బడ్జెట్-2021: రైతుల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించని బడ్జెట్ - అభిప్రాయం

  • రామాంజనేయులు
  • సహజ ఆహారం ఉత్పత్తి దారుల సంఘం
రైతు

ఫొటో సోర్స్, Getty Images

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలేవీ సగటు రైతు ఆదాయం పెంచడానికి అనుకున్న లక్ష్యానికి దరిదాపుల్లో కూడా లేవు. లాక్ డౌన్ సమయంలో హడావిడిగా మార్కెట్ విధానాల్లో తీసుకొచ్చిన మార్పులకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో, వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ప్రవేశ పెట్టబడిన 2021-22 బడ్జెట్ వ్యవసాయ రంగానికి నిరాశే మిగిల్చింది.

మద్దతు ధర, ఆహార ధాన్యాల సేకరణ, ఆహార భద్రత: దేశంలో అన్ని రంగాల్లో, కోవిడ్ లాక్‌ డౌన్ నేపథ్యంలో కొద్దో గొప్పో ఆదుకున్నది వ్యవసాయ రంగమే. అలాగే, లాక్ డౌన్ సమయంలో ఆహార పంపిణీకి గత ఏడాది బడ్జెట్ అంచనాలు రూ.11,569.68 కోట్లు కాగా, సరిచేసిన అంచనాల ప్రకారం ఇది రూ.3,07,048.46 కోట్లు అయ్యింది.

దీనికి తోడు భారతీయ ఆహార సంస్థ (FCI) చిన్న పొదుపుల సంస్థ నుండి తీసుకుంటున్న అప్పుల్లో రూ.1,15,569.68 కోట్ల భారం ప్రభుత్వమే భరించటం వల్ల ఆహార భద్రత కింద చేసే ఖర్చు రూ.4,22,618.14 కోట్లకు పెరిగింది. అయితే ఆహార భద్రత కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,42,836 మాత్రమే కేటాయించారు. దీని ప్రభావం ఆహార సేకరణ మీద, దాని ద్వారా మద్దతు అందించడంపై పడే అవకాశం వుంది.

ఫొటో సోర్స్, Reuters

గత సంవత్సరంతో పోల్చిచూస్తే, ఈ ఆర్ధిక సంవత్సరంలో మద్దతు ధరలకు ధాన్య సేకరణ, పత్తి లాంటి పంటల సేకరణ అనేక రెట్లు పెరిగిందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. రూ.1.72 కోట్ల రూపాయలతో వరి ధాన్యం సేకరణ ద్వారా 1.24 కోట్ల మంది రైతులు లాభ పడినట్లు, అలాగే రూ.75,060 కోట్లతో గోధుమ సేకరణ వల్ల 43.36 లక్షల మంది రైతులు లాభపడ్డారని బడ్జెట్‌లో పేర్కొన్నారు. వరి, గోధుమల సేకరణ కోసం పెట్టిన ఖర్చు ఎక్కువైన మాట నిజమే. కానీ ప్రభుత్వం సేకరించే మిగిలిన 20 పంటల పరిస్థితి ఏమిటి? అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మొత్తం దేశవ్యాప్తంగా 379.47 లక్షల టన్నులు వరి సేకరిస్తే అందులో 135.86 లక్షల టన్నులు పంజాబ్‌ నుంచి, 37.6 లక్షల టన్నులు హర్యానా నుంచి కొనుగోలు చేసారు. ఈ రెండు రాష్ట్రాల్లో వరి వినియోగం చాలా తక్కువ దాంతో అక్కడ పండిన ధాన్యంలో దాదాపు 90 శాతం పైగా పంటను మద్దతు ధరకు సేకరించారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి 40.69 లక్షల టన్నులు, చత్తీస్‌గఢ్‌ నుంచి 39.76 లక్షల టన్నులు, తెలంగాణ నుంచి 31.14 లక్షల టన్నులు సేకరించారు. తెలంగాణ నుంచి బియ్యం సేకరణ ఎక్కువగా ఉంటుంది. మిగతా రాష్టాల రైతులకు మద్దతు ధరలు అందని మాటే. గోధుమల విషయం లోనూ అదే జరుగుతోంది. మధ్య ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి దాదాపు 75 శాతం సేకరిస్తున్నారు.

