రైతుల ఆందోళనలు: సుప్రీం కోర్టు పార్లమెంటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందా?
- కీర్తి దూబే
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, SANJEEV VERMA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
"వ్యవసాయ బిల్లుల గురించి రైతుల వాదనలు, ప్రభుత్వం ఉద్దేశాలు కూడా కమిటీ వింటుంది. అనంతరం తమ సూచనలను జోడిస్తూ కమిటీ ఒక నివేదిక తయారుచేస్తుంది. ఈ నివేదికను రెండు నెలల్లో కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది" అంటూ మంగళవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
11 పేజీల ఆదేశ పత్రంలో నలుగు సభ్యుల కమిటీ కార్యాచరణ వివరాలను స్పష్టం చేసింది. సోమవారం, మంగళవారం జరిగిన విచారణ తరువాత సుప్రీం కోర్టు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించింది.
ఈ పరిణామాల తరువాత...శాసన సభకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న గీతను సుప్రీం కోర్టు చెరిపేసిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
నిపుణులు ఏమంటున్నారు?
"ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై సవాలు ఎదురైనప్పుడు.. ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా రూపొందించినవేనా కాదా అనే అంశాన్ని సుప్రీం కోర్టు పరిశీలిస్తుంది. ఒకవేళ ఆ చట్టాలు రాజ్యాంగ నిబంధనలను అనుసరించి రూపొందించకపోతే వాటిని రద్దు చేసే హక్కు సుప్రీం కోర్టుకు ఉంటుంది" అని భారత మాజీ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ తెలిపారు.
"రెండో విషయం ఏమిటంటే..ఒకవేళ రాజ్యాంగబద్ధమైన సవాలు తలెత్తితే, అప్పుడు అది ప్రజా చట్టం (పబ్లిక్ లా) కిందకు వస్తుంది. ఇందులో మధ్యవర్తిత్వానికి తావు లేదు. ఇది ప్రజల హక్కులకు సంబంధించిన విషయం అయినప్పుడు మధ్యవర్తుల జోక్యం ఎందుకు ఉండాలి? ప్రస్తుత వివాదంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాలన్నా కూడా ఇరు పక్షాలూ దానికి సమ్మతించాలి. కానీ అలా జరగలేదు" అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Reuters
రైతు సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ, ఆర్థిక నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. భూపిందర్ సింగ్ మాన్, అనిల్ ఘన్వత్, అశోక్ గులాటి, డా. ప్రమోద్ కుమార్ జోషి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఈ నలుగురు సభ్యులు కూడా ఇంతకుముందు తమ రాతల ద్వారా, ప్రకటనల ద్వారా కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. కోర్టు వీరి పేర్లను ప్రటించినప్పటినుంచీ వీరిని ఎన్నుకోవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి.
"ఈ కమిటీ సభ్యులు అందరూ బహిరంగంగా వ్యవసాయ బిల్లులకు మద్దతు పలికారు. అలాంటప్పుడు వీరు నిష్పక్షపాతంగా సమస్యను అంచనా వేయగలారా అనేది పెద్ద ప్రశ్న" అని పరాశరన్ అభిప్రాయపడ్డారు.
"పార్లమెంట్ వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. అవి రాజ్యంగ నిబంధనలకు లోబడి ఉన్నాయో లేదో నిర్థారించే హక్కు కోర్టుకు ఉంది. దీనికోసం ఒక కమిటీ వేయడం అనేది మరొక సమాంతర పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. ఆ చట్టాలు ప్రజలకు మేలు చేస్తాయా లేదా అనేది మరో పార్లమెంటరీ కమిటీ అంచనా వేయనుంది. ఇలాంటి పని సుప్రీం కోర్టు చేయకూడదు. నా అవగాహనలో సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం అనేది ఒక అసాధారణమైన విషయం. మామూలుగా కోర్టు అలా చేయదు. ఈ చట్టాల వల్ల ప్రభావితం అయ్యేవారు కూడా దీనికి సమ్మతి తెలుపలేదు. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది" అని పరాశరన్ తెలిపారు.
