బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు: సీబీఐ ఎందుకు ఆరోపణలు రుజువు చేయలేకపోయింది?

  • మాడభూషి శ్రీధర్
  • బీబీసీ కోసం
బాబ్రీ మసీదు

ఫొటో సోర్స్, Getty Images

ఆశ్చర్యకరమైన తీర్పు వెలువడింది. ఇది సీబీఐ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసిన తీర్పు. బీజేపీ నేతలు మిఠాయిలు పంచుకునే తీర్పు. బీజేపీ వీహెచ్‌పీ, సంఘ్ వృద్ధ నేతలు నిందల నుంచి విముక్తులై అభినందనలు అందుకునే తీర్పు.

కుట్రలు గానీ ఇతర ఆరోపణలు గానీ రుజువు కాలేదంటూ సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయాధికారి సురేంద్ర కుమార్ యాదవ్ బాబ్రీ మసీదు కూల్చివేత కేసుల్లో నిందితులైన 32 మందిని నిర్దోషులుగా విడుదల చేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. సాక్ష్యాలు లేవన్నారు. కచ్చితమైన సాక్ష్యాలు లేకుండా నేరం రుజువు కాదన్నారు. అవి కూడా మామూలే. కానీ, బాబ్రీ మసీదు కూల్చివేత ముందే అనుకున్న పథకం ప్రకారం చేసిన కుట్ర ద్వారా జరగలేదనీ, సంఘ్ పరివార్, బీజేపీ నాయకులు బాబ్రీ కట్టడంలో ఉన్న రామ్ లల్లాను కాపాడడానికి మాత్రమే విశ్వప్రయత్నాలు చేశారని, ఆరోజు మధ్యాహ్నం 12 గంటలదాకా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని, కానీ హఠాత్తుగా కొన్నిసంఘ వ్యతిరేక శక్తులు రాళ్లు విసరడం లాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం వల్లే బాబ్రీ కట్టడం కూలిపోయిందని న్యాయస్థానం తీర్పు వెలువరించడం ఆశ్చర్యకరం.

అంతేకాదు. ప్రాసిక్యూషన్ అధికారులు కోర్టు ముందుంచిన ఆడియో-వీడియో సాక్ష్యాలు అసలైనవేనని రుజువు చేయడంలో ఘోరంగా విఫలమైందనడం, అక్కడితో ముగించకుండా సాక్ష్యాలను కావాలని వండారని, తప్పుడు వీడియోలను తప్పుడు ఆడియోలను సీబీఐ తయారు చేసిందని న్యాయాధికారి అభిప్రాయానికి రావడం మరింత ఆశ్చర్యకరంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

కుట్రల రుజువు కష్టమే

క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడాలంటే చాలా పటిష్ఠమైన సాక్ష్యాలు ఉండాలి. అవి తప్పుడు సాక్ష్యాలు కాకపోయినా.. సరిపడా సాక్ష్యాలు లేకపోవడం, లేదా పరస్పర విరుద్ధ సాక్ష్యాలు రావడం, అనుమానాలు కలగడం, అనుమానాలకు అతీతంగా రుజువులు లేకపోవడం తదితర కారణాలతో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం మనం చూస్తూనే ఉన్నాం.

సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా సాక్ష్యాలను తారుమారు చేయడం ద్వారా నేరస్థులు సమాజంలో గౌరవనీయమైన స్థానాలు పొందడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ, సీబీఐ అనే ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ తప్పుడు వీడియోలు ఆడియోలు తయారు చేసి బీజేపీ అగ్రనేతలైన అడ్వాణి, మురళీ మనోహర్ జోషి లాంటి వారిని జైల్లోకి తోయాలని ప్రయత్నించారని జడ్జి పేర్కొనడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.

