డీన్ జోన్స్ మృతి... ముంబయిలో తుది శ్వాస విడిచిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ - BBC Newsreel

డీన్ జోన్స్

ఫొటో సోర్స్, ANI

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ డీన్ జోన్స్ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో చనిపోయారు ఆయన వయసు 59 ఏళ్ళు. ఐపీఎల్ కామెంటేటర్‌గా ప్రస్తుతం ముంబయిలో ఉన్న జోన్స్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఆయన మరణవార్తను వెంటనే ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. గురువారం ఉదయం అల్పాహారం తీసుకుని 11 గంటలకు ఆయన ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ బ్రీఫింగ్ సెషన్‌కు హాజరయ్యారు. ఆ తరువాత హోటల్ కారిడార్‌లో సహచరులతో మాట్లాడుతూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆయన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

జోన్స్ మృతిపై స్టార్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. "డీన్ జోన్స్ మరణించారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈ విషాద సమయంలో వారికి అండగా నిలుస్తాం" అని ఆ ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్‌కు ముఖ్యమైన అంబాసిడర్లలో డీన్ జోన్స్ ఒకరని, కామెంట్రీకి ఆయన కొత్త కళ తెచ్చారని, కొత్త ఆటగాళ్ళను ప్రోత్సహించడంలో ఆయన ముందుండేవారని కూడా స్టార్ ఇండియా తన ప్రకటనలో పేర్కొంది.

ఆస్ట్రేలియాలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన జోన్స్ తన క్రికెట్ కెరీర్‌లో 52 టెస్టులు, 164 వన్డే మ్యాచులు ఆడారు.

డీన్ జోన్స్ ఇక లేరన్న వార్త నమ్మలేకపోతున్నానని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. ఆయన కామెంటరీ అంటే తనకెంతో ఇష్టమని సెహ్వాగ్ అన్నారు.

తాను ఆడిన చాలా మ్యాచులకు జోన్స్ కామెంటరీ ఇచ్చారని, ఆయన చనిపోవడం అత్యంత విషాదకరమని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

జోన్స్ చిన్న వయసులో మరణించడం బాధాకరమని, మంచి సహచరుడిని కోల్పోయానని భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశారు.

జోన్స్ మరణం తనను విషాదంలో ముంచెత్తిందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించారు.

జోన్స్ ఇక లేరన్న వార్త మనస్తాపాన్ని కలిగిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని కోహ్లీ ట్వీట్ చేశారు.

నల్లజాతి మహిళ కాల్చివేతపై లూయిస్‌విల్లేలో నిరసన జ్వాలలు..

ఫొటో సోర్స్, FACEBOOK

అమెరికాలోని లూయిస్‌విల్లే నగరంలో భారీ నిరసన ప్రదర్శనల మధ్య ఇద్దరు పోలీసు అధికారులపై కాల్పులు జరిగాయి.

నిరాయుధ నల్లజాతి మహిళ బ్రియన్నా టేలర్ హత్య కేసులో ఏ అధికారిపైనా ఆరోపణలు నమోదు చేయకూడదన్న గ్రాండ్ జ్యూరీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరిగాయి.

ఒక ఆస్పత్రిలో వైద్య సిబ్బందిగా పనిచేసే 26 ఏళ్ల టేలర్ ఇంట్లోకి మార్చి 13న ముగ్గురు పోలీసు అధికారులు ఆమెపై చాలాసార్లు కాల్పులు జరిపారు.

అధికారుల్లో ఒకరైన బ్రెట్ హాంకిసన్ మీద టేలర్ మరణానికి కారణమైన కాల్పులకు బాధ్యుడిగా కాకుండా.. ఆమె పక్క ఇంటికి తూటాలు తగిలాయనే అభియోగంలో దోషిగా నిర్ధారించింది. మిగతా ఇద్దరు అధికారుల చర్యలనూ జ్యూరీ సమర్థించినట్లు అటార్నీ జనరల్ చెప్పారు.

నిరాయుధ నల్లజాతీయులను పోలీసులు చంపడంపై, ముఖ్యంగా మేలో జార్జి ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికా, మిగతా దేశాల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

ఫొటో సోర్స్, Reuters

బుధవారం నాడు నిరసనల్లో కాల్పులకు గురైన పోలీస్ అధికారులకు ప్రాణాపాయం ఏదీ లేదని లూయిస్‌విల్లే పోలీస్ చీఫ్ రాబర్ట్ ష్రోడెర్ చెప్పారు. అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు.

లూయిస్‌విల్లేలో అత్యవసర స్థితి ప్రకటించారు. నగరం అంతటా నేషనల్ గార్డులను మోహరించారు. నగరంలో మూడు రోజుల పాటు రాత్రి 9 నుంచి ఉదయం ఆరున్నర వరకూ కర్ఫ్యూ ఉంటుందని మేయర్ ప్రకటించారు.

కర్ఫ్యూ విధించినా, రాత్రి 9 తర్వాత జనం ఇప్పటికీ రోడ్లపై భారీగా గుమిగూడుతున్నారు.

గ్రాండ్ జ్యూరీ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనలు న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటా, షికాగోలకు కూడా వ్యాపించాయి.

ఫొటో సోర్స్, @SURESHANGADI_

కరోనాతో రైల్వే సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతి

కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేశ్ అంగడి కోవిడ్-19 వ్యాధితో బుధవారం ఎయిమ్స్ లో మృతిచెందారు. ఆయన వయసు 65 ఏళ్లు.

సెప్టంబర్ 11న కరోనావైరస్ పాజిటివ్ రావడంతో ఆయన్ను ఎయిమ్స్ లో చేర్పించారు. దాని గురించి ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.

"నాకు ఈ రోజు కరోనా రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. నేను ఇప్పుడు బాగున్నాను. డాక్టర్ల సలహాలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నాకు కాంటాక్టులోకి వచ్చిన వారు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోగలరు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి" అని పెట్టారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.

"సురేశ్ అంగడి ఒక నిబద్ధత ఉన్న కార్యకర్త. ఆయన కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసేందుకు చాలా శ్రమించారు. ఆయన అంకితభావం ఉన్న ఒక ఎంపీ, సమర్థులైన మంత్రి. అన్ని విభాగాలలో ఆయన ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరణం బాధాకరం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సంతాపం. ఓం శాంతి" అన్నారు.

సురేశ్ అంగడి చన్నబసప్ప కర్ణాటకకు చెందినవారు. ఆయన బెలగామ్ నుంచి 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయనకు రైల్వే సహాయ మంత్రి పదవి అప్పగించారు.

సురేశ్ అంగడి 1955 జూన్ 01న చన్నబసప్ప, సోమవ్వలకు జన్మించారు. బెలగాం ఎస్ఎస్ఎస్ కమిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత బెలగాంలోని రాజా లఖమగౌడ లా కాలేజీలో లా చదివారు. బీజేపీ నేత అంగడి 1996లో బెలగాం యూనిట్ అధ్యక్షులు అయ్యారు. 1999 వరకూ ఆ పదవిలో ఉన్నారు.

2001లో ఆయనను పార్టీ జిల్లా అధ్యక్షుడు చేశారు. 2004లో బెలగావి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేవరకూ ఆయన ఆ పదవిలోనే ఉన్నారు.

2009, 2014లో కూడా ఆయన వరసగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.

2019లో నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత మోదీ ప్రభుత్వంలో ఆయనకు రైల్వే సహాయ మంత్రి పదవి లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)