నరేంద్ర మోదీకి మీడియా అంటే భయమా? ఇంటర్వ్యూల్లో ఆయన తీరు ఎలా ఉంటుంది?

  • ఆశిష్ దీక్షిత్
  • బీబీసీ మరాఠీ ఎడిటర్
నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PTI

భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇప్పటివరకూ ఇంటర్వ్యూ చేసిన వాళ్లందరూ ఓ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. అది, ఏదైనా విషయం గురించి మోదీ ఇచ్చే వివరణ స్పష్టంగా ఉంటుందని.

మోదీ స్పష్టంగా మాట్లాడతారు సరే! కానీ, ఎదురైన అన్ని ప్రశ్నలకూ ఆయన బదులుచెబుతారా? ఆయన చెప్పదల్చుకున్నది మాత్రమే చెబుతారా? ఇరుకునపెట్టే ప్రశ్నలు అడిగితే ఆయన తీరు ఎలా ఉంటుంది?

మోదీ మీడియాకు ఇంటర్వ్యూలు చాలా అరుదుగా ఇస్తుంటారు. ఈ మధ్య మోదీని ఇంటర్వ్యూ చేసినవారు ఎవరూ ఆయన్ను సరైన ప్రశ్నలు అడగడం లేదని విమర్శలు ఉన్నాయి.

మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత, ఈ ఆరేళ్లలో కనీసం ఒక్క విలేకరుల సమావేశంలోనూ ఆయన పాత్రికేయుల ప్రశ్నలు ఎదుర్కొనేందుకు మందుకురాలేదు. ఆయన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గతంలో మోదీని ఇంటర్వ్యూ చేసిన స్మితా ప్రకాశ్, విజయ్ త్రివేది, రాజ్‌దీప్ సర్దేశాయ్, నవ్‌దీప్ ధరివాల్‌ లాంటి ప్రముఖ జర్నలిస్టులను మేం పలకరించాం. మోదీ‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారికి ఎదురైన అనుభవం, మరిచిపోలేని విషయాల గురించి చెప్పమని అడిగాం.

ఎవరెవరు ఏం చెప్పారంటే...

ఫొటో సోర్స్, Twitter/smitaprakash

స్మితా ప్రకాశ్

(ఏఎన్ఐ న్యూజ్ ఏజెన్సీ)

నేను ఇప్పటివరకూ రెండుసార్లు మోదీని ఇంటర్వ్యూ చేశాను. 2014లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి మాట్లాడాను. రెండోసారి 2019 జనవరిలో లోక్‌సభ ఎన్నికలకు 5 నెలల ముందు ఇంటర్వ్యూ చేశాను.

నన్ను అడిగితే, 2014లో ఇంటర్వ్యూ బాగా జరిగిందని చెబుతాను. 2014కు ముందు కూడా గుజరాత్ వెళ్లాను కానీ, ఆయన్ను కలిసే అవకాశం రాలేదు. అప్పటికి కూడా అవుతుందో, అవ్వదో స్పష్టంగా తెలీదు. విలేకరులను కలవాలంటే ఆయన కాస్త సంకోచిస్తారని విన్నాను.

కానీ ఆయన్ను కలిసినప్పుడు చాలా ప్రశాంతంగా మాట్లాడారు. ఆయన మేధావి అని కూడా అర్థమయ్యింది. అది అడగొద్దు, ఇది అడగొద్దు అనే ఆంక్షలేమీ పెట్టలేదు. ఆ సమయంలో నేను సింగపూర్‌కు చెందిన న్యూస్ ఏసియా ఛానల్‌కు కూడా పనిచేస్తూ ఉన్నాను. ఆ ఛానల్‌ కోసం నాకు కొంత ఆసక్తికరమైన సమాచారం కావాలి.