కేవలం రెండు పంటలకు, రెండు మూడు రాష్ట్రాలకే ఈ సేకరణ ద్వారా రైతులకు మద్దతు ధర లభించింది. మిగతా రైతులకు సేకరణ లేకపోగా, తక్కువ ధరలకు మార్కెట్‌లోకి FCI విడుదల చేసిన ఆహార ధాన్యాల(ఆహార భద్రతా చట్టం కింద కాక బహిరంగ మార్కెట్ అమ్మకాల పథకం కింద) మద్దతు ధరల కంటే చాలా తక్కువ ధరకు రైతులు తమ పంట అమ్ముకోవాల్సి వచ్చింది.

వ్యవసాయ రుణాలు: రూ.16.5 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం పెట్టుకున్నా ఈ మొత్తం అన్ని రాష్ట్రాలకు సమంగా పంపిణీ కాదు. రాష్ట్రాల్లోని రైతులకు కూడా సమానంగా ఇవ్వరు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తం పంపిణీ అవుతుంది. ఆ రాష్ట్రాల్లో కూడా కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని రిజర్వు బ్యాంకు ఇంతకు ముందే తన నివేదికలో పేర్కొంది. పెద్ద పెద్ద రైతులు ఎక్కువగా సంస్థాగత రుణాల లబ్ధి పొందుతుంటారు. వడ్డీ సబ్సిడీల లాభం కూడా వీరికే దక్కుతుంటుంది. వ్యవసాయం చేయని భూస్వాములు తక్కువ వడ్డీతో వచ్చే రుణాలను అనుభవిస్తుంటే, అసలు సాగు చేస్తున్న రైతుకు సంస్థాగత రుణాలు లభించడం లేదు.

అర్హులైన సాగుదారులందరికి వ్యవసాయ రుణాలు అందాల్సిన అవసరం వుంది. ఈ సంవత్సరం పది లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇందులో ఎక్కువ భాగం వ్యవసాయాధార పరిశ్రమలకు, పట్టణాలలో వుండే పెద్ద రైతులకు అందుతున్నాయని, గ్రామీణ ప్రాంతంలో వుండే రైతులకు రుణాలు అందటం లేదని ఎన్ని నివేదికలు చెప్పినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. వాస్తవంగా సాగుచేసేవారికి అందరికీ వ్యవసాయ రుణాలు అందేలా విధానాలు రూపొందించాలి. అలాగే ఇప్పటివరకూ కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే బీమా సౌకర్యం అందుతోంది. ఫసల్ బీమ యోజనతో ఎదురైన సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నాలు, దిద్దుబాటు చర్యలు ఏవీ ప్రకటించలేదు.

ఫొటో సోర్స్, AFP

వ్యవసాయ రాయితీలు: వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపధ్యం లో ధరలు పెరిగితే వినియోగ దారుల పైనా, పరిశ్రమలపైనా ప్రభావం వుంటుంది కాబట్టి ధరలు పెరగకుండా వుండటం కోసం రైతులకు రాయితీలు ఇవ్వటం జరుగుతుంది. చైనా అత్యధికంగా 185.9 బిలియన్ డాలర్లు వ్యవసాయ రాయితీలు ఇవ్వగా, ఐరోపాలో 101.3 బిలియన్ డాలర్లు, అమెరికాలో 48.9 బిలియన్ డాలర్ల సబ్సిడీలు అందుతున్నాయి. చిన్న కమతాలు వున్న జపాన్ 37.6 బిలియన్ డాలర్లు, ఇండోనేషియా 29.4 బిలియన్ డాలర్లు రాయితీలు ఇవ్వగా, మనదేశంలో అవి 11.00 బిలియన్ డాలర్లు మాత్రమే. మన దేశంలో కూడా రాయితీలు పెంచాల్సిన అవసరం వున్నది. అయితే అవి ఏ రూపంలో ఇస్తారనేది చాలా కీలకం. కొన్ని పంటలకి, కొన్ని పద్ధతులకి ఇవ్వటం వల్ల రైతుల మధ్య, ప్రాంతాల మధ్య, పంటల మధ్య అనేక తారతమ్యాలు ఏర్పడుతున్నాయి.