డిసెంబర్ 6, 1992 నాడు అయోధ్యలో కరసేవకుల ఆధ్వర్యంలో బాబ్రీ కట్టడం కూలిపోయిందని ఆనాటి వీడియోలు చెబుతున్నాయి. అప్పటికి మనదేశంలో టీవీలు అంతగా అభివృద్ధి కాలేదు. దూరదర్శన్ పాతుకుపోయిన మాట నిజమేకాని పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంది. అప్పటి ప్రధాని కార్యాలయానికి బాబ్రీ పరిణామాల వీడియోలను ఎప్పడికప్పడు ప్రత్యక్షంగా ప్రసారం చేశారని కొందరన్నారు. అప్పటికే కూలిపోవడం గురించి బీబీసీ ప్రపంచానికి తెలియజేసిందని మరికొందరు అన్నారు. దూరదర్శన్, బీబీసీ వీడియో దృశ్యాలను కోర్టు గమనించిందో లేదో ఇంకా తెలియదు. బహుశా ఈ వివరాలు 2000 పేజీల తీర్పు ప్రతిలో ఉండవచ్చు.

సంఘ్ పరివార్ నాయకులు.. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రలో భాగమా? కాదా? అన్నదే కోర్టు ముందున్న ప్రధాన విచారణాంశం. కల్యాణ్ సింగ్ ఆనాటి ముఖ్యమంత్రి, చాలా కీలకమైన వ్యక్తి. ఆయన ప్రధాన నిందితుడు. తన పక్షాన డాక్యుమెంటరీ సాక్ష్యాన్ని సమర్పించిన ఏకైన నిందితుడు కల్యాణ్ సింగ్. విచిత్రమేమిటంటే, కల్యాణ్ సింగ్, మరో కీలక నిందితురాలు ఉమాభారతి కరోనావైరస్ బారిన పడటంతో కోర్టు ముందుకు రాలేదు. సీబీఐ అత్యంత సమర్థంగా 351 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రవేశ పెట్టింది. వీరిలో చాలామంది జర్నలిస్టులు కావడం గమనించాల్సిన అంశం. వీరందరూ కోర్టులో వాంగ్మూలాలు ఇవ్వడం, వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం కూడా జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

బలమైన సాక్ష్యం ఒకటి చాలు

శాసన పరిభాషలో చెప్పాలంటే.. సాక్షులు ఎక్కువ ఉండడం కేసుకు బలం కాదు. సంఖ్యా బలం నిజానికి కేసును బలహీనం చేస్తుంది. ఒకరి మాటకు మరొకరికి పొంతన లేకపోతే, కేసు వీగిపోతుంది. ఎక్కువ సాక్ష్యాలు ఉండడం కన్నా, బలమైన సాక్ష్యం ఉండడం అవసరం.

ఇన్నాళ్లూ రెండు ప్రధానమైన నేరాల విచారణ జరిగింది. ఒకటి బాబ్రీ కట్టడం కూల్చివేతకు పెద్దల కుట్ర కాగా, మత వర్గాల మధ్య కలహాలను రెచ్చగొట్టారన్న ఆరోపణ మరొకటి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని రుజువులు చూపితే రెండో నేరమైనా రుజువయ్యే అవకాశం ఉండేది. కానీ వీడియో ఆడియో సాక్ష్యాలు అసలైనవి కావని కోర్టు అభిప్రాయపడిన తరువాత ఆ సాక్ష్యాలను కూడా నమ్మదగినవి కావని మనం నమ్మాలి.

మొదటి నేరారోపణ నంబరు 197(1992)లో లక్షల మంది కరసేవకులు నిందితులు. వారి మీద దోపిడీ, గాయపరచడం, ప్రజల పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం అనే నేరాలు మోపారు. రెండో ఎఫ్‌ఐఆర్ నంబర్ 198(1992)లో అడ్వాణీ, ఉమా భారతి లాంటి పెద్ద నాయకుల మీద ఆరోపణలు మోపారు.

