నువ్వలరేవు: ఇక్కడ వరుడికి వధువు తాళి కడుతుంది, ఇంకా...
- లక్కోజు శ్రీనివాస్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, K.Anand/B.Narsinga rao
పెళ్లంటే ఖర్చుతో కూడిన వేడుక. కానీ, ఆ ఖర్చులను తగ్గించి, పెళ్లి సంబరాలు కొనసాగేలా ఒక గ్రామం వందల ఏళ్ల క్రితమే వినూత్నంగా ఆలోచించింది.
పెద్దల ఆలోచనతో ఆ ఊరంతా ఒక పెద్ద కళ్యాణ మండపంగా మారిపోయింది. ఊళ్లో వారందరూ పెళ్లిపెద్దలు అయిపోయారు. ఆ ఊరి పేరు నువ్వలరేవు. ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ఒక మత్స్యకారుల గ్రామం.
400 ఏళ్ళ ఆచారం
ఏటా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే అన్ని ఊళ్లలోనూ పెళ్లిబాజాలు మోగుతాయి.
కానీ, నువ్వలరేవులో మాత్రం రెండు, మూడేళ్లకు ఒక్కసారి మాత్రమే, అవి కూడా సామూహికంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ ఊరిలో ఒకే ముహూర్తంలో పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేస్తారు. ఒకప్పుడు ఈ వివాహాల సంఖ్య వందల్లో కూడా ఉండేదని గ్రామస్థులు చెబుతారు.
నువ్వలరేవులో ఉండేవాళ్లు, బయటి నుంచి సంబంధాలు చేసుకోరు. గ్రామంలో ఉన్న బంధువుల కుటుంబాలతోనే వియ్యం అందుకుంటారు.
ఇక ఈ గ్రామంలో జరిగే వివాహాల్లో వరకట్నం అనేదే లేకపోవడం, వరుడి మెడలో వధువు కూడా తాళి కట్టడం లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఫొటో సోర్స్, K.Anand/B.Narsinga rao
ఊరంతా విద్యుత్ దీపాల వెలుగులు
మా ఆచారాలే మాకు రక్ష
400 ఏళ్ళ క్రితం తమ ఊరి పెద్దలు ఈ ఆచారాలన్నీ నిర్ణయించారని నువ్వలరేవులో ఉంటున్న మువ్వల రాంబాబు బీబీసీకి చెప్పారు.
"మా గ్రామంలో ఆచార, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తాం. అందరం ఒకేమాటపై నిలుస్తాం. ఇక్కడ ప్రతి రెండు, మూడేళ్ళకోసారి ఒకే ముహూర్తానికి సామూహిక వివాహాలు జరిపిస్తాం" అన్నారు.
నువ్వలరేవు గ్రామం వజ్రపుకొత్తూరు మండలంలోకి వస్తుంది. గ్రామస్థులు ప్రధానంగా చేపల వేట మీదే ఆధారపడతారు.
పెళ్లి కోసం ఊరంతా పెట్టిన స్పీకర్ల నుంచి గట్టిగా సినిమా పాటలు వినిపిస్తుండడంతో, తన స్వరం కాస్త పెంచిన రాంబాబు, గ్రామంలో ఆ ఆచారాలు ఎందుకు వచ్చాయో కూడా వివరించారు.
"మాకు అక్షరాస్యత, ఆదాయం రెండూ తక్కువే. ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని, సామూహిక వివాహాలతో ఖర్చు తగ్గించుకోవచ్చని మా పెద్దలు భావించారు. బంధువులు అందరికీ ఒకేసారి విందు ఇవ్వడం, పెళ్లి ఏర్పాట్ల ఖర్చులు అందరం భరించడం వల్ల డబ్బు ఆదా అవుతోంది" అన్నారు.
బయటి సంబంధాలు ఎందుకు చేసుకోవడం లేదని అడిగితే, దానికి కూడా రాంబాబు ఒక కారణం చెప్పారు.
"మగాళ్ళు వేటకు వెళితే రెండు మూడు నెలలు తిరిగిరారు. అలాంటి సమయంలో ఇంట్లో ఆడవాళ్ళు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. బయటి సంబంధాలు చేసుకుంటే అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే, ఊళ్లో సంబంధాలు చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అందరం సంబంధాలు కలుపుకోవడంతో ఊరంతా ఒక కుటుంబంలా కలిసి ఉంటుంది" అని చెప్పారు.