మన దేశంలో ఎక్కువ భాగం సబ్సిడీలు రసాయనిక ఎరువులపై, విద్యుత్ వినియోగంపై ఇస్తున్నారు. రసాయనిక ఎరువులపై 2020-21లో రూ.1.37 లక్షల కోట్లు ఖర్చు పెట్టగా వచ్చే సంవత్సరానికి రూ. 79.53 వేల కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రాలు అందించే ఉచిత విద్యుత్తు కూడా. ఇవి రెండూ కూడా పర్యావరణానికి నష్టం కలిగించేవే. ఎక్కువ ఎరువులు వాడే రైతులకు, రాష్ట్రాలకు ఎక్కువ సబ్సిడీ అందగా, అసలు అవి వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేసే రాష్ట్రాలకు, రైతులకు ఏ రాయితీలూ అందవు. ఎక్కువ విద్యుత్ వినియోగించి. ఎక్కువ భూగర్భ జలాలు వాడే రైతులకు ఎక్కువ సబ్సిడీ దొరుకుతుంది. అలా పండిన పంటలకు మద్దతు ధర దొరుకుతుంది. అవి వాడకుండా పర్యావరణ హితంగా పండించే ఎన్నో పంటలకు, రైతులకు ఎలాంటి మద్దతు వుండటం లేదు. మన దేశంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎరువులు, విద్యుత్‌కు కలిపి ఒక్కో హెక్టారుకు రూ.30 వేలు వరకూ సబ్సిడీలు లభిస్తుంటే, కొన్ని రాష్ట్రాల్లో ఇది మూడు వేల రూపాయలకు మించడం లేదు. తెలంగాణలో సగటున ఇది హెక్టారుకు రూ.24 వేలు వుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది దాదాపు 17 వేలు ఉంది.

వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతూ సేంద్రీయ/ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో విధానాలను, రాయితీలను పునఃసమీక్షించి రాష్ట్రాల మధ్య, పంటల మధ్యలో, రైతుల మధ్య, వ్యవసాయ పద్దతుల మధ్య ఇప్పటికే ఉన్న తారతమ్యాలను తగ్గిస్తుందని ఆశించారు. కానీ, ఆ దిశగా ఏ ప్రయత్నం జరగలేదు. ఇప్పటికే ఆందోళన చేస్తున్న రైతుల నుంచి (ముఖ్యంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్) ఇంకా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఆ మార్పుల దిశగా ప్రయత్నాలు చేసినట్టు లేదు. ఇదే పద్దతి కొనసాగితే మిగతా రాష్ట్రాల రైతులు మరింత నష్ట పోయే పరిస్థితి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఈ అసమానతలను సరిదిద్దకపోతే, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయి. ఇప్పటికే స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 19.9 శాతమే ఉంది. ఇది రైతులకు ధరల రూపంలో అందినా, వారి ఆదాయం పెద్దగా పెరగదు. చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా వున్న నేపథ్యంలో దానికి తగ్గట్టు ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా, ఒడిశాలోని కాలియా, పశ్చిమ బెంగాల్‌, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రభావం గురించి ఆర్థిక సర్వేలో ప్రస్తావించినప్పటికీ బడ్టె‌ట్‌లో మాత్రం ప్రత్యక్ష నగదు బదిలీ ఊసే లేనేలేకపోవడం గమనార్హం. పైగా అట్టహాసంగా ప్రారంభమైన PM-KISAN పథకానికి రూ.75 వేల కోట్ల నుంచి రూ.65 వేల కోట్లకి నిధులు తగ్గించారు.

