బాబ్రీ మసీదు విధ్వంసం: సుప్రీంకోర్టులో ‘చట్ట విరుద్దం’ అయిన కేసు సీబీఐ కోర్టులో రివర్స్ ఎలా అయ్యింది?

  • సల్మాన్ రావి
  • బీబీసీ ప్రతినిధి
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిర్దోషిగా రుజువైన వారిలో సాధ్వి రితంబర ఒకరు

ఫొటో సోర్స్, Hindustan Times

ఫొటో క్యాప్షన్,

బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిర్దోషిగా రుజువైన వారిలో సాధ్వి రితంబర ఒకరు

భారత సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ నెలలో తీర్పు ఇస్తూ బాబ్రీ మసీదు కూల్చడాన్ని ఒక ‘చట్టవిరుద్ధమైన’ చర్యగా పేర్కొంది.

సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్వయంగా అప్పటి చీఫ్ జస్టిస్ నేతృత్వం వహించారు.

కానీ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు కనిపించకపోవడానికి, అది వారందరినీ నిర్దోషులుగా ప్రకటించడానికి కారణం ఏంటి?

సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు, గత ఏడాది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు రెండిటిలో వైరుధ్యం ఉందని దీనిపై మాట్లాడిన న్యాయకోవిదులు, సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు.

“సీబీఐ కింది కోర్టుకు సాక్షులుగా హాజరైనవారు, తమ వాదనను కోర్టు ఎదుట వినిపించారు. కానీ కోర్టు వారి సాక్ష్యాలను అసలు గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉంద”ని బీబీసీతో మాట్లాడిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాయర్ జఫర్యాబ్ జిలానీ అన్నారు.

ఫొటో సోర్స్, PRAVEENJAIN/BBC

850 సాక్షుల వాంగ్మూలం, ఏదీ నిరూపితం కాలేదు..

బాబ్రీ మసీదు కూల్చిన కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మొత్తం 850 మంది సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేసింది.

‘‘తీర్పు వినిపించడానికి ముందు 1992 డిసెంబర్ 6న ఘటనకు సంబంధించి వార్తాపత్రికలు, పత్రికల్లో ముద్రించిన రిపోర్టులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది, కానీ, పబ్లిక్ డొమైన్ అంటే బహిరంగంగా ఉన్న వీడియోలు, ఫొటోలను పరిగణనలోకి తీసుకోలేద”ని జిలానీ చెప్పారు.

ఆ సమయంలో బాబ్రీ మసీదు విధ్వంసంలో నిందితులు ఎలాంటి పాత్ర పోషించారనేది కూడా బహిరంగ విషయమే.

“భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, మిగతా హిందూ సంస్థల నేతలు కరసేవకులను మసీదు ధ్వంసం చేయడానికి రెచ్చగొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్న వీడియోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అందులో కొందరు నేతలు మైక్‌లో “ఇంకో దెబ్బ వేయండి, బాబ్రీ మసీదును కూల్చండి” అని అరవడం స్పష్టంగా వినిపిస్తుంది” అంటారు జిలానీ.

ఏ న్యాయస్థానం అయినా బహిరంగంగా ఉన్న సాక్ష్యాలను ఎలా విస్మరిస్తుందని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

బాబ్రీ మసీదు కూల్చివేత: నాడు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జర్నలిస్టులు ఏం చెప్తున్నారు?

రెచ్చగొట్టే నినాదాలు, సాయుధ కరసేవకులు

కోర్టు రికార్డుల్లో నమోదైన సాక్ష్యాల్లో అప్పట్లో అయోధ్యలో మోహరించిన సీనియర్ పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని ఆయన వాదించారు. వారితోపాటూ ఆ సమయంలో అక్కడి నుంచి రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టులు కూడా సాక్షులుగా ఉన్నారని తెలిపారు.

“ఈ సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు నమ్మలేదు. సాక్షుల మాటకు కోర్టు ప్రాధాన్యం ఇవ్వలేదని ఈ తీర్పు చెబుతోంది. అంటే, సాక్షులందరూ అబద్ధాలు చెబుతున్నారా?.. అలా అనుకుంటే, వారందరి మీదా కోర్టు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు” అన్నారు జిలానీ.

దీనిపై హైదరాబాద్‌ నల్సార్ లా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఫైజాన్ ముస్తఫా బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడారు. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ‘నిరాశపరిచింది’, ఇది భారత నేర న్యాయ వ్యవస్థకు ఒక విఘాతం అని చెప్పారు..

“బీజేపీ, శివసేన నేతలు ఆ సమయంలో చేసిన ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు మతపరంగా నిర్వహించిన సభలో చేసిన నినాదాలను మనం చూడచ్చు. ఆరోజు వచ్చిన కరసేవకులు గొడ్డళ్లు, పారలు, తాళ్లు తీసుకొచ్చారు. ఇది కుట్రేనని వాటి ద్వారా స్పష్టంగా తెలుస్తోంద”ని ఫైజాన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్,

బాబ్రీ మసీదు కూల్చివేతపై ఈ కరసేవకులు ఏమంటున్నారంటే..

బాబ్రీ హఠాత్తుగా కూలలేదు

ఇంత పెద్ద నేరానికి దోషులుగా ఎవరినీ గుర్తించకపోవడం అనేది, దేశ న్యాయ వ్యవస్థకు మంచిది కాదని ప్రొఫెసర్ ముస్తఫా అన్నారు.

“దీనివల్ల సీబీఐ తన పని సరిగా చేయలేకపోయిందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆడియో, వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ, 350 మందికి పైగా ప్రత్యక్షసాక్షులు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ బలమైన ఆధారాలు లేవనడం నాకు అర్థం కావడం లేద”న్నారు.