పరాశరన్ దీన్ని "ఎక్సెస్ జ్యుడీషియల్ యాక్టివిజం” (మితిమీరిన న్యాయవ్యవస్థ క్రియాశీలత)గా అభివర్ణించారు.
"ఇది పార్లమెంటరీ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం. అందువల్లే కోర్టు తన అధికార పరిధిని దాటుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిరసన ప్రదర్శనలు మొదటి రోజే ఆగిపోవాలని సుప్రీం కోర్టు కోరుకుంది. ప్రభుత్వ చర్యలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, దానర్థం పార్లెమెంట్ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవచ్చని కాదు" అని పరాశరన్ అన్నారు.
అయితే, ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ ఫైజానా ముస్తఫా ఈ అంశంలో భిన్నభిప్రాయం వ్యక్తం చేశారు.
పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని, సాంకేంతిక అంశాలు ప్రస్తావించి కోర్టు చర్యను తప్పు పట్టకూడదని ప్రొఫెసర్ ముస్తఫా అభిప్రాయపడ్డారు.
"ఈ సమయంలో రాజ్యాంగ నిబంధనల మీద కాకుండా ఈ సమస్యకు పరిష్కారం సూచించడం మీదే ఎకువ దృష్టి పెడుతున్నాం అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఆ దిశగా కోర్టు నిర్ణయాలు తీసుకుంటోంది. టెక్నికల్‌గా చూస్తే ఇది ఒక రాజకీయ సమస్య. ఈ చట్టాలు మంచివా కావా అనేది ఒక రాజకీయ నిర్ణయం. ఇది కోర్టు పరిధిలోకి రాదు" అని ముస్తఫా అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోదనే ఆరోపణలు
కోర్టు ఆదేశాలను పార్లమెంటు వ్యవహారాలలో జోక్యంగా పరిగణించకూడదా?
ప్రొఫెసర్ ముస్తఫా ఈ ప్రశ్నకు జవాబిస్తూ "దీనికి సంబంధించిన ఒక సిద్ధాంతం ఉంది. దాన్ని ‘పొలిటికల్ థికెట్’ అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వ పాలసీల విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు.
అయితే, సుప్రీం కోర్టు అనేది దేశంలోని అత్యున్నత న్యాయస్థానం. ఏ అంశంలోనైనా సరే పూర్తి న్యాయం సాధించే దిశగా కోర్టు ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకోవచ్చు. ముందు ఈ ఆందోళనలు నిలిచిపోతే చాలు...తరువాత రాజ్యాంగ నిబంధనల గురించి ఆలోచించవచ్చు అని కోర్టు అనుకుని ఉంటుంది" అని అన్నారు.
కేంద్రం కోరుకున్నదే సుప్రీం కోర్టు చేసిందా?
"చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే సుప్రీం కోర్టు ఒక పరిష్కారం చూపించగలదని ప్రభుత్వం మీడియా ద్వారా తెలియజేసింది" అని ప్రొ. ముస్తఫా తెలిపారు.
"రైతుల ఉద్యమాన్ని ఎలా ఆపాలా అన్నదే కోర్టు ఆలోచిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదని కోర్టు కోరుకుంటోంది. అందుకే ముందు ఉద్యమాన్ని ఆపగలిగితే తరువాత రాజ్యంగ నిబంధనల గురించి ఆలోచించవచ్చని కోర్టు భావిస్తోంది. కోర్టు తరచూ ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది” అని ప్రొ. ముస్తఫా తెలిపారు.
