బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?

  • రమ్య కౌశిక్
  • బీబీసీ కోసం
బెంగళూరు, బావి

ఫొటో సోర్స్, Vishwanath Srikantaiah

బెంగళూరు ఆగ్నేయ ప్రాంతమైన కైకొండ్రహల్లి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ, జనజీవనానికి కీలకమైన నీటి సరఫరా వ్యవస్థ ఇక్కడ సరిగ్గా లేదు.

ఇక్కడే ఓ రెండు అంతస్తుల భవనంలో నడుస్తోంది రేణుక హై స్కూల్. నీటి అవసరాలను తీర్చుకునేందుకు ఇలాంటి స్కూళ్ల మైదానాల్లో ఇప్పుడు పాత కాలంలోలా బావులు తవ్వుతున్నారు. బెంగళూరు వ్యాప్తంగా ఇలాంటి పది లక్షల బావులు తవ్వాలని ప్రణాళిక వేసుకున్నారు.

ఇదో బృహత్తర కార్యక్రమం. వాతావరణ మార్పుల నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు ఇలా పాత పద్ధతిలో బావులు తవ్వడం మంచిది.

ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి. దీనికి సమీపంలో అర్కావతి అనే నది ఉంది. అయితే, దానితో అవసరాలు తీర్చుకునే స్థాయిని బెంగళూరు చాలాకాలం క్రితమే దాటేసింది. కావేరీ నది బెంగళూరుకు జీవనాడీ. దాని నుంచి రోజుకు 145 కోట్ల లీటర్ల నీరు బెంగళూరుకు వస్తోంది. కానీ, నగరానికి దక్షిణం వైపు దాదాపు 100 కి.మీ.ల దూరంలో అది ఉంది.

భూగర్భజలాలు మరో ప్రత్యామ్నాయం. నగరంలో నాలుగు లక్షల అక్రమ బోరు బావులు ఉన్నాయి. అతివాడకం వల్ల వాటిలో చాలవరకూ ఎండిపోయాయి. 200 అడుగుల కింద ఉన్న రాతి పొరల నుంచి బోరు బావుల ద్వారా భూగర్భ జలం పైకి వస్తుంది. అయితే, వీటి నుంచి నీటిని అతిగా తోడుకోవడంతో అవి అడుగంటాయి. మళ్లీ వాటిలో నీరు చేరుకోవాలంటే ఏళ్ల సమయం పడుతుంది. నగరంలో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వాటిని నమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది.

భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేందుకు అవసరమైన భూ పరిస్థితులు బెంగళూరులో లేవని బ్రిటన్‌లోని షెఫీల్డ్ అర్బన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకురాలు డాక్టర్ హిత ఉన్నికృష్ణన్ అన్నారు. బెంగళూరులోని సామాజిక నీటి వనరుల చరిత్ర గురించి ఆమె అధ్యయనం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

బెంగళూరులో వర్షాలు బాగానే పడతాయి. ఏడాదిలో దాదాపు 60 రోజులు వానలు కురుస్తాయి. మొత్తంగా 97.2 సెం.మీ.ల వార్షిక వర్షాపాతం నమోదవుతుంది.

మరి, ఈ నీరంతా ఏమవుతోంది?

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని సెంటర్ ఫర్ ఎకాలజికల్ సైన్సెస్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ ప్రశ్నకు జవాబు చెబుతోంది. 1973 నుంచి 2017 మధ్య బెంగళూరులో కాంక్రీటు పేవ్‌మెంట్లు పది రెట్లు పెరిగాయని వారి అధ్యయనం సూచించింది. నగరవ్యాప్తంగా దాదాపు 93 శాతం కాంక్రీటు పేవ్‌మెంట్లు పరుచుకున్నాయి.

భూగర్భ జలం తిరిగి పోగయ్యేందుకు నేల నుంచి నీరు కిందకు ఇంకాలి. కానీ, ఇలా కాంక్రీటు పేవ్‌మెంట్లు, తారు రోడ్ల కారణంగా ఆ పరిస్థితి లేకుండా పోయింది. విలువైన వర్షం నీటితో మురుగు కాల్వలు నిండి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుకుని, అవి మునిగిపోతున్నాయి.

''సహజ పరిస్థితుల్లో సాధారణ వర్షం కురిసినప్పుడు నగరంలో 3 నుంచి 10 శాతం వాన నీరు భూగర్భంలోని పొరల్లోకి ఇంకుతుంది. కానీ, నేలపై మనం భవనాలు నిర్మించడం మొదలుపెడితే, మనం ఆ ఇంకే స్థలాన్ని తగ్గిస్తున్నట్లే. వర్షం నీరు ఇంకడాన్ని మనం పది శాతం నుంచి సున్నాకు తెస్తున్నాం'' అని నీటి పరిరక్షణ నిపుణుడు విశ్వనాథ్ శ్రీకాంతయ్య అన్నారు.

