హైదరాబాద్ నిజాం మనుమడు నజఫ్ అలీ ఖాన్: 'మా బాకీ మాకు ఇప్పించండి' అంటూ కేంద్రానికి లేఖ - Press Review

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

చివ‌రి నిజాం న‌వాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మ‌న‌ుమడు న‌జ‌ఫ్ అలీ ఖాన్‌.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. నిజాం జువెల‌రీ ట్ర‌స్ట్ ఆదాయ‌, సంప‌ద ప‌న్నుకు సంబంధించిన వివాదం 26 ఏళ్లుగా ఆదాయ ప‌న్ను శాఖ ద‌గ్గ‌ర పెండింగ్‌లో ఉన్న‌ద‌ని, దీనిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆ లేఖ‌లో ఆయ‌న‌ కోరారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

ఇప్ప‌టికే ఇందులోని మొత్తం 114 ల‌బ్ధిదారుల్లో 39 మంది చ‌నిపోయార‌ని, మిగిలిన వాళ్ల‌లో చాలా మంది ఆరోగ్య, ఆర్థిక స‌మస్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని ఆ లేఖ‌లో న‌జ‌ఫ్ అలీ ఖాన్ చెప్పారు.

ఈ వివాదం ఎక్క‌డ మొద‌లైందో న‌జ‌ఫ్ ఆ లేఖ‌లో వివ‌రించారు. దాని ప్ర‌కారం.. 1950ల‌లో చివ‌రి నిజాం కొన్ని ట్రస్ట్‌ల‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక‌టి నిజాం జువెల‌రీ ట్ర‌స్ట్‌. ఇందులోని న‌గ‌ల‌ను అమ్ముకోవ‌డానికి ట్ర‌స్టీలైన ప్రిన్స్ ముఫ‌ఖ‌ంజా, ప్ర‌భుత్వం నామినేట్ చేసిన అధికారికి అధికారం క‌ట్ట‌బెట్టారు. 1995లో ఈ న‌గ‌ల‌ను రూ. 206 కోట్ల‌కు కొన‌డానికి ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ మొత్తాన్ని నిజాం కుటుంబానికి చెందిన‌ 114 మంది ల‌బ్ధిదారుల‌కు స‌మానంగా పంచారు. అయితే, న‌గ‌ల‌ను అప్ప‌గించే స‌మ‌యంలో ఆదాయ పన్ను శాఖ త‌మ‌కు రూ. 30.50 కోట్ల 'ఆదాయ‌, సంప‌ద ప‌న్ను' బాకీ చెల్లించాల్సి ఉందని చెప్పింది. ఆ మొత్తాన్ని ఆ రూ. 206 కోట్ల నుంచే చెల్లించారు.

ఈ మొత్తంలో రూ.15.45 కోట్ల‌ను బ‌కాయిల కోసం చెల్లించ‌గా.. వీటిలో చాలా వ‌ర‌కు రీఫండ్స్ రూపంలో వెన‌క్కి వ‌చ్చింది. కానీ, ఈ మొత్తాన్ని త‌ప్పుడు అకౌంట్ల‌లో వేశారు. ఇంకా రూ.14.05 కోట్ల‌ను భ‌విష్య‌త్తులో ప‌న్ను చెల్లించ‌డం కోసం అప్ప‌టి ఎస్‌బీహెచ్‌లో (ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జ‌మ చేసిన‌ట్లు ఆ లేఖలో న‌జ‌ఫ్ వెల్ల‌డించారు.

ఆ బ‌కాయిలు, రీఫండ్స్‌కు సంబంధించిన వివాదం ఇంకా కొన‌సాగుతోంది. ఆ రీఫండ్‌తోపాటు బ్యాంక్‌లో ఉంచిన రూ.14.05 కోట్లు కూడా నిజాం కుటుంబ ల‌బ్ధిదారుల‌కు పంచాల్సి ఉన్నా.. ఆదాయ పన్ను శాఖ మాత్రం పంచ‌డం లేదని న‌జ‌ఫ్ తెలిపారు. తాము క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌న్నులు చెల్లిస్తున్నా కూడా ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఇంకా రూ. 8.54 కోట్ల ప‌న్ను బాకీ ఉన్న‌ట్లుగా చెబుతున్న‌ద‌ని, ఇన్నేళ్లుగా ప‌రిష్కారానికి నోచుకోని ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని న‌జ‌ఫ్ ఆ లేఖ‌లో కోరారంటూ ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

'బిట్ కాయిన్ ఓ నీటి బుడగ' -ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

ఇటీవల దూసుకుపోతున్న బిట్ కాయిన్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరగడాన్ని ఆయన బుడగతో పోల్చారని ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణ అని అన్నారు.

ఓ జాతీయ ఛానెల్‌కు బుధవారం నాడు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి. గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ నేడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది. వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే. కానీ, బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు కాబట్టే బిట్ కాయిన్‌‌పై ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. ఈ వైఖరి ఓ బుడగ లాంటిది’ అని ఆయన వ్యాఖ్యానించారంటూ ఈ వార్తలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ వ్యాక్సీన్‌కు అంగీకార పత్రం తప్పనిసరి

భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసిందని సాక్షి ఒక కథనంలో తెలిపింది.

ఆ పత్రంపై సంతకం చేసిన వారికే టీకా వేస్తారని పేర్కొంది. కోవాగ్జిన్‌ ట్రయల్స్‌ పూర్తి కానందున అంగీకారపత్రం (కన్సెంట్‌) అడుగుతున్నారని తాము భావిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రం ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ భారత్‌ బయోటెక్‌ సంస్థ లబ్ధిదారుల నుంచి అంగీకారపత్రం తీసుకోవాలని కోరిన అంశంపై చర్చ జరిగిందని ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు.

అయితే, అంగీకారపత్రంలో ఎటువంటి అంశాలుంటాయో ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. సాధారణంగా ట్రయల్స్‌లో ఉన్నవాటి విషయంలో మాత్రమే అంగీకారపత్రం తీసుకుంటారని, అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న ఆక్స్‌ఫర్డ్‌ కోవిషీల్డ్‌ టీకాకు ఎలాంటి అంగీకారపత్రం అడగడం లేదని ఆయన తెలిపారు.

తెలంగాణకు 20 వేల డోసుల కోవాగ్జిన్‌ టీకాలు బుధవారం వచ్చి నట్లు ఆయన ధ్రువీకరించారు. వాటిని హైదరాబాద్‌ స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే, అంగీకారపత్రంపై సంతకం చేస్తూ టీకా తీసుకునే వారు ఎవరు ఉంటారన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోందంటూ ఈ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)