21 మంది పెద్ద రాజకీయ నాయకుల మీద కుట్ర ఆరోపణలను విచారించాల్సిన అవసరం లేదని 2001లో సీబీఐ నిర్ణయించింది. దీన్ని సవాలు చేశారు. అలహాబాద్ హైకోర్టు 2010లో ఈ నిర్ణయాన్ని సమర్థించి వారిపై విచారణ అవసరం లేదని తీర్పుచెప్పింది. కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆర్టికల్ 142 కింద తన అసాధారణ అధికారాలను ఉపయోగించి ఆ నేరారోపణల విచారణ జరిపి తీరాలని సుప్రీంకోర్టు 2017 ఏప్రిల్ నాడు ఆదేశించింది.

అంటే, ఈ కేసు ప్రాథమిక దశలోనే సుప్రీంకోర్టు దాకా వెళ్లి, మళ్లీ ట్రయల్ కోర్టు (సీబీఐ స్పెషల్ కోర్టు, లఖ్‌నవూ)కు చేరింది.

రామ్ విలాస్ వేదాంతి, మహంత్ నృత్య గోపాల్ దాస్ (రాం జన్మభూమి న్యాస్) శివసేన నాయకుడు సతీశ్ ప్రధాన్, వీహెచ్‌పీ నాయకులు చంపత్ రాయ్, మహంత ధర్మదాస్, బీఎల్ శర్మలపైన మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వారు ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేశారని, నష్టపరిచారని, దురుద్దేశపూరితంగా మతద్వేషాలను రెచ్చగొట్టారనే నేరారోపణలు చేశారు. ఈ నేరారోపణ పత్రంలో అడ్వాణి, తదితర బీజేపీ, వీహెచ్‌పీ అగ్రనాయకులు బాబ్రీ కట్టడానికి దగ్గరలో ఒక స్టేజి మీద నుంచి కరసేవకులను రెచ్చగొట్టారని నేరారోపణ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఏం జరుగుతుంది?

28 సంవత్సరాలు సాగిన దర్యాప్తు, విచారణ తద్వారా పెద్ద నాయకుల మీద మోపిన నిందలు తాజా తీర్పుతో తుడిచిపెట్టుకు పోయాయి. బాబ్రీ మసీదు కూలడం నిజం, ఒక పెద్ద మూక కూల్చడం నిజం. కాని ఆ కేసులో 92 ఏళ్ల లాల్ కృష్ణ ఆడ్వాణి, 86ఏళ్ల మురళీ మనోహర్ జోషి, 61ఏళ్ల ఉమాభారతి, 88ఏళ్ల కల్యాణ్ సింగ్, 65ఏళ్ల వినయ్ కతియార్ లాంటి బడా బీజేపీ నాయకులతో పాటు 32 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోష ముద్రను ప్రసాదించడంతో బాబ్రీ కూల్చివేత కుట్ర తదితర నేరాల చరిత్రకు తెర పడింది.

బాబ్రీ-అయోధ్య వివాదంలో నిరుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత.. బాబ్రీ కూల్చివేత నేర విచారణ కేసు ఒక లాంఛనంగా మిగిలిపోయింది. బాబ్రీ కూల్చివేతకు కరసేవకులను సన్నద్ధం చేసి, సాధనాలు ఇప్పించి, రప్పించి, కోపం రగిలించి, ఆ సమయానికి అక్కడ ఉండి, ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులు నిందితులని సీబీఐ ఆరోపిస్తూ ఆరోపణ పత్రాలను దాఖలు చేసింది. 49 మంది నిందితుల్లో, 17 మంది చనిపోగా మిగిలిన 32 మందిపై 28 ఏళ్లపాటు కొనసాగిన నేర విచారణను మొత్తానికి ముగించారు. సీబీఐ కోర్టు ఈ నిర్దోషి తీర్పుపైన అప్పీలుకు వెళ్తుందా లేదా అనేది కూడా ఒక ఖాళీ లాంఛనం తప్ప ప్రయోజనం ఉన్న పని కాదు.