విశ్వనాథ్ బయోమీ ఎన్విరాన్మెంటల్ ట్రస్టుకు నేతృత్వం వహిస్తున్నారు. బెంగళూరులో పది లక్షల బావులు తవ్వే కార్యక్రమాన్ని ఈ ట్రస్టే చేపట్టింది.

వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా రాబోయే ఏళ్లలో నగరంలో నీటి కటకట మరింత దారుణంగా మారొచ్చని అంచనాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

కొన్నేళ్ల క్రితం వరకూ దాదాపు నాలుగు కి.మీ.ల దూరంలోని ఇబ్లూర్, బెల్లందూర్‌ల నుంచి రేణుక హైస్కూల్‌కు ట్యాంకర్లలో నీళ్లు వచ్చేవి. వారానికి ఒకసారో, రెండు సార్లో వెయ్యి లీటర్ల నీటిని బోరు బావుల నుంచి అవి తీసుకువచ్చేవి.

నీటి నాణ్యత గురించి స్కూల్ ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉండేది. బెంగళూరు అర్బన్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమయ్యాయి. స్థానికంగా ఉన్న కైకొండ్రహలి చెరువు కూడా కలుషితమైంది.

ఇక రేణుక స్కూల్ ముందు ఒకటే ప్రత్యామ్నాయం మిగిలింది. అదే సంప్రదాయ పద్ధతిలో బావి తవ్వించడం. ఇందుకోసం బావులను తవ్వే 'మన్నువడ్డర'లకు స్కూల్ కబురు పెట్టింది. 14 అడుగుల లోతుతో బావిని తవ్వించింది. 2013లో ఈ పనిని మొదలుపెట్టారు.

బావులను తవ్వడం, వాటిని బాగు చేయడం చాలా నైపుణ్యాలు అవసరమయ్యే వృత్తి. ప్రమాదాలతో కూడుకున్న పని కూడా. మన్ను వడ్డరలు తరతరాలుగా ఈ పనిచేస్తూ వస్తున్నారు. చిన్నపాటి పనిముట్లతోనే బావులు తవ్వడం ఎలాగో వారికి బాగా తెలుసు.

బోరు బావుల్లా సంప్రదాయ బావులు భూగర్భ జలాలకు నష్టం కలిగించవు. పైన తెరుచుకుని, తక్కువ లోతు ఉండటంతో వర్షాలు పడ్డప్పడు ఇవి భూగర్భ జలాలు ఇంకా పోగయ్యేలా చేస్తాయి.

ఫొటో సోర్స్, Vishwanath Srikantaiah

అనుకున్నట్లుగా ఒకవేళ మన్ను వడ్డరలు పది లక్షల బావులు తవ్వగలిగితే, వర్షం నీటిలో 50 నుంచి 60 శాతం వరకూ ఇంకేలా చేయొచ్చని, నగరంలో వరదలను అరికట్టవచ్చని విశ్వనాథ్ శ్రీకాంతయ్య అంటున్నారు.

ప్రకృతిసిద్ధమైన అంశాల ఆధారంగా భారతీయ వాస్తు శాస్త్రంలో ఉన్న విషయాలు, హైడ్రోజియోలజిస్ట్ సూచనల ప్రకారం ఈ బావులను ఎక్కడ తవ్వాలనేది నిర్ణయిస్తారు.

గంగమ్మ దేవతకు పూజ చేసి తవ్వకం ప్రారంభిస్తారు.

మన్ను వడ్డరల్లో ఒకరు తవ్వే పని చేస్తారు. మిగతా వాళ్లు తట్టలతో మట్టిని తీస్తారు. మట్టి వదులుగా ఉంటే, బావి గోడలు కూలిపోకుండా, ముందుగానే అచ్చు వేసుకున్న ఓ లోహపు జాలిని పెడతారు. ఆ తర్వాత జాలిని తీసి, సిమెంటు రింగులు పెడతారు.

అడుగున మట్టి మెత్తగా మారి, నీటి సంకేతాలు కనిపిస్తే మన్ను వడ్డరల పని దగ్గరపడినట్లే. పది నుంచి వంద అడుగుల లోతులో ఉంటే నీటి ఊటను చేరుకోగానే, బావిలోకి నీళ్లు రావడం మొదలవుతంది. వాళ్లు, అలాగే మరో 8 నుంచి 10 అడుగుల లోతు తవ్వుతారు. అది చాలా కష్టమైన పని.

బావి లోపల చుట్టూ మట్టి కూలిపోకుండా ఇదివరకు రాళ్లు పెట్టేవారు. ఇప్పుడు సిమెంట్ రింగ్‌లు పెడుతున్నారు. రాళ్ల మధ్యలో ఉండే సందు ద్వారా బావిలోకి నీరు ఊరేది. ఇప్పుడు సిమెంట్ రింగ్‌లకు కూడా అలాగే నాలుగు ఇంచుల వెడెల్పుతో ఉండేలా రంధ్రాలు చేస్తున్నరు.

