అర్జున్ యుద్ధ ట్యాంక్: భారత సైన్యం అమ్ములపొదిలో మరో బలమైన అస్త్రం - ప్రెస్ రివ్యూ

అర్జున్ ట్యాంక్

ఫొటో సోర్స్, army-technology.com

ఫొటో క్యాప్షన్,

అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్

భారత సైన్యం అమ్ములపొదిలో కొత్తగా అర్జున్ ట్యాంక్ చేరినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన సరికొత్త 'అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (ఎంకే-1ఏ)' సైన్యం అమ్ములపొదిలోకి చేరింది.

చెన్నై నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఏర్పాటైన సభలో ఆ ట్యాంకును భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఎంఎం నరవణేకు ప్రధాని మోదీ అప్పగించారు.

''మన సరిహద్దులను కాపాడే మరొక యోధుణ్ని (అర్జున్‌ ట్యాంక్‌) దేశానికి అంకితం చేస్తున్నందుకు గర్విస్తున్నాను. దేశీయంగా రూపకల్పన చేసి, ఇక్కడే తయారుచేసిన అర్జున్‌ ఎంకే-1ఏను సైన్యానికి అందజేస్తున్నందుకు గర్విస్తున్నాను. దక్షిణాదిన తమిళనాడులో తయారైన సాయుధ యుద్ధ ట్యాంకులు ఉత్తరాదిన సరిహద్దులను కాపాడనున్నాయి. భారతదేశ సమైక్య స్ఫూర్తికిది ఉదాహరణ'' అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారని పత్రిక చెప్పింది.

ఉన్నతాధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. తమిళనాడులోని అవడిలో ఉన్న 'హెవీ వెహికల్‌ ఫ్యాక్టరీ (హెచ్‌వీఎఫ్)'కు 118 అర్జున్‌ ట్యాంకుల తయారీకి ఆర్డర్‌ లభించింది.

ఈ ఆర్డర్‌ విలువ రూ.8500 కోట్లు. అర్జున్‌ ఎంకే 1 ఆల్ఫా ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ట్యాంకు అని వారు వివరించినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

1972లో డీఆర్‌డీవో ఈ అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంకుల ప్రాజెక్టును చేపట్టింది. 2004లో తొలి విడతగా 16 అర్జున్‌ ట్యాంకులు ఆర్మీకి అందాయి.

2011 నాటికి 100 ట్యాంకులు సైన్యం అమ్ములపొదిలో చేరాయి. వాటిని మరింత ఆధునీకరించి.. 71 కొత్త ఫీచర్లతో ఈ ట్యాంకులను అభివృద్ధి చేశారు.

ఈ ఆర్డర్‌ ద్వారా మన దేశానికి చెందిన 200 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన 8000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

అర్జున్ ట్యాంకుల తయారీలో మొత్తం 15 విద్యా సంస్థలు, 8 ప్రయోగశాలలు, పెద్ద సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పాలుపంచుకుంటున్నాయని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఏపీలో త్వరలో పుర, నగర పాలిక ఎన్నికల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడిన పుర, నగర పాలిక ఎన్నికల నిర్వహణకు త్వరలో ప్రకటన రానుందని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించంది.

గత మార్చిలో వాయిదా పడిన పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమ లేదా మంగళవారాల్లో ప్రకటన చేయనుంది. ఎక్కడ నిలిచిపోయాయో అక్కడి నుంచి ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది.

ఇప్పటికే దాఖలైన నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ, పోలింగు, ఓట్ల లెక్కింపు కోసం మరోసారి తేదీలను ప్రకటించనున్నారు. నెలాఖరులోగా ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా పడ్డాయి.

12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు.

75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. అవి పూర్తయ్యేలోగా.. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

తొలి దశ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక తనను కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వద్ద ఎన్నికల కమిషనర్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించారని తెలిసినట్లు ఈనాడు చెప్పింది.

