మాడుగుల హల్వా: ‘శోభనం రాత్రి కోసం స్పెషల్‌గా ఆర్డర్ చేసి తెప్పించే స్వీట్’

  • లక్కోజు శ్రీనివాస్
  • బీబీసీ కోసం
మాడుగుల హల్వా
ఫొటో క్యాప్షన్,

మాడుగుల హల్వా

మాడుగుల హల్వా తయారీ ప్రారంభమై దాదాపు ఒకటిన్నర శతాబ్దాలైనా దానికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ హల్వా కారణంగానే మాడుగుల ఓ పర్యాటక కేంద్రంగా మారిపోయింది.

రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకూ చాలా మంది ఈ హల్వాకు అభిమానులే.

విశాఖ వచ్చిన చాలా మంది నేతి వాసనతో ఘుమఘుమలాడే మాడుగుల హల్వాను రుచి చూడకుండా వెళ్లరు.

విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా అని గుర్తింపు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు మాడుగుల నుంచి 20కి పైగా దేశాలకు ఈ హల్వా ఎగుమతి అవుతోంది.

మొదట్లో గుమ్మడికాయ... తర్వాత గోధుమ పాలు

మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు సుమారు 140 ఏళ్ల కిందట అదే గ్రామంలో కుటుంబ పోషణకు మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. అప్పట్లో ఆయన బూడిద గుమ్మడి, కొబ్బరికాయ, ఖర్బూజాలతో హల్వా తయారు చేసి అమ్మేవారు.

హల్వా వ్యాపారంలో బాగా పోటీ ఉండటంతో మరో కొత్త స్వీట్‌ని తయారు చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ కొత్త స్వీటే... ఇప్పుడు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటున్న మాడుగుల హల్వా.

"మొదట్లో మాడుగుల హల్వా ఒక సాధారణ స్వీట్ మాత్రమే. దానినే ఏదైనా కొత్తగా చేయాలని మా తాతగారు ఆలోచించేవారు. కొన్ని ప్రయోగాలు చేసి బూడిద గుమ్మడి, కర్బూజ, కొబ్బరికాయల బదులు... గోధుమ పాలు, ఆవు నెయ్యి, జీడిపప్పు, పంచదారతో హల్వాని తయారు చేశారు. అంతకుముందు చేసిన హల్వా కంటే దీని రుచి బాగుండటంతో అమ్మకాలు బాగా పెరిగాయి. క్రమంగా మాడుగుల హల్వా పేరు ఊరు దాటి జిల్లా స్థాయికి చేరింది. దానిని మా నాన్నగారు దంగేటి మూర్తి ఇంకా ముందుకు తీసుకుని వెళ్లారు. ఆయన ఈ హల్వా ఘుమఘుమలు విదేశాల వరకూ పాకేలా చేశారు. అప్పట్లో మా తాతగారు చేసిన హల్వాకి కొద్దికొద్దిగా మార్పులు చేసి మూడు రకాలుగా తయారు చేస్తున్నాం. అన్నీ మాడుగుల హల్వానే...అన్నీ సూపర్ హిట్టే" అని మాడుగుల హల్వా సృష్టికర్త దంగేటి ధర్మారావు మునిమనవడు దంగేటి మోహన్ ‘బీబీసీ’కి వివరించారు.

పాకం కుదిరితేనే...

మాడుగుల హల్వా తయారు చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ముందుగా మేలు రకం గోధుమలు మూడు రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీస్తారు.

వాటిని ఒక రోజు పులియబెట్టి... వాటికి ఆవు నెయ్యి, పంచదార కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్‌ కోసం జీడిపప్పు, బాదం పప్పు వేస్తారు.

