దిల్లీ అల్లర్లు: బీజేపీ నేత కపిల్ మిశ్రా మీద పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఇంతవరకూ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? - బీబీసీ స్పెషల్

  • కీర్తీ దూబే
  • బీబీసీ ప్రతినిధి
కపిల్ మిశ్ర

ఫొటో సోర్స్, gettyimages/Hindustan Times

ఫొటో క్యాప్షన్,

కపిల్ మిశ్ర

ఫిబ్రవరి 23 మధ్యాహ్నం... అసెంబ్లీ ఎన్నికల్లో మోడల్‌టౌన్ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత కపిల్ మిశ్రా, జాఫ్రాబాద్-మౌజ్‌పూర్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన రాకముందే అక్కడ ఆయన మద్దతుదారులంతా గుమిగూడారు.

జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. కపిల్ మిశ్రా ప్రజలనుద్దేశిస్తూ... "డీసీపీ ఇక్కడే ఉన్నారు. నేను మీ అందరి తరఫున చెప్తున్నాను. ట్రంప్ వెళ్లేవరకూ మేము శాంతంగానే ఉంటాం. కానీ ఆ తరువాత ఇక్కడ మొత్తం ఖాళీ అవ్వలేదో మేం మీ మాట కూడా వినం. ట్రంప్ వెళ్లిపోయే లోపల మీరు (పోలీసులు) జాఫ్రాబాద్, చాంద్‌బాగ్ ప్రాంతాలు ఖాళీ చేయించండి. ఇది మీకు మా విజ్ఞప్తి. ఒకవేళ ఆ ప్రాంతాలన్నీ ఖాళీ అవ్వకపోతే, మేం రోడ్డు మీదకు రావలసి ఉంటుంది" అంటూ ప్రసంగం ఇచ్చారు.

కపిల్ మిశ్రా మూడు రోజుల గడువు ఇస్తూ, పోలీసుల మాట కూడా వినం అని హెచ్చరిస్తూ ప్రసంగిస్తున్నప్పుడు ఈశాన్య దిల్లీ డీసీపీ వేద్ ప్రకాశ శౌర్య అక్కడే ఉన్నారు. కానీ ఇది అసలు ప్రసంగమే కాదు అని కపిల్ మిశ్రా దబాయిస్తున్నారు.

నేను ఏ ప్రసంగమూ ఇవ్వలేదు - కపిల్ మిశ్రా

దిల్లీ అల్లర్ల వెనక కుట్ర కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 59లో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను అనుసరించి కపిల్ మిశ్రాను పోలీసులు ప్రశ్నించారు. అక్కడ తానేమీ ప్రసంగాలు చెయ్యలేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Social Media

"నేను అక్కడ ప్రజల సమస్యలను పోలీసులకు వివరించి చెప్పడానికి, బ్లాక్ చేసిన రోడ్లను పోలీసుల సహాయంతో తిరిగి తెరిపించడానికి వెళ్లాను. నేనేం స్పీచ్ ఇవ్వలేదు. మూడు రోజుల్లో బ్లాక్ చేసిన రోడ్లను ఖాళీ చేయించాలని మాత్రమే చెప్పాను. రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న ప్రజలను ఖాళీ చేయించకపోతే మేము కూడా ధర్నా చేస్తాం అని మాత్రమే చెప్పాను" అని కపిల్ మిశ్రా అన్నారు.

ఫిర్యాదులున్నా, ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు?

కపిల్ మిశ్ర రోడ్లు ఖాళీ చేయించాలని హెచ్చరించిన రోజు అంటే ఫిబ్రవరి 23 సాయంత్రమే ఈశాన్య దిల్లీ తగలబడడం మొదలయ్యింది. ఆ ప్రాంతంలో జరుగుతున్న హింస గురించి వార్తలు, ఫొటోలు, వీడియోలు ఒకదాని తరువాత ఒకటి రావడం ప్రారంభమయ్యాయి.

