లౌంగీ బూయియా: బిహార్‌లో మరో మౌంటెయిన్ మ్యాన్... మూడు కిలోమీటర్ల కాలువను ఒక్కరే తవ్వేశారు

  • నీరజ్ ప్రియదర్శి
  • బీబీసీ కోసం
లౌంగీ బూయియా

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI/BBC

ఫొటో క్యాప్షన్,

లౌంగీ బూయియా

బిహార్ రాజధాని పట్నా నుంచి దాదాపు 200 కి.మీ.ల దూరంలో గయా జిల్లాలోని బాంకేబజార్ బ్లాక్‌ ఉంది. ఇక్కడ జనం ప్రధానంగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తుంటారు. కానీ, సాగు నీటి సౌలభ్యం లేకపోవడంతో వరి, గోధుమల్లాంటి లాభసాటి పంటలు పండించే పరిస్థితి ఇక్కడ లేదు.

దీంతో ఇక్కడి గ్రామాల యువత ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వలసపోవడం ఎక్కువైంది.

కోటిల్వా గ్రామంలో నివసించే లౌంగీ బూయియా కుమారులు కూడా ఇలాగే ఉపాధి వెతక్కుంటూ గ్రామం వదిలి వెళ్లిపోయారు.

మేకలు మేపుకుంటూ గ్రామం పక్కనే ఉన్న బంగేటా కొండ మీదకు వెళ్లినప్పుడు బూయియాకు ఓ ఆలోచన వచ్చింది. ‘గ్రామానికి నీళ్లు వస్తే, పంటలు పండి, వలసలు ఆగిపోతాయి కదా!’ అని ఆయన అనుకున్నారు.

ఈ ప్రాంతంలో వానాకాలంలో వర్షాలు పడతాయి. అయితే, నీరు బంగేటా కొండ మీదే నిలిచిపోతుంటుంది.

ఈ నీటిని ఎలాగైనా పంట పొలాల వరకూ రప్పించాలన్న ఆలోచన బూయియాకు వచ్చింది.

దీంతో ఆయన ఆ ప్రాంతమంతా తిరిగి, కొండ మీద నుంచి నీటిని పొలాల వరకూ తీసుకువచ్చేందుకు ఓ కాలువ తవ్వాలని ఓ మ్యాపు గీసుకున్నారు. ఒకటి, రెండు కాదు... ఏకంగా 30 ఏళ్లపాటు కాలువను తవ్వుతూ ఉన్నారు.

ఒంటరిగానే కష్టపడి ఐదు మీటర్ల వెడల్పు, మూడు అడుగుల లోతుతో మూడు కిలోమీటర్ల పొడవున ఓ కాలువను తవ్వారు.

కొండ మీదున్న నీటిని ఊరి చెరువు వరకూ తీసుకువచ్చారు.

వీడియో క్యాప్షన్,

30 ఏళ్లుగా ఒంటిచేత్తో 3 కిలోమీటర్ల కాలువ తవ్విన బిహార్‌ భగీరథుడు

గత ఆగస్టులోనే బూయియా కాలువ తవ్వడం పూర్తిచేశారు. ఆ తర్వాత కురిసిన వర్షాలతో ఆయన కృషికి ఫలితం కనిపించింది. చెరువులోకి నీళ్లు వచ్చాయి.

స్థానికంగా ఉన్న మూడు గ్రామాలకు చెందిన మూడు వేల మందికి ఈ చెరువు నీరు ఉపయోగపడుతోంది. అక్కడి రైతులు ఈసారి వరి, గోధమలు కూడా వేస్తున్నారు.

‘‘నేను ఒకసారి నిశ్చయించుకున్నాక, వెనక్కితగ్గే రకం కాదు. ఎప్పుడు ఖాళీ దొరికినా, కాలువ తవ్వే పనిలో మునిగిపోయేవాడిని. కాలువ పూర్తి చేయడం నా వల్ల కాదేమోనని నా భార్య అంటుండేది. కానీ, పూర్తి చేయొచ్చని నేను గట్టిగా నమ్మాను. నీళ్లు వస్తాయి, పొలం పనులు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఒక్కటే నా మనసులో మెదిలింది. పిల్లలు వలస పోకుండా, ఊర్లోనే ఉంటారు కదా అనుకున్నా. వరి, ఇతర ధాన్యాలు పండితే, కనీసం పొట్టైనా నిండతుంది కదా’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Neeraj Priyadarshi/BBC

ఇదివరకు గయాలోని గెహ్లార్‌కు చెందిన దశరథ్ మాంఝీ ఒంటరిగా కొండను తవ్వి, తమ గ్రామానికి దారిని వేసి ‘మౌంటెయిన్ మ్యాన్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఆయన జీవితం ఆధారంగా హిందీలో సినిమా కూడా వచ్చింది.

