బాబ్రీ మసీదు కూల్చివేత కేసు: అందరూ నిర్దోషులైతే, మరి మసీదును కూల్చిందెవరు?

ఫొటో సోర్స్, DOUGLAS E. CURRAN/AFP via Getty Images
28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 32 మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.
బీజేపీ, రైట్ వింగ్ సంస్థలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నాయి.
అయితే, కోర్టు తీర్పు విషయమై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు చేశారు.
''పక్కా ప్రణాళిక ప్రకారమే మసీదును కూల్చివేశారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కానీ, ఇప్పుడేమో ప్రత్యేక న్యాయస్థానం భిన్నంగా తీర్పునిచ్చింది. ఇంతకీ మసీదు ఎలా కూలిపోయింది. మరి? ఏదైనా మాయాజాలం జరిగిందా?'' అని ఆయన ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో చాలా మంది బాబ్రీ కేసు తీర్పుపై సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
బాబ్రీ కూల్చివేతను సుప్రీం కోర్టు ఇదివరకు తప్పుపట్టిన విషయాన్ని మరిచిపోకూడదని సీనియర్ పాత్రికేయురాలు సీమా చిశ్తీ అన్నారు.
‘‘రామ జన్మభూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, బాబ్రీ విధ్వంసం తప్పేనని వ్యాఖ్యానించింది. కానీ, ఇప్పుడు బాబ్రీ విధ్వంసం కేసులో ఇలాంటి తీర్పు రావడం వింతగా అనిపిస్తోంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
సీబీఐ కోర్టు బాబ్రీ విధ్వంసం కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చింది. మరి, ఆ మసీదును కూల్చిందెవరు?
‘‘ఓ కుట్రను చట్టప్రకారం రుజువు చేయడం అంత సులభం కాదు. ఇలాంటి కేసుల్లో అప్పటి పరిస్థితిని తెలియజేసే సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచనలు ఉన్నాయి. ఐపీఎస్ అంజూ గుప్తా సహా కొందరి సాక్ష్యాలు ఉన్నాయి. వారి నిజాయతీని శంకించలేం. ఎవరైనా గుంపుగా చేరి, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే... ఐపీసీ సెక్షన్ 149 ప్రకారం ఆ గుంపులో ఉండే వారిదే బాధ్యత అవుతుంది. బాబ్రీ మసీదు అక్కడ ఉండేదన్నది, దాన్ని కూల్చారన్నది వాస్తవం. అలాంటప్పుడు చట్ట ప్రకారం ఆ గుంపు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని సీనియర్ పాత్రికేయుడు రామ్‌దత్త్ త్రిపాఠీ అన్నారు.
‘‘బాబ్రీ కూల్చివేత ప్రణాళిక ప్రకారం జరిగిన పని కాదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుందా? లేదా? అన్నది తీర్పు పూర్తి ప్రతి వచ్చాకే స్పష్టమవుతుంది’’ అని బీబీసీ హిందీ ఎడిటర్ ముకేశ్ శర్మ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
గుంపును తీసుకువచ్చింది ఎవరు?
నిందితుల్లో ఎవరి ప్రమేయం లేకుండానే క్షణికావేశంలో బాబ్రీ కూల్చివేత జరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది.
కానీ, అంతమంది జనం ఉన్న గుంపును బాబ్రీ మసీదు దగ్గరికి తీసుకువచ్చింది ఎవరు? దాన్ని ఎలా కూల్చారు?
‘‘ఈ ఘటన అకస్మాత్తుగా జరిగిందని కోర్టు అనడం ఆశ్యర్యం కలిగించింది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. గుంపు రెచ్చిపోయి ఏదైనా చేసినా, వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేంద్ర బలగాలను లోపలికి రాకుండా ఎవరు ఆపారు?’’ అని సీమా ప్రశ్నించారు.
బాబ్రీ కూల్చివేత సమయంలో అక్కడున్న నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనడానికి సాక్షులు ఉన్నారని కూడా ఆమె అన్నారు.
