మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో డీజిల్‌పై 820 శాతం, పెట్రోల్‌పై 258 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది- సోనియా గాంధీ లేఖ

పెట్రో ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ లేఖ రాశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పెట్రో ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ లేఖ రాశారు

దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు.

పెట్రోల్, డీజిల్ మీద భారీగా ఎక్సైజ్ డ్యూటీ విధించిన కేంద్ర ప్రభుత్వం, గత ఆరున్నరేళ్లలో రూ.21 లక్షల కోట్లు ఆర్జించందని ఆమె చెప్పారు.

ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసిన సోనియా గాంధీ, దానిని కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హాండిల్‌లో పోస్ట్ చేశారు.

గత ఆరున్నరేళ్లలో కేంద్రం డీజిల్ మీద 820 శాతం, పెట్రోల్ మీద 258 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంచిందని సోనియా అందులో రాశారు.

"ఎక్సైజ్ సుంకం ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి రూ.21 లక్షల కోట్లు ఆర్జించింది. ఎవరి కోసం వసూలు చేశారో, వారికి ఈ డబ్బు చేరాల్సుంటుంది" ఆమె అన్నారు.

"దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. ప్రజల ఆదాయం తగ్గిపోయింది. దేశంలోని మధ్యతరగతి ఇబ్బందులతో సతమతం అవుతోంది. ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. దీంతో, ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి. కానీ, ఇలాంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వం ఖర్చుపెట్టడంలేదు" అన్నారు.

ప్రభుత్వం ఇలాంటి తీవ్రమైన చర్యలు ఎందుకు తీసుకుంటోందో తనకు అర్థం కావడం లేదని సోనియా అన్నారు.

"దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఎప్పుడూ లేనంత స్థాయిలో పెరిగాయి. కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఇప్పటికీ అంత ఎక్కువ పెరగలేదు. నిజం చెప్పాలంటే, యూపీఏ ప్రభుత్వ హయాంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలతో పోల్చి చూస్తే, ఇప్పుడు దానిలో సగం ఉంది" అని సోనియా పేర్కొన్నారు.

"కానీ, లాభాలు ఆర్జించడానికి మీ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి వరుసగా 12 రోజులపాటు చమురు ధరలు పెంచింది. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 20 డాలర్లు ఉన్నప్పుడు కూడా కేంద్రం చమురు ధరలు తగ్గించకూడదనే నిర్ణయం తీసుకుంది. గత ఏడేళ్లుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి గత ప్రభుత్వాలే కారణమని మీరు నిందించడం విచారకరం. నిజానికి, 2020లో దేశీయ ముడి చమురు ఉత్పత్తి 18 ఏళ్లలో కనిష్ట స్థాయిలో ఉంది" అని సోనియా ఆ లేఖలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)