#womenhavelegs: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?

రీమా

ఫొటో సోర్స్, Instagram/rimakallingal

ఫొటో క్యాప్షన్,

రీమా

#విమెన్ హావ్ లెగ్స్ (స్త్రీలకు కాళ్ళు ఉన్నాయి) అంటూ పలువురు సినీ తారలు తమ కాళ్ళు కనిపించేలా పోస్టు చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ఇదంతా ఎలా మొదలయింది?

తమిళ నటి అనాశ్వర రాజన్ ఆరు రోజుల క్రితం పొట్టి షార్టు ధరించిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ విషయాన్ని తప్పు పడుతూ అనేక మంది ఆమె పోస్టుపై అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేసి ఆమెని ట్రోల్ చేశారు. ఈ కామెంట్లు చాలా వరకు తమిళంలో ఉన్నాయి.

దీంతో, పలువురు సినీ తారలు ఆమెకు మద్దతు తెలుపుతూ తాము పొట్టి డ్రెస్సులు ధరించిన ఫొటోలతో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో #womenhavelegs #yeswehavelegs #showthemhowitsdone హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

సినీ నటి రీమా కల్లింగల్, సముద్రపు ఒడ్డున స్విమ్ సూట్ ధరించిన ఫోటో పెట్టి “ఆశ్చర్యం, ఆశ్చర్యం!!! స్త్రీలకు కాళ్లు ఉన్నాయి” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ఈ అంశం పై నటి అహానా కృష్ణ తీవ్రంగా స్పందించారు.

ఆమె ఒక షర్టు మాత్రమే ధరించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ఈ ఫోటో పై అసభ్యకరంగా ఎవరు కామెంట్ చేస్తారో చూస్తాను అని రాశారు.

"నేనేమి ధరిస్తానో మీకు సంబంధించిన వ్యవహారం కాదు. అలాగే ఎవరైనా ఏమి ధరిస్తారో కూడా మీకు సంబంధించిన వ్యవహారం కాదు. మీ పనులేవో మీరు చూసుకోండి. మీకు తగినంత పని ఉండి ఉండకపోవచ్చు. అందుకే ఇతరుల వ్యవహారాల్లో తల దూరుస్తున్నారు” అని రాశారు.

“నేను నాకు నచ్చినట్లు షార్టు ధరిస్తాను, చీర కట్టుకుంటాను, లేదా స్విమ్ సూట్ వేసుకుంటాను. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడానికి మీకు లైసెన్సు లేదు. అలాగే నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఇదేమీ ఒక అవకాశంగా నేను చూడటం లేదు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోండి. నేను ధరించే దుస్తులు కాదు” అని తీవ్రంగా ఆమె పోస్టులో రాశారు.

"నాకు తెలిసినంత వరకు స్త్రీ అయినా పురుషుడు అయినా శరీర భాగాలైన పొట్ట చేతులు, కాళ్ళు ఒకటే. పురుషుల పోస్టుల మీద చేసే కామెంట్లకి, స్త్రీల పోస్టుల మీద చేసే కామెంట్లకి మధ్య వ్యత్యాసం ఎందుకుండాలో నాకర్ధం కాదు. ఒక పురుషుడు శరీర ప్రదర్శన చేస్తూ ఫోటోలు పోస్టు చేస్తే, హాట్‌గా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారని కామెంట్లు పెడతారు. అదే పోస్టు ఒక స్త్రీ చేస్తే మాత్రం సెక్స్ కి సమ్మతంగా ఉందని, ఆమెకి సిగ్గు లేదని, అందరి దృష్టిని ఆకర్షించడానికి చేస్తోందని విమర్శిస్తారు”.

ఈ పితృస్వామ్య భావజాలాన్ని మీ దగ్గరలో ఉన్న చెత్త బుట్టలో విసిరేయండి అని ఆమె రాశారు.

“నేను ఈ పొట్టి బట్టలతో ఫోటో పోస్టు చేయడం వెనక ఒకటే అర్ధం ఉంది. నాకు ఆ ఫోటో అంటే ఇష్టం ఉండటం వలన నా సోషల్ మీడియా లో నేను షేర్ చేసుకున్నాను. ఇందులోనుంచి మీరింకేదైనా అర్ధాన్ని వెతుక్కుంటే అది మీ జీవితంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితులకు అద్దం పడుతోంది’’ అని ఆమె విమర్శించారు.

“ఎప్పటి నుంచో పాతి పెట్టుకుపోయిన భావజాలాలు ఒకేసారి మారవు. కానీ, ఆ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించే ప్రవర్తనకి అడ్డు కట్ట వేయవచ్చు” అని ఆమె అన్నారు.

“అసభ్యకర రీతిలో కామెంట్లు చేసే వారిని ఖండించండి. మేలు చేయని పితృస్వామ్యాన్ని ఖండించండి. ఎవరో తెలియని వ్యక్తులు మీ దుస్తుల గురించి చేసే కామెంట్లను ఖండించండి” అని ఆమె అభిమానులకు పిలుపునిచ్చారు.

ఈ మూడు పనులు చేయగలిగితే అసభ్యకర కామెంట్లు చేసే వారు విషం వెళ్లగక్కడానికి భయపడే పరిస్థితి ఏర్పడి వారి ఆలోచనలను వారితోనే ఉంచుకోగలిగే పరిస్థితి వస్తుంది అని ఆమె పోస్టులో రాసారు.

“ఈ పోస్టు మొత్తాన్ని నేను ఒకే ఒక్క వ్యాక్యం లో చెప్పాలంటే, పితృస్వామ్య వ్యవస్థ నశించడమే నేను అభిమానించే కాలంగా మారుతుంది" అని అంటూ ఆమె పోస్టును ముగించారు.

మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ కూడా తన భార్య, హీరోయిన్ నజ్రియా నాజిమ్ ఫహద్ పొట్టి గౌనుతో ఉన్న ఫోటోను పోస్టు చేసి #విమెన్ హావ్ లెగ్స్ అని రాశారు. ఆయన రాసిన పోస్టుకు అభిమానుల నుంచి సానుకూల స్పందన లభించింది.

పలువురు తారల నుంచి లభిస్తున్న మద్దతుతో "నేనేమి చేస్తున్నాననే అంశం గురించి మీరు విచారించకండి. నేనేమి చేస్తున్నానో అనే విషయం గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారో అనే విషయం గురించి విచారించండి” అంటూ అనాశ్వర తిరిగి సోషల్ మీడియాలో ఇంకొక పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)