ట్రంప్ - బైడెన్ చర్చలో రచ్చ... డిబేట్ నిబంధనలు మారుస్తున్న కమిషన్ - BBC Newsreel

జో బైడెన్, డోనల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య డిబేట్‌లు మరింత క్రమశిక్షణతో జరిగేలా చూడటానికి.. డిబేట్ నియమనిబంధనలను మార్చుతున్నట్లు.. అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లను పర్యవేక్షించే కమిషన్ ప్రకటించింది.

ట్రంప్, బైడెన్‌ల మధ్య బుధవారం జరిగిన తొలి డిబేట్‌లో ఇద్దరు నాయకులూ పరస్పరం పరుష పదాలతో తిట్టుకుంటూ చర్చను రసాభాస చేయటంతో కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సీపీడీ) ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మార్పుల్లో.. అభ్యర్థులు ఒకరు మాట్లేడటపుడు మరొకరు జోక్యంచేసుకుని అడ్డుకోకుండా ఉండటానికి.. అలా చేయటానికి ప్రయత్నించే వారి మైక్రోఫోన్లు కట్ చేయటం ఒకటిగా ఉండవచ్చునని అమెరికా మీడియా కథనాలు చెప్తున్నాయి.

కమిషన్ ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ బృందం ఇప్పటికే విమర్శించింది. మంగళవారం నాటి డిబేట్‌లో ట్రంప్, బైడెన్ చాలా సార్లు ఒకరిపై ఒకరు చిరాకు పడ్డారు. ఇద్దరూ పరస్పరం 'షటప్' అని కూడా అనుకున్నారు. డిబేట్ హోస్ట్ క్రిస్ వాలెస్ మధ్యలో జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పాల్సి వచ్చింది.

చాలా అంశాలపై చర్చిస్తున్న సమయంలో ట్రంప్, బైడెన్ ఒకరినొకరు తిట్టుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే, చివరికి హోస్ట్ క్రిస్ వాలెస్ ఇద్దరినీ 'స్టాప్ టాకింగ్' అనాల్సి వచ్చింది.

చర్చ సమయంలో ఒకసారి ట్రంప్‌ మాటల మధ్యలో బైడెన్ జోక్యం చేసుకోగానే వాలెస్, తనతో "ఆయన చెప్పేది పూర్తి చేయనివ్వండి" అన్నారు. దానిపై ట్రంప్ వ్యంగ్యంగా "బైడెన్‌కు అది అసలు తెలీదు కదా" అన్నారు.

అంతే కాదు, ట్రంప్, బైడెన్ డిబేట్ సమయంలో పరస్పరం చురకలు వేసుకున్నారు. ఒకరినొకరు ఎగతాళి చేసుకున్నారు. ట్రంప్‌ను తనను అమెరికా చరిత్రలోనే అత్యుత్తమ అధ్యక్షుడుగా చెప్పుకుంటే, ఇప్పటివరకూ అత్యంత చెత్త అధ్యక్షుడు ట్రంపేనని బైడెన్ విమర్శించారు.

డిబేట్ సమయంలో ట్రంప్ మరోసారి బైడెన్‌తో "నా ముందు మిమ్మల్ని మీరు స్మార్ట్ అని చెప్పుకోకండి. నా ముందు స్మార్ట్ అనే మాట ఉపయోగించకండి" అన్నారు.

IPL 2020: KKRvsRR పాయింట్ల పట్టికలో తారుమారవుతున్న జట్ల స్థానాలు

ఫొటో సోర్స్, BCCI/IPL

ఫొటో క్యాప్షన్,

ఆంద్రే రసెల్, దినేశ్ కార్తిక్

ఐపీఎల్-13లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్ తొలి అపజయం మూటగట్టుకుంది.

వరసగా రెండు మ్యాచుల్లో విజయాలతో బుధవారం ఉదయం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఈ ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది.

దిల్లీ మళ్లీ టాప్ ప్లేసుకు చేరుకోగా.. తాజా విజయంతో కోల్‌కతా రెండో స్థానానికి చేరింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇచ్చిన 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137పరుగులు మాత్రమే చేయగలిగింది.

అయితే, రాజస్థాన్ మీద 37 పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్‌కతాకు మ్యాచ్ ముందు వరకూ ఇలాంటి ఫలితం వస్తుందని నమ్మకం లేదు.

మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ "ఉదయం ఎవరైనా మేం 37 పరుగులతో గెలిచామని చెప్పుకుంటుంటే, చాలా సంతోషంగా ఉంటుంది" అన్నారు.

అది నిజమే, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మొదటి రెండు మ్యాచుల్లో 200కు పైగా స్కోర్లు చేసింది.

ఫొటో సోర్స్, BCCI/IPL

సంజును ఆపాలి, రాజస్థాన్‌ను ఓడించాలి

రాజస్థాన్ బౌలర్లు బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ ను 174 పరుగులకే కట్టడి చేసినప్పుడు రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.

స్మిత్ తక్కువ పరుగులకే అవుట్ అయినప్పుడు, అభిమానులు సంజు శాంసన్ ఉన్నాడులే అనుకున్నారు. సంజు కూడా విఫలమవడంతో, తేవతియా మరోసారి అద్భుతం చేస్తాడని ఆశించారు. కానీ అవేం జరగలేదు.

స్మిత్ 3, సంజు శాంసన్ 8, రాబిన్ ఉతప్ప 2, తేవతియా 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

19వ ఓవర్లో మూడు సిక్సర్ల కొట్టిన టామ్ కరన్ 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టులో టాప్ స్కోరర్ అయ్యాడు. కానీ అవి జట్టుకు విజయం అందించలేకపోయాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ శివమ్ మావీ నాలుగు ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి సంజు శాంసన్, జాస్ బట్లర్ వికెట్లు పడగొట్టాడు.

కమలేష్ నాగర్‌కోటీ కూడా ఒకే ఓవర్లో రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్ వికెట్లు పడగొట్టి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL

శుభ్‌మన్ టాప్ స్కోరర్

కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో శుభమన్ గిల్ కీలక పాత్ర పోషించాడు.

అతడు జట్టుకు మరోసారి మంచి ఆరంభాన్ని అందించాడు. ఓపెనర్ సునీల్ నరైన్ 15 పరుగులకే అవుటైనా 34 బంతులు ఆడిన శుభ్‌మన్ 47 పరుగులు చేశాడు.

ఆండ్రూ రసెల్ 14 బంతుల్లో మూడు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. ఇయాన్ మోర్గాన్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

దీంతో కోల్‌కతా 174 పరుగుల మంచి స్కోర్ సాధించగలిగింది.

రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి శుభ్‌మన్ గిల్, దినేశ్ కార్తీక్‌ వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)