జడ్జి బీహెచ్ లోయా హత్య కేసును అరుణ్ మిశ్రాతో కూడిన జూనియర్ న్యాయమూర్తుల బెంచ్‌కు అప్పగించారని సీనియర్ న్యాయమూర్తులు ఆరోపించారు.

తరువాత ఈ కేసు నుంచీ తనే స్వయంగా తప్పుకుంటున్నట్టు అరుణ మిశ్రా ప్రకటించారు.

అంతే కాకుండా జస్టిస్ రంజన్ గొగోయ్ మీద లైంగిక వేధింపుల కేసులోనూ, ఒక భూసేకరణ కేసులోనూ కూడా జస్టిస్ మిశ్రా వివాదాలు ఎదుర్కొన్నారు.

భూసేకరణ కేసులో తాను ఇచ్చిన తీర్పుపై పునర్విచారణ పిటిషన్ వేసినప్పుడు పునర్విచారణ జరిపే బెంచ్‌ నుంచీ జస్టిస్ మిశ్రా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు జస్టిస్ మిశ్రా తిరస్కరించడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times

మోదీపై ప్రశంసలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడంతో జస్టిస్ అరుణ మిశ్రా మరోసారి వార్తల్లోకొచ్చారు. ప్రధాని మోదీని అంతర్జాతీయ వేదికపై కార్యసాధకుడిగా పేర్కొంటూ "బహుముఖ ప్రజ్ఞాశాలి" అని ఆయన కొనియాడారు.

ఈ వ్యాఖ్యలు న్యాయవాద బృందాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చలు రేకెత్తించాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసే కేసుల విచారణ నుంచీ జస్టిస్ మిశ్రా తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా గత ఏడాది ఆగస్టులో ప్రముఖ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తూ.. కొన్ని ప్రముఖ పారిశ్రామిక సంస్థల కేసులను తరచుగా అరుణ్ మిశ్రా ధర్మాసనానికే అప్పగిస్తున్నట్టు ఆరోపించారు.

గుజరాత్‌కు చెందిన హరేన్ పాండ్యా హత్యకేసులో న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ఇచ్చిన తీర్పులో అనేక లోపాలున్నయంటూ సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ్‌శంకర్ ఝా ఎత్తిచూపారు. అనంతరం ఈ కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

ఇలా జస్టిస్ అరుణ్ మిశ్రా అనేక వివాదాలు ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, CARAVAN MAGAZINE

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ లోయా

దాదాపు లక్ష కేసుల విచారణ...

అరుణ మిశ్రా తన పదవీ కాలంలో సుమారు ఒక లక్ష కేసులను విచారించి ఉంటారని న్యాయవాద బృందాలు చెబుతున్నాయి.

అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం విదేశాల్లో పొందిన న్యాయవాద పట్టా భారతదేశంలో గుర్తింపు పొందడానికి శ్రమించిన వారిలో జస్టిస్ మిశ్రా కూడా ఒకరు.

2000 సంవత్సరంలో సాయంత్రం లా కాలేజీలను మూసివేయాలనే డిమాండ్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు తీసువచ్చినది కూడా జస్టిస్ మిశ్రానే.

అఖిల భారత న్యాయవాదుల సంక్షేమ పథకాన్ని ప్రారంభించిన ఘనత కూడా జస్టిస్ అరుణ మిశ్రాకే దక్కుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)