కరోనావైరస్: దేశంలో రోజూ ముప్పావు లక్ష కేసులు.. మరి లాక్‌డౌన్ సఫలమా? విఫలమా?

  • తారేంద్ర్ కిశోర్
  • బీబీసీ ప్రతినిధి
భారత్ లాక్‌డౌన్-4

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

భారత్‌లో కరోనా

గత ఐదు రోజులుగా భారతదేశంలో రోజుకు 75 వేల కంటే అధికంగా కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. మరే ఇతర దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు.

రోజువారీ సంక్రమణ సంఖ్య భాతదేశంలోనే అత్యధికంగా ఉంది.

మొత్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే, అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉంది.

కానీ రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే భారత్ మొదటి స్థానంలో ఉంది.

ఈ గణాంకాల తీరు చూస్తుంటే భారత్ అతి త్వరలో ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన దేశాల్లో మొదటి స్థానానికి చేరుకుంటుందని భావిస్తున్నారు.

భారతదేశంలో లాక్‌డౌన్ సడలించినప్పటి నుంచి రోజువారీ కేసులు అధిక సంఖ్యలో నమోదవడం మొదలైందని గణాంకాలు చెబుతున్నాయి.

జూన్ 1 నుంచీ లాక్‌డౌన్ క్రమంగా సడలించారు. దాన్ని అన్‌లాక్-1 అని పిలిచారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్,

భారత్‌లో పెరుగుతున్న కరోనా రోజువారీ కేసులు

లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు అన్‌లాక్-1లో నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అప్పటినుంచే రోజువారీ కోవిడ్-19 కేసులు కూడా పెరగడం మొదలయ్యింది.

దీంతో, లాక్‌డౌన్‌తో చేసిన ప్రయత్నాలన్నీ అన్‌లాక్-1 వల్ల వృధా అయిపోయిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

మొట్టమొదట మార్చి 25 నుంచీ 21 రోజులపాటూ లాక్‌డౌన్ విధించారు. కానీ కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతుండడంతో దానిని మే 3కు, తర్వాత మే 30కి పొడిగించారు. చివరికి జూన్ 1న అన్‌లాక్-1 ప్రకటించారు.

తర్వాత క్రమంగా అన్‌లాక్-2, అన్‌లాక్-3 కూడా ప్రకటించారు. క్రమక్రమంగా అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అన్‌లాక్-4 ప్రారంభం కానుంది.

మరోవైపు కోవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంటే, దీనినిబట్టి భారతదేశంలో లాక్‌డౌన్ పూర్తిగా విఫలమయ్యిందని అనుకోవచ్చా?

ఫొటో సోర్స్, STR VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

భారత్‌లో లాక్‌డౌన్

నిపుణులు ఏమంటున్నారు?

లాక్‌డౌన్ పూర్తిగా విఫలమైనట్లుగా భావించాల్సిన అవసరం లేదని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ గిరిధర్ ఆర్. బాబు బీబీసీతో అన్నారు.

"లాక్‌డౌన్ ముఖ్య ఉద్దేశం వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం, అదే సమయంలో కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం. ఈ రెండు లక్ష్యాలూ నెరవేరాయి. లాక్‌డౌన్‌తో కోవిడ్-19 పూర్తిగా మాయమైపోతుందని కాదు. వ్యాక్సిన్ వచ్చేవరకూ కరోనావైరస్ వ్యాప్తి తగ్గదు" అన్నారు.

కానీ, లాక్‌డౌన్ వైఫల్యం ప్రాంతీయంగా ఉందని డా. గిరిధర్ చెప్పారు. ఉదాహరణకు ముంబై, దిల్లీలలో లాక్‌డౌన్ సమయంలో కూడా కేసులు అధికంగా పెరిగాయన్నారు.

అయితే, జేఎన్‌యూ సోషల్ మెడిసన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఛైర్‌పర్సన్ సంఘమిత్రా ఆచార్య భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.

బీబీసీతో మాట్లాడిన ఆమె లాక్‌డౌన్ కచ్చితంగా విఫలమయ్యిందని అన్నారు.