"మాడుగుల హల్వాని ఇప్పుడు మాడుగులలోనే కాకుండా చాలా మంది తయారు చేసేస్తున్నారు. అయితే అందరికీ మాడుగుల హల్వా రుచి రాదు. హల్వాని అందరూ తయారు చేయగలిగినా... దాని పాకాన్ని ఎక్కడ అపాలి? ఏ రుచి కుదిరినప్పుడు పాకాన్ని దించాలి? అనే టెక్నిక్ మాత్రం మాకే సొంతం. నిజానికి హల్వా తయారీ చూస్తే సులువుగానే అనిపిస్తుంది. గోధుమలను రోటిలో రుబ్బడంలో నైపుణ్యం, రుబ్బిన పాలను ఇనుప కళాయిలో వేసి, పాకం వచ్చే వరకు ఒకే వేడిలో మరగపెట్టడం, కట్టెలపైనే వండటం, అన్నింటి కంటే ముఖ్యంగా పాకం కుదిరిందా? లేదా? అని తెలుసుకోవడం పెద్ద పని. కనీసం 15, 20 ఏళ్లు అనుభవం ఉన్నవాళ్లే కళాయి దగ్గర పని చేస్తారు. పాకం సరిగ్గా చేస్తే హల్వా అదిరినట్టే. కానీ, సరిగ్గా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం మాత్రం కష్టం. దానికి టెక్నిక్ తెలిసుండాలి. అందుకే ఎంత మంది ఎన్ని రకాలైన హల్వాలు తయారు చేసినా మాడుగుల హల్వా రుచి దేనికీ రాదు. మా ఊరి పేరు చెడిపోతుందనే భయంతో మేం నాణ్యత విషయంలో అస్సలు రాజీపడం. ఇది కూడా మాడుగుల హల్వా రుచికి కారణమే" అని చెప్పారు దంగేటి మోహన్.

పెరిగిన వ్యాపారం

మాడుగుల హల్వాని ఓ శతాబ్దం పాటు దంగేటి కుటుంబీకులు మాత్రమే తయారు చేసేవారు. అయితే ఈ హల్వా వ్యాపారం బాగుండటం... విదేశాల్లో సైతం క్రేజ్ రావడంతో చాలా మంది ఈ హల్వాని తయారు చేయడం ప్రారంభించారు.

దీంతో క్రమంగా మాడుగులలో హల్వా తయారీ పెద్ద వ్యాపారంగా మారింది. ప్రస్తుతం హల్వా వ్యాపారాన్ని నమ్ముకుని చాలా కుటుంబాలు మాడుగులలో జీవిస్తున్నాయి.

"మాడుగుల హల్వా వ్యాపారం కారణంగా సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మాడుగుల హల్వా రుచి ఇతర ప్రాంతాల్లో తయారు చేసే వారికి రాకపోవడం వలనే ఇక్కడ ఎంత మంది హల్వా చేసినా... అందరికీ వ్యాపారం ఉంటుంది. ఇక్కడ హల్వా తయారీలో సంప్రదాయ పద్ధతులతో పాటు ఇక్కడ దొరికే నీరు, వాతావరణం కూడా అందుకు కారణమని నమ్ముతాం. మాడుగుల హల్వాకి ఉన్న వ్యాపారం వల్ల ఊరిలోని చాలా మంది హల్వా తయారీలోకి వస్తున్నారు. ఎవరి వ్యాపారం వారికి ఉంటుంది. డిమాండ్ బాగా ఉంటోంది. ఇప్పుడు ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి పంపగలుగుతున్నాం. నాణ్యతలో రాజీపడకుండా చేసే హల్వా ఖరీదు కేజీ రూ. 350 నుంచి రూ.400 వరకూ ఉంటుంది" అని మాడుగుల హల్వా వ్యాపారి దాసరి ప్రసాద్ చెప్పారు.

విదేశాల్లో క్రేజ్

మాడుగల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు రోజూ హల్వా సప్లై అవుతూ ఉంటుంది.

మాడుగుల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు, వెళ్లినప్పుడల్లా ఈ హల్వాను తీసుకెళ్లడంతో విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది.

"నేను ఆస్ట్రేలియాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. మొదట్లో అక్కడి స్నేహితులకు ఒకటిరెండు సార్లు మాడుగుల హల్వా తీసుకెళ్లి ఇచ్చాను. దాని రుచికి ఫిదా అయిన మా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు మా ఊరికి వెళ్తానా అని ఎదురు చూస్తుంటారు. మా అన్నయ్యగారి బాబు నామకరణం కోసం వచ్చాను. ఈ వేడుకలోనూ అతిథులకు మాడుగుల హల్వా పెడతాం. ఇప్పుడు మాడుగుల హల్వా శుభకార్యాల్లో తప్పనిసరి అయిపోయింది’’ అని నామకరణం ఫంక్షన్‌కి హల్వాని ఆర్డర్ చేయడానికి వచ్చిన కళ్యాణ్ బీబీసీతో అన్నారు.