వెంటనే సోషల్ మీడియాలో ఆరోజు కపిల్ మిశ్రా ఇచ్చిన ప్రసంగం గురించి చర్చలు మొదలయ్యాయి. అది హేట్ స్పీచ్ అనీ, హింసను ప్రేరేపిస్తున్నట్లుగా ఉందని, కపిల్ మిశ్రాను వెంటనే అరస్ట్ చెయ్యాలని డిమాండ్ మొదలయ్యింది.

ఇది జరిగి ఏడు నెలలు కావస్తున్నప్పటికీ దిల్లీ అల్లర్ల విషయంలో నమోదైన 751 ఎఫ్ఐఆర్‌లలో కపిల్ మిశ్రా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు.

పైగా ఎఫ్ఐఆర్ 59ను అనుసరించి కపిల్ మిశ్రా నుంచి తీసుకున్న వాంగ్మూలం తరువాత అది అసలు ప్రసంగమే కాదని అంటున్నారు.

మొదటి ఫిర్యాదు: ‘గుణపాఠం చెప్పాలి’

కపిల్ మిశ్రా మీద ఇచ్చిన రెండు ఫిర్యాదుల కాపీలు బీబీసీ వద్ద ఉన్నాయి. వీటిల్లో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ ఈ ఫిర్యాదుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

చట్ట ప్రకారం ఒక ఆరోపణ ప్రాథమికంగా నేరమయితే.. అంటే చాలా తీవ్రమైనది, అరస్ట్ వారెంట్ లేకుండా కూడా పోలీసులు అపరాధిని అదుపులోకి తీసుకోగలిగేది అయితే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయవలసి ఉంటుంది.

కానీ కపిల్ మిశ్రాపై ఫిర్యాదు ఇచ్చిన వాళ్లు బీబీసీకి అందించిన సమాచారం ప్రకారం.. మొదట ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరించారు. తరువాత ఫిర్యాదులు తీసుకున్నప్పటికీ ఎఫ్ఐఆర్ దాఖలు చెయ్యలేదు.

బీబీసీ ఈ విషయాలపై ప్రశ్నిస్తూ పోలీసులకు ఒక లేఖ పంపింది. కానీ ఇంతవరకూ దానికి జవాబు రాలేదు. మాకు జవాబు అందిన వెంటనే, వాటన్నిటినీ కలుపుతూ మేము ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, Kirti Dubey/BBC

కమీషనర్, హోం శాఖకు తెలుసు

యమునా విహార్‌కు చెందిన జమీ రిజ్వీ ఫిబ్రవరి 24న ఫిర్యాదు రాసి దిల్లీ పోలీస్ కమీషనర్, హోం మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాలకు కాపీలు పంపించారు.

అందులో ఏం రాసుందంటే...

“ఫిబ్రవరి 23న ఒక 20-25 మంది తుపాకులు, త్రిశూలాలు, కర్రలు చేతబట్టి నినాదాలు చెయ్యడం మొదలుపెట్టారు.

కపిల్ మిశ్రా ’లాఠీ ఝళిపించండి, మేము మీతో పాటే ఉంటాం.

ఎక్కువసేపు ఝళిపించండి, మేము మీతో పాటే ఉంటాం.

లాగి లాగి వాయించండి, మేము మీతో పాటే ఉంటాం.

ముల్లాలో కూడా ఝళిపించండి, మేము మీతో పాటే ఉంటాం.

నాలుగువైపులా ఝళిపించండి, మేము మీతో పాటే ఉంటాం’ అంటూ నినాదాలు చేశారు.

కాసేపటి తరువాత కపిల్ మిశ్రా మరి కొంతమందితో కలిసి వచ్చారు. వాళ్ల చేతుల్లోనూ తుపాకులు, కత్తులు, త్రిశూలాలు, కర్రలు, రాళ్లు, సీసాలు ఉన్నాయి. అక్కడ నిలబడి కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు.

‘మనింట్లో టాయిలెట్లు శుభ్రం చేసేవారిని ఇప్పుడు మనం నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలా?’ అని అడిగారు. జవాబుగా కానే కాదు అని అందరూ అరిచారు.