ఫొటో సోర్స్, PANKAJ NANGIA/ANADOLU AGENCY VIA GETTY IMAGES
వ్యవసాయ చట్టాన్ని రాజ్యసభలో పాస్ చెయ్యనే లేదు
14, 15వ లోక్‌సభ ప్రధాన కార్యదర్శి, పాలసీ నిపుణులు అయిన పీడీ తంగప్పన్ ఆచార్య మాట్లాడుతూ, " ఈ బిల్లులను రాజ్యసభలో పాస్ చెయ్యనే లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 ప్రకారం ఎలాంటి చట్టాలనైనా సరే సభలో మెజారిటీ ఓటింగ్ ఆధారంగా ఆమోదించాల్సి ఉంటుంది . మెజారిటీ అంటే ఏంటి? ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కబెట్టకుండా మెజారిటీ అని చెలా చెప్తాం? రాజ్యసభలో వాయిస్ ఓటింగ్ ద్వారా బిల్ ఆమోదించారు. వాయిస్ ఓటింగ్‌లో మెజారిటీ సంఖ్యను ఎలా లెక్కిస్తాం? ఈ ప్రాతిపదికన ఈ చట్టాన్ని పాస్ చేయడం తప్పు. కానీ కోర్టు ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావనా తీసుకు రాలేదు" అని అన్నారు.
"ప్రభుత్వం, రైతులు చర్చలు జరుపుతున్నారు. కోర్టు కొత్తగా కమిటీ వేసింది. ఈ కొత్త కమిటీ వల్ల మరింత గందరగోళం ఏర్పడే అవకాశమే కనిపిస్తోంది. దీనివల్ల సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు నాకైతే కనిపించట్లేదు" అని తంగప్పన్ చెప్పారు.
కోర్టు తన నిర్ణయంలోని పలు విషయాలకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదని తంగప్పన్ అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, Reuters
"కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రైతులతోనూ, ప్రభుత్వంతోనూ మాట్లాడుతుందని చెప్పారు. ఏ ఆధారంగా ఈ కమిటీని నిర్ణయించారన్నది చెప్పలేదు. రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసిన సభ్యుల కమిటీ రైతులతో ఏం మాట్లాడుతుంది? ఏ ప్రాతిపదికన ఈ నలుగురినీ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారో చెప్పలేదు. చూస్తుంటే ప్రభుత్వమే ఈ నలుగురి పేర్లనూ కోర్టుకు సూచించిందేమో అనిపిస్తోంది" అని ఆయన అన్నారు.
ఈ కమిటీ ఇరు పక్షాలతోనూ చర్చ జరిపి, తమ సూచనలను కూడా జత చూస్తూ కోర్టుకు నివేదిక సమర్పిస్తుందనే అనుకుందాం. అయితే ఆ నివేదిక ఆధారంగా ఈ చట్టాల రాజ్యాంగబద్ధతను కోర్టు నిర్ణయిస్తుందా? ఈ కమిటీ సూచనలతో ఏమి చేస్తారో కోర్టు స్పష్టంగా చెప్పలేదు.
ఇన్నాళ్లూ ప్రభుత్వం చేసిన పనినే పార్లమెంట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఇప్పుడు కోర్టు చేస్తోంది. సాధారణంగా చర్చలు జరిపే పని ప్రభుత్వం చేస్తుంది.
ఎలాంటి విషయంలోనైనా కోర్టు ముందుగా ఇరు పక్షాల వాదనను వింటుంది. ఆ తరువాత స్టే విధిస్తుంది. ఇప్పుడేమో ఏ వాదనలూ వినకుండానే వ్యవసాయ చట్టాలపై స్టే విధించింది. ఇది చాలా అసాధారణమైన విషయం" అని తంగప్పన్ ఆచార్య అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- ISWOTY: ఒలింపిక్స్ పతకంపై ఆశలు చిగురింపజేస్తున్న ఈ యువ షూటర్ మీకు తెలుసా?
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- దేశ విభజన సమయంలో కరాచీలో హిందువులను, సిక్కులను ఎలా ఊచకోత కోశారు.. ఆస్తులను ఎలా లూటీ చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)