ISWOTY - శివానీ కటారియా: సమ్మర్‌ క్యాంపు నుంచి సమ్మర్ ఒలింపిక్స్‌ దాకా...

శివానీ కటారియా

2004 గ్రీస్-ఒలింపిక్స్ తర్వాత మళ్లీ 2016 రియో-ఒలింపిక్స్ వరకూ ఆ మెగా ఈవెంట్‌లో మహిళల స్విమ్మింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు.

12 ఏళ్ల విరామం తర్వాత రియోలో భారత్‌కు ఆ అవకాశం తెచ్చిపెట్టింది శివానీ కటారియానే.

టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడే అవకాశం కోసం ఇప్పుడు ఆమె థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు.

2016 దక్షిణాసియా క్రీడల్లో 200 మీటర్లు ఫ్రీస్టైల్ విభాగంలో ఆమె బంగారు పతకం గెలిచారు. ఈ విభాగంలో జాతీయ రికార్డు కూడా ఆమె పేరిట ఉంది.

స్విమ్మింగ్‌లో ఆమె ప్రయాణం హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన ఓ సమ్మర్ క్యాంపుతో మొదలైంది.

శివానీకి ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి ఆమెను ఆ సమ్మర్ క్యాంపుకు తీసుకువెళ్లారు. అప్పటికి స్విమ్మింగ్ తన కెరీర్ అవుతుందని, భారత్ తరఫున తాను ఒలింపిక్స్‌లో పోటీపడతానన్న ఊహ కూడా ఆమెకు లేదు.

గురుగ్రామ్ శివానీ స్వస్థలం. ఆమె ఇంటికి సమీపంలో ఉన్న బాబా గంగ్ నాథ్ స్విమ్మింగ్ సెంటర్‌లోనే ఆ సమ్మర్ క్యాంపు జరిగింది.

కాలక్షేపం కోసం అందులో చేరడం, శివానీ జీవితాన్ని మలుపుతిప్పింది.

నెమ్మదిగా స్థానికంగా జరిగే స్విమ్మింగ్ పోటీల్లో ఆమె పాల్గొనడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీల్లోనూ ఆమెకు పతకాలు వచ్చాయి.

దీంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. స్విమ్మింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల కోసం రోజుకు రెండు సార్లు శిక్షణ తీసుకున్నారు.

కెరీర్‌పరంగా తన వృద్ధిలో కుటుంబానిదే ముఖ్య పాత్ర అని శివానీ అంటుంటారు.

ఆర్థిక చేయూత, నైతిక స్థైర్యం అందిస్తూ శివానీకి ఆమె కుటుంబం అండగా నిలిచింది.

శివానీ సోదరుడు ఆమెతో పాటు స్విమ్మింగ్ శిక్షణ తీసుకున్నారు. సోదరుడితో పోటీపడటం తాను రోజురోజుకూ మెరుగయ్యేందుకు తోడ్పడిందని శివానీ చెబుతుంటారు.

కఠిన శ్రమకు ఫలితంగా శివానీకి జాతీయ స్థాయిలో పతకాలు రావడం మొదలైంది. తన వయసువారీ విభాగాల్లో ఆమె రికార్డులు బద్దలుకొడుతూ వచ్చారు.

జూనియర్ స్థాయిలో త్వరగా విజయవంతమవడం సీనియర్ స్థాయికి సన్నద్ధమయ్యేందుకు తనకు బాగా ఉపయోగపడిందని శివానీ చెబుతున్నారు.

క్రీడల్లో విజయవంతం అవ్వడానికి అనేక త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సామర్థ్యాలను పెంచుకునేందుకు, సవాళ్లను అధిగమించేందుకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది.

గురుగ్రామ్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఎదురైన సవాళ్లను చూసి, శివానీ ఈ పాఠం నేర్చుకున్నారు.

అప్పట్లో హరియాణాలో వేడి నీటి కొలనులు ఉండేవి కావు. దీంతో శివానీకి చలి కాలంలో శిక్షణ తీసుకునే వీలుండేది కాదు.

కఠిన శ్రమతో పెంపొందించుకున్న సామర్థ్యం కాస్త చలికాలం వల్ల వచ్చే విరామంతో పోయేది.

దీంతో ఆమె సొంత ప్రాంతాన్ని వదిలి 2013లో బెంగళూరుకు మారాల్సి వచ్చింది. ఆమె నిర్ణయం పనిచేసింది.

అదే ఏడాది ఏసియన్ ఛాంపియన్‌షిప్‌లో తన వయసు విభాగంలో శివానీ ఆరో స్థానంలో నిలిచారు. ఈ టోర్నీ అంతర్జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమయ్యేందుకు ఆమెను మానసికంగా సన్నద్ధురాలిని చేసింది.

2014 యూత్ ఒలింపిక్స్‌లో శివానీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2016లో దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచారు.

ఈ ప్రదర్శనలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రియో ఒలింపిక్స్‌లో స్థానం కోసం కృషి చేసి, సఫలీకృతురాలయ్యారు.

రియోలో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, అక్కడ నేర్చుకున్న పాఠాలు భవిష్యతు అంతర్జాతీయ పోటీలకు తనకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.

2017లో శివానీకి హరియాణా ప్రభుత్వం భీమ్ పురస్కారం ఇచ్చింది. భారత్‌కు మరిన్ని పతకాలు సాధించి, ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారం అందుకోవడం తన కల అని ఆమె అంటున్నారు.

భారత్‌లో క్రీడా వసతులు పెరిగాయని, అయితే మరింత మంది మహిళా కోచ్‌లు రావాల్సిన అవసరం ఉందని శివానీ అభిప్రాయపడ్డారు. అప్పుడే, ప్రపంచ శ్రేణి క్రీడాకారిణులు భారత్‌లో తయారవుతారని ఆమె అన్నారు.

(శివానీ కటారియా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)