చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి స్కామ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా క్యాబినెట్ అనుమతి లేకుండా అసైన్డ్ భూములను సేకరించారన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ విభాగం నోటీసులు జారీ చేసిందని ఏఎన్ఐ తెలిపింది.
చంద్రబాబు నాయుడుతోపాటు అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ, మరికొందరు అధికారులకు కూడా సీఐడీ నోటీసులు పంపినట్లు ఏఎన్ఐ పేర్కొంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని సీఐడీ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
రెండు సీఐడీ బృందాలు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనకు నోటీసులు ఇచ్చాయని, మార్చి 23న విచారణకు హాజరు కావాలని అందులో సీఐడీ పేర్కొన్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
ఇండియన్ పీనల్ కోడ్ 166, 167, 120 B రెడ్ విత్ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 1989, ఏపీ ఎసైన్డ్ ల్యాండ్ 1977లోని సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేశారు.
ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.
తెలుగుదేశం నేతల స్పందన ఏంటి ?
ఈ నోటీసులపై స్పందించిన నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, "తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు" అని ట్విటర్లో విమర్శించారు.
అధికారంలోకి వచ్చి 21 నెలలైనా ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఇప్పుడు కేసులు పెట్టడమేంటి అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టడానికి రామకృష్ణారెడ్డికి అర్హత లేదని, ఎవరూ ఫిర్యాదు చేయని కేసులో సీఐడీ కేసులు పెట్టడం అన్యాయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
దళితులకు ఎంతో మేలు చేకూర్చేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసిందని, ఇప్పుడు ఆయన పైనే ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసు పెట్టడం దారుణమని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు నాయుడిని వేధించడానికి ఆఖరికి ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసులను కూడా జగన్ ప్రభుత్వం వాడుకుంటోందని, ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బైటికి వస్తారని లోకేశ్ తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు అక్రమంగా, చట్టవిరుద్ధంగా తమ భూములను సేకరించారని మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తనకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని తాను సీఐడీ దృష్టికి తీసుకువచ్చినట్లు రామకృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
- మెహులీ ఘోష్: జాతరలో బెలూన్లు కాల్చిన ఈ షూటర్ గురి ఇప్పుడు ఒలింపిక్స్‌పై
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)