కంగనా రనౌత్ వెనుక ఎవరున్నారు? ఎవరి అండతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు?
- అనంత్ ప్రకాశ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, PRODIP GUHA / HINDUSTAN TIMES
కంగనా రనౌత్, ఉద్ధవ్ ఠాక్రే
సినీ నటి కంగనా రనౌత్‌కు చెందిన భవనంలో కొంత భాగాన్ని ముంబయి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు బుధవారం కూల్చివేశారు. ఈ భవనాన్ని కంగనా ఇల్లుగా, కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు.
భవనంలో అక్రమ మార్పులు చేశారని, అందుకే కూల్చివేస్తున్నామని బీఎంసీ అధికారులు వివరించారు.
‘ఈ రోజు నా ఇల్లు కూలింది. రేపు ఉద్ధవ్ ఠాక్రే గర్వం కుప్పకూలుతుంది’ అంటూ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ట్విటర్లో కంగనా రనౌత్ ఓ వీడియో పోస్ట్ చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె గట్టిగానే నిల్చున్నట్లు ఈ వీడియోను బట్టి అర్థమవుతోంది. నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని ఆమె మాట్లాడారు.
‘‘ఉద్ధవ్ ఠాక్రే... ఫిల్మ్ మాఫియాతో కలిసి నా ఇల్లు కూలగొట్టి కక్ష తీర్చుకున్నానని అనుకుంటున్నావా? ఈ రోజు నా ఇల్లు కూలింది. రేపు నీ గర్వం కుప్పకూలుతుంది. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు నాకు గొప్ప ఉపకారం చేశావు. కశ్మీరీ పండిట్లు ఎలాంటి అనుభవాలు ఎదుర్కున్నారో నాకు తెలుసు. ఈ రోజు నేను అది స్వయంగా అనుభవించా. ఈ దేశానికి నేను మాట ఇస్తున్నా. అయోధ్యతోపాటు కశ్మీర్ గురించి కూడా సినిమా తీస్తా. దేశ ప్రజలను మేల్కొలుపుతా. ఇలా చేస్తారని నాకు తెలుసు. ఉద్ధవ్ ఠాక్రే ఈ క్రూరత్వం నా మీద చూపించడం మంచిదైంది. దీనికి ఓ అర్థం ఉంది. జై హింద్, జై మహారాష్ట్ర’’ అని కంగనా ఆ వీడియోలో అన్నారు.
కంగనా ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. మహారాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారని అన్నారు.
అయితే, ఉద్ధవ్ ఠాక్రేను కంగనా సవాలు చేస్తున్న తీరు, ఆమెకు ఎవరైనా అండగా నిలుస్తున్నారా అన్న ప్రశ్నను రేకిత్తిస్తోంది.
ఫొటో సోర్స్, TWITTER/KANGANATEAM
కంగనా ట్విటర్లో పోస్ట్ చేసిన ఫొటో
బీజేపీ మద్దతు ఉందా?
బీజేపీ కంగనాకు అండగా ఉంటోందని తాను గట్టిగా నమ్ముతున్నానని మహారాష్ట్ర రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న సీనియర్ పాత్రికేయురాలు సుజాత ఆనందన్ అంటున్నారు.
‘‘బీజేపీ మద్దతు లేకుండా, ఆమె ఉద్ధవ్ ఠాక్రే గురించి ఇలా మాట్లాడటం సాధ్యం కాదు. ఇదంతా చేస్తున్నందుకు రాజ్యసభ టికెట్ లభిస్తుందని కంగనా విశ్వాసంతో ఉండి ఉంటారు. ప్రస్తుత వ్యవహారం తర్వాత శివసేన ఆమెను నేరుగా లక్ష్యం చేసుకోకపోవచ్చు. బాలీవుడ్, ప్రభుత్వ విభాగాల ద్వారా ఆమెను చుట్టుముట్టే ప్రయత్నం చేయొచ్చు. బాలీవుడ్‌కు, శివసేనకు లోతైన సంబంధాలు ఉన్నాయన్నది చరిత్ర ఎరిగిన సత్యం. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే... రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఇలా అన్ని రూపాల్లో దెబ్బకొట్టడం ఆ పార్టీ తీరు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే, కంగనా ఇల్లు కూల్చివేత విషయంలో బీఎంసీ తీరుపై కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు చేశారు.