మాంఝీ తరహాలోనే ఇప్పుడు లౌంగీ బూయియాను కూడా అందరూ ‘మౌంటెయిన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు.

‘‘ఈ పని మొదలుపెట్టినప్పుడు దశరథ్ మాంఝీ గురించి ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్నా. గ్రామానికి నీళ్లొస్తే పంటలు పండుతాయి, వలసలు ఆగిపోతాయి కదా అనిపించింది. ఎలాగైనా పొలాల వరకు నీటిని తీసుకురావాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నా’’ అని బూయియా అన్నారు.

బూయియాకు నలుగురు కుమారులు. వారిలో ముగ్గురు వలస వెళ్లి పనిచేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామంలోని ఇంట్లో బూయియాతోపాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, వాళ్ల పిల్లలు ఉంటారు.

ఇప్పుడు మిగతా కుమారులు కూడా తిరిగివస్తారన్న ఆశతో బూయియా ఉన్నారు.

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI/BBC

ఫొటో క్యాప్షన్,

బూయియా 30 ఏళ్లపాటు ఈ కాలువను తవ్వారు

బూయియా ప్రయత్నం ఇప్పుడు కోటిల్వా గ్రామస్థుల్లో ఆనందాన్ని నింపింది.

‘‘ఆయన చేసిన పని అద్భుతానికి ఎంతమాత్రమూ తక్కువ కాదు. కొండను తవ్వి కాలువగా మార్చాలంటే చిన్న పని కాదు. ఆయన కృషిని భావి తరాలు కూడా గుర్తుపెట్టుకుంటాయి’’ అని స్థానికుడు ఉమేశ్ రామ్ అన్నారు.

‘‘బూయియా ఈ పని మొదలుపెట్టినప్పుడు, ఆయన పడుతున్న కష్టం చూసి జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు చాలా సార్లు మేం వినతులు పెట్టాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మేం కూడా ఇదే జరిగే పని కాదనుకున్నాం. కానీ, బూయియా మేం అనుకున్నది తప్పని నిరూపించారు’’ అని కోటిల్వాకే చెందిన జీవన్ మాంఝీ అన్నారు.

బూయియా చేసిన పని గురించి తెలుసుకుని, ఆయన్ను కలిసేందుకు రోజూ గ్రామానికి ఎవరో ఒకరు వస్తున్నారని స్థానికులు చెప్పారు.

లౌంగీ బూయియా చేసిన పనిని గయా జిల్లా అధికారులు ప్రశంసించారు. ఆయనకు సన్మానం చేయాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHI/BBC

ఫొటో క్యాప్షన్,

‘నేను ఒకసారి నిశ్చయించుకున్నాక, వెనక్కితగ్గే రకం కాదు’

‘‘ఇది తెలిశాక, చాలా సంతోషమనిపించింది. దశరథ్ మాంఝీ తర్వాత అదే రీతిలో మళ్లీ గయాకు చెందిన లౌంగీ బూయియా చాలా గొప్ప పని చేశారు. తన బంజరు భూమికి నీటిని తీసుకొచ్చేందుకు చాలా ఏళ్లపాటు కఠిన శ్రమకోర్చి కాలువ తవ్వారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇలాంటి మహనీయులే చరిత్రను లిఖిస్తారు. మా జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఆయన గర్వకారణం’’ అని నామ్‌గంజ్ బ్లాక్ డెవెలప్‌మెంట్ ఆఫీసర్ అలఖ్ నిరంజన్ అన్నారు.

అయితే, గయా జిల్లా యంత్రాంగం తీరును చాలా మంది విమర్శిస్తున్నారు. బూయియా 30 ఏళ్లుగా ఒంటరిగా కాలువ తవ్వుతున్నప్పుడు, యంత్రాంగం మొద్దు నిద్రపోయిందా అని ప్రశ్నిస్తున్నారు.

‘‘ముందు ఎవరూ రాలేదు. ఇప్పడు కొందరు వస్తున్నారు. కొందరు మాట ఇచ్చి వెళ్లిపోతున్నారు. నా పనైతే పూర్తైంది. నాకు ఇప్పుడు ఏదీ వద్దు. నా కుటుంబానికి ఓ ఇల్లు, మరుగుదొడ్డి కావాలని కోరుకుంటున్నా. నాది మట్టి గోడల ఇల్లు. అది పాడైపోతోంది. ఒకవేళ ఈ కొండను తవ్వే పని లేకుంటే, ఈలోగా నేను ఇల్లు కట్టుకునేవాడిని. నాకు పతకాలేమీ వద్దు. ఒక ట్రాక్టర్ ఉంటే, వ్యవసాయం సులువుగా చేసుకుంటాను’’ అని బూయియా అన్నారు.

ఫొటో సోర్స్, Neeraj Priyadarshi/BBC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)