సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- గీతా పాండే
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Shaheen Abdulla
జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్‌ను బేషరతుగా విడుదల చేయాలని కేరళలో పోస్టర్లు అంటించారు
గత ఏడాది అక్టోబర్ 5వ తేదీ ఉదయం హాథ్‌రస్ కేసు కవర్ చెయ్యడానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆ గ్రామానికి వెళ్లాను.
అంతకు కొన్ని రోజుల ముందు హాథ్‌రస్‌లోని బుల్‌గడి గ్రామంలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు అగ్రకుల యువకులు సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె మరణించింది.
ఆ అమ్మాయిపై జరిగిన క్రూరమైన దాడి, ఆమె మరణం, కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోకుండా రాత్రికి రాత్రే ఆమెకు దహన సంస్కారాలు జరిపించడం.. అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యాంశమైంది.
ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని కలిశాను. నల్లటి పొడవాటి జుత్తు, చిరునవ్వుతో ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉండేదో వాళ్లంతా చెప్పారు.
ఫొటో సోర్స్, Raihana Sidhique
ఆమె శరీరం మీద అయిన గాయాల గురించి, బతికున్నపుడు, చనిపోయిన తరువాత కూడా ఆమె పట్ల పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి చెప్పారు.
అదే రోజు సిద్దిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ కూడా దిల్లీ నుంచి బుల్‌గడికి బయలుదేరారు. 41 ఏళ్ల సిద్దిక్ మలయాళ పత్రిక ఆళిముఖంలో పని చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా దిల్లీలోనే ఉంటున్నారు.
అయితే, బుల్‌గడికి సిద్దిక్ ప్రయాణం నా ప్రయణం కన్నా భిన్నంగా సాగింది.
హథ్‌రస్‌కు 42 కిమీ దురంలో సిద్దిక్ కప్పన్‌ను, తనతో పాటూ అదే కారులో వస్తున్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
గత వారానికి సిద్దిక్‌ను జైల్లో పెట్టి 150 రోజులు అవుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
సిద్దిక్ తన కుటుంబ సభ్యులకు, లాయర్‌కు అందించిన వివరాల ప్రకారం, తనను "ఈడ్చుకెళ్లి కర్రలతో తొడలపై చితకబాదారు. చెంపదెబ్బలు కొట్టారు. విచారణ పేరుతో సాయంత్రం 6 గంటల నుంచీ మర్నాడు పొద్దున్న 6 వరకు నిద్రపోనివ్వలేదు. ఇదంతా తీవ్ర మానసిక హింసకు గురి చేసింది."
డయాబెటిక్ పేషెంట్ అయిన సిద్దిక్‌ను మందులు కూడా వేసుకోనివ్వలేదు.
అయితే, పోలీసులు ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. శాంతిభద్రతలకు ముప్పు కలిగించే కుట్రలో భాగంగా.. కుల విద్వేషాలు రెచ్చగొట్టి, అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో సిద్దిక్ హాథ్‌రస్ దారి పట్టారని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న మిగతా ముగ్గురిపైన కూడా ఇవే నేరాలు మోపారు.
కారులో సిద్దిక్‌తో పాటూ ఉన్న మిగతా వ్యక్తులు కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థకు చెందిన వారని పోలీసులు తెలిపారు. పీఎఫ్ఐ రాజీ పడని నమ్మకాలతో కూడిన ఒక ముస్లిం సంస్థ.. ఉగ్రవాద బృందాలతో సంబంధాలు ఉన్నాయని తరచూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విశ్వసిస్తోంది.
ఫొటో సోర్స్, Raihana Sidhique
భర్త సిద్దిక్‌తో రైహానా
ఒక మూతపడిన వార్తాపత్రికలో జర్నలిస్టునని సిద్దిక్ చెప్పుకుంటున్నారు, వాస్తవానికి ఆయన కూడా పీఎఫ్ఐ సభ్యుడని యూపీ అధికారులు ఆరోపించారు.
ఈ ఆరోపణ నిజం కాదని కేరళ జర్నలిస్టుల సంఘం, సిద్దిక్ లాయర్, పీఎఫ్ఐ కూడా స్పష్టం చేశాయి.
కేరళ జర్నలిస్టుల సంఘానికి ఆఫీస్ బేరర్ అయిన సిద్దిక్... "యూపీ పోలీసులు తనపై తప్పుడు నేరాలు మోపుతున్నారని, చట్టవిరుద్ధంగా తనను నిర్బంధించారని" ఆరోపించారు.
