బ్యాంకుల సమ్మె: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతో సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరిస్తుందా?

ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ బ్యాంకుల రెండు రోజుల బంద్ సోమవారం నుంచి ప్రారంభమైంది.

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా 9 బ్యాంక్ యూనియన్ల గ్రూప్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఈ సమయంలో ప్రభుత్వ బ్యాంకుల బ్రాంచుల్లో డబ్బులు వేయడం, తీయడం, చెక్ క్లియరెన్స్ లాంటి పనులపై ప్రభావం పడుతుంది. అయితే ఏటీఎంలు పనిచేస్తుంటాయి.

ఈ సమ్మెలో 10 లక్షల మందికి పైగా బ్యాంక్ సిబ్బంది, అధికారులు ఉన్నారు.

మరోవైపు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ లాంటి బ్యాంకుల కార్యకలాపాలు మాత్రం మామూలుగానే కొనసాగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకుల సమ్మె ఎందుకు?

పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలు సేకరించాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ కంపెనీలతోపాటూ కొన్ని బ్యాంకులను ప్రైవేటుపరం చేయడం ద్వారా అంత మొత్తాన్ని సేకరించాలనుకుంటోంది.

కేంద్రం రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంకును పూర్తిగా ప్రైవేటీకరించాలనే ప్రతిపాదన ఇప్పటికే ఉంది. అయితే, ఏ రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తారు అనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత రాలేదు.

ఫిబ్రవరి 15న రాయిటర్స్ తన ఒక రిపోర్టులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయచ్చని అంచనా వేసింది.

ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుతం ప్రైవేటు రుణగ్రహీతగా ఉంది. 2019 జనవరిలో ఐడీబీఐ బ్యాంకులోని 51 శాతం వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. కేంద్ర మంత్రి మండలి 2018 ఆగస్టులో దీనికి ఆమోదముద్ర వేసింది. ఎల్ఐసీ ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లో ఉంది. అందుకే ఐడీబీఐని పూర్తిగా ప్రైవేటు బ్యాంకుగా భావించలేం. అయితే, ఎల్ఐసీ తన ఐడీబీఐ వాటాను మెల్లమెల్లగా విక్రయించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

బ్యాంకుల ప్రైటీకరణ ఎంతవరకూ కరెక్ట్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసమర్థ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు.

"వాటిని కార్పొరేట్ సంస్థలకు అమ్మినా కూడా అది పెద్ద తప్పిదం అవుతుంది. ఒక భారీ బ్యాంకును ఏదైనా విదేశీ బ్యాంకు అమ్మడం అనేది రాజకీయంగా సాధ్యం కాదు. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి చాలా తక్కువ సమాచారం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకును కొనుగోలు చేసే సామర్థ్యం ఒకే ఒక ప్రైవేటు బ్యాంకుకే ఉంది. కానీ, అది వీటిని కొంటుందా, లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు" అన్నారు.

ఇటీవల న్యూస్ చానల్ ఎన్‌డీటీవీ టౌన్‌హాల్ కార్యక్రమంలో కూడా మాట్లాడిన రఘురామ్ రాజన్ బ్యాంకుల ప్రైవేటీకరణను తప్పిదంగా చెప్పారు.

"ఒక ప్రైవేటు సంస్థకు బ్యాంకును అప్పగిస్తే, అది తమ కంపెనీ కోసమే రుణం తీసుకున్నప్పుడు, అక్కడ ఏవైనా నేరాలు జరిగితే, వాటిని పట్టుకోడానికి, వాటిపై నిఘా పెట్టడానికి మన దగ్గర సరైన వ్యవస్థ లేదు. అందుకే, నేను అలాంటి ఆలోచనను విరమించుకోవడం మంచిదనే చెబుతాను" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

తర్వాత బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ ఎలా ఉండచ్చు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాజన్ ప్రస్తుత ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

"మరింత సమర్థమైన ప్రొఫెషనల్స్‌ను తీసుకురండి, సీఈఓను నియమించడానికి, తొలగించడానికి బోర్డుకు అధికారాలు ఇవ్వండి. తర్వాత ప్రభుత్వ నియంత్రణ తొలగించండి. అలా చేస్తే, ఈ ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తూ, ప్రజల దగ్గరే ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఉండవు" అన్నారు.

"అది సాధ్యమే.. కానీ, దానికి సమయం పడుతుంది. దీనికోసం ఏడాది సమయం ఇచ్చారా, లేక ప్రైవేటీకరణ కోసం ఆ బ్యాంకులను సిద్ధం చేశారా.. అనేది నాకు తెలీదు. దురదృష్టవశాత్తూ మన ప్రైవేటీకరణ చరిత్ర చాలా నిరాశాజనకంగా ఉంది" అన్నారు.

పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు స్థాపించాలని ఆర్బీఐ సిఫారసు చేసిన తర్వాత, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గత ఏడాది నవంబర్‌లో దానిపై ఆందోళన వ్యక్తం చేసింది.

"కార్పొరేట్ సంస్థలకు తమ సొంత బ్యాంకులు స్థాపించడానికి అనుమతి ఇవ్వడం వల్ల విరుద్ధ ప్రయోజనాలు, ఆర్థిక శక్తి ఒకే చోట కేంద్రీకృతం కావటం, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు రావటం జరగవచ్చు" అని ఎస్ అండ్ పీ చెప్పింది.

కార్పొరేట్ బ్యాంకులకు యాజమాన్య హక్కులు లభించడం వల్ల ఇంటర్-గ్రూప్ రుణ ప్రక్రియ, నిధుల మార్పిడి లాంటి ప్రమాదాలు ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ నియంత్రణ వద్దంటున్న ఆర్థికవేత్తలు

ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా కూడా బ్యాంకుల ప్రైవేటీకరణపై వార్తా చానల్ సీఎన్‌బీసీ-టీవీ 18తో మాట్లాడారు. "ప్రతి వ్యాధికీ ప్రైవేటీకరణే పరిష్కారం" అనేది కూడా అంగీకరించకూడదని అన్నారు.

"మనం చాలా ఉదాహరణలు చూశాం. ఇదొక్కటే మార్గం అని అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయలేం. కార్యకలాపాలను, యాజమాన్యం నుంచి వేరు చేయడానికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి" అని ముంద్రా అన్నారు.

"ఇది ఒక మంచి మోడల్ కాగలదు. ఇక్కడ మరో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పనిచేసే స్వేచ్ఛ, ఇంకొకటి మూలధనం. వృద్ధి, మూలధనం పెరుగుదలకు అవకాశాలు ఉంటే, వివిధ ప్రాంతాలు కూడా దానిపై క్లెయిం చేస్తాయి కాబట్టి, అప్పుడు అక్కడ చాలా పరిమితులు కూడా ఉంటాయి".

దీనిని వివిధ దశల్లో చేసినా, దానివల్ల చాలా సాయం ఉంటుందని నిరూపితం అవుతుంది. ఎందుకంటే, యాజమాన్యం నుంచి భరోసా ఉంటుంది, మూలధనం పెంచే స్వేచ్ఛ ఉంటుంది.

మరోవైపు, ప్రైవేటు సెక్టార్‌కు యాజమాన్య హక్కు ఉన్నంత మాత్రాన పనిచేసే వ్యవస్థ మెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదని, అది చాలా సందర్భాల్లో కనిపించిందని.. ఎస్‌బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

"నేను ప్రభుత్వ బ్యాంక్ లేదా ప్రభుత్వ యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడ్డం లేదు. ప్రభుత్వం తమ పనితీరు మెరుగు పరచుకోడానికి ఆసక్తి చూపుతోందా.. లేక తన నియంత్రణ వదిలించుకోవడం మీద ఆసక్తి చూపుతోందా.. అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అందుకే మనం పనితీరు వ్యవస్థ, నియంత్రణ నుంచి యాజమాన్యంను దూరంగా ఉంచాల్సుంటుంది" అన్నారు.

ప్రభుత్వం ఒక పెట్టుబడిదారుడి పాత్ర పోషించాలని, తన నియంత్రణ వదులుకోవాలని ఆయన భావిస్తున్నారు.

"మీరు పెట్టుబడిదారుడు అయినప్పుడు, మీ ఆశలు ఒక పెట్టుబడిదారుడిలాగే ఉంటాయి. మీరు ప్రదర్శన మీద దృష్టి పెట్టండి. నిర్వహణలో జవాబుదారీతనం ఉండేలా చూసుకోండి. నియంత్రణను వదులుకోండి" అంటారు రజనీష్ కుమార్.

ఏయే బ్యాంకులను ప్రైవేటీకరిస్తారు, అది ఏ ప్రక్రియ ప్రకారం జరుగుతుందనేది అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, బ్యాంక్ యూనియన్లతోపాటూ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన అన్ని సంఘాలూ మార్చి 17 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి.

మరోవైపు, ఎల్ఐసీ అన్ని యూనియన్లూ మార్చి 18 నుంచి సమ్మె చేస్తామని ప్రకటించాయి. నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీల్లోని అన్ని సంఘాలూ ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)