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల సంఘాన్ని కోరింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితోనూ ఎస్‌ఈసీ సమావేశమై ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, FASTAG.ORG

ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే ఇక రెట్టింపు టోల్

ఫాస్ట్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అమల్లోకి తెచ్చిందని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

టోల్‌ గేట్ల దగ్గర రద్దీని తగ్గించే దిశగా వాహనాలకు ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.

ట్యాగ్‌ లేని వాహనాలకు టోల్‌ ఫీజు భారం రెట్టింపు కానుంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎన్‌హెచ్‌ఏఐ) ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది.

జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లోని అన్ని లేన్లు ఫిబ్రవరి 15/16 అర్ధరాత్రి నుంచి 'ఫాస్టాగ్‌ లేన్లు'గా మారతాయని పేర్కొందని పత్రిక చెప్పింది.

'నిబంధనల ప్రకారం ఫాస్టాగ్‌ లేని వాహనాలు, చెల్లుబాటు కాని ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలు గానీ ఫాస్టాగ్‌ లేన్‌లోకి వచ్చిన పక్షంలో రెట్టింపు ఫీజు వర్తిస్తుంది' అని ఎన్‌హెచ్‌ఏఐ వివరించింది.

డిజిటల్‌ విధానం ద్వారా టోల్‌ ఫీజుల చెల్లింపును ప్రోత్సహించేందుకు, ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తోడ్పడగలవని తెలిపింది.

2016లో తొలిసారిగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు చక్రాల ప్యాసింజర్‌ వాహనాలు, గూడ్స్‌ వాహనాలకు ఫాస్టాగ్‌ అమర్చడాన్ని తప్పనిసరి చేసింది.

ఆ తర్వాత డెడ్‌లైన్‌ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది. ఫాస్టాగ్‌ అమలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరింత పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

టీకా వేసుకోవడంలో ఆదర్శంగా నిలిచిన ఆశా వర్కర్లు

తెలంగాణలో 83 శాతం ఆశా వర్కర్లు కరోనా టీకా తీసుకున్నారని నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

కరోనా కష్టకాలంలో నిర్విరామంగా పనిచేసిన ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు టీకా తీసుకోవడంలోనూ ముందు వరుసలో నిలిచారు. అపోహలు విడనాడి వ్యాక్సిన్‌ తీసుకుంటూ అన్ని వర్గాలవారికి ఆదర్శంగా నిలిచారు.

జనవరి 16న వైద్యసిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలుత ప్రభుత్వ సిబ్బందికి, ఆ తర్వాత ప్రైవేట్‌ వైద్యసిబ్బందికి ఇచ్చారు.

కొవిన్‌ యాప్‌లో వైద్యవిభాగంలోని అన్నిరకాల సిబ్బంది ఉత్సాహంగా వివరాలు నమోదుచేసుకున్నప్పటికీ టీకాలు తీసుకొనే సమయంలో వెనుకంజవేశారు.

ప్రభుత్వ వైద్య విభాగంలోని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు మాత్రం పెద్దసంఖ్యలో టీకాలు తీసుకున్నారు. కొవిన్‌లో వివరాలు నమోదుచేసుకున్న ఆశాల్లో 83 శాతం, ఏఎన్‌ఎంలలో 81 శాతం సిబ్బంది టీకాలు వేసుకున్నారు.

వైద్యులు, నర్సులు, వైద్య విద్యార్థులు, పారామెడికల్‌ సిబ్బంది కంటే వీరే ఎక్కువగా వేసుకోవడం విశేషం.

ప్రభుత్వ వైద్య విద్యార్థులు అత్యల్పంగా 29 శాతం మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మొత్తం ప్రభుత్వ వైద్య సిబ్బందిలో 1.76 లక్షల మంది కొవిన్‌లో వివరాలు నమోదుచేసుకోగా, 1.09 లక్షల మంది మాత్రమే టీకా తీసుకున్నారని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)