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మొత్తం 49 మంది నిందితులు. అయితే, వీరిలో లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమా భారతి, వినయ్ కటియార్, సాధ్వీ రితంభర, మహంత్ నృత్య గోపాల్ దాస్ సహా 32 మంది మాత్రమే ఇప్పుడు సజీవంగా ఉన్నారు.
28ఏళ్లపాటు ఈ కేసు విచారణ సాగింది. ఈ 32 మంది నిందితుల పాత్రపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు... బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ఓ ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నిన ఘటన కాదని తీర్పునిచ్చింది.
తీర్పు వెలువడిన తర్వాత ఎల్కే అడ్వాణీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... కేసులో ఆరోపణలను రుజువుచేసేందుకు తగిని స్థాయిలో సాక్ష్యాలు లేవని చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో "చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇది చాలా సంతోషకరమైన రోజు'' అంటూ ఎల్.కె.అడ్వాణీ స్పందించారు. ''అయోధ్యలో 1992, డిసెంబర్ 6న అదంతా హఠాత్తుగా జరిగిందని, అందులో ఏ కుట్రా లేదని ఈ తీర్పు నిరూపిస్తోంది'' అని తన వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.
మురళీ మనోహర్ జోషి స్వయంగా పాత్రికేయుల ముందుకు వచ్చి మాట్లాడారు. ‘‘రామమందిర నిర్మాణం దేశంలోని గొప్ప ఉద్యమాల్లో ఒకటి. నేను ఇంతే చెబుతాను. జై సియారామ్’’ అని అన్నారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. తీర్పు రావడం ఆలస్యం అయినప్పటికీ న్యాయమే గెలుస్తుందని ఇది నిరూపించిందని అన్నారు.
అయితే, తీర్పు విషయమై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సుప్రీం కోర్టే బాబ్రీ విధ్వంసాన్ని తప్పని వర్ణించిందని, అలాంటి చర్యకు బాధ్యులెవరో తేల్చకపోవడం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
‘లిబర్హాన్ కమిషన్ నివేదికకు విరుద్ధంగా...’
‘‘మనం మెజార్టీవాదం వైపు వెళ్తున్నామా? రూల్ ఆఫ్ లాను వదిలిపెట్టి అరాచకత్వంవైపు అడుగులేస్తున్నామా? లిబర్హాన్ కమిషన్ ఏర్పాటైన తర్వాత ఓ సుదీర్ఘ ప్రక్రియ నడిచింది. ఈ తీర్పు వచ్చాక ఎలాంటి స్పందనలు చూస్తున్నాం?’’ అని రామ్‌దత్త్ త్రిపాఠీ ప్రశ్నించారు.
పక్కా కుట్ర ప్రకారమే బాబ్రీ విధ్వంసం జరిగిందని 2009లో లిబర్హాన్ కమిషన్ నివేదిక ఇచ్చిందని ముకేశ్ శర్మ గుర్తుచేశారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు లిబర్హాన్ కమిషన్ నివేదికకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు.
సుప్రీం కోర్టు రామ జన్మభూమి వివాదం కేసు ప్రకారం బాబ్రీ విధ్వంసం కేసులో తీర్పు ఇవ్వడం కుదరదా? అన్న ప్రశ్నకు... ‘‘రెండు కేసులు వేర్వేరు. సుప్రీం కోర్టులో నడిచింది సివిల్ కేసు. బాబ్రీ విధ్వంసం క్రిమినల్ కేసు. పైగా కింది కోర్టులో ఉన్న కేసు’’ అని రామ్‌దత్త్ బదులు ఇచ్చారు.
‘‘ఈ తీర్పు తర్వాత ‘విశ్వ గురువు’ అని మనల్ని మనం అనుకోవడం చూసి ప్రపంచం నవ్వుతుంది. వేల ఏళ్ల నాగరికత అని చెప్పుకుంటాం. కానీ, మనం ఆటవికత వైపు వెళ్తున్నామా అని అనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.
బాబ్రీ తీర్పు బీజేపీకి విజయమేనని... భారతీయులందరికీ మాత్రం ఓటమి అని సీమా అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుపై సీబీఐ తప్పకుండా పైకోర్టులో అప్పీలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)