ఆంధ్రప్రదేశ్: పందెం కోళ్లు దొంగిలించారని దళిత యువకులను చెట్టుకు కట్టి కొట్టారు

  • శంకర్.వి
  • బీబీసీ కోసం
చెట్టుకు బందీ అయిన యువకులు

పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్లు దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారని పోలీసులు చెప్పారు.

చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని టి.నరసాపురం మండలం జగ్గవరంలో ఇది జరిగింది.

సంక్రాంతి సమయంలో పందాలకు సిద్ధం చేసిన పుంజులను దొంగిలించారంటూ ఇద్దరు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు.

అదే సమయంలో మరో ఇద్దరు యువకులు తప్పించుకున్నారని, అయినా వారిలో ఒకరిని ఇంటి నుంచి తీసుకొచ్చి మరీ చెట్టుకు కట్టేసి కొట్టారని స్థానికులు చెప్పారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను చింతలపూడి ఆస్పత్రికి తరలించారు.

వాట్సాప్ వీడియోలు, కొందరి ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేశామని చింతలపూడి పోలీసులు చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

ఆస్పత్రిలో బాధితులు

బంధువుల ఇంటికి వెళ్తుంటే ఆపేసి కొట్టారు

బంధంచర్ల గ్రామానికి చెందిన నలుగురు యువకులు జనవరి 18న గణపవారి గూడెం మీదుగా వెళ్తున్నప్పుడు స్థానికులు వారిని అడ్డుకున్నారని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుల్లో ఒకరైన సంతోష్ బీబీసీకి చెప్పారు.

గణపవారి గూడెంలో పెట్రోల్ పోయించుకోవడానికి షాపు దగ్గర ఆగిన తమపై దాడి జరిగిందన్నారు.

సంతోష్, మరికొందరు యువకులు రోజువారీ కూలిపనులు చేస్తుంటారు. సంక్రాంతి రోజు వారంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారు.

అయితే గణపవారి గూడెంలో పందెం కోళ్లు దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహంతో ఉన్న సమయంలో పెట్రోల్ దుకాణం వద్ద దగ్గర మొదలయిన వివాదం చివరకు యువకులను కట్టేసి కొట్టేవరకూ వెళ్లింది.

"మేం ప్రవీణ్ వాళ్ల అక్క ఇంటికి సింగగూడెం వెళుతున్నాం. నాతోపాటూ వెంకటేష్, బాలు, ప్రవీణ్ ఉన్నారు. గొర్తిపాడు దగ్గరకు వెళ్ళే సరికి బండిలో పెట్రోల్ అయిపోయింది.

షాప్ దగ్గర బాటిల్ తీసుకుని కింద పెట్టాను. వెంటనే కొందరు మా దగ్గరకి వచ్చి మీరు కోళ్ల దొంగలు. మా ఊళ్లో కోళ్లు దొంగిలిస్తున్నారు అంటూ మమ్మల్ని కొట్టారు. భయంతో నేను, బాలు పారిపోయాం.

వెంకటేష్, ప్రవీణ్‌ను వాళ్లు పట్టుకున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ చెప్పడంతో మా ఇద్దరిని కూడా మంగళవారం ఉదయం ఆ ఊరికి తీసుకెళ్లారు.

అక్కడే చెట్టుకి కట్టేసి కొట్టారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి , మేము చెప్పినట్టు చెప్పాలని ఒత్తిడి చేశారు. కోళ్లు మేమే దొంగిలించామని ఒప్పుకోవాలన్నారు" అని సంతోష్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, viral video grab

ఫొటో క్యాప్షన్,

కొడుతున్న గ్రామస్థులు

ఆధారాలు లేకుండా దాడి చేస్తారా..

పెట్రోల్ కోసం ఆగిన యువకులపై పాశవికంగా దాడి చేశారంటూ చింతలపూడికి చెందిన ఎయిమ్ నాయకుడు విల్సన్ ఆరోపించారు. ఏ ఆధారాలు లేకుండా దళిత యువకులను దొంగలని కొట్టారని ఆయన బీబీసీతో అన్నారు.

