దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం

  • శ్రుతి మేనన్
  • బీబీసీ రియాలిటీ చెక్
దిశా రవి
ఫొటో క్యాప్షన్,

దిశా రవి పర్యావరణ కార్యకర్త

ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ప్రేరేపించడాన్ని నిషేధించే చట్టం కింద ఇటీవల ఒక యువ సామాజిక కార్యకర్తపై కేసు పెట్టడంతో, వలస పాలన కాలం నాటి ఆ అత్యంత వివాదాస్పద చట్టం మళ్లీ చర్చనీయాంశమైంది.

22 ఏళ్ల దిశా రవి మీద ప్రయోగించిన ఆ చట్టం ఏమిటి? భారతదేశంలో ఈ చట్టాన్ని వినియోగించటం పెరుగుతోందా?

దేశద్రోహ చట్టం ఏమిటి?

ఇది భారత శిక్ష్మా స్మృతిలోని ఒక సెక్షన్. ‘‘ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రేరేపించడాన్ని లేదా ప్రేరేపించేందుకు ప్రయత్నించడాన్ని’’ శిక్షార్హమైన నేరమని ఈ సెక్షన్ చెప్తోంది. ఇందుకు జరిమానా లేదా గరిష్టంగా జీవిత ఖైదు లేదా ఈ రెండూ శిక్షగా విధించవచ్చు.

ఒక సోషల్ మీడియా పోస్టును లైక్ చేయటం లేదా షేర్ చేయటం, ఒక కార్టూన్ గీయటం, చివరికి స్కూల్లో నాటకం వేసినందుకు కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు.

భారతదేశం బ్రిటిష్ పాలన కింద ఉన్నపుడు 1870లలో చేసిన చట్టం ఇది.

సౌదీ అరేబియా, మలేసియా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, సూడాన్, సెనెగల్, టర్కీ దేశాల్లో కూడా దేశద్రోహం మీద చట్టాలు ఉన్నాయి.

అమెరికాలోనూ దేశద్రోహ చట్టం ఒక రూపంలో ఉంది. కానీ భావ ప్రకటనా స్వాతంత్ర్యాలను అమెరికా రాజ్యాంగంలో చేర్చినందున.. ఈ చట్టాన్ని ప్రయోగించటం చాలా అరుదు.

బ్రిటన్ దేశ ద్రోహ చట్టానికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన న్యాయ పోరాటం జరిగిన అనంతరం 2009లో దానిని రద్దు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో పెరిగిన దేశద్రోహం కేసులు

దేశంలో గత ఐదేళ్లలో వ్యక్తుల మీద దేశద్రోహం కేసులు నమోదవటం ప్రతి ఏటా కనీసం 28 శాతం మేర పెరిగిందని.. ఆర్టికల్-14 అనే న్యాయవాదులు, పాత్రికేయులు, విద్యావేత్తల బృందం సేకరించిన సమాచారం చెప్తోంది.

భారతదేశపు అధికారిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2014 వరకూ దేశద్రోహం కేసులను ప్రత్యేక వర్గంగా నివేదించటం మొదలుపెట్టలేదు.

అయితే.. ఆర్టికల్ 14 బృందం నివేదించిన కేసుల సంఖ్య కన్నా.. ఆ బ్యూరో నివేదించిన కేసుల సంఖ్య తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క దేశద్రోహం కేసునూ ఆ విధంగా రికార్డు చేయలేదు.

ఆర్టికల్-14 బృందంలో సమాచారాన్ని పర్యవేక్షించే లుభ్యాథి రంగరాజన్.. ఆయా కేసుల్లో మోపిన అభియోగాలు ఏమిటి అనేదానిని తెలుసుకోవటానికి తమ బృందం కోర్టు పత్రాలు, పోలీసు నివేదికలను సవివరంగా పరిశీలిస్తుందని చెప్పారు.

‘‘ఎన్‌సీఆర్‌బీ నివేదికలో కేసులను ప్రధాన నేరం పద్ధతిలో క్రోడీకరిస్తారు. అంటే.. ఏదైనా ఒక కేసు నేరాభియోగాల్లో దేశద్రోహం అభియోగం ఉన్నా కూడా.. దానికన్నా పెద్ద నేరాలైన అత్యాచారం, హత్య వంటి అభియోగాలు కూడా ఆ కేసులో ఉన్నట్లయితే.. ఆ నేరం కింద సదరు కేసును వర్గీకరిస్తారు’’ అని ఆయన వివరించారు.

అయితే, ఎన్‌సీఆర్‌బీ వివరాలు, ఆర్టికల్-14 వివరాలు రెండూ.. ఈ తరహా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని చూపుతున్నాయి.

గత దశాబ్ద కాలంలో దేశంలో నమోదైన మొత్తం దేశద్రోహం కేసుల్లో దాదాపు మూడింట రెండు శాతం ఐదు రాష్ట్రాల్లో - బిహార్, కర్నాటక, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో నమోదైనట్లు ఆర్టికల్-14 సమాచారం చెప్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నమోదు చేసిన కేసులు కూడా ఉన్నాయి.

