విశాఖ ఏజెన్సీ - దాయర్తి: ఆ ఊరిలో అందరూ కౌబాయ్స్‌లా గుర్రాల మీద తిరుగుతారు... ఎందుకో తెలుసా?

  • లక్కోజు శ్రీనివాస్
  • బీబీసీ కోసం
దాయర్తి

విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఓ ‘గుర్రాల గ్రామం’ ఉంది. ఆ ఊరిలో మనుషులతో సమానంగా గుర్రాలు కనిపిస్తుంటాయి. దాదాపు ఇంటికో గుర్రం ఉంటుంది.

ఇక్కడి గిరిజనుల జీవితాల్లో గుర్రాలు ఒక భాగం. కౌబోయ్ సినిమాను తలపించేలా గ్రామంలో ప్రతి ఒక్కరూ గుర్రాన్ని పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు.

ఏజెన్సీ అంటేనే కనీస సౌకర్యాలు లేక... దూరంగా విసిరేసినట్లు ఉండే గ్రామాలే అధికంగా కనిపిస్తాయి. రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. దాయర్తి కూడా అలాంటి గ్రామమే.

విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో దాయర్తి ఉంది. ఈ గ్రామం చేరుకోవాలంటే కొండదిగువ నుంచి 7 కిలోమీటర్లు రాళ్లతో నిండిన దారిలో నడుచుకుంటూ వెళ్లాలి. దాయర్తికి విద్యుత్ సౌకర్యం కూడా లేదు.

గిరిజనులు పండించే పంటలను, అటవీ ఉత్పత్తుల్ని సంతల్లో అమ్మాలన్నా... అక్కడ ఏదైనా సరుకులు కొనుక్కుని గ్రామానికి తీసుకుని వెళ్లాలన్నా... కొండపై నుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్లే ఏ పనికైనా గుర్రాలనే నమ్ముకోవాలి.

బాహ్య ప్రపంచంతో సంబంధాల కోసం ఈ గుర్రాలే గిరిజనులకు ఆధారం.

తరతరాలుగా ఇదే పద్ధతి

ప్రభుత్వ రికార్డుల్లో దాయర్తి గ్రామం వందకుపైగా ఏళ్ల నుంచే ఉంది. అప్పట్లో కేవలం 10 నివాసాలు మాత్రమే ఉంటే... ఇప్పుడవి వందకు చేరాయి. 10 గృహాలున్నప్పుడు మూడు, నాలుగు గుర్రాలుండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 50కి పెరిగింది.

ఈ గ్రామంలో ఓ సమయంలో అత్యధికంగా 70 గుర్రాలుండేవని... కొన్ని పారిపోయి, మరి కొన్ని చనిపోవడంతో ఇప్పుడు ఆ సంఖ్య 50కు చేరుకుందని గ్రామస్థులు తెలిపారు.

"తరతరాలుగా మా పెద్దల నుంచి మాకు గుర్రాలే ఆస్తిగా వస్తున్నాయి. మా గ్రామంలో వివాహాలకు కూడా గుర్రాన్ని కానుకలుగా ఇచ్చే ఆచారం ఉంది. మొదటి గుర్రం ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ... వందేళ్లుగా ఇక్కడ గుర్రాలతోనే జీవితం గడుస్తుందని మా పెద్దలు చెప్పారు. మాకు అదే అనుభవం అవుతోంది. ఇతర గ్రామాలు, మండల కేంద్రాలతో కలిపే సరైన రోడ్డు మార్గం లేనందున ఈ గుర్రాలే అన్నింటికి ఆధారమవుతున్నాయి" అని దాయర్తి గ్రామ వార్డు సభ్యుడు ఆనంద్ బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్,

విశాఖపట్నం ఏజెన్సీలో ‘గుర్రాల గ్రామం’.. ఇక్కడ ఇంటికో గుర్రం ఎందుకుంది?

చుట్టుపక్కల గ్రామాల కోసమూ...

దాయర్తి గ్రామంతో పాటు చుట్టు పక్కల దాదాపు పది గ్రామలకు రోడ్డు మార్గం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం వీళ్లు ఇంకా డోలీలనే నమ్ముకోవాలి. దాయర్తి గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు మధ్యలో ఉంది. అంతే కాకుండా గుర్రాలున్న గ్రామం కూడా ఇదే.

"మా గ్రామంలో గుర్రాలుండటంతో అందరూ ప్రయాణ అవసరాలకు ఇక్కడికే వస్తారు. ఇక్కడ నుంచి గుర్రాలను తీసుకుని మైదాన ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. మారుమూల గ్రామాల్లో కేవలం 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తుంటాయి. అటువంటి వారంతా మా గ్రామంపైనే ఆధారపడతారు. అందరికి అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ గుర్రాలను మేమంతా ప్రాణంగా చూసుకుంటాం. మాకు సమీపంలో ఉన్న మైదాన ప్రాంతాల్లో గుర్రాల సంతలు కూడా జరుగుతాయి. రవాణా సౌకర్యాలు లేని చిన్నచిన్న గ్రామాల వారు చందాలు వేసుకుని గ్రామ అవసరాల కోసం గుర్రాలు కూడా కొనుక్కుంటారు" అని 60 ఏళ్ల నాగేశ్వరరావు చెప్పారు.