"దొంగలని ఆరోపిస్తూ చెట్టుకు కట్టి, కర్రలతో కొట్టడం దారుణం. దళితులకు స్వేచ్ఛ లేకుండా పోయిందనడానికి ఇది ఉదాహరణ. రెండు రోజుల పాటు దాడులు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదు. ఆ యువకుల ప్రాణాలకు ఏదైనా అయితే దిక్కెవరు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారిని కొట్టిన వారిని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద శిక్షించాలి" అని డిమాండ్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు

ఫిర్యాదు రాగానే స్పందించాం- పోలీసులు

దళిత యువకులను గణపవారి గూడెం దగ్గర చెట్టుకి కట్టేసి కొట్టిన విషయం తమకు వాట్సాప్ ద్వారా తెలిసిందని చింతలపూడి సీఐ మల్లేశ్వర రావు బీబీసీకి చెప్పారు. ఆ వీడియోలు కనిపించగానే బాధితులు సంతోష్, వెంకటేశ్వరరావు స్టేట్ మెంట్ రికార్డ్ చేశామని తెలిపారు.

వాళ్లు మరో ఇద్దరు స్నేహితులతో మోటార్ సైకిల్ మీద ఆ దారిలో వెళుతున్నారు. షాపు దగ్గర ఉన్న పెట్రోల్ బాటిల్ తీసి పోసుకునే సమయానికి, చెప్పకుండానే బాటిల్ తీసుకున్నారంటూ షాపులోని మహిళ గొడవ చేశారు. దాంతో ఇద్దరు పారిపోయారు. గ్రామస్తులు మిగతా ఇద్దరినీ పట్టుకున్నారు.

ఆ తర్వాత వెంకటేశ్వర రావు మేనమామ వచ్చి మాట్లాడాక అతడిని వదిలేశారు. ప్రవీణ్‌ని మాత్రం 18న రాత్రి అంజిబాబు అనే వ్యక్తి కోళ్ల ఫారంలో బంధించాడు.

19న ఉదయం సంతోష్‌ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఇద్దరినీ దారుణంగా కొట్టారు. తర్వాత చెట్టుకి కట్టేశారు. 19న సాయంత్రం వదిలేశాక వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు" అన్నారు.

బాధితుల ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామన్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా అందరినీ అరెస్ట్ చేస్తామని తెలిపారు.

ఫొటో సోర్స్, viral video grab

తక్షణం అరెస్ట్ చేయకపోతే ఆందోళన

పందెం కోళ్ల దొంగతనం పేరుతో ఇంత దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేవీపీఎస్ నేత పిల్లి రామకృష్ణ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడారు.

"దాడికి చేసిన వారిలో నలుగురిని పోలీసులు నిందితులుగా చెబుతున్నారు. కానీ ఇందులో చాలామందికి ప్రమేయం ఉంది. మొదట పెట్రోల్ దొంగతనం అని కొట్టారు. రెండోరోజు దాన్ని కోళ్ల దొంగతనంగా మార్చేశారు. ఆధారాలు లేకుండా, అనుమానంతో వైర్లు,కర్రలతో కొట్టడం అమానవీయం. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి" అన్నారు.

జిల్లాలో పందెం కోళ్ల దొంగతనాలు

సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా కోళ్ల పందాలు ఆడడం మామూలే. ఆ సమయంలో పందాల కోసం నాలుగైదు నెలల ముందు నుంచే కోడిపుంజులకు శిక్షణ ఇచ్చి బరిలో దించుతుంటారు.

అయితే ఈసారీ పందాలకు సిద్ధం చేసిన కొన్ని కోడి పుంజులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని గణపవారిగూడెం వాసులు చెప్పారు. పందెం కోళ్లకు కాపలాగా ఉండాల్సి వస్తోందని ఎం రామారావు బీబీసీతో అన్నారు.

"ఊళ్లో చాలా రోజులుగా కోడి పుంజుల దొంగతనాలు జరుగుతున్నాయి.

దాంతో కొందరు విసిగిపోయారు. కొందరు రాత్రింబవళ్లూ పొలాల్లో పుంజులకు కాపలా ఉండాల్సొచ్చింది. దాంతో, కొందరు యువకులను కొట్టారు.

ఆవేశంతో ఇలాంటి దాడులు చేయడం మా ఊళ్లో ఎప్పుడూ లేదు. కోపంగా ఉన్న కొందరు అదుపు తప్పి అలా చేసుంటారు" అన్నారు రామారావు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)