సిద్దిక్ ఒక జర్నలిస్ట్ మాత్రమేనని, తన విధి నిర్వహణలో భాగంగా హథ్‌రస్ వెళ్లేందుకు ప్రయత్నించారని కేరళ జర్నలిస్టుల సంఘం నొక్కి చెబుతోంది. సిద్దిక్‌ను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
సిద్దిక్ పని చేస్తున్న అళిముఖం పత్రిక కూడా.. ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే దిశలోనే హథ్‌రస్ వెళ్ళేందుకు ప్రయత్నించారని స్పష్టం చేసింది.
ఫొటో సోర్స్, Shaheen Abdulla
తన భర్త నిర్దోషి అని చెబుతున్న రయిహనత్
మొదట సిద్దిక్‌పై చిన్న చిన్న బెయిలబుల్ నేరాలు మోపారని, రెండు రోజుల తరువాత చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద దేశద్రోహం నేరం మోపారని సిద్దిక్ లాయర్ విల్స్ మాథ్యూస్ చెప్పారు. యూఏపీఏ కింద బెయిల్ రావడం అసాధ్యం.
"నా క్లయింట్ 100% తటస్థ, స్వతంత్ర్య జర్నలిస్ట్. కొంతమందితో కలిసి ఒకే కారులో ప్రయాణిస్తే తను నేరస్థుడు అయిపోరు. ఒక జర్నలిస్ట్ తన వృత్తిలో భాగంగా అనేక మందిని కలవాల్సి ఉంటుంది. నిందితులతో సహా ఎంతోమందిని కలుస్తూ ఉంటారు. నిందితులతో కలిసి ప్రయాణించినంత మాత్రాన, అది అరెస్ట్ చెయ్యడానికి కారణం కాలేదు" అని మాథ్యూస్ అన్నారు.
సిద్దిక్‌ను నిర్బంధించిన తరువాత కొన్ని వారాల వరకూ బయటవారిని ఎవరినీ కలిసేందుకు అనుమతించలేదని కోర్టు పత్రాల్లో తెలిపారు.
ఆయన్ను అరెస్ట్ చేసిన 29 రోజుల తరువాత నవంబర్ 2న తన కుటుంబానికి మొదటి ఫోన్ కాల్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారు. ఆ తరువాత ఎనిమిది రోజులకు సిద్దిక్ తన భార్యతో మాట్లాడారు.
47 రోజుల తరువాత తన లాయర్ మాథ్యూస్‌ను కలుసుకోవడానికి అనుమతించారు. అప్పటికి మాథ్యూస్ సుప్రీం కోర్టులో దావా వేశారు.
తన భర్త నవంబర్ 2న తనకు కాల్ చేసేవరకు "ఆయన బతికున్నారో లేదో కూడా తెలియలేదని" సిద్దిక్ భార్య రైహానత్ చెప్పారు. ఆమె కేరళలోని మళపురం జిల్లాలోని ఒక గ్రామంలో ఉంటున్నారు.
90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మంచం పట్టిన తన తల్లిని కలుసుకునేందుకు సుప్రీం కోర్టు గత నెల సిద్దిక్‌కు ఐదు రోజుల బెయిల్ మంజూరు చేసింది. ఆయన తన తల్లితో ఉన్న నాలుగు రోజులూ ఆరుగురు యూపీ పోలీసులు, రెండు డజన్ల కేరళ పోలీసులు బయట కాపలా కాశారు.
ఫొటో సోర్స్, Getty Images
హాథ్‌రస్ రేప్ కేసుకు నిరసన తెలిపిన వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠినంగా వ్యవహరించారు
"తన తల్లి ఆరోగ్యం గురించి ఆయన బెంగపడ్డారు. మా ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు, పిల్లల గురించి దిగులు చెందారు" అని రైహానత్ చెప్పారు.
తన భర్త ముస్లిం కావడం వల్లే అరెస్ట్ చేశారని, ఆయన ఏ తప్పూ చేయలేదని రైహానత్ ఆందోళన వ్యక్తం చేశారు.
"బీఫ్ ఎన్నిసార్లు తిన్నావు? డాక్టర్ జాకిర్ నాయక్‌ను ఎన్నిసార్లు కలిశావు? ముస్లింలు దళితులకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అంటూ పోలీసులు తన భర్తను పదే పదే ప్రశ్నించార"ని రైహానత్ తెలిపారు.
అయితే, డా. జాకిర్ నాయక్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. డా. నాయక్‌పై విద్వేష ప్రసంగాలు, హవాలా కేసులు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం మలేసియాలో ఉంటున్నారు.
