‘హాథ్రస్ బాధితురాలిపై అత్యాచారం జరగలేదు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో వీర్యం ఆనవాళ్లు లేవు’ - యూపీ పోలీసులు
రాహుల్ గాంధీ: 'పోలీసులు నన్ను లాఠీతో కొట్టారు, కింద పడేశారు'
హాథ్రస్ బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, పోస్టుమార్టం నివేదిక ప్రకారం బాధితురాలు మెడ గాయం వల్ల చనిపోయిందని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
హాథ్రస్లో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమె కుటుబం అనుమతి లేకుండానే పోలీసులు అంత్యక్రియలు చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యలో యూపీ పోలీసు ఏడీజీ ప్రశాంత్ కుమార్ స్పందిస్తూ.. ‘‘ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో వీర్యం ఆనవాళ్లు కనిపించలేదు. దీన్ని బట్టి కొందరు కావాలనే, కులాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారు. ఇలాంటి వాళ్లను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
హాథ్రస్ బాధిత యువతి వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, విచారణ చేపడుతున్నట్లు లక్నోలోని అలహాబాద్ హైకోర్టు బెంచి ప్రకటించింది.
బాధిత యువతి అంత్యక్రియలను కూడా గౌరవంగా చేయలేదన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది.
ఈ మొత్తం వ్యవహారంలో బాధిత యువతి, బాధిత కుటుంబం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందా? రాష్ట్ర అధికారులు దురుసుగా వ్యవహరించారా? అన్న కోణాల్లో విచారణ జరపాలని నిర్ణయించింది.
రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, హాథ్రస్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఈ వ్యవహారంపై కథనాలు ప్రసారం చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు కూడా నోటీసులు జారీ చేసింది.
ఈనెల 12వ తేదీన ఈ కేసుపై విచారణ జరుపనుంది.
ఫొటో సోర్స్, ANI
హాథ్రస్ వెళ్తుండగా రాహుల్ గాంధీ అరెస్ట్: 'పోలీసులు నన్ను లాఠీతో కొట్టి, కింద పడేశారు'
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హాథ్రస్లో సామూహిక అత్యాచారానికి గురైందని భావిస్తున్న, మరణించిన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ గురువారం దిల్లీ నుంచి కారులో బయలుదేరారు.
మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
ఈక్రమంలో పోలీసులు తనపై లాఠీఛార్జి చేశారని, రోడ్డుపైకి నెట్టేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఫొటో సోర్స్, twitter/INCIndia
ఫొటో సోర్స్, twitter/INCIndia
‘‘పోలీసులు నన్ను లాఠీతో కొట్టారు. కింద పడేశారు. అయినా నాకు సమస్యేమీ లేదు. భారతదేశంలో కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మాత్రమే నడవగలరా? సామాన్యులు నడవలేరా? ఈ దేశంలో కేవలం మోదీ మాత్రమే కాలినడకన వెళ్లగలరా? సామాన్య ప్రజలు వెళ్లకూడదా? తొలుత మా కారును ఆపేశారు. మేం కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను హాథ్రస్ వెళ్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య సంవాదం జరిగింది.
రాహుల్ గాంధీ: ‘‘నేను ఒంటరిగా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. సెక్షన్ 144 ప్రకారం గుమికూడటం చట్టవిరుద్ధం. నేను ఒంటరిగా హత్రాస్ వెళ్తాను. మరి, మీరు ఏ సెక్షన్ ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తున్నారో నాకు చెప్పండి.’’
పోలీసు అధికారి: ‘‘సర్, సెక్షన్ 188 ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం’’
రాహుల్ గాంధీ: ‘‘ఈ 188 ఏంటి. నాకు అర్థమయ్యేలా చెప్పండి’’
పోలీసు అధికారి: ‘‘చట్టపరమైన ఉత్తర్వులను అతిక్రమించినందుకు..’’
