ఇండియా - చైనా మధ్య గొడవల్లో భారత స్టార్టప్‌ కంపెనీలు దెబ్బతింటున్నాయా?

  • నిఖిల్ ఇనామ్‌దార్‌
  • బీబీసీ బిజినెస్‌ కరస్పాండెంట్‌, ముంబై
జాక్ మా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జాక్ మాకు చెందిన అలీబాబా కంపెనీ భారత్‌లో పలు ప్రధాన స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది

ఇప్పటికే కరోనా మహ్మమ్మారి కారణంగా ఏర్పడిన పరిణామాలతో ఇబ్బందులు పడుతున్న భారతీయ స్టార్టప్‌ కంపెనీలు.. ఇండియా - చైనాల మధ్య సైనిక ఘర్షణలతో మరింత నలిగి పోతున్నాయి.

లద్ధాక్‌ సరిహద్దు ఘర్షణలో భారత సైనికులు 20 మంది చనిపోవటంతో.. చైనాతో ఆర్ధిక వ్యవహారాల విషయంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో హద్దు మీరింది నువ్వంటే నువ్వంటూ రెండు దేశాలు పరిస్పరం ఆరోపించుకుంటున్నాయి.

అయితే.. భారత్‌కు చెందిన 30 యూనికార్న్‌ స్టార్టప్‌లలోని 18 కంపెనీలలో చైనా సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. వీటి విలువ సుమారు 100 కోట్ల డాలర్ల వరకు ఉంటుంది. ఇందులో డెలివరీ యాప్స్‌ నుంచి ట్యాక్సీ సర్వీసులు, హోటల్‌ చైన్లు, ఈ-లెర్నింగ్‌ అప్లికేషన్ల వరకూ ఉన్నాయి.

చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఈ కంపెనీలు ఆశించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. “ఒక పెద్ద ఆర్ధిక వనరు అందకుండా పోయింది’’ అని ట్రూనార్త్‌ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లో పనిచేస్తున్న హరీశ్‌ చావ్లా చెప్పారు. “మార్కెట్‌లో చైనా కంపెనీలు ముఖ్యంగా మొబైల్‌, కన్స్యూమర్‌ విభాగాలకు చెందిన కంపెనీలు చురుగ్గా ఉన్నా, లావాదేవీలు, ఒప్పందాలు మందగించే అవకాశం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం 200 చైనా యాప్‌లను నిషేధించింది. ఇందులో టిక్‌టాక్‌ లాంటి సోషల్ మీడియా యాప్‌, పబ్‌జీ లాంటి ప్రముఖ గేమ్‌లు కూడా ఉన్నాయి. జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ఇతర చిన్నా పెద్దా కంపెనీలలో చైనా పెట్టుబడులను భారత ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు భారత్‌లో ఎక్కడికెళ్లినా 'బాయ్‌కాట్‌ చైనా' నినాదం వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

అయితే చైనా పెట్టుబడుల రాక ఆగిపోవడానికి సరిహద్దుల మధ్య వివాదమొక్కటే కారణం కాదు. కరోనా మహమ్మారి సమయంలో దెబ్బతిన్న కంపెనీలను విదేశీ కంపెనీలు సులభంగా లాగేసుకోకుండా నిరోధించడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్‌లో విదేశీ పెట్టుబడుల విధానంలో మార్పులు చేర్పులు చేసింది. ఈ నిర్ణయం భారత్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్టప్‌ కంపెనీల మీద పెను ప్రభావం చూపింది.

ఒక దశాబ్దం కిందట భారత్‌లో చైనా సంస్థల పెట్టుబడులు నామమాత్రంగా ఉండేవి. కానీ 2010 తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఓ స్టార్టప్‌ రీసెర్చ్‌ కంపెనీ నుంచి బీబీసీ సేకరించిన గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ఈ పదేళ్ల కాలంలో చైనాకు చెందిన 35 కార్పొరేట్ కంపెనీలు, 85 వెంచర్‌ క్యాపిటల్‌ ఏజెన్సీలు, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కలిసి సుమారు 400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. చైనా కంపెనీల పెట్టుబడులున్న స్టార్టప్‌లలో పేటీఎం, స్విగ్గీ, స్నాప్‌డీల్‌ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి.