‘వీళ్లంతా ముందు సీఏఏ-ఎన్ఆర్‌సీ గురించి నిరసనలు చేశారు. ఇప్పుడేమో రిజర్వేషన్ల గురించి ధర్నాలు చేస్తున్నారు. ఇంక ఇప్పుడు వీళ్లందరికీ ఒక గుణపాఠం నేర్పించాల్సిందే’ అంటూ ప్రసంగించారు’’ అని జమీ రిజ్వీ తన ఫిర్యాదులో రాశారు.

జమీ రిజ్వీ మార్చి 18న ఈ విషయమై కరకర్‌డుమా మెట్రోపాలిటన్ కోర్టు తలుపులు కూడా తట్టారు. సీఆర్‌పీసీ సెక్షన్ 156 (3) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవలసిందిగా ఆదేశించాలని కోర్టును కోరారు. అయినా సరే ఇప్పటివరకూ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

రిజ్వీ తన ఫిర్యాదులో “మిశ్రా స్పీచ్ విన్న తరువాత అతనితోపాటు వచ్చినవాళ్లు నిరసనకారులపై రాళ్లు రువ్వారు. పోలీసుల సమక్షంలోనే ముస్లింలు, దళితులను దేశద్రోహలంటూ, ముల్లాలంటూ కులాలపేర్లతో నిందించారు. వాహనాలు తగలబెట్టడం మొదలెట్టారు. కపిల్ మిశ్రా చేతిలో తుపాకీ పట్టుకుని 'ఎవ్వరినీ వదలొద్దు. వీళ్ళందరికీ ఇవాళ గుణపాఠం చెప్పాల్సిందే. నిరసనల సంగతి మర్చిపోయేలాగ బుద్ధి చెప్పండి' అంటూ అరుస్తూ ఉన్నారు" అని కూడా రాశారు.

ఫొటో సోర్స్, gettyimages/Anadolu Agency

ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఫిబ్రవరి 24 న ఈ ఫిర్యాదు అందినట్టు దీనిపై దిల్లీ పోలీస్ కమిషనర్ ముద్ర వేశారు. అంటే ఈ ఫిర్యాదుల గురించి పోలీస్ కమిషనర్‌కు తెలుసు. అలాగే హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ ఫిర్యాదు అందుకున్నట్టు సమాచారం వచ్చింది. వాళ్లకి కూడా ఈ విషయం తెలుసు.

"ఆ రోజు కపిల్ మిశ్రా డీసీపీని హెచ్చరించాక, ఆయన అక్కడ వీధుల్లో తిరుగుతూ రెండు రోజుల్లోగా ఈ ధర్నాలు నిలిపివేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయంటూ బెదిరించడం మొదలుపెట్టారు. నిరసనలు ఆపకపోతే ఇక్కడ అల్లర్లు జరుగుతాయని, మీరు, మీ నిరసనలు ఎవ్వరూ మిగలరని బెదిరించారు. కపిల్ మిశ్రా, ఆయన అనుచరులు కర్దంపురి, జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ ప్రాంతాల్లోని మైనారిటీలను, దళితులను పట్టుకుని చావబాదారు. దయచేసి నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చెయ్యండి. విచారణ జరిపి తగిన శిక్ష పడేలా చూడండి” అని రిజ్వీ తన ఫిర్యాదులో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images/Hindustan Times

కపిల్ మిశ్రా బీబీసీతో ఏమన్నారు?

ఈ ఆరోపణలన్నింటికీ జవాబులు ఇవ్వాలని మేం కపిల్ మిశ్రాను సంప్రదించాం.

కపిల్ మిశ్రా బీబీసీతో మాట్లాడుతూ "కొంతమంది నా మీద ఫిర్యాదులు చేశారు. కానీ నేనొక్క మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇవి ఫిర్యాదులేగానీ ఎఫ్ఐఆర్‌లు కావు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఇవి తప్పుడు ఆరోపణలనీ, నిరాధారమైనవనీ కనుగొన్నారు. పోలీసులు కోర్టుకు లిఖితపూర్వకంగా తమ జవాబు ఇచ్చారు. ఈ అల్లర్లకు కారణమైనవారిని భవిష్యత్తులో తప్పకుండా పట్టుకుంటారు. తాహిర్ హుసేన్, అతని సహచరులు ఉమర్ ఖాలిద్, ఖాలిద్ సైఫీ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. ఇప్పుడు నేరస్థుల మీంచి దృష్టి మళ్లించడానికి నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఫిర్యాదులన్నీ అందులో భాగమే కదా?" అన్నారు.