విదేశాంగ విధానాల పట్ల మోదీకున్న అవగాహన చూసి నేను ఆశ్చర్యపోయా. ప్రధాని కాకముందు విదేశాంగ విధానాల గురించి ఆయనకు పెద్దగా అనుభవం లేదని అందరూ అనుకున్నారు. కానీ, ఆరోజు సింగపూర్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయన నాతో మాట్లాడారు.

రేటింగుల గురించి నాకు బెంగ లేదు. ఎందుకంటే మాది ఏజెన్సీ. మా నుంచి వివిధ ఛానెళ్లకు ఆ ఇంటర్వ్యూ వెళ్తుంది. కరణ్ థాపర్‌లా నా ఇంటర్వ్యూ ఉండదు. ఆయన సుదీర్ఘ సమాధానాలు ఇచ్చేటట్లు నా ప్రశ్నలు ఉండాలి. అలా ఉంటే, ఛానెళ్లు ఎవరికి కావాల్సినవి వాళ్లు ఎడిట్ చేసి వాడుకోవచ్చు.

ఇబ్బంది పెట్టే ప్రశ్నలకైనా సరే, మోదీ చక్కగా జవాబిస్తారు. కానీ, ఆ జవాబులు ఆయనకు కావలసినట్టుగానే ఉంటాయి.

ఇంటర్వ్యూకు ముందు, తరువాత ఆయనలో ఏ మార్పూ ఉండదు. అలిసిపోవడం లేదా అడిగిన ప్రశ్నల గురించి నిలదీయడంలాంటివి ఏమీ ఉండవు. సంభాషణ ముగిశాక అక్కడి నుంచి సెలవు తీసుకుంటారు. అంతే!

ఆ ఇంటర్వ్యూ తరువాత మోదీ నాకు ఫోన్ చేశారు. అన్ని ఛానళ్లలోనూ అది ఒకేసారి ప్రసారమవుతుందని తనకు తెలియదని నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/vijaitrivedi

విజయ్ త్రివేది

(ఎన్‌డీటీవీ ఇండియా కోసం మోదీని ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం 'సత్య హిందీ' ఛానల్‌లో పనిచేస్తున్నారు.)

2019 ఏప్రిల్‌లో నాకు మోదీ ఫోన్ చేశారు. అహ్మదాబాద్ రమ్మని పిలిచారు. అప్పటికి 20 ఏళ్లుగా నాకు మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దిల్లీలో మోదీ.. బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. ఏటా దీపావళికి నాకు ఫోన్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలిపేవారు. ఆతిథ్యం ఇవ్వడంలోనూ ఆయనకు ఆయనే సాటి. స్నేహితులను బాగా చూసుకుంటారు.

ఆరోజు పొద్దున్నే అహ్మదాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరాం. అందులో నలుగురే కూర్చోవచ్చు. కానీ, మేము ఐదుగురం ఉన్నాం.

నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన చాలా బలంగా, నిస్సంకోచంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. చాలామంది ఆచి తూచి మాట్లాడుతుంటారు. కానీ, మోదీ తనకేమనిపిస్తే అది నిర్మొహమాటంగా చెబుతారు. ఉదాహరణకు 2008లో పార్టీలో చాలామంది ప్రధానమంత్రి పదవికి సరైన అభ్యర్థిని ఎన్నుకునేందుకు తటపటాయిస్తుంటే, మోదీ మాత్రం ఆడ్వాణీ ప్రధాని కావాలని గట్టిగా చెప్పారు.

మేము ఆరోజు అమ్రేలీ వెళ్తున్నాం. ‘ఇప్పుడు ఒక 45 నిముషాల ప్రయాణం, దీని తర్వాత మళ్లీ ఒక 30 నిముషాల ప్రయాణం ఉంటుంది. ఈ సమయంలో మీకెప్పుడు కావాలంటే అప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు’ అని మోదీ నాతో అన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా '2002 గుజరాత్ అల్లర్ల విషయంలో మీరు బాధ్యత వహిస్తారా? అందుకు క్షమాపణలు అడుగుతారా?' అని నేను మోదీని ప్రశ్నించాను.

