టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి: రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు, అనంతరం క్షమాపణ

చల్లా ధర్మారెడ్డి

ఫొటో సోర్స్, FB/Challa Dharma Reddy

తెలంగాణ రాష్ట్రంలోని పరకాల నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందిన వారికి అక్షరం ముక్క రాదని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఓసీ సంఘాలు నిర్వహించిన ఒక సభలో ఆయన ఈ మాటలు అన్నారు.

రిజర్వేషన్ వల్ల ఉద్యోగం పొందిన ఒక ఉన్నతాధికారిని తన నియోజకవర్గంలో నియమించానని, కానీ, ఆయనకు అక్షరం ముక్క కూడా రాదని తరువాత తెలిసిందని చెప్పారు.

''మా నియోజకవర్గంలో అందరు ఏఈలూ కలసి ఒక ఉన్నతాధికారి గురించి చెప్పి, మంచి ఆఫీసర్ అని నియామకం చేయించమన్నారు. పనిచేసేవారైతేనే తీసుకుందాం అన్నాను. బాగా పనిచేస్తాడని చెప్పారు. తీసుకురమ్మన్నాను. తను పనిచేస్తున్నాడు. ఒకసారి నేను పిలిచి మాట్లాడితే అతనికి అక్షరం ముక్క కూడా రాదు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాను. ''ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాడు సర్. బాగా చదివితే అడ్డం తిరుగుతాడు. ఇతనైతే ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాడు' అన్నారు" అని వేదికపై చెప్పారు ధర్మారెడ్డి.

అంతేకాదు, రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు వచ్చిన వారే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా ఉన్నారనీ, వారి వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుందని ధర్మారెడ్డి అన్నారు.

''రాష్ట్రంలో, జిల్లాలో ఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లినా ఉన్నతాధికారులుగా వారే ఉన్నారు. రాష్ట్రం నాశనం అవడానికి కారణం వాళ్లే'' అన్నారు.

ఫొటో సోర్స్, fb/Challa Dharma Reddy

రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు రావాలనీ, ఒకసారి రిజర్వేషన్ ఫలితం అందుకున్న వారికి మళ్లీ ఉద్యోగం ఫలితం ఇవ్వకూడదనీ, దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలనీ ధర్మా రెడ్డి కోరారు.

''ఒకసారి రిజర్వేషన్ వస్తే ఉన్నత స్థితికి వెళ్తున్నారు. వారి పిల్లలు కార్పొరేట్ స్కూళ్లల్లో చదువుతూ ఉన్నత స్థితికి వెళ్తున్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ దాని వల్ల తాము తప్ప ఎవరూ బాగుపడే స్థితిలో ఉండకూడదని వారు అనుకుంటున్నారు. రిజర్వేషన్ వచ్చిన కుటుంబంలోని వారికి ఇక రిజర్వేషన్ అక్కర్లేదని నేను వాదిస్తున్నాను. ఎప్పుడో వచ్చిన రిజర్వేషన్ విధానంలో మార్పులు జరగాలి. కేంద్రం దానికి బాధ్యత తీసుకోవాలి'' అని ధర్మా రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ మాటలన్న కొన్ని గంట్లోలే ఆయన వాటిని వెనక్కు తీసుకున్నారు. ఈ విషయాన్ని తాను ఏ వేదిక మీదైనా చెబుతాననీ, ఓసీ సంఘాలతో కలసి నడుస్తానని చెప్పిన ధర్మారెడ్డి, ఆ తరువాత తన వ్యాఖ్యాలను వక్రీకరించారంటూ కొత్త వాదన వినిపించారు. ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.

''నా మాటలను వక్రీకరించారు. గిట్టని వారు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి. తప్పుడు ప్రచారాలను నమ్మద్దు. నేను అగ్రకుల పేదల రిజర్వేషన్ల అమలు గురించే మాట్లాడాను. నేను తప్పుడు మాటలు అన్నట్టు చెబుతున్నారు. నేను రిజర్వేషన్ తగ్గించాలి అనలేదు. పదిశాతం ఈడబ్లుఎస్ అదనంగా వస్తుంది అన్నాను. దాన్ని పేద, బలహీన వర్గాలకు వర్తించి ఇవ్వమన్నాను. నా మాటలు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నా మాటలను వెనక్కు తీసుకుంటున్నాను. సారీ చెప్తున్నాను'' అన్నారు ధర్మారెడ్డి.

మరోవైపు చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై పలు దళిత, బీసీ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.

ప్రస్తుతం తెలంగాణలో కులాల వారీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.

ఎస్సీలకు 15 శాతం

ఎస్టీలకు 6 శాతం

బీసీలకు (ఏ-డీ) 25 శాతం

బీసీ (ఈ) (కొన్ని ముస్లిం శాఖలు) 4 శాతం

వీటికి అదనంగా ఇకపై ఓసీల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి.

ఇప్పటి వరకూ ఓపెన్ కేటగిరీలో 50 శాతం ఉద్యోగాలు ఉండగా, ఇకపై 40 శాతానికి తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)