కశ్మీర్ ప్యాడ్ ఉమన్: శానిటరీ ప్యాడ్ కొనడానికే సిగ్గుపడిన ఆ మహిళ ఇప్పుడు వాటిని అందరికీ పంచుతున్నారు

ఫొటో సోర్స్, इरफ़ाना ज़रग़र
పీరియడ్స్ పట్ల ఉన్న అపోహలను తొలగించాలంటారు ఇర్ఫానా జర్గర్
కర్ఫ్యూ, లాక్‌డౌన్, సామాజిక దూరాలను పక్కనబెట్టి ఇర్ఫానా ఒక లక్ష్యంతో పని చేస్తున్నారు. గత ఏడేళ్లుగా జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో చాలామంది మహిళలకు వారి పీరియడ్స్ సమయంలో ఆమె తయారు చేసే ప్యాడ్‌ల ఆధారపడ్డారు.
మహిళలకు పీరియడ్స్ సమయం ఎంత ఇబ్బందికరమైందో ఇర్ఫానాకు తెలుసు. చిన్నతనంలో తన కోసం ప్యాడ్ కొనుక్కోవడం కూడా తెలియదని ఆమె చెప్పారు. ‘‘మా నాన్నే నా కోసం కొనుక్కొచ్చేవారు. ఆయన చనిపోయాక చాలా ఇబ్బంది అయ్యింది. మా తమ్ముళ్లకు చెప్పడానికి ఇబ్బందిపడ్డాను’’ అని ఆమె వివరించారు.
ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఇర్ఫానా, తాను నివసించే పట్టణంలో స్త్రీలకు ఉన్న ఈ ఇబ్బందిని తొలగించాలని నిర్ణయించుకున్నారు. ‘‘నా దగ్గర డబ్బుంటే అందరికీ శానిటరీ ప్యాడ్‌లు కొనిచ్చేదానిని కదా అనుకునేదాన్ని’’అని ఆమె చెప్పారు.
ఫొటో సోర్స్, Irfana Zargar
ఎంతో మంది మహిళలకు శానిటరీ ప్యాడ్స్ అందిస్తున్న ఇర్ఫానా
ఇది ‘సిగ్గు’పడే విషయం
ఆసియాలోని చాలా దేశాలలో రుతుక్రమం సమయంలో స్త్రీలను అంటరానివారుగా చూస్తారు. పీరియడ్స్ రావడం స్త్రీలకు సిగ్గుపడే విషయంగా మారింది.
ఇర్ఫానా కూడా ఇలాంటి సామాజిక వాతావరణంలోనే పెరిగారు. జమ్మూకాశ్మీర్‌లోని భారత పాకిస్తాన్ సరిహద్దుల ప్రాంతాలు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయి. మహిళలు ఎప్పుడంటే అప్పుడు బైటికి వెళ్లడం సాధ్యం కాదు.
మగవాళ్లు లేని ఇళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కొన్నిసార్లు పురుషులు షాపుకెళ్లి ప్యాడ్లు కొనుక్కురావడానికి నిరాకరిస్తుంటారు.
ఆర్ధికంగా సంపన్నులైన మహిళలకు కూడా చాలాసార్లు ప్యాడ్లు కొనడం కష్టమని, దీనికి కారణం సిగ్గేనని, చాలామంది షాపుకు వెళ్లి అడగడానికి ఇబ్బంది పడుతుంటారని ఇర్ఫానా అన్నారు.
‘‘దుకాణానికి వెళ్లి అన్నా అదివ్వు అని అడుగుతుంటారు తప్ప ప్యాడ్ అనే మాట వాడటానికి కూడా వారు ఇబ్బంది పడతారు’’ అన్నారు ఇర్ఫానా. మహిళలందరికీ ప్యాడ్లు అందించడమేకాక, పీరియడ్స్‌పట్ల వారిలో ఉన్న అపోహలను కూడా తొలగించాలని ఆమె భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, Irfana Zargar
మార్పు కోసం ప్రయత్నం
ఇర్ఫానా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆమె దగ్గర డబ్బు లేదు. ఈ సమయంలో తండ్రి చేసిన సాయం మరువలేనిదని ఆమె అంటారు.
తండ్రి తప్ప కుటుంబంలో ఎవరూ ఆమె ప్రయత్నంపట్ల సానుకూలంగా ఉండేవారు కాదట.