ఈ విషయాలపై విచారించేందుకు మిమ్మల్ని దిల్లీ పోలీసులు పిలిచారా? అని మేం అడిగాం. అవును అని ఆయన జవాబిచ్చారు. విచారణ వివరాలు తెలపాలని అడిగినప్పుడు కపిల్ మిశ్రా నుంచి ఎటువంటి జవాబూ రాలేదు.

రెండో ఫిర్యాదు: ‘ఈరోజు మీకు జీవితం నుంచి విముక్తి కలిగిస్తాం’

రిజ్వీ ఫిర్యాదు ఒక్కటే కాదు. ఆయన తన ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు చాంద్‌బాగ్‌కు చెందిన రుబీనా బానో అక్కడ ఉన్నారు. ఆవిడ కూడా కపిల్ మిశ్రాపై ఫిర్యాదు చెయ్యడానికే వచ్చారు. కానీ పోలీసులు తన ఫిర్యాదు స్వీకరించట్లేదని ఆవిడ తెలిపారు.

తరువాత మార్చి 18న ముస్తఫాబాద్‌లోని మసీదు (ఈద్గా)లో ఏర్పాటు చేసిన దిల్లీ పోలీస్ ఫిర్యాదుల కేంద్రానికి వెళ్లి తన ఫిర్యాదును ఇచ్చారు. ముస్తఫాబాద్‌లోని ఈద్గాను దిల్లీ అల్లర్ల బాధితులకోసం శిబిరంగా మార్చారు.

ఇప్పటివరకూ ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలు చెయ్యలేదు. మార్చి 19న దయాల్‌పుర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందుకున్నారు. ఫిర్యాదు ఇచ్చిన కారణంగా తనను, తన కుటుంబాన్ని భయపెడుతున్నారని, తమ వాళ్లందరిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రుబీనా ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Kirti Dubey/ BBC

రుబీనా బానో మార్చి 18 న ఇచ్చిన ఫిర్యాదులో... "ఫిబ్రవరి 24 సోమవారం ఉదయం 11 గంటలకు ధర్నా జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాను. చాలామంది పోలీసులు మిలటరీ దుస్తుల్లో కనిపించారు. ఏసీపీ అనూజ్ కుమార్, దయాల్‌పుర్ ఎస్‌హెచ్‌ఓతో కలిసి అక్కడున్న మహిళలతో గొడవపడుతున్నారు. వాళ్లని దూషిస్తూ మీ అందరికీ ఇవాళ జీవితం నుంచే విముక్తి కలిగిస్తాం అని చెబుతున్నారు" అని పేర్కొన్నారు.

“మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే మీరెందుకు మమ్మల్ని తప్పుడు మాటలంటున్నారు?’ అని ఏసీపీని అడిగాను. దానికి జవాబుగా ‘కపిల్ మిశ్రా తన అనుచరులు మీకివాళ జీవితం నుంచి విముక్తి ప్రసాదిస్తారు’ అని ఆయన చెప్పారు. ఇంతలో దయాల్‌పుర్ ఎస్‌హెచ్ఓ తారకేశ్వర్ సింగ్ వడివడిగా వచ్చి ఏసీపీకి ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ కపిల్ మిశ్రా నుంచి వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతున్నంతసేపూ ఏసీపీ ‘జీ-జీ’ అంటూనే ఉన్నారు. ఫోన్ పెట్టేశాక ‘ఏం చింతించకండి... శవాలను పేర్చేద్దాం. వీళ్ల త్యాగాన్ని గుర్తుంచుకుందాం’ అని అన్నారు. తరువాత పోలీసులు కూడా కపిల్ మిశ్రా అనుచరులతో కలిసి మహిళల మీద దాడి చేశారు" అని ఆమె ఫిర్యాదులో రాశారు.

