కొండపల్లి శ్రావణి: మనసు మమత, మౌనరాగం టీవీ సీరియల్స్ నటి ఆత్మహత్య - ప్రెస్ రివ్యూ

కొండపల్లి శ్రావణి

ఫొటో సోర్స్, facebook/sravani.kondapalli.37

టీవీ సీరియల్ నటి, మనసు మమత, మౌనరాగం ఫేమ్‌ శ్రావణి అనుమానాస్పద స్థితిలో బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నమస్తే తెలంగాణ పత్రిక కథనం ఇచ్చింది.

టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన దేవరాజ్‌ రెడ్డి అనే వ్యక్తి వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపించారు.

హైదరాబాద్‌లో కొన్నాళ్లపాటు తమ ఇంట్లోనే ఉన్న దేవరాజ్‌, డబ్బు కోసం శ్రావణిని వేధించాడని, సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్‌ మెయిల్ చేశాడని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి ఆమెకు టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యాడు.

ఆ స్నేహంతో కొన్నాళ్లు ఆమె కుటుంబంతోనే కలిసి ఉన్నాడు.

దేవరాజ్‌ రెడ్డి వేధింపులపై ఈ ఏడాది జూన్‌లో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని తల్లిదండ్రులు చెప్పారు.

అయినా దేవరాజ్‌ మారకపోవడంతో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

అయితే శ్రావణికి ఆత్మహత్యకు తాను కారణం కాదని, కుటుంబ సభ్యులు, సాయి అనే మరో వ్యక్తి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని దేవరాజ్‌ రెడ్డి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే శ్రావణి తనపై కేసు పెట్టిందని, ఈ వ్యవహారంలో విచారణకు తాను సిద్ధమని దేవరాజ్‌రెడ్డి స్పష్టం చేశాడు.

ఫొటో సోర్స్, ACB

ఫొటో క్యాప్షన్,

ఫైల్ ఫొటో

ఎన్‌వోసీ కోసం 1.12 కోట్ల లంచం-ఏసీబీకి పట్టుబడ్డ మెదక్‌ అదనపు కలెక్టర్‌

112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) కోసం 1.12 కోట్లు లంచగా డిమాండ్‌ చేసిన మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

ఈ కథనం ప్రకారం లింగమూర్తి అనే బాధితుడు ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి, తహశీల్దార్‌ సత్తార్‌లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

ఎన్‌వోసీ కోసం లింగమూర్తి అనే వ్యక్తి నుంచి అదనపు కలెక్టర్‌ నగేశ్‌ రూ. కోటీ 12 లక్షలు డిమాండ్‌ చేశారు. బాధితుడు ఇప్పటికే రూ.40 లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ముకు బదులు నగేశ్‌కు బినామీగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి పేరు మీద ఐదెకరాలా భూమిని లింగమూర్తి అగ్రిమెంట్‌ చేశారు.

ఎన్‌వోసీ ఇవ్వడానికి డబ్బుతోపాటు ష్యూరిటీగా బ్లాంక్‌ చెక్కులు కూడా బాధితుడి నుంచి నగేశ్‌ తీసుకున్నారు. ఈ ఆధారాలతోపాటు ఫోన్‌కాల్స్‌ రికార్డులను కూడా అవినీతి నిరోధక శాఖకు లింగమూర్తి సమర్పించడంతో ఏసీబీ అధికారులు మెదక్‌ అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో ఎనిమిది బ్లాంకు చెక్కులు, బినామీ వ్యక్తికి రాసిచ్చిన అగ్రిమెంట్‌ పేపర్లు కూడా ఏసీబీకి దొరికాయి. దీంతో నగేశ్‌ను, ఆయన భార్యను కూడా ఏసీబీ అరెస్టు చేసింది.

మరోవైపు బాధితుడిచ్చిన ఆధారాల మేరకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించి రూ.28 లక్షల నగదు, అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుంది.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

పార్టీ ఆఫీసుకు తాళాలేసుకుని వెళ్లిపోతే ఎలా? : అయ్యన్నపాత్రుడు

పార్టీ ఆఫీసుకు తాళాలేసుకుని వెళ్లిపోతే ప్రజలు ఏమనుకుంటారని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అసంతృప్తి వ్యక్తం చేశారని సాక్షి పత్రిక రాసింది.

ఆఫీసును వదిలేసి హైదరాబాద్‌లో ఉంటున్నారని, చుట్టపుచూపుగా వచ్చి వెళుతుంటే ప్రజలు కార్యకర్తలకు ఏం సందేశమిచ్చినట్లని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారని వెల్లడించింది.

ప్రజల్లోకి వెళ్లకుండా ఆన్‌లైన్‌ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే ఎలాగని ఆయన ప్రశ్నించినట్లు ఈ కథనం పేర్కొంది. పార్టీ అధినేత హైదరాబాద్‌లో కూర్చుంటే పని కాదని, ఇలా అయితే పార్టీ ఎలా బతుకుతుందని ఆయన ప్రశ్నించినట్లు తెలిపింది.

అయ్యన్నపాత్రుడి విమర్శలపై స్పందించిన చంద్రబాబునాయుడు, వెంటనే ఏపీకి వెళ్లాలని లోకేశ్‌ను ఆదేశించినట్లు కూడా సాక్షి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మళ్లీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్న యువరాజ్ సింగ్

రిటైర్మెంట్‌కు యువరాజ్‌ టాటా

గత ఏడాది జూన్‌లో క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న యువరాజ్‌ సింగ్‌ తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారని, దేశవాళి క్రికెట్‌లో మళ్లీ ఆడబోతున్నారని ఈనాడు ఒక కథనం ఇచ్చింది.

ఈ కథనం ప్రకారం పంజాబ్‌ క్రికెట్ ప్రయోజనాల కోసం తాను తిరిగి రావాలనుకుంటున్నానని, పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్‌ పునీత్ బాలీ కోరిక మేరకు తాను పునరాగమనానికి సిద్దంగా ఉన్నానని యువరాజ్‌ ప్రకటించారు.

ప్రస్తుతం పంజాబ్‌ యువ క్రికెటర్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న యువరాజ్‌కు మళ్లీ క్రికెట్‌పై మనసు మళ్లిందని, ఈ మేరకు తన అభిమతాన్ని తెలుపుతూ బీసీసీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి లేఖ రాశారని పునీత్‌ బాలీ వెల్లడించారు. కనీసం మరో ఏడాదిపాటైనా పంజాబ్‌ తరఫున ఆడాలని తాను యువరాజ్‌ను కోరినట్లు బాలీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)