40 అడుగల లోతు బావిని తవ్వడానికి ఏడు, ఎనిమిది మంది ఉన్న మన్ను వడ్డరల బృందానికి మూడు రోజులు పడుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసే ఇలా బృందంగా ఏర్పడతారు. కష్టాన్ని, సంపాదనను సమంగా పంచుకుంటారు.

లోతును బట్టి ఒక్కో బావికి 30 వేల నుంచి 1.5 లక్షల రూపాయల దాకా డబ్బు వస్తుంది. సగటున రోజుకు ఒక్కొక్కరూ 1,200 రూపాయల దాకా సంపాదిస్తారు. భారత్‌లోని నగరాల్లో ఓ పురుషుడి సగటు సంపాదన కన్నా ఇది రెండు రెట్లు పైనే ఉంది.

''నేను తవ్విన ప్రతి బావీలో నీళ్లు పడతాయని హామీ ఇవ్వగలను. నీళ్లు పడితేనే డబ్బులు తీసుకుంటా. పడని సందర్భం ఒక్కటి కూడా లేదు'' అని ఎల్లమ్మపాల్యకు చెందిన పెద్దన్న అన్నారు. బెంగళూరు శివారు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 75 మన్ను వడ్డర కుటుంబాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP

లక్ష్యం పది లక్షల బావులు

రేణుక హై స్కూల్‌లో బావి తవ్విన తర్వాత రోజూ రెండు విడతలుగా మొత్తం వెయ్యి లీటర్ల నీటిని తోడుతున్నారు. స్కూల్‌లోని టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు, తోట అవసరాలకు ఇది సరిపోతోంది. నీటిని తోడిన రెండు మూడు గంటల్లో మళ్లీ కావాల్సినంత నీరు ఊరుతోంది. పక్కనే ఉన్న చెరువు నుంచి ఊట వస్తోంది. కలుషితమైన ఈ చెరువును 2009లో శుభ్రం చేశారు.

ఇటు స్కూల్ మీద కురిసే వాన నీరంతా బావిలోకి చేరే ఏర్పాటు కూడా చేశారు. కాలాన్ని బట్టి బావిలో నీటి మట్టం మారుతోంది.

బయోమీ ఎన్విరాన్మెంటల్ ట్రస్టు సహకారంతో సుస్థిర నీటి వనరుల వినియోగ పద్ధతుల వైపు చాలా మంది మళ్లుతున్నారు. వారిలో రేణుక హైస్కూల్ కూడా ఒకటి.

బెంగళూరులో ఇప్పటికే పాత తరం బావులు పది వేల దాకా ఉన్నాయని విశ్వనాథ్ శ్రీకాంతయ్య చెప్పారు. అయితే, పది లక్షల బావుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందని అన్నారు.

''మన్ను వడ్డరల సాయంతో నగరంలో పది లక్షల బావులను తవ్వగలిగితే, మనం వాన నీటిలో 50-60 శాతం ఒడిసిపట్టుకోవచ్చు. నగరంలో వరదలను నివారించవచ్చు. రోజూ భూగర్భంలోని ఊటల్లోకి 140 కోట్ల లీటర్ల నీరు చేరుతుంది'' అని ఆయన వివరించారు.

‘‘మన్ను వడ్డరల శ్రమతోపాటు జ్ఞానం, నైపుణ్యాలు కూడా ఇందుకు ఎంతో అవసరం. ఆగ్నేయ బెంగళూరులో భూగర్భ జలాల మ్యాపింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడి భూ లక్షణాల గురించి మన్ను వడ్డరలకు ఎంతో పట్టు ఉన్న విషయాన్ని మేం గుర్తించాం'' అని బయోమీ ఎన్విరాన్మెంటల్ ట్రస్టు సలహాదారు శుభా రామచంద్రన్ అన్నారు.

నగర అవసరాలకు నది నుంచి నీటిని తీసుకురావడంతో పోలిస్తే, బావుల్లో నుంచి నీటిని తీసేందుకు అయ్యే ఖర్చు ఒక శాతం కూడా ఉండదు.

బెంగళూరులో సంప్రదాయ బావుల వాడకం పెరగడానికి మన్ను వడ్డరలు చాలా కీలకం. ఇప్పుడు వారి పనికి డిమాండ్ కూడా పెరుగుతోంది.

''బెంగళూరు నీటి కష్టాలకు మన్ను వడ్డరలు పరిష్కారం చూపగలరు. వాళ్ల సాయంతో నగరం నేల అడుగునే ఓ నదిని మనం సృష్టించవచ్చు'' అని విశ్వనాథ్ శ్రీకాంతయ్య అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)