పొరుగు రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు ఏపీలోకి తెచ్చుకోవడంనేరం కాదు - హైకోర్టు తీర్పు : ప్రెస్‌రివ్యూ

బీరు తాగుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెలుపల లేదా లోపల కొనుగోలు చేసిన మూడు మద్యం బాటిళ్లు ఓ వ్యక్తి కలిగి ఉండటం... ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన మూడు బాటిళ్లను రాష్ట్రంలోకి తీసుకురావడం నేరం కాదని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 411 ప్రకారం స్వదేశీ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్‌) మూడు బాటిళ్లు, విదేశీ మద్యం మూడు బాటిళ్లు, 650 ఎం.ఎల్‌ 6 బీరు సీసాలు, 2 లీటర్ల కల్లు అనుమతి లేకుండా ఓ వ్యక్తి కలిగి ఉండేందుకు అవకాశం ఉందని గుర్తు చేసింది.

పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలోకి మద్యం తీసుకొస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పింది.

రంపచోడవరం పోలీసులు... కె. శ్రీనివాసులు మరో నలుగురిపై నమోదు చేసిన కేసును రద్దు చేసింది. వారి వాహనాన్ని తక్షణం విడిచిపెట్టాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

మద్యం రవాణా చేస్తున్నారనే కారణంతో రంపచోడవరం, జగ్గయ్యపేట పోలీసులు ఏపీ ఎక్సైజ్‌ సవరణ చట్టం-2020లోని సెక్షన్‌ 34(ఏ) ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, digilocker

ఇకపై లైసెన్స్‌ పునరుద్ధరణ ఆన్‌లైన్‌లోనే

తెలంగాణ రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారని సాక్షి తెలిపింది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ, లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్‌ (హజార్డస్‌ లైసెన్స్‌) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్‌ లైసెన్స్‌ పొందటం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్‌ లైసెన్స్‌ జారీ తదితర ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు.

వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

జూన్‌ 24న, డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్, పాత లైసెన్స్‌ కార్డు స్థానంలో స్మార్ట్‌కార్డు పొందటం, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.

శ్రీశైలం పవర్‌హౌ‌స్‌లో మళ్లీ షార్ట్‌సర్క్యూట్‌

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

ఈనెల 10 నుంచి పవర్‌హౌ్‌సలోని ఒకటి, రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన చేయాలనే లక్ష్యంతో పవర్‌హౌ్‌సలో యుద్ధప్రాతిపదికన టెంపరరీ లైటింగ్‌ వ్యవస్థ, జనరేటర్లు, మోటార్లను పునరుద్ధరిస్తున్నారు.

ఈ క్రమంలో సామగ్రిని పంపించే డీసీఎం వాహనం జల విద్యుత్‌ కేంద్రం ప్రధాన ద్వారానికి 50 అడుగుల దూరంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్దకు చేరుకోగానే టెంపరరీ విద్యుత్‌ లైటింగ్‌ వ్యవస్థను పునరుద్ధరించడానికి వేసిన కేబుల్‌లో షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడింది.

అప్రమత్తమైన జెన్‌కో సిబ్బంది వెంటనే అత్యవసర ద్వారం గుండా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒక రకంగా ఈ ఘటన మాక్‌ డ్రిల్‌కు దోహదపడిందని జెన్‌కో ఉన్నతాధికారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, EPA

తెలంగాణ ఖైదీలు.. మంచి పనోళ్లు!

ఖైదీల సంక్షేమం, వారిలో సత్ప్రవర్తన తేవడంలో భాగంగా వృత్తిపరమైన శిక్షణ, ఉపాధి కల్పనలో తెలంగాణ జైళ్లశాఖ దేశంలో అగ్రస్థానంలో ఉందని నమస్తే తెలంగాణ తెలిపింది. ఎన్సీఆర్బీ (నేషనల్‌ క్రైం రికార్డ్సు బ్యూరో)-2019 నివేదిక ప్రకారం.. తెలంగాణ జైళ్లలోని ఖైదీలు రూ.599.89 కోట్ల విలువైన ఉత్పత్తుల తయారు చేశారు. రూ.72 కోట్ల ఉత్పత్తులతో తమిళనాడు రెండోస్థానంలో, రూ.29 కోట్ల ఉత్పత్తులతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి.

ఒక్కో ఖైదీ ఏడాదిలో తయారుచేసిన వస్తువుల విలువపరంగా కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో ఒక్కో ఖైదీ రూ.8,93,093 విలువైన వస్తువులు తయారుచేయగా, తమిళనాడు ఖైదీలు ఒక్కొక్కరు రూ.49,611 విలువైన వస్తువులు చేశారు. తర్వాత స్థానంలో ఉన్న చండీగఢ్‌లో రూ.41,478 విలువైన వస్తువులు తయారు చేశారు.

తెలంగాణలో ఖైదీలు తయారు చేస్తున్న వివిధ రకాల వస్తువులను మైనేషన్‌ బ్రాండ్‌ పేరిట జైళ్లశాఖ నేరుగా విక్రయిస్తుంది.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వీరు తయారుచేసే మాస్క్‌లు, శానిటైజర్లకు మంచి గిరాకీ ఉంది. 2018లోనూ తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఖైదీలు చేసిన ఉత్పత్తులకు రూ.495.86 కోట్లు ఆదాయం వచ్చింది.

దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో పనిచేస్తున్న ఖైదీల్లో నైపుణ్యం ఉన్నవారికి రోజుకు సరాసరి కూలి రూ.103.19 ఇస్తున్నారు. కొంతమేర పని తెలిసినవారికి రూ.89.54, పని నేర్చుకుంటున్నవారికి రూ.80.06 ఇస్తున్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)