ఈ పదేళ్ల కాలంలోనే చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో వచ్చిన మొత్తం 5 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. అంటే రెట్టింపయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

టిక్ టాక్, పబ్ జీ సహా 200 చైనా యాప్ లను భారత్ నిషేధించింది

మోడరన్‌ సిల్క్‌ రూట్‌గా చెబుతున్న చైనా నిర్మిత బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో భారత్‌ భాగస్వామి కాకపోవచ్చు. కానీ తనకు తెలియకుండానే చైనా వర్చువల్‌ కారిడార్‌లో భారత్ పాలు పంచుకుంటోందని ‘గేట్‌వే హౌస్‌’ అనే థింక్‌ట్యాంక్‌ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

“ఆరంభ దశలో ఉన్న పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం ఉండకపోవచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి అనేక వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి’’ అని చావ్లా అభిప్రాయపడ్డారు. “కానీ ఇప్పటికే అలీబాబా, టెన్సెంట్‌, బైడూ లాంటి బడా కార్పొరేట్‌ల నుంచి పెట్టుబడులు స్వీకరించిన, మరికొన్ని చైనా సంస్థల నుంచి పెట్టుబడులు ఆశిస్తున్న స్టార్టప్‌లు ఇబ్బందులు పడతాయి’’ అని చెప్పారాయన.

భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలనే తన ప్రణాళికలన్నింటినీ అలీబాబా నిలిపేసింది. “భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు నిజంగానే ఆశ్చర్యపోయారు. కానీ ఈ విషయంలో వారికి వేరే మార్గం లేదు’ అని అలీబాబా నుంచి కొంత పెట్టుబడిని సేకరించిన ఓ యూనికార్న్‌ కంపెనీకి వ్యవస్థాపకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు.

ఈ అంశంపై స్పందన తెలపాల్సిందిగా పేటీఎం, బిగ్‌ బాస్కెట్‌, స్నాప్‌డీల్‌ లాంటి సంస్థలను బీబీసీ సంప్రదించింది. కానీ సున్నితమైన ఈ వ్యవహారంలో మాట్లాడానికి ఎవరూ ముందుకు రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images

చైనా పెట్టుబడులను భారత్‌ వద్దనుకుంటోందా?

చైనా నుంచి పెట్టుబడులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ చైనా కంపెనీలు సులభంగా భారత మార్కెట్‌లో పెట్టబడులు గుమ్మరించకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని ప్రముఖ పారిశ్రామిక కంపెనీలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో వారి వెల్లువను పరిమితం చేయాలని భారత్‌ కోరుకుంటోందని ఆ సంస్థలు వివరించాయి.

“పెట్టుబడులకు పూర్తిగా తలుపులు మూసేయాలని ప్రభుత్వం కోరుకోవడం లేదు. అయితే స్టార్టప్‌ కంపెనీలలోకి ఎడాపెడా వస్తున్న చైనా పెట్టుబడులను ఒక స్థాయికి పరిమితం చేయడం దాని ఉద్దేశం’’ అని శివ్‌నాడార్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాల విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జాబిన్‌ టి.జాకబ్‌ చెప్పారు.

ఉన్న పెట్టుబడులు విస్తరించకుడా, భారత్‌లోకి 5G సర్వీసులు వచ్చే వరకు హువావే లాంటి టెక్నాలజీ దిగ్గజాలను దూరంగా ఉంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కొందరు నిపుణులు అంటున్నారు.