ఫొటో సోర్స్, K.Anand/B.Narsinga rao
వరుడికి తాళి కడుతున్న వధువు
వరుడి మెడలో తాళికట్టే వధువు
పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించినప్పుడు గ్రామంలోని యువతీ యువకులను పెద్దలు పిలిచి వారు ఎవరినైనా ప్రేమించారా? ఇష్టపడుతున్నారా? అని అడుగుతారని, ఇష్టపడినవారికే ఇచ్చి పెళ్లి చేస్తారని రాంబాబు చెప్పారు.
నువ్వలరేవులో బెహరా, బైనపల్లి, మువ్వల అనే ఇంటి పేరు ఉండే కుటుంబాలవారే ఉంటారు. పెళ్లిళ్లు అన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.
నువ్వలరేవు సామూహిక వివాహాలలో వరుడి మెడలో వధువు తాళి కట్టడం అనే ఆచారం తమ ఊరికే ప్రత్యేకం అని ఒక వధువు తండ్రి బేహరా మధుసూదన్‌రావు బీబీసికి చెప్పారు.
"వరుడు కట్టిన తాళి వధువుకి, వధువు కట్టే తాళి వరుడికి రక్ష అని ఈ ఆచారం చెబుతుంది. ఇద్దరూ సమానమని చెప్పాలన్నదే మా పెద్దల ఉద్దేశం. అంతా ఒకే ఊరి వాళ్లం కావడంతో పెళ్లిలో మాకు వరకట్నం సమస్య ఉండదు. వధూవరులకు నల్ల కళ్లజోడు పెట్టడం, కరెన్సీ నోట్లతో అలంకరించడం లాంటి సరదాలు కూడా ఉంటాయి" అన్నారు.
ఈ గ్రామం ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో ఉండడంతో పెళ్ళి తంతులో ఎక్కువగా ఒరిస్సా సంప్రదాయాలు కనిపిస్తాయి. అలాగే పెళ్ళిలో మహిళలు ఒరిస్సా జానపదాలు కూడా పాడుతుంటారు.
ఫొటో సోర్స్, K.Anand/B.Narsinga rao
ప్రేమికుల రోజే...వీళ్లకు పెళ్లి రోజు
నువ్వలరేవులో వివాహాలు రెండేళ్లకో, మూడేళ్ళకు ఒకసారి జరుగుతాయి. అన్నీ ఒకే రోజు, ఓకే ముహూర్తానికి, వధువు ఇంట్లో జరుగుతాయి.
దీంతో దాదాపు ప్రతి ఇంటికీ పెళ్లి కళ వచ్చేస్తుంది.
ఈసారీ సామూహిక వివాహలు ప్రేమికుల రోజున జరుపుకోవడం ఆనందంగా ఉందని నూతన వధూవరులు చెప్పారు.
"ఈ సమయంలో మా ఊళ్లో ప్రతి ఇంటికీ పెళ్లికళ వచ్చేస్తుంది. నేను మా ఊళ్లో సామూహిక వివాహాలు జరగడం చూడ్డం ఇది నాలుగోసారి. ఇక్కడ 2014లో 200 జంటలకు, 2017లో 103 జంటలకు, 2019లో 99 జంటలకి పెళ్లి జరిగింది. ఇప్పుడు 42 జంటలు పెళ్లి చేసుకున్నాయి. మా ఊళ్లో గతంలో ఒకే ముహూర్తంలో 300కు పైగా పెళ్లిళ్లు జరిగాయని మా పెద్దవాళ్లు చెప్పారు. ప్రేమికుల దినోత్సవం రోజు నేను పెళ్ళి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని వరుడు మోహన్ బీబీసీతో అన్నారు.
ఫొటో సోర్స్, K.Anand/B.Narsinga rao
నువ్వలరేవులో పెళ్లి సందడి
పెళ్లైనా, ఎన్నికలైనా పెద్దలు చెప్పిందే వేదం
నువ్వలరేవు గ్రామంలో అందరూ పెద్దలమాటకి కట్టుబడి ఉంటారు. సామూహిక వివాహాలు కాకుండా..ఈ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడూ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. గ్రామ పెద్దలు నిర్ణయించిన వ్యక్తిని వారు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వస్తున్నారు.
"ఏ విషయంలో అయినా మా ఊరు మొత్తం ఒకే మాటపై ఉంటుంది. పెళ్లైనా, పంచాయతీ ఎన్నికైనా, వేరే ఏదైనా అంతే. మా గ్రామంలో 12 వేల జనాభా ఉంది. పెద్ద గ్రామం కావడంతో పెళ్లిళ్లకు బయటి సంబంధాల అవసరం ఉండదు. ఇప్పటి వరకు మా ఊళ్లో పెళ్లిళ్ల విషయంలో ఇప్పటివరకూ చిన్న గొడవ కూడా జరగలేదు" అని 2014లో పెళ్లి చేసుకున్న ముప్పాల రమణ బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)