ఫిర్యాదులు తీసుకున్నారు, కానీ...

దయాల్‌పుర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక పోలీసు అధికారిని బీబీసీ సంప్రదించింది. పేరు ప్రస్తావించవద్దంటూ "ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు. సెక్షన్ 144 విధించినప్పుడు ఆ మహిళలు బయటకు రాకుండా ఉండాల్సింది. అప్పుడు కూడా వాళ్లు బయటికి వచ్చాక, వాళ్లకు గాయాలైతే బాధ్యులు ఎవరు? ఇందులో ఆ మహిళల పాత్ర ఎంత అని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం" అని చెప్పారు.

‘ఫిర్యాదులను పరిశీలిస్తే అవి కాగ్నిజబుల్ ఫిర్యాదులనీ, నేరం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అలంటప్పుడు ఎఫ్ఐఆర్ రాయాలి కదా?’ అని బీబీసీ ఆ పోలీసు అధికారిని అడిగింది. ఈ ప్రశ్నకు జవాబిస్తూ ‘అవును ఎఫ్ఐఆర్ 60 దీనికి సంబంధించినదే కదా’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images/Hindustan Times

’ఎఫ్ఐఆర్ 60 దిల్లీ హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్ శర్మ హత్య గురించి కదా! ఇందులో రుబీనా బానో ఏసీపీ, కపిల్ మిశ్రాలపై ఇచ్చిన ఫిర్యాదు కూడా ఉందా?’ అని బీబీసీ ప్రశ్నించింది.

ఆ పోలీస్ కొన్ని క్షణాలు మౌనం వహించి.. ‘హెడ్ కానిస్టేబుల్ హత్య వీడియో మీరు చూశారు కదా, దానికి సంబంధిచిన కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని చెప్పారు.

ఎఫ్ఐఆర్ 60ని బీబీసీ పరిశీలించింది. అందులో యోగేంద్ర యాదవ్, షాహీన్ బాగ్‌లో లంగర్ ఏర్పాటు చేసే డీహెచ్ బింద్రాతో సహా పలువురి పేర్లు ఉన్నాయి గానీ రుబీనా బానో, ఏసీపీ అనూజ్ కుమార్, కపిల్ మిశ్రాల పేర్లలో ఏవీ లేవు.

‘రుబీనా బానో ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా?’ అని బీబీసీ మళ్లీ సూటిగా అడిగింది. అందుకు ఆ పోలీస్ అధికారి "ఫిర్యాదు తీసుకున్నాంగానీ ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images/Hindustan Times

నన్ను, నా కుటుంబాన్ని భయపెడుతున్నారు: రుబీనా

2013లో సుప్రీంకోర్టు లలితా కుమారి వర్సెస్ యూపీ ప్రభుత్వం కేసులో తీర్పునిస్తూ.. ఒకవేళ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు ప్రాథమికంగా కాగ్నిజబుల్ అయితే (పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేసేవైతే) పోలీసులు ఎఫ్ఐఆర్ కచ్చితంగా దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

‘‘పేర్లు లేకుండా ఫిర్యాదు చేయాలని, లేకుంటే దానిని తీసుకోబోమని ఎస్‌హెచ్ఓ అంటున్నారు. కేసులో నన్నే ఇరికిస్తానని బెదిరిస్తున్నారు’’ అని రుబీనా బానో తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో రుబీనా బానో దిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు నిరాకరిస్తే, రిట్ ద్వారా ఆ అధికారి ఆ బాధ్యతలను నిర్వర్తించేలా కోర్టు ఆదేశిస్తుంది.