దేశ అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ సీబీఐ, హోంమంత్రిత్వ శాఖ(భారత ప్రభుత్వం) కిందికి వస్తుంది. ప్రొఫెసర్ ముస్తఫా అభిప్రాయం ప్రకారం దర్యాప్తు ఏజెన్సీ, ప్రాసిక్యూషన్‌కు విడిగా స్వయం ప్రతిపత్తి ఉండడం అవసరం.

సీనియర్ జర్నలిస్ట్, రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ 1992 డిసెంబర్ 6న జరిగిన ఆ ఘటనపై, అప్పటి పరిస్థితి గురించి ఒక పుస్తకం కూడా రాశారు.

“అక్కడ ఉన్న మసీదును కూలగొట్టి ఆలయ నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నట్టు విశ్వహిందూ పరిషత్ 1989లోనే కోర్టుకు స్పష్టం చేసింది. విశ్వహిందూ పరిషత్ తన ఉద్దేశం స్పష్టంగా చెప్పింది అని బీబీసీతో ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడినపుడు ఆయన చెప్పారు.

1992 డిసెంబర్ 6న జరిగింది హఠాత్తుగా ఒక్క రోజులో జరిగిన, ఘటన కాదని ముఖోపాధ్యాయ తెలిపారు.

“దీనికి చాలా కాలం నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిందే. ధ్రువీకరించడానికి వార్తాపత్రికల కటింగ్స్, పత్రికల రిపోర్టులు ఉన్నాయి. అంతా ‘డాక్యుమెంటెడ్’. బహిరంగం కూడా. ఇన్నేళ్లూ ఏ హిందూ సంస్థలు ఈ ఉద్యమం నడిపించాయో, అవి బాబ్రీ కట్టడాన్నికూల్చి అక్కడ మందిరం నిర్మించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి” అని ఆయన చెప్పారు.

లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర ఉద్దేశం కూడా అదేనని ముఖోపాధ్యాయ తెలిపారు.

వీడియో క్యాప్షన్,

'బాబ్రీ మసీదును కూల్చివేసింది ఎవరో మొత్తం ప్రపంచానికి తెలుసు' - అసదుద్దీన్ ఒవైసీ

నిందితులందరూ నిర్దోషులు ఎలా అయ్యారు

ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన చార్జిషీటులో పేర్లు ఉన్న నిందితులు జనాలను రెచ్చగొట్టారని, అల్లర్లు చెలరేగే పరిస్థితికి కారణమయ్యారని ఎక్కడా నిరూపితం కాలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పింది.

“1992 డిసెంబర్ 6న మధ్యాహ్నం కరసేవకులు హఠాత్తుగా అదుపుతప్పారని, అడ్డుపెట్టిన వాటిని విరగ్గొట్టుకుని, బాబ్రీ మసీదుపైకి ఎక్కేశారని, విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘల్ అలా చేయవద్దని వారికి నచ్చజెప్పారని” కూడా ప్రత్యేక కోర్టు గుర్తించింది.

“కరసేవకుల మధ్య కొన్ని నేరశక్తులు ఉన్నాయి. వారు ఆ పనికి ముగింపు ఇచ్చారు. ఎందుకంటే వారు రామభక్తులు అయ్యుంటే, ఆ వివాదిత స్థలంలో విగ్రహాలు కూడా ఉన్నాయని పదే పదే చెప్పిన అశోక్ సింఘల్ మాటలు వినేవారు” అని కోర్టు భావించింది.

“చట్టంలో కుట్ర అనేది ఎలా ఉంటుందంటే, దానిని నిరూపించడం అంత సులభం కాదు. అది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ‘సందర్భోచిత సాక్ష్యాల’ ఆధారంగా ఉంటుంది. అక్కడ ఐపీఎస్ అంజూ గుప్తా, ఇంకా చాలామంది ఇచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. వారి నిజాయితీ గురించి ప్రశ్నలు లేవనెత్తలేం” అని సీనియర్ జర్నలిస్ట్ రామదత్త్ త్రిపాఠీ అన్నారు.

“ఇక రెండోది. ఒక దగ్గర ఏదైనా గుంపు గుమిగూడినప్పుడు. వారేదైనా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే, ఐపీసీ సెక్షన్ 149 ప్రకారం గుంపులోని ఒకరు ఇంకొకరు చేసిన పనికి బాధ్యులు అవుతారు. ఇక్కడ బాబ్రీ మసీదు ఉంది, దానిని పడగొట్టారనేది వాస్తవం. అలాంటప్పుడు చట్ట ప్రకారం దానికి వారు బాధ్యులు అవుతారు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

విరుద్ధమైన నిర్ణయాలు

అప్పటి భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రిటైర్డ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హాన్ నేతృతంలో ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు.

ఆయన 17 ఏళ్ల తర్వాత 2009లో దీనిపై తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

మొత్తం 100 మంది సాక్ష్యుల వాంగ్మూలాలు నమోదు చేసిన కమిటీ, అల్లర్లు రెచ్చగొట్టడంలో, బాబ్రీ మసీదును కూల్చడంలో లాల్ కృష్ణ అడ్వాణీ, కల్రాజ్ మిశ్రా, మురళీ మనోహర్ జోషి సహా మొత్తం 68 మంది ముఖ్య పాత్ర పోషించారని తమ నివేదికలో చెప్పింది.

నేరపూరిత కుట్ర , బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన వారికి వ్యతిరేకంగా ఇదే రిపోర్టులో తాము ఆధారాలు కూడా అందించామని జస్టిస్ లిబర్హాన్ బీబీసీ ప్రతినిధి అరవింద్ ఛాబ్డాకు చెప్పారు.

కమిటీ నివేదిక, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పులో చాలా వైరుధ్యం ఉందని జస్టిస్ లిబర్హాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)