‘‘గత 20 ఏళ్లలో దీని క్రేజ్ అమాంతం పెరిగింది. విదేశాల్లో ఉండే వాళ్లు అనేక మంది పండుగలు, ఫంక్షన్లకి ఆర్డర్ చేసి మరీ కొరియర్ల ద్వారా దీన్ని తెప్పించుకుంటారు. అమెరికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, అస్ట్రేలియా... ఇలా 20 దేశాల ప్రజలకు మాడుగుల హల్వా రుచి తెలుసు" అని ఆయన వివరించారు.

సినిమా వాళ్లు షూటింగ్ స్పాట్‌కు తెప్పించుకుంటారు..

విశాఖ ఏజెన్సీకి వెళ్లేందుకు మాడుగుల ముఖద్వారం. ఏజెన్సీలో తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా ఇలా అనేక భాషల సినిమాలు షూటింగులు జరుపుకొంటాయి.

షూటింగుల కోసం వచ్చిన వారంతా మాడుగుల మీదుగా ఏజెన్సీకి వెళ్తుంటారు. ఆ సందర్భంగా మాడుగుల హల్వాని రుచి చూస్తారు.

ఇలా రుచి చూసిన వారిలో సినీ నటులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కూడా ఉన్నారని మాడుగుల హల్వా వ్యాపారులు గర్వంగా చెప్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

మాడుగుల హల్వా కొంటున్న ‘జబర్దస్త్’ నటుడు

"షూటింగులకు వచ్చే సినీ నటులు ఈ హల్వాను తప్పక రుచి చూస్తారు. కొందరు వెళ్లినప్పుడూ, వచ్చినప్పుడూ కొంటారు. కొన్ని సార్లు ఆర్డరు చెప్తే మేమే షూటింగు స్పాట్లకు తీసుకుని వెళ్తాం. ఇక రాజకీయ నాయకులు మీటింగుల కోసమో, పథకాల ప్రారంభ సమయంలోనో వస్తే వారు కూడా మాడుగుల హల్వాని రుచి చూస్తారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సైతం మాడుగుల వచ్చినప్పుడు హల్వా రుచి చూసిన వారే. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మాడుగుల హల్వా రుచి చూసిన వారేనని మా పెద్దలు చెప్పారు. రావుగోపాలరావు, కృష్ణ, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, రవితేజ, చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రాజమౌళి ఇలా అనేక మంది ప్రముఖులు ఇక్కడకి వచ్చినప్పుడో...లేదా ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టించుకుని మరీ తిన్నవారే" అని స్థానిక వ్యాపారి సుబ్బారావు చెప్పారు.

తొలి రాత్రికి ప్రత్యేకంగా?

మాడుగుల హల్వాను తినడం వల్ల లైంగిక సామర్ధ్యం పెరుగుతుందన్న నమ్మకంతోనూ దీన్ని చాలా మంది కొంటుంటారు. ‘తొలి రాత్రి’ వేడుక కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు.

"చాలా మంది తొలిరాత్రికి పెట్టే స్వీట్లలో ఇది కచ్చితంగా ఉండేలా చూస్తారు. ఆర్డర్‌లు స్పెషల్‌గా తయారు చేయించుకుంటారు. అలాగే బాలింతలకు శక్తి కోసం కూడా మాడుగుల హల్వా ఇస్తారు" అని హల్వా వ్యాపారి రాంబాబు బీబీసీతో చెప్పారు.

"మాడుగుల హల్వాని గోధుమ పాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఆవుపాలతో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా పోషక పదార్థాలే. ఎటువంటి కల్తీ లేకుండా వీటితోనే తయారు చేసి...మోతాదుకు మించకుండా తింటే మాడుగుల హల్వా ఆరోగ్యానికి, శారీరక శక్తికి దోహదపడే అవకాశం ఉంది" అని న్యూట్రిషియనిస్ట్ కిరణ్ కుమార్ చెప్పారు.

వీడియో క్యాప్షన్,

శోభనం రాత్రి స్పెషల్ హల్వా.. 'మాడుగుల హల్వా'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)