సీఎం జగన్ వల్ల శ్రీవారి దర్శనం అయ్యిందన్న ప్రధాని మోదీ - ప్రెస్ రివ్యూ

మోదీ, జగన్

ఫొటో సోర్స్, Press Release

కోవిడ్-19 నివారణ చర్యలపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ తిరుమలలోని అన్నమయ్య భవన్ నుంచి పాల్గొన్నారని సాక్షి కథనం చెప్పింది.

‘మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడటం వల్ల నాకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం కలిగింది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో అన్నారు.

కోవిడ్‌–19 నివారణ చర్యలపై బుధవారం ఆయన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ సహా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమలలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ అన్నమయ్య భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అక్కడ శ్రీవారి ఫొటో ఉండటం చూసి.. స్వామి వారికి ప్రధాని మోదీ నమస్కారం చేసుకున్నారని సాక్షి రాసింది.

‘మీ (జగన్‌) వల్ల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. తిరుమలలో స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యి కూడా మీరు (జగన్‌) వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయం’ అన్నారని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వలంటీర్ల వ్యవస్థ పని తీరు బాగుందని ప్రధాని ప్రశంసించారు. ఈ వ్యవస్థల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, వారికి త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయని అన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నానని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

బంగారం కొనుగోళ్లకు సరైన సమయం

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయం అని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనం ప్రచురించింది.

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అందుకు ఇదే సరైన తరుణం. గత కొంత కాలం నుంచి పుత్తడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.

ప్రస్తుతం తులం పసిడి ధర రూ. 49 వేల వద్ద కదలాడుతున్నది. కనుక పుత్తడి కొనుగోళ్ల విషయంలో మీరు ఎంత త్వరపడితే అంత మంచిది. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా మీ జేబుకు భారీ చిల్లు పడటం ఖాయం అని కథనంలో రాశారు.

పుత్తడి ధరల క్షీణత ఎంతో కాలం కొనసాగపోవచ్చని, వచ్చే ఏడాది చివరి నాటికి తులం ధర రూ.68 వేల వరకు పెరుగవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారని పేర్కొంది.

బంగారం ధరలు గత రెండేండ్లలో విపరీతంగా పెరిగాయి. దేశంలో గతేడాది దాదాపు 19 శాతం బలపడిన పుత్తడి ధర.. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 40 శాతం మేరకు ఎగసింది. మున్ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.

కరోనా సంక్షోభంతోపాటు పలు ఇతర సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తుండటం, డాలర్‌ విలువ తగ్గుదల లాంటి అంశాలు బంగారం ధరలకు రెక్కలు తొడగవచ్చన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయని కథనంలో చెప్పారు.

వివిధ కారణాల రీత్యా గత కొంత కాలం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఈ ధోరణి ఎంతో కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ.49 వేల వద్ద కదలాడుతున్న తులం పసిడి ధర వచ్చే ఏడాది చివరి నాటికి రూ.65 వేల నుంచి రూ.68 వేల వరకు పెరుగవచ్చని ‘గోల్డెన్‌ డిప్‌' పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొన్నదని పత్రిక చెప్పింది.

మరోవైపు గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌)లోకి వచ్చే పెట్టుబడులు గత కొంత కాలం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. పుత్తడి ధరల పెరుగుదలకు ఇది దోహదం చేస్తుందని నమస్తే తెలంగాణ వివరించింది.

తెలంగాణలో ఏసీపీ అక్రమాస్తుల విలువ రూ. 70 కోట్లు

తెలంగాణలో ఒక ఏసీపీ 75 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ వై.నర్సింహారెడ్డి.. సుమారు రూ.70 కోట్ల ఆస్తు లు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అంచనాకు వచ్చారు.

బుధవారం అతని నివాసంతోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి దీనిని గుర్తించారు.

ఏసీబీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మహేంద్రహిల్స్‌లోని నర్సింహారెడ్డి నివాసంతోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, వరంగల్‌, జనగాం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు నిర్వహించారని కథనంలో చెప్పారు.

మొత్తంగా తెలంగాణ, ఏపీలోని 25 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు

ఉదయం 7గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ సోదాల్లో నర్సింహారెడ్డికి 3 ఇళ్లు, 5 ఓపెన్‌ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు రూ.5కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిన నర్సింహారెడ్డి రియల్‌ ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు ఆధారాలతో గుర్తించారని ఆంధ్రజ్యోతి రాసింది.

ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.7.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం రూ.70 కోట్ల వరకు ఉంటుందని తెలిపారని పేర్కొంది.

ఈ మేరకు అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఇక నర్సింహారెడ్డికి సంబంధించి రెండు బ్యాంకు లాకర్లను గుర్తించారు. వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తుల సమాచారంతోపాటు నగదు, విలువైన వస్తువులు బయట పడే అవకాశం ఉందని భావిస్తున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, iStock

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, బూడిద చెరువులో కలిపింది

వరంగల్ జిల్లాలో ప్రియుడి మోజులో పడిన ఒక భార్య అతడితో కలిసి భర్తను హత్య చేసిందని ఈనాడు కథనం ప్రచురించింది.

ప్రియుడి మోజులో పడిన ఒక మహిళ అతడితో కలిసి భర్తను హతమార్చింది.

వరంగల్‌ గ్రామీణ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన ఈ ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది.

సీఐ తిరుమల్‌ కథనం ప్రకారం.. గేటుపల్లితండాకు చెందిన దర్యావత్‌సింగ్‌ (42) హన్మకొండ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడని ఈనాడు చెప్పింది.

మహబూబాబాద్‌ జిల్లా తాళ్లపూసపల్లికి చెందిన జ్యోతితో ఇతనికి ఆరేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వీరు నెక్కొండ మండల కేంద్రంలో ఉంటున్నారు.

జ్యోతికి అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన సాంబరాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడిందని, అది వివాహేతర సంబంధానికి దారితీయగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పత్రికలో రాశారు.

‘కరోనా కారణంగా దర్యావత్‌సింగ్‌ ఈమధ్య ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో ప్రియుణ్ని కలవడానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో అతడిని హతమార్చాలని భార్య ప్రణాళిక వేసింది.

ఈనెల 14న భర్త మద్యం తాగి ఉన్నాడని, అతన్ని చంపడానికి ఇదే అనుకూల సమయమని జ్యోతి సాంబరాజుకు ఫోన్‌చేసి చెప్పడంతో అతడు ట్రాలీ ఆటోతో నెక్కొండ వచ్చాడు.

ఇద్దరూ కలిసి తాడుతో దర్యావత్‌సింగ్‌ గొంతు బిగించి హతమార్చారు. మృతదేహాన్ని ఆటోలో తన పత్తి చేనుకు తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించాడు. మర్నాడు చూడగా శవం సగమే కాలింది. దీంతో ఆ రాత్రి మృతదేహాన్ని పూర్తిగా కాల్చేసి బూడిద తీసుకెళ్లి చెరువులో పారబోశారు’ అని కథనంలో చెప్పారు.

దర్యావత్‌సింగ్‌ కనిపించకపోవడంతో అతడి అన్న వీరన్న ఈ నెల 21న నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జ్యోతిపై అనుమానం వచ్చి ఆమె కాల్‌ డేటాను సేకరించారు.

ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు అంగీకరించింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)