కరోనావైరస్ దెబ్బతో తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయా?

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
వై.ఎస్.జగన్, కేసీఆర్

ఫొటో సోర్స్, @AndhraPradeshCM

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం అప్పులతోనే ముందుకు సాగాలని అంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు.

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబరు ఒకటిన లేఖ రాశారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 83 శాతం ఆదాయం కోల్పోయినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా ఖర్చు గణనీయంగా పెరిగిందని వివరించారు.

"ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఒడిదుడుకులతో తగినంత నిధులను సమకూర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాం. రుణాల కోసం ద్రవ్య సంస్థల నుంచి ఫ్రంట్ లోడింగ్ విధానంలో అప్పులు తీసుకుంటున్నాం. విధి లేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంపై ఆధారపడాల్సి వచ్చింది" అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఏడాదికి సరిపడా నిధులను ముందే తీసుకోవడాన్ని ఫ్రంట్ లోడింగ్ అంటారు. మరోవైపు వేతనాలు, ఖర్చుల్లో అసమానతలను పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ నుంచి తాత్కాలికంగా తీసుకునే రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులుగా చెబుతారు.

ఆగస్టు 31 న తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల్లో రాష్ట్రం రూ. 8,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌దీ ఇదే పరిస్థితి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఆర్థిక నిపుణుడు ఎస్‌.అనంత్‌తో బీబీసీ తెలుగు మాట్లాడింది. "పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు మరీ దిగజారింది. దివాలాకు దగ్గరగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో రాష్రంలో ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉంది.

ఐదు నెలల ఆదాయం రూ. 37,305.79 కోట్లు కాగా.. ఖర్చు రూ. 88,618.19 కోట్లు. దీంతో లోటు రూ. 51,312.40 కోట్లకు చేరింది.

కేవలం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ. 25,103.58 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019-20 లో తీసుకున్న మొత్తం అప్పు రూ. 40,400.96 కోట్లు.

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆర్థిక పరిస్థితిపై వివరాలను బీబీసీ న్యూస్ కోరింది. అయితే ఎలాంటి స్పందనా రాలేదు.

అయితే, ప్రతి నెల రాష్ట్ర అకౌంట్లను కాగ్ పరీశిలించి తమ వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచుతోంది. దీనిలోని వివరాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తెలంగాణ ఆదాయం రూ. 23,221.56 కోట్లు కాగా.. ఖర్చు రూ. 38,425.67 కోట్లు. దీంతో లోటు రూ. 15,204.11 కోట్లకు చేరింది.

ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో తీసుకున్న అప్పులు రూ. 20,783.84 కోట్లు. గత ఆర్థిక సంవంత్సరం 2019-20 లో తీసుకున్న అప్పు రూ. 29,902 కోట్లుగా కాగ్ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం నుంచి బకాయిలు

మరోవైపు కేంద్రం నుంచి వస్తువుల సేవల పన్ను (జీఎస్‌టీ) కాంపెన్‌సేషన్ సెస్సు బకాయిలు కూడా రావాల్సి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 4,863.21 కోట్లని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. రూ. 5,420 కోట్లని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు ఇటీవల ట్వీట్ చేశారు. ఐజీఎస్‌టీ కూడా రూ. 2,700 కోట్ల వరకూ కేంద్రం బాకీ ఉందని ఆయన తెలిపారు.

జీఎస్‌టీ చెల్లింపుల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా మారింది. అయితే, పరిహార సెస్సు (కాంపెన్‌సేషన్ సెస్సు)ల్లో తగ్గిన వాటాను రుణాలతో భర్తీ చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఇదివరకు పన్నులతో పోల్చినప్పుడు జీఎస్‌టీ అమలు చేశాక వచ్చే పన్నులోటును భర్తీ చేసేందుకు జీఎస్‌టీ కాంపెన్‌సేషన్ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు కాంపెన్‌సేషన్ సెస్సును కేంద్రం విధిస్తోంది. ఇప్పుడు దీనిలో తగ్గుతున్న వాటాలను రుణాలతో భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

ఇది అన్యాయమని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. వీటిలో బీజేపీ పాలిత కర్నాటక కూడా ఉంది.

"జీఎస్‌టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే. సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలనడం సరి కాదు. సెస్ ఎక్కువ చెల్లిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. తక్కువ సెస్ తీసుకుంటోంది కూడా తెలంగాణనే" అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

లోటు బడ్జెట్ ప్రభావం

ఆదాయం బాగా తగ్గిపోవడంతో కొత్త మార్గాల్లో ఆదాయాన్ని అర్జించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృత్తి పన్ను పెంచింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రూ. 1,250గా ఉన్న వృత్తి పన్ను శ్లాబును రూ. 2,000 కు పెంచింది. ఏడాదికి రూ. 2,500 మించకుండా వృత్తి పన్ను వసూలు చేసేందుకు గత ఉత్తర్వులను సవరించినట్టు పేర్కొంది.

"సంక్షేమ పథకాల అమలుకు భారీ ఆర్థిక కేటాయింపులు అవసరం. ఒక వైపు ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. మరోవైపు సంక్షేమ పథకాలకు నిధుల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్నులు పెంచడం అనివార్యంగా మారింది" అని ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం పన్ను రూపంలో ఆదాయం పెంచే దిశగా ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ వివాదంలో ఉన్న లేక ఆమోదంలేని భూములను రెగ్యులరైజేషన్ చేసేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా.

మరోవైపు ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తేచ్చుకునే పరిమితిని మూడు శాతం నుంచి ఐదు శాతానికి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్సును తెలంగాణ మంత్రి మండలి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రుణ శాతం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ముంచుకొస్తున్న ముప్పు

అయితే, తాహతుకు మించి వ్యయం చేయడం వల్లే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతోందని ఆర్థిక రంగ నిపుణుడు ఎస్.అనంత్ వ్యాఖ్యానించారు.

"విపరీతమైన ఖర్చుతో కూడుకున్న ఎన్నికల హామీలను నెరవేర్చడంతో రాష్ట్రాలకు అలవికానంత వ్యయమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ వ్యయాలకు తగ్గట్లు ఆదాయం పెరగడం లేదు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా తగ్గాయి'' అని ఆయన పేర్కొన్నారు.

''గతంలో లోటును అధిగమించేందుకు.. రాష్టాలు సొంతంగా పన్నులు విధించి అదనపు ఆదాయం సమకూర్చుకోగలిగేవి. అయితే, వస్తువు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో రాష్ట్రాలు పన్నులు పెంచే వెసులుబాటును కోల్పోయాయి. కేంద్రంపై ఇదివరకటికన్నా ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది" అని చెప్పారు.

మరోవైపు రాష్ట్రాలు రుణాలు తీసుకోవడం ఎప్పటిలానే కొనసాగించడంతో పాత, కొత్త బకాయిలను ఎలా తీర్చగలవో అంతుబట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

"ఇదే పరిస్థితి కొనసాగితే.. ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం భవిష్యత్‌లో అంత సులభం కాదు. బ్యాంకు రుణాలపై ఆధారపడే చిన్న వ్యాపారులపై ఈ ప్రభావం పడొచ్చు. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ వ్యయాల్లో కోత పడి.. దేశంలో సామాజిక, రాజకీయ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)