అయితే చైనా పెట్టుబడుల మీద పరిమితులు విధిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక భారత స్టార్టప్‌‌లో ఒక విదేశీ కంపెనీ 10 శాతం వాటాను, ఒక వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ 25 శాతం వాటాను ప్రభుత్వ అనుమతి లేకుండా పొందగలదు. అలాంటి పరిస్థితిలో మిగతా పెట్టుబడులను స్టార్టప్‌లు ఎక్కడి నుంచి సంపాదిస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జొమాటో నుంచి పేటీఎం వరకు చైనా కంపెనీలు అనేక స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టాయి

“ఒకపక్క చైనా కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు అవి తప్పుకుంటే వాటి స్థానంలో అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎవరు ముందుకు వస్తారు?’’ అని ఒక న్యాయ సంస్థలో భాగస్వామి అయిన అతుల్ పాండే ప్రశ్నించారు.

దాదాపు 14 చైనా కంపెనీల నుంచి పెట్టుబడులకి దరఖాస్తులు వచ్చాయని, కానీ ఇప్పుడు అవన్నీ ఆటోమేటిక్‌గా పెండింగ్‌లో పడ్డాయని ఆయన తెలిపారు. “పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో అర్దం కాలేదు. కానీ మాకు స్పష్టతనివ్వాలి’’ అని కోరారు.

ఈ ప్రతిష్టంభనతో ఇప్పటికే అనిశ్చితి నెలకొంది. పాశ్చాత్య కంపెనీలతో పోలిస్తే చైనా సంస్థలు పెట్టుబడుల చర్చల నుంచి వేగంగా తప్పుకుంటున్నాయి.

భారతీయ స్టార్టప్‌లు చైనా మొబైల్‌ మార్కెట్‌ నుంచి ఎంతో నేర్చుకోడానికి, అనుకరించడానికి ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు చైనా టెక్‌ దిగ్గజాలను పక్కనబెట్టడం వల్ల ఆ కంపెనీలు కూడా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తంది.

చైనా కంపెనీలు లేకపోయినా, ప్రపంచవ్యాప్తగా అనేక కంపెనీలు పెట్టబడులు పెట్టటానికి ముందుకు వస్తాయని, కోవిడ్‌-19కు ముందునాటి పరిణామాలు మళ్లీ ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. భారత్‌ అనేది ఒక పెద్ద మార్కెట్‌ అన్న విషయం మర్చిపోవద్దని వారు గుర్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

చైనాతో భారత్ ఆర్ధిక కయ్యానికి సరిహద్దు సమస్య ఒక్కటే కారణం కాదు

సిలికాన్ దిగ్గజాల నుంచి పెట్టుబడులు ఎటు వెళ్లాయి?

ఒకవైపు కోవిడ్‌ మహమ్మారి కొనసాగుతుండగానే గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటి సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు, ఏఐడీఏ, కేకేఆర్ లాంటి ఈక్విటీ దిగ్గజాల నుంచి భారత్‌ సుమారు 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది.

అయితే వీటిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి ముకేశ్‌ అంబానీ గ్రూప్‌కు చెందిన టెలీకాం కంపెనీ సంస్థ జియోలోకి వెళ్లాయి తప్ప స్టార్టప్‌లకు రాలేదు. కాకపోతే దీనివల్ల చైనా నుంచి ఆగిన పెట్టుబడులను భారత్‌ పూడ్చుకోగలిగింది.

ఇండియన్‌ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, వెంచర్‌లు ఎక్కువగా విదేశీ నిధుల మీదే ఆధారపడుతున్నాయి. వీటిలో భారతదేశపు పెట్టుబడులు ఐద శాతమేనని ఒక ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌లో భాగస్వామి అయిన గోపాల్‌ జైన్‌ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

కోవిడ్‌-19 తర్వాత పరిణామాలలో డబ్బు కొరత ఏర్పడితే ఈ నిధులు 30 నుంచి 40 శాతం వరకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. అప్పుడే చైనా పెట్టుబడులు లేకుండా భారత్‌ తన 30 యూనికార్న్‌ స్టార్టప్‌లను సృష్టించగలదా అన్నది తేలుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)