‘‘కంగనా భవన నిర్మాణం చట్టవిరుద్ధమా, లేక ఆ భవనాన్ని కూల్చివేసిన పద్ధతి చట్టవిరుద్ధమా? హైకోర్టు ఆ చర్యలు చట్టవ్యతిరేకమని, వెంటనే ఆపేయాలని ఆదేశించింది. ఆ చర్యలన్నీ కక్షపూరితమే. ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ఎక్కువ కాలం నడవవు. కంగనా భవనాన్ని కూల్చే ప్రయత్నంలో శివసేన తనను తాను కూల్చుకోవడం మొదలుపెట్టలేదు కదా!’’ అని కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ ట్వీట్ చేశారు.
ఆయన ట్వీట్ చేయడానికి ముందు కంగనా రనౌత్ ఇల్లు/కార్యాలయం కూల్చివేత చర్యలు వెంటనే నిలిపివేయాలని బీఎంసీని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. దీన్ని కంగనా విజయంగా సోషల్ మీడియాలో చాలా మంది వర్ణించారు.
ఫొటో సోర్స్, GETTY IMAGES
‘బీఎంసీ ద్వారా చర్యలు తీసుకోవడం శివసేన సహజ స్టైల్ కాదు’
సోషల్ మీడియాలో చర్చ
బుధవారం ఉదయం తన భవనాన్ని కూల్చివేయడానికి బీఎంసీ సిబ్బంది వచ్చిన సమయంలో కంగనా కొన్ని ట్వీట్లు చేశారు.
‘‘మణికర్ణిక ఫిల్మ్స్ ప్రొడక్షన్లో మొదటి సినిమాగా అయోధ్య చిత్రాన్ని ప్రకటించాం. ఇది నాకు ఓ భవనం మాత్రమే కాదు, రామ మందిరం. ఇప్పుడు అక్కడికి బాబర్ వచ్చాడు. చరిత్రలో మరోసారి రామ మందిరాన్ని కూలగొడుతున్నారు. గుర్తుపెట్టుకో బాబర్... మళ్లీ అక్కడ మందిరం నిర్మిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్’’ అని ఆమె వాటిలో వ్యాఖ్యానించారు.
తన ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలూ చేపట్టలేదని కంగనా అన్నారు.
‘‘నా ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలూ లేవు. పైగా కోవిడ్ వ్యాప్తి కారణంగా సెప్టెంబర్ 30 వరకు కూల్చివేత కార్యకలాపాలు చేపట్టకూడదని నిషేధం ఉంది. ‘బులీవుడ్’ (బులీ అంటే వేధించేవాళ్లు) చూడండి... ఇదే ఫాసిజం అంటే’’ అని ఆమె ట్వీట్ చేశారు.
భవనం కూల్చివేత, కంగనాకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా చాలా మంది పోస్ట్‌లు పెట్టారు.
‘‘నక్కకు చావు మూడినప్పుడు, నగరంవైపు పరుగెడుతుంది. శివసేన అదే చేస్తోంది. కంగనా భయపడే వ్యక్తి కాదు. యావత్తు దేశం ఆమె వెంట ఉంది. భవనం మళ్లీ కట్టుకోవచ్చు. కానీ, శివసేన స్థాయి ఏంటో బయటపడింది’’ అని రెజ్లర్ బబిత ఫోగట్ ట్వీట్ చేశారు.
కంగనా తన ట్వీట్లలో ఉపయోగించిన #DeathOfDemocracy హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో టాప్ ట్రెండ్‌గా మారింది.
బీఎంసీ కక్ష తీర్చుకుందా?
ఈ మొత్తం వ్యవహారంలో బీఎంసీ కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇదివరకు షారుఖ్‌ఖాన్, కపిల్ శర్మ లాంటి ప్రముఖులపై కూడా బీఎంసీ కార్యకలాపాలు చేపట్టింది. కానీ, ఇలా 24 గంటలు గడువు ఇచ్చి, కూల్చివేతలకు ఎప్పుడూ దిగలేదు. కంగనా విషయంలో మాత్రం బీఎంసీ ఇదే చేసింది.
‘‘కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా బీఎంసీ చేపట్టిన చర్యల్లో పూర్తిగా కక్షపూరిత వైఖరి కనిపిస్తోంది. ముంబయిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలు చాలా ఉన్నాయి. మరి, వాటిపై ఇదే రీతిలో చర్యలు తీసుకోరు’ అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు హేమంత్ దేశాయి అన్నారు.