‘గుర్రం బతికితేనే మాకు బతుకు’

గుర్రాలను పోషించడమంటే కష్టమైన పనే. వాటి ఆహారం, ఆరోగ్యం, అలనాపాలనా చూడటం ప్రయాసతో కూడుకున్నదే. దాయర్తి గ్రామంలో ఉన్న ఒక్కో గుర్రం పోషణ కోసం నెలకి సగటున ఐదు వందల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని గ్రామస్థులు చెప్పారు.

"గుర్రాలకి ఆహారంగా ఉలవలు, తౌడు, ధాన్యం వేస్తాం. ఇది మేం పండించేది కాదు. సంతల్లో దాణాని కొని తీసుకొస్తాం. ఒక్కో గుర్రానికి నెలకి మూడు బస్తాల దాణా అవసరం. బస్తా 500 రూపాయలు. దాణా రోజూ పెట్టం. గుర్రాన్ని తీసుకుని వెళ్లవలసిన అవసరం వచ్చినప్పుడే పెడతాం. మిగతా సమయంలో కొండలపై దొరికే ఆకులను తింటూ అవి జీవిస్తాయి. రోజూ గుర్రానికి దాణా వేయడమంటే మా వల్ల అయ్యే పని కాదు. కానీ గుర్రం లేకపోతే మాకు బతుకు లేదు. అందుకే ఖర్చుతో పనైనా దాణాని కొంటాం. ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా... మేమే నాటు వైద్యం చేస్తాం. సాధారణంగా గుర్రం 20 ఏళ్లు బతుకుతుంది" అని గ్రామంలో నాటు వైద్యం చేసే సూర్యం చెప్పారు.

కొన్ని గ్రామాల్లో ఒకటో, రెండో... దాయర్తిలో యాభై

ఏజెన్సీలో చాలా చోట్ల రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అయా గ్రామలకు అవసరార్థం ఒకటో, రెండో గుర్రాలు ఉంటాయి. అలా కిల్లంకోట, బలపం, గాలికొండ, దుప్పిలవాడ, ఎర్రచెరువులు, మొండిగెడ్డ, రంగబయలు గ్రామ పంచాయితీలలో కూడా గుర్రాలున్నాయి.

"గుర్రాలను మేం మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. అందుకే వీటి సంఖ్య మా వద్ద ఎక్కువ. మేం వీటిని కట్టేయం. స్వేచ్ఛగా కొండలపై ఎక్కడెక్కడో తిరుగుతూ నీళ్లు, ఆహారం కోసం గ్రామానికి చేరుకుంటాయి. మా పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయ ఆస్తిగా భావిస్తూ వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అందుకే ఎప్పుడైనా ఒకటి, రెండు గుర్రాలు కనిపించకపోయినా... వాటిని వెదికేందుకు గ్రామమంతా కలిసి బయలుదేరుతాం" అని చెప్పారు దాయర్తి గ్రామ యువకుడు గోవింద్.

గుర్రాలతోనే బాల్యం, స్నేహం

గుర్రాల గ్రామం దాయర్తి... ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ పిల్లలంతా గుర్రాలతో ఆటలాడుకుంటూ కనిపిస్తారు. వారిని గుర్రాలపైకి ఎక్కించి వారి తల్లిదండ్రులు సరదాగా తిప్పుతుంటారు.

"మా పిల్లల బాల్యం, మా బాల్యం అంతా కూడా గుర్రాల మధ్యే గడిచింది. పిల్లలకు గుర్రాలే నేస్తాలు. వారి ఆటపాటలన్ని అశ్వాలతోనే. ఇంటికో గుర్రం ఉన్నా...ఇది మాది, ఇది వాళ్లది అనే తారతమ్యం ఉండదు. అన్ని అందరివి అనే గ్రామ కట్టుబాటు ఉంది. అందుకే వీటి బాగోగులని కూడా గ్రామమంతా కలిసే చూసుకుంటాం. గుర్రాల సంరక్షణ ఇతర గుర్రాల వ్యవహారాలన్ని మగాళ్ల పనే. ఆడవాళ్లు ఈ పనులకు దూరంగా ఉంటారు. ఎందుకంటే గుర్రాలు కొన్ని సార్లు వింతగా ప్రవర్తిస్తూ... భయపెడతాయి" అని రాంబాబు చెప్పారు.

గుర్రాల గ్రామానికి నిధుల సమస్య

ఏళ్ల తరబడి రోడ్డు మార్గం లేదని తెలిసినా... అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని దాయర్తి గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. కేవలం ఐదు కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తే తమ జీవితాలు బాగుపడతాయని వారు అంటున్నారు.

దాయర్తి గ్రామానికి రోడ్డు, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో స్థానికుల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బీబీసీ ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.

"ఏజెన్సీలోని చాలా గ్రామలకు రోడ్డు సౌకర్యం లేదు. ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. నిధుల సమస్య ఉండటంతో ముందు చిన్న చిన్న గ్రామాల రోడ్డు సమస్యలను పరిష్కరిస్తున్నాం. దాయర్తి గ్రామానికి నిధులు మంజూరైన వెంటనే రోడ్డు వేస్తాం. రోడ్డు వస్తే... విద్యుత్ సమస్యకూ పరిష్కరం దొరుకుతుంది. ఇది త్వరలోనే జరుగుతుంది" అని పీవో వెంకటేశ్వర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)