కచ్చితమైన సాక్ష్యం లేదని, కనుక వారంతా నిర్దోషులని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పు ఒక అభిప్రాయం అని తెలుసుకోవాలి. బీజేపీ నాయకుల నేతృత్వంలో బాబ్రీ మసీదు కూలిందని, రామాలయ నిర్మాణం కోసం బాబ్రీ మసీదు కూల్చాలన్నదే బీజేపీ రాజకీయ ఎజెండా అని అందరికీ తెలిసినంత మాత్రాన.. 32 మంది నేతలను జైలుకు పంపడానికి తగిన సాక్ష్యంగా అది కోర్టు ముందు నిలబడుతుందని అనుకోవడం సరికాదని ఈ తీర్పు అర్థం.

ఫొటో సోర్స్, Getty Images

రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణ కూడా రుజువుకాలేదన్న తరువాత.. బాబ్రీ మసీదు కూల్చివేయడానికి సాయుధులైన మూకలను వారే ప్రేరేపించారన్న ఆరోపణ కూడా నిలవదు.

న్యాయాన్యాయాల మాట ఎలా ఉన్నా.. ఆలయ నిర్మాణం కోసం మసీదు కూల్చివేత తప్పదని కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ, వీహెచ్‌పీ తదితర సంస్థలు ఈ తీర్పుతో ఘన విజయం సాధించాయి. అయోధ్యలో బాబ్రీ నిర్మాణం ఉన్నచోట రామాలయం నిర్మించి తీరతాం అంటూ రథయాత్ర చేసిన అడ్వాణీ నాయకత్వంలో బీజేపీ విజయయాత్రల్లో ఈ కేసు గెలుపు కూడా గొప్ప మైలు రాయి.

1984లో లోక్‌సభలో బీజేపీకి కేవలం రెండే రెండు స్థానాలు ఉండేవి. అక్కడి నుంచి తామే సొంతంగా లోక్‌సభలో కావాల్సిన మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా బీజేపీ ఎదిగింది రామాలయం నిర్మించాలనే విధానంతోనే. 2019లో సుప్రీంకోర్టు అనుకూల తీర్పు, 2020లో సీబీఐ కోర్టు అనుకూల తీర్పుతో ఇలాంటి అజెండానే ఆ పార్టీ అనుబంధ సంస్థలు మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ. కేవలం మతపరమైన పునరేకీకరణ ద్వారా అధికారం సాధించగలిగే రాజకీయ వ్యూహాలకు ప్రస్తుతం మరింత బలం చేకూరుతుంది. మతోద్రేకాలు, మతభావనల ఆధారంగా రాజకీయ నిర్ణయాలు జరపకుండా ఆపడం కష్టమయ్యే పరిస్థితులకు ఈ పరిణామాలు నిలువెత్తు ఉదాహరణలు. 2024లోగా అయోధ్యలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించి, పర్యటకాన్ని కూడా ప్రోత్సహించే వ్యూహాలకు బలం చేకూరుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇలాంటి వ్యూహాలను అంటే మరిన్ని ఆలయ రాజకీయ వ్యూహాలను అధికార పార్టీ ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువ.

అయితే అసలు అర్థం కాని ప్రశ్నలు ఏమిటంటే, కోర్టు అభిప్రాయపడినట్టు సీబీఐ ఇంతపెద్ద బీజేపీ నాయకులపైన తప్పుడు ఆరోపణలు ఎందుకు చేసినట్టు? తప్పుడు వీడియోలు ఆడియోలు ఎందుకు సృష్టించినట్టు? ఇది సీబీఐ కుట్రా? ఒకవేళ కుట్రే అయితే వారిమీద ఎవరు చర్యలు తీసుకోగలుగుతారు? నష్టపరిహారం ఇస్తారా?

(వ్యాసకర్త న్యాయవ్యవహారాల నిపుణులు, కేంద్ర సమాచార మాజీ కమిషనర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)