"సిద్దిక్ కప్పన్ అరెస్ట్ ఇస్లామోఫోబిక్ అని ఎవరైనా అంటే, అందుకు నేను ఆమోదిస్తాను" అని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ అభిలాష్ ఎంఆర్ తెలిపారు.
ఈ కేసును దాలా దగ్గరనుంచీ గమనిస్తున్న అభిలాష్.. ఇదొక "రాజకీయ కక్ష సాధింపు చర్య" అని, "రాజకీయమైన మతవిద్వేష హింస కేసు" అని, సిద్దిక్ "ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని" అన్నారు.
ఫొటో సోర్స్, Shaheen Abdulla
అనారోగ్యంతో బాధతపడుతున్న అమ్మను చూడడానికి సిద్దిక్‌కు ఫిబ్రవరి నెలలో అయిదు రోజులు బెయిల్ ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం అన్యాయంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
యోగి ఆదిత్యానాథ్‌ను ఇండియాలో అత్యంత వివాదాస్పదమైన, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విభజనకు పాల్పడే నాయకుడిగా అభివర్ణిస్తారు. ముస్లిం వ్యతిరేక హిస్టీరియాను రెచ్చగొట్టడానికి ఎలక్షన్ ర్యాలీలను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
హథ్‌రస్ అత్యాచార కేసులో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరును అంతర్జాతీయ సమాజం ఖండించింది. ముఖ్యంగా ఆ బాధితురాలి కుటుంబం అనుమతి లేకుండా, మీడియాకు దూరంగా ఆమెకు దహన సంస్కారాలు జరిపిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
హథ్‌రస్ కేసులో యువతి మరణించిన తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బాధితుల కుటుంబాన్ని కలుసుకోకుండా నిరసనకారులను ఆపేందుకు పోలీసులు వారిని తీవ్రంగా కొట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
నేను, సిద్దిక్ హథ్‌రస్‌కు ప్రయాణమైన ముందు రోజు అంటే అక్టోబర్ 4న యోగీ ఆదిత్యానాథ్ ఇచ్చిన ఒక ప్రకటనలో.. తమ రాష్ట్ర పురోగతిని చూడలేనివారు హథ్‌రస్ సంఘటనను అడ్డం పెట్టుకుని మాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు చేస్తున్న "అంతర్జాతీయ కుట్ర" అని ఆరోపించారు.
ఫొటో సోర్స్, Shaheen Abdulla
సిద్దిక్ అరెస్ట్ తరువాత.. భారతదేశంలో రోజు రోజుకూ జర్నలిస్టులకు భద్రత లేకుండా పోతోందని ప్రెస్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
గత ఏడాది 'రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్' తయారు చేసిన ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ జాబితాలోని 180 దేశాలలో ఇండియా 142వ స్థానంలో ఉంది. అంతకుముందు సంవత్సరం కన్నా రెండు స్థానాలు కిందకు దిగజారింది.
ఫిబ్రవరిలో రైతుల ఉద్యమాన్ని కవర్ చేస్తున్న ఎనిమిది మంది జర్నలిస్టులపై పోలీసులు కేసులు వేశారు. మహిళా జర్నలిస్టులు, ముఖ్యంగా ముస్లిం మతానికి చెందినవారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
సిద్దిక్ కప్పన్‌కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా పోలీసులు ప్రవేశపెట్టలేకపోయారని లాయర్ అభిలాష్ తెలిపారు.
అయితే, తమ చర్యల ద్వారా హథ్‌రస్ వెళ్లకూడదంటూ జర్నలిస్టులకు హెచ్చరికలు పంపడంలో మాత్రం విజయం సాధించారని ఆయన అన్నారు.
"సిద్దిక్‌ను అరెస్ట్ చెయ్యడం, ఒక సాధారణ వ్యక్తిని అరెస్ట్ చెయ్యడం ఒకటి కాదు. మీడియా నోరు మూయించడం అంటే ప్రజాస్వామ్యానికి ముగింపు పలికినట్టు లెక్క" అని సిద్దిక్ లాయర్ మాథ్యూస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం: సైకిళ్లు, ఎడ్ల బండ్ల మీద పన్నులు వేసిన ఈ నగరం.. అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది?
- మత మార్పిడి: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను ఎందుకు తీసుకొస్తున్నాయి?
- పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: రాష్ట్రంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఒవైసీ ఎంత ప్రభావం చూపగలరు?
- సౌదీ అరేబియాలో చమురు నిల్వలపై తిరుగుబాటుదారుల దాడులతో భారత్‌కు ఎంత నష్టం
- తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు
- హిమాలయాల్లో పొంచి ఉన్న పెను ప్రమాదాలు.. ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు?
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)