"నా అభిప్రాయంలో లాక్‌డౌన్ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మొదట్లోనే ఇంత కఠినమైన లాక్‌డౌన్ అవసరం లేదు. హాట్‌స్పాట్‌లు గుర్తించి మొదట అక్కడ లాక్‌డౌన్ విధించి, క్రమంగా దేశం మొత్తంగా విధించి ఉండాల్సింది. ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారి ఇంత కఠిన లాక్‌డౌన్ విధించడం ఇంతకుముందెప్పుడూ ఏ అంటువ్యాధి విషయంలోనూ చూడలేదు. ఇప్పుడేమో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ అన్‌లాక్ చెయ్యక తప్పదు. మొదట ప్రజల ప్రాణాలు కాపాడ్డం ముఖ్యం అన్నారు. లాక్‌డౌన్‌తో సమస్యలు తలెత్తాక.. ఇప్పుడు ప్రజల జీవనోపాధి గురించి కూడా ఆలోచించాలి కదా అంటున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

లాక్‌డౌన్ సమయంలో జనం భారీగా వలస వెళ్లారు

లాక్‌డౌన్ క్రమక్రమంగా విస్తరించి ఉండాల్సింది అనే మాటతో డా. గిరిధర్ ఏకీభవించడంలేదు.

"ఇప్పుడు ఇలా చెప్పడం సులువే. కానీ, అప్పుడు ఇండియాలో లాక్‌డౌన్ విధించినప్పుడు అమెరికా, బ్రెజిల్‌లో లాక్‌డౌన్ లేదు. మరి, ఇప్పుడు ఆ రెండు దేశాల్లో కూడా భారత్‌లో కంటే ఎక్కువ కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

"శాస్త్రీయ ఆధారాలు పరిశీలిస్తే ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారో అక్కడంతా కోవిడ్-19 కేసులు తక్కువగా ఉన్నాయి. మరణాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. మిగతా దేశాల పరిస్థితిని అధ్యయనం చేస్తే ఈ విషయం తెలుస్తుంది" అన్నారు.

అయితే, కోవిడ్-19 గణాంకాల విషయంలో ప్రొఫెసర్ సంఘమిత్రా ఆచార్య అభిప్రాయం భిన్నంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రాజధాని దిల్లీలో లాక్‌డౌన్

"ప్రభుత్వం మొదట్లో పెరుగుతున్న కేసుల సంఖ్యను చూపించి ప్రజలను భయపెట్టింది. కానీ నిశితంగా గమనిస్తే కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొదటి నుంచీ ఈ సంఖ్య తక్కువగానే ఉంది. భారతదేశంలో మూడు శాతం కంటే ఎక్కువ మరణాలు ఎప్పుడూ లేవు" అన్నారు.

"కోవిడ్-19 కేసుల సంఖ్య ఎప్పుడూ ఎక్కువే ఉంది. కానీ, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కుంటుపడడంతో ప్రభుత్వం తమ ప్రాధాన్యతలు మార్చవలసి వచ్చింది. అందుకే, ఇప్పుడు రికవరీ రేటు, మరణాల సంఖ్య చూపిస్తోంది. నిజానికి ఈ ట్రెండ్స్ మొదటి నుంచీ ఇలాగే ఉన్నాయి. ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలే మారుతున్నాయి. వాస్తవ ట్రెండ్స్‌ను మొదటే ప్రజలకు చూపించినట్లైతే కరోనావైరస్ చుట్టూ ఇన్ని భయాలు ఉండేవి కావు. ప్రజల మానసిక ఆరోగ్యం దెబ్బతినేది కాదు" అంటారు సంఘమిత్ర.

"ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే, అది ఇప్పుడప్పుడే పట్టాలపైకి వచ్చేలా లేదు" అని డా. ఆచార్య అభిప్రాయపడ్డారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020-21 సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం తగ్గింది.

ఈసారీ ఈ గణాంకాలు మరింత కృంగిపోయే అవకాశాలున్నాయని అంచనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)