డోనల్డ్ ట్రంప్: ‘నా ఆరోగ్యం చాలా బాగుంది.. రేపు ఎన్నికల ర్యాలీలో పాల్గొంటా’ - BBC Newsreel

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కోవిడ్-19 చికిత్స పూర్తయిందని, ఈ వారాంతం నుంచి ఆయన ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఆయన వైద్యుడు తెలిపారు.

''మందులకు ట్రంప్ శరీరం చక్కగా స్పందిస్తోంది. ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉంది''అని డాక్టర్ సీన్ కాన్లీ తెలిపారు.

శుక్రవారం నాడు మరోసారి కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటానని ట్రంప్ చెప్పారు. ఈ వారాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొంటానని ఆయన వివరించారు.

డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌తో గురువారం జరగాల్సిన టీవీ సంవాదం నుంచి ట్రంప్ తప్పుకున్న సంగతి తెలిసిందే.

ట్రంప్‌కు కోవిడ్-19 సోకడంతో వర్చువల్‌గా సంవాదం నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు. అయితే వర్చువల్ సంవాదం కోసం తన సమయం వృథా చేసుకోనని ట్రంప్ అన్నారు.

మరోవైపు గురువారం సాయంత్రం ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడారు. తన ఆరోగ్యం ఇప్పుడు చాలా బావుందని, ఫ్లోరిడాలో శనివారం జరగబోయే బహిరంగ సభలో ప్రసంగిస్తానని ఆయన అన్నారు.

ఇంటర్వ్యూ మధ్యలో ఆయన కొంచెం దగ్గుతూ కనిపించారు. ఒక సమయంలో ఆయన మైక్‌ను మ్యూట్ చేశారు. గొంతు సమస్యను సరిచేసుకొని మళ్లీ మాట్లాడారు.

యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి

ఫొటో సోర్స్, Reuters

ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి 2020వ సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆకలిపై పోరాడుతున్నందుకు ఈ బహుమతి దక్కింది.

యుద్ధం, అంతర్గతపోరుకు ఆకలిని ఆయుధంగా చేసుకోకుండా ప్రపంచ ఆహార కార్యక్రమం అడ్డుకుందని నార్వేకు చెందిన నోబుల్ కమిటీ అభిప్రాయపడింది.

ఈ బహుమతితో పాటు కోటి స్వీడిష్ క్రోనాలు (సుమారు రూ.8 కోట్లు) నగదు పురస్కారం కూడా లభిస్తుంది.

ఓస్లో నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో నార్వే నోబెల్ ఇన్‌స్టిస్ట్యూట్ 101వ నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించింది.

ఈ పురస్కారం తమకు గర్వకారణం అని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పీ) స్పందించింది.

88 దేశాల్లో ప్రతి ఏటా 9.70 కోట్ల మందికి డబ్ల్యుఎఫ్‌పీ ఆహారాన్ని అందిస్తోందని అంచనా.

గతేదాడి నోబెల్ శాంతి బహుమతి ఆఫ్రికా దేశమైన ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్‌కు దక్కింది.

1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధం తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు రెండు దేశాల మధ్య కొనసాగిన సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ, ఎరిట్రియాతో ఇథియోపియా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

వీడియో క్యాప్షన్,

నోబెల్ ఎవరు? ఈ పురస్కారాలు ఎందుకు?

ఫొటో సోర్స్, RAVI PRAKASH/ BBC

భీమా కోరెగావ్ కేసులో స్టెన్ స్వామి అరెస్ట్.. యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు

ప్రముఖ సామాజిక కార్యకర్త ఫాదర్ స్టెన్ స్వామిని రాంచీలో అరెస్ట్ చేశారు. ముంబయి నుంచి వచ్చిన ఒక ఎన్ఐఏ బృందం గురువారం రాత్రి ఆయన్ను అరెస్ట్ చేసింది.

'బగైచా'లోని ఆఫీసులో ఉన్నప్పుడు 83 ఏళ్ల స్టెన్ స్వామిని అరెస్ట్ చేశారు. ఆయన తన కార్యాలయంలోనే ఒక గదిలో ఒంటరిగా ఉంటున్నారు.

భీమా కోరెగావ్ ఘటనలో ప్రమేయం ఉందని స్వామిపై ఆరోపణలు చేశారు. ఎన్ఐఏ ఆయనపై యూఏపీఏ సెక్షన్లు నమోదు చేసింది.

గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న స్టెన్ స్వామిపై యూఏపీఏతో పాటు ఐపీసీలోని చాలా తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు.

ఎన్ఐఏ ఈ అరెస్టు గురించి మీడియాకు బహిరంగపరచలేదు. కానీ స్టెన్ స్వామిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ కదమ్ ధ్రువీకరించిన అధికారిక మెమో బీబీసీ దగ్గర ఉంది.

దాని ఒక కాపీని స్టెన్ స్వామికి కూడా ఇచ్చారు. ఆయన సహోద్యోగి పీటర్ మార్టిన్ కూడా ఈ విషయాన్ని బీబీసీకి ధ్రువీకరించారు.

