పావని కుమారి: స్కూల్ బ్యాగు మోయడమే కష్టమైన వయసులో వెయిట్ లిఫ్టింగ్‌లోకి... BBC ISWOTY

స్కూలు బ్యాగులు మోయడం కూడా కష్టమైన ఎనిమిదేళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్ మొదలుపెట్టి విజయాలు అందుకున్నారు యువ భారత వెయిట్‌లిఫ్టర్ కేవీఎల్ పావని కుమారి.
చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉన్న పావని శక్తిసామర్థ్యాలను ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు గుర్తించారు. ఆమెకు సరైన మార్గనిర్దేశం చేశారు. పావని బాల్యంలోనే వెయిట్ లిఫ్టింగ్ సాధన మొదలుపెట్టారు.
పావనిది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా జి. కొత్తపల్లి గ్రామం. ఆమెను 2011లో హైదరాబాద్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీలో తల్లిదండ్రులు చేర్చారు. అప్పుడు పావని వయసు ఎనిమిదేళ్లు.
కుటుంబ సభ్యుల మద్దతుతో శ్రమించిన పావని త్వరగానే జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో తన ముద్ర వేయడం మొదలుపెట్టారు.
గత ఏడాది ఆమెకు కెరీర్‌లో మంచి విజయాలు దక్కాయి. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన 2020 ఏసియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పావని జూనియర్, యూత్ విభాగాల్లో రెండు రజత పతకాలు సాధించారు.
మారుమూల ప్రాంతంలో ఉన్న కారణంగా పావనికి క్రీడా వసతులు అందుబాటులో ఉండేవి కావు. దీంతో చిన్న వయసులోనే ఆమెను శిక్షణ కోసం దూర ప్రాంతమైన హైదరాబాద్‌కు తల్లిదండ్రులు పంపించాల్సి వచ్చింది.
అక్కడ అకాడమీలో కోచ్ పి.మాణిక్యాలరావు పావని బాధ్యతలు తీసుకున్నారు. తాను క్రీడాకారిణిగా మెరుగుపడటానికి కోచ్ మార్గదర్శనం ఎంతో దోహదపడిందని పావని చెబుతున్నారు.
ఫొటో సోర్స్, facebook/Andhra-pradesh-State-Weight-Lifting
అకాడమీకి సెలవులు వచ్చినప్పుడు కూడా తన ఊరికి వెళ్లకుండా, అకాడమీ బయట ఉంటూ పోటీలకు సన్నద్ధమయ్యేవారు పావని.
వెయిట్‌లిఫ్టింగ్‌లో సవాళ్లను అధిగమించేందుకు అనునిత్యం సాధన చేస్తున్నప్పటికీ, ఆమెకు వ్యక్తిగత జీవితంలో సవాలు ఎదురైంది.
పావన తండ్రి పేద రైతు. అనారోగ్య కారణాలతో ఆయన 2018లో పనికి దూరమయ్యారు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
దీంతో పావని క్రీడ మీద దృష్టి కేంద్రీకరించలేకపోయారు. 2019 వరకూ ఆమె వైఫల్యాలు కొనసాగాయి. అయితే, కుటుంబం ఆర్థికంగా అండగా నిలిచే పరిస్థితులు లేకపోయినా, పావని మానసిక, నైతిక స్థైర్యాలను కోల్పోలేదు.
కొన్ని వైఫల్యాలు చవిచూసినా.. బిహార్‌లోని బుద్ధగయలో జరిగిన 2019 యూత్ (సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్), 56వ మెన్ అండ్ వుమెన్ (జూనియర్) నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాణించి ఆమె ఫామ్‌లోకి దూసుకొచ్చారు.
బెస్ట్ లిఫ్టర్ అవార్డు గెలుచుకోవడంతో పాటు... యూత్ విభాగంలో రెండు టోర్నమెంట్ రికార్డులు కూడా నెలకొల్పారు.
బుద్ధగయలో చూపిన ప్రతిభ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసింది. అదే జోరును తాష్కెంట్‌లో జరిగిన 2020 ఏసియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ కొనసాగించారు.
పావని తన తొలి అంతర్జాతీయ టోర్నమెంటులోనే.. యూత్ విభాగంలోనూ, జూనియర్ విభాగంలోనూ రజత పతకాలు గెలుకున్నారు.
తాష్కెంట్‌లో సాధించిన విజయం పావనికి గుర్తింపు తెచ్చిపెట్టినప్పటికీ.. తన సుదీర్ఘ ప్రయాణానికి అది ఆరంభం మాత్రమేనని పావని అంటుంటారు.
దేశం కోసం ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలన్నది తన స్వప్నమని.. అందుకోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధమని ఆమె చెబుతున్నారు.
క్రీడాకారిణులు కెరీర్‌లో విజయం సాధించాలంటే శిక్షణ ముఖ్యమని.. అందుకు నైతిక, ఆర్థికపరమైన సహకారం కూడా అవసరమవుతుందని పావన అన్నారు.
అత్యున్నత స్థాయిలో బాగా రాణించాలంటే అటు శారీరకంగానూ, ఇటు మానసికంగానూ దృఢంగా ఉండాలని క్రీడాకారిణులకు పావని సూచిస్తున్నారు.
(పావని కుమారి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)
ఇవి కూడా చదవండి:
- బడ్జెట్లో ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)