వ్యవసాయ చట్టాల అమలును 18 నెలలు తాత్కాలికంగా నిలిపేస్తామన్న కేంద్రం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని రైతు సంఘాలతో చర్చల సందర్భంగా కేంద్రం ప్రతిపాదించిందని ఈనాడు పత్రిక వెల్లడించింది.
రైతులతో పదో విడత చర్చల సందర్భంగా కేంద్రం ఈ ప్రతిపాదన పెట్టిందని, ఈ మేరకు తాము సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేస్తామని తెలిపిందని ఈ కథనం వెల్లడించింది.
అయితే, కేంద్రం ప్రతిపాదనపై తాము అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిసాన్ యూనియన్ నాయకులు తెలిపారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు, స్వల్ప మార్పులు చేస్తామని ప్రభుత్వం విజ్జాన్ భవన్లో బుధవారంనాటి చర్చల సందర్భంగా తమ వైఖరులను పునరుద్ఘాటించడంతో మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది.
అయితే, కొద్ది విరామం తర్వాత తిరిగి మొదలైన చర్చల్లో అమలు వాయిదాకు ప్రతిపాదించిన కేంద్రం, ఆందోళనలను విరమించాల్సిందిగా రైతులను కోరింది. దీనిపై తమ అభిప్రాయం చెప్పే వంతు రైతు సంఘాలకు రావడంతో శుక్రవారంనాడు మరోసారి జరగబోయే చర్చల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. తదుపరి చర్చల్లో సమస్య పరిష్కారమవుతుందని ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Getty Images
బస్సు టికెట్ క్యాన్సిల్‌తో రూ.1.05 లక్షలు మాయం
సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం ఒకటి హైదరాబాద్‌లో బైటపడిందని, బస్ టికెట్ క్యాన్సిల్‌కు ప్రయత్నించగా రూ.1.05 లక్షలు కాజేశారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది రెడ్‌బస్ యాప్‌ద్వారా గుంటూరుకు బస్ టికెట్ బుక్ చేశారు. అనివార్య కారణాలతో ఆ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న ఆయన కస్టమర్ కేర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
ఆన్లైన్లో వెతకగా దొరికిన కాల్ సెంటర్ నంబర్ రెడ్బస్దే అనుకుని వారికి ఫోన్ చేశారు. అయితే, అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతుండటంతో ఆయన ఫోన్‌ను కుమారుడికి ఇచ్చి మాట్లాడించారు.
కస్టమర్ కేర్ సెంటర్ ఉద్యోగిగా చెప్పుకున్న అవతలి వ్యక్తి ఎనీడెస్క్ యాప్ (అవతలి వ్యక్తికి మన కంప్యూటర్ ఆపరేషన్ చేసేందుకు అవకాశమిచ్చేది) ఇన్స్టాల్ చేయాల్సిందిగా కోరాడు. ఆ యువకుడు యాప్‌ను ఇన్స్టాల్ చేయగా, ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు చెప్పాలని అవతలి వ్యక్తి అడిగాడు. ఓటీపీ చెప్పడం, రూ.1.05 మాయం కావడం క్షణాల్లో జరిగిపోయాయి.
ఎకౌంట్ నుంచి డబ్బు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో సదరు న్యాయవాది నమ్మలేక ఏటీఎంకు వెళ్లి చెక్ చేయడంతో అది నిజమేనని తేలింది. తన అకౌంట్ నుంచి దుండగులు డబ్బును కాజేసినట్లు గుర్తించిన న్యాయవాది హైదరాబాద్‌లోని నాంపల్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.
ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 1 నుంచి రేషన్ సరుకులు ఇంటికే వస్తాయి
ఏపీలో ఇంటికే రేషన్ సరకులు
దేశంలోనే తొలిసారి రేషన్ సరకులను ఇంటింటికి చేరవేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ప్రారంభించబోతోందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
పాదయాత్ర హామీలను నిలబెట్టుకునే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రేషన్ సరకుల డోర్ డెలివరీ వాహనాలను ఇవాళ ప్రారంభిస్తారని ఈ కథనం తెలిపింది.
ఫిబ్రవరి 1 నుంచి వీటి ద్వారా రేషన్ సరఫరా మొదలువుతుందని, ఇందుకోసం 9,260 వాహనాలను సిద్ధంచేశారని వెల్లడించింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మూడు జిల్లాలకు చెందిన 2500 వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు.
ఈ వాహనంలో తూకం వేసే యంత్రాలు, ఎల్ఈడీ ల్యాంపులు, ఈ-పాస్ యంత్రాల ఛార్జింగ్ పాయింట్లు, మిని ఫ్యాన్, మైక్, ఫస్ట్ ఎయిడ్ కిట్లాంటివి ఉంటాయి. రేషన్ సరఫరాలో ఎలాంటి అక్రమాలు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేపట్టనున్నామని ప్రభుత్వం వెల్లడించినట్లు సాక్షి కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, Reuters
వ్యాక్సీన్ తీసుకున్న మరుసటి రోజే విఠల్ రావు మరణించడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు
అది కరోనా టీకా మరణం కాదు
నిర్మల్ జిల్లాలో కరోనా టీకా తీసుకున్న ఒక రోజు తర్వాత 108 వాహనం డ్రైవర్ మృతి టీకా కారణంగా జరిగింది కాదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
మంగళవారంనాటు టీకా తీసుకున్న విఠల్ రావు పటేల్ అనే 108 పైలట్ బుధవారం నాడు ఆకస్మికంగా మృతి చెందారు. అయితే, విఠల్‌రావుకు గుండె నొప్పి వచ్చిందని, ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మార్గమధ్యంలోనే మరణించారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈ మరణానికి , టీకాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ, ఈ మృతిపై రాష్ట్ర కమిటీ సమగ్ర దర్యాప్తు జరిపి సెంట్రల్ కమిటీకి నివేదిస్తుందని .
అయితే విఠల్‌రావు కరోనా వ్యాక్సీన్ కారణంగానే మృతి చెందారని కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)