"ఇదే ప్రశ్నను 1984 అల్లర్ల విషయంలో సోనియా గాంధీని మీరు ధైర్యంగా అడగగలరా?" అని ఆయన నన్ను ఎదురుప్రశ్నించారు. సోనియా గాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు తప్పకుండా అడుగుతానని నేను చెప్పాను.

అదే ప్రశ్న మోదీని నేను మళ్లీ అడిగాను. ‘నేను ఏం చెప్పదలుచుకున్నానో, అది చెప్పేశాన’ని ఆయన జవాబిచ్చారు. నేను వదలకుండా, మళ్లీ అదే ప్రశ్న అడిగాను. ఆయన కెమెరాకు అడ్డంగా చేతులుంచారు. నన్ను పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న ఫైల్స్ చూడటం మొదలుపెట్టారు. తర్వాత కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నారు. హెలికాప్టర్‌లో పూర్తి మౌనం అలుముకుంది.

మేము దిగుతున్నప్పుడు, మోదీ నా భుజంపై చెయ్యి వేసి... ‘బహుశా, ఇదే మన చివరి సంభాషణ కావొచ్చు’ అని అన్నారు.

నేను ఆ సమయంలో అక్కడ జరుగుతున్న ఓ ర్యాలీని కవర్ చెసుకుని వెనక్కి వచ్చేసరికి మోదీ తన హెలికాప్టర్‌లో వెనక్కి వెళిపోయారు. నా తిరుగు ప్రయాణానికి ఒక కారు ఏర్పాటు చేశారని ఆయన అనుచరులు చెప్పారు. నేను వాళ్ల కారు ఎక్కకుండా, దారిలో వస్తున్న ట్రాక్టర్‌ను లిఫ్ట్ అడిగి వెనక్కి వచ్చేశాను.

ఈ ఇంటర్వ్యూ ప్రసారం అవ్వకుండా అడ్డుకోవాలని మోదీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. మేము పూర్తి సంభాషణ ప్రసారం చేశాం. మా ఎడిటర్ దీనికోసం ‘ఇంటర్వ్యూ అంటే మౌనం’ అన్న క్యాప్షన్‌తో ప్రోమో కూడా తయారుచేశారు.

ఆ ఇంటర్వ్యూకు అంత ప్రచారం వస్తుందని నేను అసలు ఊహించలేదు.

ఆ తరువాత, ఇప్పటి వరకూ మోదీ నాతో మాట్లాడలేదు. నేను చాలాసార్లు ఆయన కార్యక్రమాలను కవర్ చేశాను. ఆయనతో పాటూ అమెరికా కూడా వెళ్లాను. ఒకసారి ఎదురుపడినప్పుడు నన్ను పలకరించారు. అంతే.

నాకు ఆయనమీద వ్యతిరేకత ఏమీ లేదు. అంతకుముందూ లేదు. ఇప్పుడూ లేదు. ఈరోజు కూడా నాకు ఆయన ఎక్కడైనా తారసపడితే నేను అదే చేస్తాను. ఆయన్ను ప్రశ్నలడుగుతాను.

ఫొటో సోర్స్, facebook/rajdeepsardesai

రాజ్‌దీప్ సర్దేశాయ్

(ఎన్‌డీటీవీ, సీఎన్‌ఎన్ -ఐబీఎన్ ఛానళ్లకోసం మోదీని ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఇండియా టుడేకు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.)

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను అనేకసార్లు ఇంటర్వ్యూ చేశాను. కానీ, అన్నిటికన్నా గుర్తుండిపోయేది 2012 సెప్టెంబర్‌లో నేను చేసిన చివరి ఇంటర్వ్యూ. ఆరోజు నన్ను తన బస్సు దిగువన కూర్చోబెట్టారు. ఆయనకు విలేకరులంటే ఒక రకమైన భయం, జాగ్రత్త ఉన్నట్టు నాకు అనిపించాయి. నేను చేసిన ఇంటర్వ్యూను ఉత్తమమైన జర్నలిజం అని ఆకార్ పటేల్ కొనియాడారు.