కొన్ని రాష్ట్రాలు.. దేశంలో మావోయిస్టు గెరిల్లాలతో సుదీర్ఘంగా కొనసాగుతున్న అంతర్గత సంఘర్షణ ప్రభావిత రాష్ట్రాలు.

అయితే.. ఇటీవలి కాలంలో ఈ కేసుల సంఖ్య పెరగటానికి.. ప్రస్తుత రైతుల నిరసనలు, గత ఏడాది పౌరసత్వ చట్టాలకు మార్పులపై నిరసనలు, ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళ మీద సామూహిక అత్యాచారం మీద నిరసనలు వంటి పౌర నిరసనోద్యమాలకు మధ్య సంబంధం ఉందని ఈ సమాచారం చూపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

యూపీలో గత ఏడాది దళిత మహిళపై సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా దిల్లీలో ప్రదర్శన

దేశద్రోహం చట్టాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?

దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించడంపై కోర్టులు ప్రశ్నించటం, ఆదేశాలు ఇవ్వటం, వ్యాఖ్యానించటం జరిగింది.

నకిలీ వీడియోలు షేర్ చేశారనే ఆరోపణతో అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులకు దిల్లీ కోర్టు ఒకటి ఫిబ్రవరి మొదట్లో బెయిల్ మంజూరు చేస్తూ.. ‘‘దుష్టులకు కళ్లెం వేయాలనే పేరుతో అసమ్మతివాద స్వరాన్ని అణచివేయటానికి’’ దేశద్రోహం చట్టాన్ని ప్రయోగించజాలరని పేర్కొంది.

నిందితులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడాలని ప్రజలని ప్రేరేపించనిదే, లేదా ప్రజల్లో అశాంతిని రాజేసే ఉద్దేశంతో హింసకు ప్రేరేపించనిదే.. వారిపై దేశద్రోహం అభియోగాలు మోపజాలరని సుప్రీంకోర్టు కూడా స్పష్టంచేసింది.

దేశద్రోహం అభియోగాల్లో దోషులుగా నిర్ధారించే రేటు కూడా 2014లో 33 శాతంగా ఉన్నది 2019లో మూడు శాతానికి పడిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ఈ చట్టాన్ని ఒక బెదిరింపు ఎత్తుగడగా వాడుతున్నారని.. దేశద్రోహం చట్టం చెల్లుబాటును సవాల్ చేసిన సీనియర్ న్యాయవాది కోలిన్ గొంజాల్వెస్ చెప్తున్నారు.

‘‘ఈ చట్టాన్ని ఉపయోగించటం ద్వారా, యువతను జైళ్లలో పెట్టటం ద్వారా యువతీయువకులను రాజ్యం భయభ్రాంతులకు గురిచేస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ కేసు ప్రక్రియ దానికదే ఒక శిక్ష అని ఆయన అభివర్ణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కాంగ్రెస్ హయాంలో దేశద్రోహం కేసులో బుక్కయిన కార్టూనిస్ట్ అసీం త్రివేది

ఈ చట్టాన్ని అధికార బీజేపీ జాతీయ ప్రతినిధి టామ్ వడక్కన్ సమర్థించారు.

‘‘మనది అహింసను విశ్వసించే దేశం. కానీ దేశ ప్రతిష్టను ప్రభావితం చేసే పరిస్థితులను సృష్టించే, ప్రేరేపించే శక్తులు ఉన్నట్లయితే.. ఈ చట్టానికి ఇంకా అవసరమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ చట్టం కింద కేసుల్లో దోషులుగా నిర్ధారితమవుతున్న కేసులు తక్కువగా ఉండటంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఈ కేసుల్లో చాలా వాటికి తగినన్ని సాక్ష్యాలు లేవు. కొన్నిసార్లు ఈ కేసులను ఛేదించటం కష్టం’’ అని పేర్కొన్నారు.

2011లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం.. దేశద్రోహం అభియోగంతో అరెస్ట్ చేసి, నిరసనలు వెల్లువెత్తటంతో విడుదల చేసిన కార్టూనిస్ట్ అసీమ్ త్రివేది.. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయని అంటారు.

‘‘నాకు అదృష్టం కలిసొచ్చింది. నాకు విస్తృతమైన మద్దతు లభించకపోయినట్లయితే.. నా జీవితమంతా ఈ కేసును ఎదుర్పొంటూ, నా డబ్బులన్నీ దీనికోసం ఖర్చుపెడుతూ గడపాల్సి వచ్చేది’’ అని చెప్పారు.

‘‘అదే ఇప్పుడైతే ఆ అభియోగాలను ఎత్తేసి ఉండరని, నా జీవితమంతా కోర్టుల లోపలా, వెలుపలా నన్ను నేను రక్షించుకోవటానికి పోరాడుతూ ఉండాల్సి వచ్చేదని ఖచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)