రైతులను సంఘటితం చేసి సహకార సంఘాలుగా, ప్రొడ్యూసర్ కంపెనీలుగా ఏర్పాటు చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రకటించినప్పటికీ కొన్ని మౌలికమైన సమస్యలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ కేంద్రం ఈ బడ్జెట్‌లో కూడా ఏమీ ప్రకటించలేదు. రైతు సహకార సంఘాలకు రుణాలు అందటం చాలా పెద్ద సమస్య. బ్యాంకులన్నీ 150 శాతం వ్యవసాయేతర ఆస్తులని కుదువ పెట్టమని కోరుతున్నారు. పరిశ్రమలకు సులభంగా రుణాలిచ్చే ప్రభుత్వాలు, బ్యాంకులు రైతు సహకార సంఘాల పట్ల ఈ వివక్షను వీడాలి. ఈ విషయాల గురించి ఆర్ధిక మంత్రి, వ్యవసాయ మంత్రులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా బడ్జెట్‌లో దీని మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్స్: కొత్తగా తీసుకు వచ్చిన మార్కెట్ విధానాలతో మార్కెట్ యార్డ్ (APMC)ల బయట జరిగే లావాదేవీలపై ఎలాంటి సెస్స్ ఉండదని ప్రకటించిన కేంద్రం, మౌలిక వసతుల కల్పనకు ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీల్లో వినియోగదారులపై ప్రభావం పడకుండా కొద్దిగా మార్పులు చేసి వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు చేయటం జరిగింది. దీని ద్వారా APMCలని అభివృద్ధి చేయటం, అధునీకరించటం చేస్తామని ప్రకటించారు. ఇది స్వాగతించాల్సిన విషయమే.

ఫొటో సోర్స్, PRAKASH SINGH

కేంద్ర బడ్జెట్ ఇంత నిరాశాజనకంగా వుంటే, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా కొంచెం చొరవచూపి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచి, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా కింది విషయాలపై తెలుగు రాష్ట్రాలు దృష్టిపెట్టి, బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి.

  • విస్తరణ వ్యవస్థని బలోపేతం చేసి, అధిక పెట్టుబడి ఖర్చులు తగ్గించే దిశగా, భూమికి అనుకూలంగా సరైన పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించి, సహకారం అందించాలి.
  • కరువు సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాన నీటిని ఒడిసిపట్టి పంటలకు వాడుకునే పద్ధతులకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందించాలి, అలాగే తక్కువ నీటిని వినియోగించే పంటలకు సరైన ధర కల్పించాలి. కరువు, తుపాను సమస్యలు ఎక్కువవుతుండడంతో ప్రకృతి వైపరీత్యాల నష్టం నుంచి ఆదుకోవటానికి బడ్జెట్‌లో ప్రత్యెక నిధిని కేటాయించాలి.
  • వాస్తవ సాగుదారులందరికి రుణాలు అందటం కోసం 'రుణ హామీ నిధి'ని ఏర్పాటు చేయాలి. దీనిని కేవలం చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, కౌలు రైతులకు రుణాలు అందించడానికే వినియోగించాలి.
  • రైతు సహకార సంఘాలకు సులభంగా రుణాలు అందే ఏర్పాటు చేయాలి. అలాగే పంట పండిన తర్వాత దాచుకోవటానికి గిడ్డంగులు, ప్రాసెసింగ్ పరికరాలు అందించాలి.
  • సేంద్రీయ వ్యవసాయం వేళ్లూనుకున్న నేపథ్యంలో మిగిలిన రసాయనిక వ్యవసాయంతో సమానంగా సేంద్రియ రైతులకు సబ్సిడీలు అందేలా కేటాయింపులు చేయాలి
  • సగానికి పైగా వ్యవసాయం మహిళలే చేస్తుండడంతో మహిళా రైతుల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించాలి.

( అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)