సీనియర్ పాత్రికేయురాలు సుజాత ఆనందన్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, బీఎంసీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని ఆమె అన్నారు.
‘‘ఆర్జే మలిష్కా ముంబయిలోని గుంతల రోడ్ల గురించి ఓ పాట రూపొందించారు. అప్పుడు కూడా బీఎంసీ ఆమెపై ఇలాంటి చర్యలే తీసుకుంది’’ అని సుజాత ఆనందన్ చెప్పారు.
కంగనా రనౌత్ ఇల్లు కూల్చివేత ప్రారంభం
తెర వెనుక ఉన్నది ఎవరు?
కంగనాపై బీఎంసీ చర్యల విషయంలో ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తెర వెనుక పాత్ర పోషించి ఉండొచ్చని సుజాత ఆనందన్ అన్నారు.
‘‘ఇలా బీఎంసీ ద్వారా చర్యలు తీసుకోవడం వారి సహజ స్టైల్ కాదు. అరాచక శక్తులను పంపి, కంగనా కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడటం శివసేన స్టైల్. బీఎంసీ చర్యల విషయంలో శరద్ పవార్ ప్రధాన పాత్ర పోషించి ఉంటారు. చట్టపరిధిలోనే ప్రత్యర్థులను దెబ్బకొట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. శరద్ పవార్ అనుమతించకపోవడం వల్లే శివసేన ఇంతవరకూ విధ్వంసానికి దిగి ఉండకపోవచ్చు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నా, ఇప్పుడు అసలు నాయకుడు శరద్ పవారే. ఈ ప్రభుత్వానికి పవార్ హెడ్ మాస్టర్ అని సంజయ్ రవుత్ ఓసారి చెప్పారు. పవార్ కనుసన్నల్లోనే ఇది జరుగుతుండొచ్చు’’ అని ఆమె చెప్పారు.
కంగనా రనౌత్ కూడా శివసేనను కావాలనే రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోందని హేమంత్ దేశాయి అభిప్రాయపడ్డారు.
‘‘బాబర్ లాంటి పదాలను కంగనా వాడటం చూస్తుంటే, ఆమె కూడా రాజకీయ భాష మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె కూడా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా శివసేన మరిన్ని చర్యలు చేపట్టేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయేలా లేదు’’ అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, SONAL/BBC
ప్రచ్ఛన్న యుద్ధంలో కంగనా చిక్కుకున్నారా?
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి బీజేపీ, శివసేనల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ యుద్ధంలో భాగంగానే కంగనా ఇల్లు, కార్యాలయంపై బీఎంసీ చర్యలు తీసుకుందన్నది వారి అభిప్రాయం.
మరి, ఇకపై ఈ యుద్ధంలో ఏం జరగనుంది?
మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా ఇదే తీరు కొనసాగిస్తే, వ్యవహారాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని సుజాత ఆనందన్ అభిప్రాయపడ్డారు.
‘‘ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. వచ్చే ఐదేళ్లపాటు శివసేనను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటూనే ఉంటోంది. ఈ స్థాయిలో రణగొణ ధ్వనులు ఎప్పటివరకూ ఉంటాయంటే మాత్రం... ‘బిహార్ ఎన్నికల’ వరకూ అని జవాబు చెప్పొచ్చు’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంతర్వేదిలో అసలేమైంది.. రథం చుట్టూ రాజుకుంటున్న వివాదంలో బీజేపీ, జనసేన నేతల గృహ నిర్బంధం
- కరోనావైరస్: 73 ఏళ్ల క్రితం ఈ నవలలో రాసినట్టే అంతా జరుగనుందా?
- కరోనా టెస్టుల పేరుతో తీసుకెళ్లి కిడ్నీలు కాజేస్తున్నారా?
- కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చేసిన బీఎంసీ, ముంబయిని పీవోకేతో పోల్చిన కంగనా
- వలంటీర్లకు అస్వస్థతతో ఆగిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ ట్రయల్స్
- లద్ధాఖ్ సెక్టార్లో కొడవళ్లు బిగించిన కర్రలతో మోహరించిన చైనా సైనికులు’
- బెంగళూరు యువతికి కరోనావైరస్ రెండోసారి సోకిందన్న అనుమానాలు
- భారత రక్షణశాఖ వెబ్సైట్ నుంచి మాయమైన ఆ డాక్యుమెంట్లో ఏముంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)