రాహుల్ గాంధీ: ‘‘ఏ చట్టం? నేను ఏ చట్టాన్ని అతిక్రమిస్తున్నానో అది చెప్పండి ముందు.‘‘
పోలీసు అధికారి: ‘‘మహమ్మారి నియత్రణ ఆదేశాలు, సెక్షన్ 144 ఆదేశాలు..’’
రాహుల్ గాంధీ: ‘‘నేను సెక్షన్ 144ను అతిక్రమించలేదు’’
పోలీసు అధికారి: ‘‘మరి ఇదంతా ఏంటి? ఇక్కడ ఏం జరుగుతోంది?’’
రాహుల్ గాంధీ: ‘‘ఇదంతా నేను చేయలేదు. మీరే చేశారు’’
పోలీసు అధికారి: ‘‘లేదు సర్. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను’’
రాహుల్ గాంధీ: ‘‘మీరు ఎవరి ఆదేశాల ప్రకారం లాఠీచార్జ్ చేశారు?’’ అని ఒక కార్యకర్త ప్రశ్నించారు.
పోలీసు అధికారి: ‘‘లేదు.. లేదు. ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదు’’
కాంగ్రెస్ కార్యకర్త: ‘‘మీరు రాహుల్ గాంధీని కొట్టారు’’
కాగా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు రాజకీయ రోటీలు కాల్చుకునేందుకు ఉత్తర ప్రదేశ్ వస్తున్నారని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాగ్ సింగ్ విమర్శించారు.
ఫొటో సోర్స్, Mohd Zakir/Hindustan Times via Getty Images
'హాథ్రస్ గ్యాంగ్‌రేప్ కేసులో న్యాయం జరగాలి' - సోనియా గాంధీ
హాథ్రస్లో సామూహిక అత్యాచారం జరిగిందని భావిస్తున్న బాధితురాలి మృతదేహానికి అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించిన కేసులో న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. 'హాథ్రస్ నిర్భయ' చనిపోలేదు, ఆమెను చంపేశారని సోనియా ఆరోపించారు.
"ఒక వ్యక్తి మరణించిన తరువాత కూడా గౌరవించే సంప్రదాయం మనకు ఉంది. హిందూ ధర్మం ఆ విషయాన్ని ప్రస్తావిస్తుంది. కానీ, హాథ్రస్ అమ్మాయి మృతదేహాన్ని పోలీసుల బలంతో అనాథ శవంలా దహనం చేశారు" అని సోనియా అన్నారు.
జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్ర మహిళా సంఘం ఇప్పటికే హాథ్రస్ వ్యవహారంపై, బాధితురాలికి అర్థ రాత్రి అంత్యక్రియలు చేయడంపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేశాయి. నాలుగు వారాల్లోగా తమ నోటీసుకు బదులివ్వాలని జాతీయ మానవ హక్కుల సంఘం యూపీ పోలీసులను ఆదేశించింది.
ఈ ఉదంతంపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ప్రతిపక్షాల నుంచి, మాజీ పోలీసు ఉన్నతాధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి వీఎన్ రాయ్ బీబీసీతో మాట్లాడుతూ పోలీసులు తమ విలువలను కాపాడుకోవాలని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- ఉత్తర ప్రదేశ్‌లో బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయా, లేదా? : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
- ట్రంప్ - బైడెన్ చర్చలో రచ్చ... డిబేట్ నిబంధనలు మారుస్తున్న కమిషన్ - BBC Newsreel
- బాబ్రీ మసీదు విధ్వంసం: సుప్రీంకోర్టులో ‘చట్ట విరుద్దం’ అయిన కేసు సీబీఐ కోర్టులో రివర్స్ ఎలా అయ్యింది?
- రాహుల్ గాంధీ అరెస్ట్: ‘పోలీసులు నన్ను లాఠీతో కొట్టి, కింద పడేశారు’
- ‘ట్విటర్లో పరిచయమైన ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్‌లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)