అమరావతి భూములపై సీబీఐతో దర్యాప్తు జరిపించండి: లోక్‌సభలో మిథున్ రెడ్డి - ప్రెస్ రివ్యూ

అమరావతి భవనాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రాజధాని ప్రాంత భూముల కోనుగోళ్ల ఆరోపణలు, ఏసీబీ కేసును వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

మిథున్ రెడ్డి మాట్లాడే సమయంలో టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజధాని భూముల విషయంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని మిథున్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి ఏకపక్షంగా దర్యాప్తు జరుగుతుందనే భావన కలుగుతోందని, కాబట్టి దీనిని సీబీఐతో దర్యాప్తు చేయాలని ప్రతిపాదించారు.

ఈ విషయంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. అదేవిధంగా, ఫైబర్‌గ్రిడ్‌ నిధుల అవకతవకలు, అంతర్వేది రథం ఘటనపైనా సీబీఐ దర్యాప్తు చేయించాలన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రూ.80 లక్షల విలువైన ఫోన్లు చోరీ

లక్షా రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.80 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లను దొంగిలించిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద వెలుగుచూసిందని సాక్షి దిన పత్రిక ఓ కథనం ప్రచురించింది.

సినీ ఫక్కీలో కంటైనర్‌లోకి చొరబడిన ఆగంతకులు.. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమలో తయారైన 980 రెడ్‌మి ఫోన్లను గోతాల్లో నింపుకుని పారిపోయారు.

శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు సెల్‌ఫోన్ల లోడుతో బయలుదేరిన కంటైనర్‌ వెనుక తాళాలను కత్తిరించిన దుండగులు.. లోపలకి చొరబడి కొన్ని మొబైల్స్‌ను దొంగిలించి, వాహనం ఆగిన సమయంలో దిగి పారిపోయారు.

వెనుకగా వస్తున్న వాహనదారులు కాజ టోల్‌ ప్లాజా వద్ద కంటైనర్‌ డ్రైవర్‌కు ఆగంతకులు చొరబడిన విషయాన్ని చెప్పారు. దీంతో డ్రైవర్, సిబ్బంది బుధవారం ఉదయం మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు కంటైనర్‌తో సహా చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సరిగ్గా మూడేళ్ల కిందట కూడా ఇదే పరిశ్రమలో తయారైన మొబైల్‌ ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌ లారీ నెల్లూరుకు సమీపంలో చోరీకి గురైంది. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి పాల్పడిన ముఠాను గుర్తించి కొంతమేరకు రికవరీ చేశారు.

ఫొటో సోర్స్, Facebook/SingeetamSrinivasaRao

దర్శకుడు సింగీతం శ్రీనివాస‌రావుకు క‌రోనా

ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాస‌రావు క‌రోనా బారిన ప‌డ్డారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

కరోనా ల‌క్ష‌ణాలు కనిపించడంతో సెప్టెంబ‌ర్ 9న చెన్నైలో ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని ,ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానని సింగీతం పేర్కొన్నారు.

మంగ‌ళ‌వారం(సెప్టెంబ‌ర్ 22) నాటితో ఆయ‌న క్వారంటైన్ గ‌డువు ముగుస్తుంద‌ని తెలిపారు. అయితే అంత‌కు ముందు రోజే ఆయ‌న పుట్టిన‌రోజు కావ‌డం విశేషం.

" 65 ఏండ్లుగా నేను పాజిటివ్‌గా ఉన్నా, కానీ డాక్ట‌ర్లు ఇప్పుడు కొత్త‌గా కోవిడ్ పాజిటివ్ అన్నారు"అని ఆయన చమత్కరించారు. హోమ్ ఐసోలేష‌న్‌లో భాగంగా ప్ర‌త్యేక గ‌దిలో ఉన్నాన‌ని, ఇది త‌న‌కు హాస్ట‌ల్ రోజుల‌ను గుర్తు చేస్తోందంని వ్యాఖ్యానించారు.

మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్ర‌త్త‌లు ప‌డ్డా ఆ వైర‌స్ త‌న‌కు సోకింద‌ని" ఆయన తెలిపారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సీనియర్ సిటిజన్లు ఇకపై బ్యాంకుకు వెళ్లనక్కర్లేదు.. ఉద్యోగులే ఇంటికొస్తారు

కరోనావైరస్ వ్యాప్తి నడుమ మహమ్మారితో బ్యాంక్‌‌‌‌లకు రాలేకపోతున్న ప్రజల కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌‌‌లు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను మొదలుపెట్టాయని వెలుగు పత్రిక తెలిపింది.

ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులను 70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు అందజేయనున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌‌‌లు తెలిపాయి. ఈ సర్వీసుల కోసం కస్టమర్లు తమ బ్యాంక్ మొబైల్ యాప్, వెబ్‌‌‌‌సైట్, కాల్ సెంటర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మొదటగా అప్లికేషన్ ఫామ్‌‌‌‌ను నింపాల్సి ఉంటుంది.

బ్యాంక్ బ్రాంచ్‌‌‌‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ నుంచి అన్ని బ్యాంకింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్స్ ఈ సర్వీసు రిక్వెస్ట్‌‌‌‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.

బ్యాంక్ వర్కింగ్ డేస్‌‌‌‌లో మీ సర్వీసు డెలివరీ టైమ్‌‌‌‌ను మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సర్వీసు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక, కేసు ఐడీ, రిక్వెస్ట్ టైప్ వంటివి మీకు ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ రూపంలో పంపిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)