మార్చి నుంచి జూలై వరకూ స్థానిక పోలీసులు తనను భయపెడుతున్నారని.. ఫిర్యాదు వెనక్కితీసుకోవాలని, లేదంటే కేసులు పెడతామని బెదిరిస్తన్నారని రుబీనా తన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

జూలై 25న తన భర్తను ఓ వ్యక్తి నిర్బంధించాడని, ఫిర్యాదు వెనక్కితీసుకోకపోతే తమ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడని రుబీనా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images/Hindustan Times

కపిల్ మిశ్రాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు: దిల్లీ పోలీసులు

రాజకీయ నాయకులపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లకు సంబంధించిన ఓ పిటిషన్‌కు స్పందనగా జూలై 13న దిల్లీ పోలీసులు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.

‘‘దిల్లీలో అల్లర్లు సృష్టించాలని జనాన్ని రాజకీయ నాయకులు రెచ్చగొట్టినట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లభించిలేదు. ఒకవేళ అలాంటి ప్రసంగాలు చేసినట్లు దృష్టికి వస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తాం’’ అని పోలీసులు అందులో తెలిపారు.

ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరిగిన ఘటనలకు సంబంధించి కపిల్ మిశ్రా మీద వచ్చిన ఫిర్యాదుపై దిల్లీ పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నిజానికి ఆయన ఫిబ్రవరి 23న ప్రసంగం చేసిన తర్వాత సాయంత్రమే అల్లర్ల గురించి వార్తలు వచ్చాయి.

దిల్లీ పోలీసుల తీరుపై జస్టిస్ మురళీధర్ ఆందోళన

హర్ష్ మందర్, ఫరాహ్ నక్వీ వేసిన ఓ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ తల్వంత్ సింగ్ ఫిబ్రవరి 26న వాదనలు విన్నారు.

ఆందోళనకరమైన ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నాయకులు కపిల్ మిశ్రా, పర్వేశ్ వర్మ, అనురాగ్ ఠాకుర్‌ల అరెస్టును కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది.

నిజానికి దీని విచారణ చీఫ్ జిస్టిస్ చేయాల్సి ఉంది. అయితే, పిటిషన్‌దారులు సత్వర విచారణ కోరుకోవడంతో జస్టిస్ మురళీదర్ దగ్గిరికి ఈ కేసు వచ్చింది.

దిల్లీ పోలసుల తరఫున న్యాయవాదిగా తనను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎంపిక చేశారని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. అయితే, దీనిపై దిల్లీ ప్రభుత్వ న్యాయవాది రాహుల్ మెహ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే, నిబంధనల ప్రకారం ఈ నిర్ణయాన్ని దిల్లీ మంత్రి మండలి తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images/Anadolu Agency

పైగా ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం పక్షం కూడా కాదు. దీంతో సొలిసిటర్ జనరల్ ఇందులో జోక్యం చేసుకోవడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

‘‘బీజేపీ నేతలు విద్వేష ప్రసంగాలు చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై అరెస్టులు చేయడం ఇప్పుడు అవసరం లేదు. దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ వచ్చేవరకు ఎదురుచూడవచ్చు’’ అని తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు.

‘‘దోషులకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం తప్పనిసరి అని మీకు అనిపించడం లేదా? దిల్లీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏది అత్యవసరమో మేం నిర్ణయించాలి. వందల మంది ఆ వీడియోను చూశారు. మీకు ఇప్పుడు కూడా ఈ అంశం అత్యవసరమైనదని అనిపించడం లేదా?’’ అని తుషార్ మెహతాను జస్టిస్ మురళీధర్ ప్రశ్నించారు.

తాను సదరు వీడియో చూడలేదని తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు.

జస్టిస్ మురళీధర్ అదే ప్రశ్నను కోర్టులో ఉన్న పోలీసు అధికారిని కూడా అడిగారు. కపిల్ మిశ్రా వీడియో తాను చూడలేదని ఆ అధికారి బదులు చెప్పారు.

‘‘మీ కార్యాలయంలో అన్ని టీవీలు పెట్టుకుని కూడా మీరు ఈ వీడియో చూడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ పోలీసులు ప్రదర్శిస్తున్న వైఖరి షాక్‌కు గురిచేస్తోంది’’ అని జస్టిస్ మురళీధర్ అన్నారు.