మోదీని నేను మొదటిసారిగా 1990లో జరిగిన రథయాత్రలో కలిశాను. ఒక తెల్లని కుర్తా పైజామా వేసుకుని ఉన్నారు. అప్పట్లో ఇన్ని టీవీ ఛానల్స్ లేవు. ఆయన బాగా మాట్లాడగలరని నాకు అర్థమైంది..

2001లో 9/11 దాడి తర్వాత 3-4 రోజులపాటు ఉగ్రవాదంపై మేం ఒక కార్యక్రమం చేశాం. అందులో ప్రమోద్ మహాజన్‌ను మాట్లాడమంటే, అప్పట్లో ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నందువల్ల తిరస్కరించారు. తర్వాత శాస్త్రి భవన్‌లో నేను మోదీని కలిసి, మా చర్చా కార్యక్రమంలో పాల్గొనమని అడిగా. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. మీరు ఈ అంశంపై కార్యక్రమం చేయడం మంచి విషయం అని నాతో అన్నారు.

అప్పట్లో మోదీ చాలావరకూ అందుబాటులో ఉండేవారు. ఏ ప్రశ్న అడిగినా బదులిచ్చేవారు. ముందుగా ఏ రకమైన ప్రశ్నలూ అడిగేవారు కాదు. ప్రస్తుతం ఆయన ఇచ్చే ఏ ఇంటర్వ్యూ చూసినా, పీఆర్ కోసం చేసినట్టుంటున్నాయి. అప్పట్లో మోదీతో సంభాషించడమంటే సరదాగా ఉండేది.

2002 అల్లర్లు జరిగినప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన్ను ఇంటర్వ్యూ చేశాక, ఆఫీసుకి వచ్చి చూస్తే ఆ టేప్ నలిగిపోయి ఉంది. మళ్లీ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. రాత్రి 11 గంటలకి మోదీతో మాట్లాడాను. అవే ప్రశ్నలడిగాను. మళ్లీ ఓపిగ్గా అన్నింటికీ ఆయన జవాబులు చెప్పారు. ఈరోజుల్లో అలాంటివి అసాధ్యం అనిపిస్తోంది.

నవ్‌దీప్ ధరివాల్

(బీబీసీ న్యూస్‌లో పనిచేస్తున్నప్పుడు మోదీని ఇంటర్వ్యూ చేశారు)

‘వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు సమయంలో నేను మోదీని ఇంటర్వ్యూ చేశాను. ఆ సదస్సు పట్ల ఆయన ఎంతో ఉత్సాహం కనబరిచేవారు. గుజరాత్‌ను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ప్రవాసులకు చూపించాలని తహతహలాడేవారు.

ఇంటర్వ్యూకు ముందు మోదీ, నేను ఒకరినొకరం పలకరించుకున్నాం. తరువాత నేరుగా సంభాషణ మొదలుపెట్టాం.

ఆ సదస్సుతోపాటు గుజరాత్ అల్లర్ల గురించీ కూడా ఆయన్ని అడగాలని నేను అనుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ విషయంపై మోదీ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నారని, అలా అడగడమే సముచితమని నాకు అనిపించింది.

"వేల మంది ముస్లింలను ఊచకోతకు గురైన సమయంలో మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని మీరు జనాన్ని ఆహ్వానిస్తున్నారా?’ అని అడిగా.

దానికి ఆయన జవాబు ఇవ్వలేదు. నేను మళ్లీ అదే ప్రశ్న అడిగాను. ఆయన మైక్రోఫోన్ తీసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆయన తీరు స్పష్టంగా ఉంది.. ఆ సదస్సు గురించి తప్ప, ఇంకే ఇతర విషయాలూ మాట్లాడనని ఆయన చెప్పకనే చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)