"నేను చేస్తున్నది మొదట్లో నా సోదరుడికి నచ్చలేదు. పీరియడ్ కిట్‌ను పంచడం వరకు అతనికి ఓకే. కానీ సోషల్ మీడియాలో పీరియడ్స్ గురించి మాట్లాడటం అతనికి నచ్చేదికాదు.'' అని ఆమె చెప్పారు.
ఇర్ఫానా తన ప్రాజెక్ట్ కోసం నెలకు కనీసం రూ.10,000 ఖర్చు చేస్తున్నారు. ఖాళీ సమయంలో ప్యాడ్లను తయారు చేస్తుంటారు. స్నేహితులు, బంధువులు ఆమెకు సాయం చేస్తుంటారు.
ఫొటో సోర్స్, Irfana Zargar
అడ్డుపడ్డ కరోనా
కరోనా మహమ్మారి ఇర్ఫానా కృషికి అడ్డంకిగా మారింది. ప్యాడ్లను అవసరమైనవారికి చేర్చడానికి ఆమె చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
‘‘లాక్‌డౌన్ కారణంగా నగరం మొత్తం మూసేశారు. నేను కూడా ఇంట్లో బందీ అయ్యాను'' అన్నారామె.
దీంతో లాక్‌డౌన్ కాలంలో ప్రజలను చేరుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు ఇర్ఫానా. పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లి శానిటరీ ప్యాడ్లను తీసుకునేవారు సోషల్ మీడియా ద్వారా నేరుగా ఆమెను సంప్రదించడం మొదలు పెట్టారు.
తనకు వస్తున్న అభ్యర్ధనలకు అధికారులకు వివరించి, వారి నుంచి అనుమతి పొంది కిట్‌ను అవసరమైనవారికి అందించడం మొదలుపెట్టారు ఇర్ఫానా.
ఈ కిట్‌లో శానిటరీ ప్యాడ్, అండర్ ప్యాంట్, హ్యాండ్ శానిటైజర్‌లాంటివి ఉంటాయి.
షాపుల్లో దొరికే శానిటరీ ప్యాడ్ ఖరీదు రూ.40 నుంచి రూ.50 వరకు ఉంటుంది. కశ్మీరీ మహిళలకు ఇది పెద్ద మొత్తం. పరిస్థితుల్లో ఇర్ఫానా కిట్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.
ఫొటో సోర్స్, Irfana Zargar
శానిటరీ ప్యాడ్స్ కిట్‌తో ఇర్ఫానా
‘ఆమె దేవదూత’
శానిటరీ ప్యాడ్ కొనలేని వారిలో హసీనా బానో ఒకరు. ఆమెకు నలుగురు కూతుళ్లు. భర్త చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆమె బంధువులు చేసే సాయం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు.
"ఇర్ఫానా మా జీవితంలోకి రాక ముందు నేను, నా కూతురు పీరియడ్ కాలంలో పాత బట్టలు వాడేవాళ్లం’’ అని హసీనా చెప్పారు. ఇర్ఫానాను దేవదూతగా అభివర్ణించారు హసీనా.
ఫొటో సోర్స్, Irfana Zargar
హసీనా బానోతో ఇర్ఫానా
'ప్యాడ్ ఉమన్'
2018లో వచ్చిన అక్షయ్ కుమార్ సినిమా ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా తర్వాత ఇర్ఫానాను కశ్మీర్ 'ప్యాడ్ ఉమన్' అని అందరూ ఆప్యాయంగా పిలుస్తున్నారు. ఇర్ఫానా ప్రతి నెలా 350 పీరియడ్ కిట్లు, శానిటరీ బాక్సులను పంపిణీ చేస్తారు.
శానిటరీ ప్యాడ్ సదుపాయం అందుకోలేని అనేకమంది మహిళలు, యువతులకు కూడా వీటిని అందించాలని ఆమె భావిస్తున్నారు. ఇప్పుడు రీసైకిల్ చేయగల శానిటరీ ప్యాడ్‌ల తయారీపై కూడా ఆమె దృష్టి సారించారు.
తన ప్రయత్నం సముద్రంలో నీటిబొట్టువంటిదన్నారు ఇర్ఫానా. మహిళల ఆప్యాయతను అందుకుంటున్నకొద్దీ తనకు ఈ పని పట్ల ఇంకా ఉత్సాహం పెరుగుతుందని ఆమె అన్నారు.
‘‘మా నాన్న బతికి ఉంటే ఎంతో గర్వించేవారు’’ అన్నారు ఇర్ఫానా.
ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)