అనంతరం జడ్జి సూచన మేరకు కపిల్ మిశ్రా, పర్వేశ్ వర్మ, అనురాగ్ ఠాకుర్‌ల ప్రసంగాల క్లిప్పులను కోర్టులో వినిపించారు.

అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇది సరైన సమయం కాదని సొలిసిటర్ జనరల్ అన్నారు.

‘‘మరి, సరైన సమయం ఏది? ఈ నగరం తగలబడుతోంది’’ అని జస్టిస్ మురళీధర్ అన్నారు.

పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేయొచ్చని సొలిసిటర్ జనరల్ బదులు ఇచ్చారు.

ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంపై దిల్లీ పోలీసులు ‘కాన్షియస్ డెసిషన్’ తీసుకోవాలని జస్టిస్ మురళీధర్‌ అన్నారు.

ఆ తర్వాత అర్ధరాత్రి జస్టిస్ మురళీధర్‌ను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

మరుసటి రోజు ఈ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డి.ఎన్.పటేల్ విచారించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించినట్లుగానే ఈ అంశాన్ని అత్యవసర అంశంగా చూడలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images/Hindustan Times

దిల్లీ పోలీసుల గణాంకాలు ఇలా...

దిల్లీ పోలీసులు విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జూలియో ఫ్రాంసిస్ రిబెరో ఓ లేఖ రాశారు.

‘‘సాక్ష్యాధారాలను బట్టి విచారణ ఉంటుంది. విచారిస్తున్న వ్యక్తి ఎంత పేరున్నవారు, ఆయన ఎంత పెద్ద వ్యక్తి అన్నదానిపై కాదు’’ అని అందులో వ్యాఖ్యానించారు.

రిబెరో లేఖకు స్పందిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ కొన్ని గణంకాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం దిల్లీ అల్లర్లకు సంబంధించి 410 ఎఫ్ఐఆర్‌లు ముస్లింల ఫిర్యాదులపై నమోదు చేశారు. 190 ఎఫ్ఐఆర్‌లు హిందువుల ఫిర్యాదులపై నమోదు చేశారు.

అంతకుముందు సెప్టెంబర్ 13న పోలీసులు విడదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో మొత్తంగా 751 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, వాటిలో 250 ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి అభియోగపత్రాలు కూడా దాఖలు చేశామని తెలిపారు. మొత్తంగా 1,153 మందిని నిందితులుగా పేర్కొన్నామని.. వీరిలో 571 మంది హిందువులు, 582 మంది ముస్లింలు ఉన్నారని వెల్లడించారు.

ఇవి సాధారణ అల్లర్లే అనుకుంటే, హిందువుల ఎఫ్‌ఐఆర్‌ల్లో ముస్లింలపై ఆరోపణలు ఉంటాయి. అంటే, 190 ఎఫ్‌ఐఆర్‌లపై 582 మంది ముస్లింలను నిందితులుగా పేర్కొన్నారు. అదే సమయంలో ముస్లింల ఫిర్యాదులపై నమోదైన 410 ఎఫ్ఐఆర్‌లలో 571 మంది హిందువులను నిందితులుగా చేర్చారు.

జులై 13న హైకోర్టులో దిల్లీ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌లో దిల్లీ అల్లర్లలో చనిపోయినవారిలో 40 మంది ముస్లింలు, 13 మంది హిందువులు ఉన్నట్లు పేర్కొన్నారు.

అంటే, ముస్లింలవైపు మృతులు ఎక్కువగా ఉన్నా, వారి ఫిర్యాదులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు తక్కువగా ఉన్నాయి. పైగా నిందితుల్లో వారి శాతమే ఎక్కువగా ఉంది.

దిల్లీ పోలీసుల గణాంకాలను చూస్తుంటే, దిల్లీ అల్లర్లలో ముస్లింలు తమ మతంవారినే చంపారా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

ఇదే ప్రశ్న ఓ దిల్లీ పోలీసు అధికారిని అడిగితే.. ‘‘మీరు కోర్టుకు వెళ్లండి. చట్ట ప్రకారం మేం జవాబు ఇస్తాం’’ అని బదులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)