ఎన్ఐఏ అధికారులు మాతో ఆయన బట్టలు, సామాన్లు తీసుకురమ్మని చెప్పారు. ఆ సామాన్లన్నీ రాత్రే చేర్చాలని వారు తమకు సూచించారని పీటర్ చెప్పారు.

"ఎన్ఐఏ ఆయన్ను రాంచీ కోర్టులో ప్రవేశపెడుతుందా లేక నేరుగా ముంబయి తీసుకెళ్తుందా అనేది ఇప్పటివరకూ చెప్పలేదు. మాకు దాని గురించే ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఫాదర్ స్టెన్ స్వామి వయసు పైబడింది, ఆయన అనారోగ్యంగా కూడా ఉంటున్నారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

హాథ్‌రస్ వెళ్లే దారిలో కేరళ జర్నలిస్ట్ అరెస్ట్.. సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

ఉత్తరప్రదేశ్‌లో మలయాళ వార్తా సంస్థ అజిముఖం జర్నలిస్టు సిద్దీక్ కప్పన్ అరెస్టుపై కేరళ జర్నలిస్టుల సంఘం సుప్రీంకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది.

ఆయన అరెస్టు చట్టవిరుద్ధం అని, కప్పన్‌ను వెంటనే సుప్రీంకోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఈ పిటిషన్‌లో కోరారు.

సిద్దీక్ కప్పన్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అక్టోబర్ 5వ తేదీన మధుర టోల్ ప్లాజా దగ్గర అరెస్టు చేశారు.

ఆ సమయంలో ఆయన మరో ముగ్గురితో కలిసి.. యూపీలోని హాథ్‌రస్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైనట్లు చెబుతున్న దళిత బాలిక గ్రామానికి వెళ్తున్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన లాయర్ విలిస్ మాథ్యూ బీబీసీతో మాట్లాడుతూ తన పిటిషన్ శుక్రవారం కోర్టులో విచారణకు వస్తుందని చెప్పారు.

స్వతంత్ర మీడియా ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని, పోలీసులు కప్పన్‌ను ఇలా అరెస్టు చేయడం రాజ్యాంగంలోని సెక్షన్ 14ను ఉల్లంఘించినట్లేనని మాథ్యూ అన్నారు.

ఫొటో సోర్స్, BCCI/IPL

IPL 2020: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం

దుబాయిలో జరుగుతున్న ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను 69 పరుగులతో ఓడించింది. పంజాబ్ 17 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

రెండో ఓవర్లోనే ఓపెనర్ మయాంగ్ అగర్వాల్‌(9)ను హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్ చేశాడు.

ప్రభ్ సిమ్రన్ సింగ్(11), కేఎల్ రాహుల్(11) కూడా తక్కువ పరుగులకే అవుట్ అవడంతో పంజాబ్ కష్టాల్లో పడిపోయింది.

తర్వాత నికొలస్ పూరన్ చెలరేగిపోయాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. స్కోరును కాసేపు పరుగులెత్తించాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL

మాక్స్ వెల్‌తో కలిసి స్కోరును వంద దాటించిన పూరన్.. జట్టు స్కోరు 126 పరుగుల దగ్గర ఉన్నప్పుడు 15వ ఓవర్లో అవుట్ అయ్యాడు.

17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూరన్ మొత్తం 37 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి.

ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడిపోవడంతో పంజాబ్ వరసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది.

చివరి ముగ్గురు బ్యాట్స్ మెన్లు(మహమ్మద్ షమీ, షెల్డన్ కోట్రెల్, అర్షదీప్ సింగ్) సున్నా పరుగులకే అవుట్ అయ్యారు.

హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్‌ 3, ఖలీల్ అహ్మద్, తంగరసు నటరాజన్ చెరి రెండు, అభిషేక్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

ఫొటో సోర్స్, BCCI/IPL

జానీ బెయిర్ స్టో సెంచరీ మిస్

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.

ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో దూకుడుగా ఆడి జట్టుకు మంచి ఆరంభం అందించారు.

కానీ రవి బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్లో జట్టు స్కోరు 160 పరుగులు ఉన్నప్పుడు ఇద్దరూ అవుట్ అయ్యారు.

16వ ఓవర్ మొదటి బంతికి అవుటైన కెప్టెన్ డేవిడ్ 40 బంతుల్లో 52 పరుగులు చేశాడు.

అదే ఓవర్ నాలుగో బంతికి అవుటైన జానీ బెయిర్ స్టో సెంచరీ మిస్ అయ్యాడు. 55 బంతులు ఆడి ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 97 పరుగులు చేశాడు.

అబ్దుల్ సమద్(8), మనీష్ పాండే(1), ప్రియం గార్గ్(0) పెద్దగా పరుగులు చేయకపోయినా కేన్ విలియమ్సన్(20) జట్టు స్కోరును 200 దాటించి నాటౌట్‌గా నిలిచాడు.

పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్‌కు 3, అర్షదీప్ సింగ్‌కు 2, మహమ్మద్ షమీకి ఒక వికెట్ దక్కాయి.

సన్ రైజర్స్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మాన్ ఆఫ్ ది మాచ్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)