గుజరాత్: టీ షర్ట్‌ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్‌

విమల్ చూడాసమా

ఫొటో సోర్స్, ANANDKANABAR/twitter

ఫొటో క్యాప్షన్,

అసెంబ్లీకి టీ షర్టుతో రాకూడదని నిబంధనలు లేవని విమల్ చూడాసమా వాదించారు.

గుజరాత్‌ అసెంబ్లీ సమావేశానికి టీ షర్ట్‌ వేసుకుని వచ్చిన ఎమ్మెల్యే విమల్‌ చూడాసమాను స్పీకర్‌ రాజేంద్ర త్రివేది సోమవారంనాడు సభ నుంచి బయటకు పంపించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే టీ షర్టు వేసుకోరాదని ఎక్కడా నియమం లేదని ఎమ్మెల్యే వాదించగా, డ్రెస్‌ కోడ్‌పై నిబంధనలున్నాయని స్పీకర్‌ పేర్కొన్నారు.

సోమనాథ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విమల్‌ చూడాసమా ఇటీవల తరచూ టీ షర్టు వేసుకుని అసెంబ్లీకి సమావేశాలకు వస్తున్నారు. ఇలా టీ షర్టు వేసుకుని సభకు రావడం సభా మర్యాదకు విరుద్ధంగా ఉందని, షర్ట్‌ లేదా కుర్తా వేసుకుని రావాలని స్పీకర్‌ రాజేంద్ర త్రివేది వారం రోజుల కిందట విమల్‌ చూడాసమాకు సూచించారని ఎన్డీటీవీ తెలిపింది.

ఫొటో సోర్స్, PARIMALBHAI/twitter

ఫొటో క్యాప్షన్,

టీ షర్టులో అసెంబ్లీకి రావొద్దని స్పీకర్ ఇంతకు ముందే సభ్యులకు సూచించారు.

సభలో ఏం జరిగింది?

"జెర్సీలు, టీషర్టులు వేసుకుని సభకు రావద్దని ఒక నియమం ఉంది. ఒక ఎమ్మెల్యే సభా నియమాలకు విరుద్ధంగా మళ్లీ జెర్సీ వేసుకుని వచ్చారు. రెండు నిమిషాల కిందటే ఆ ఎమ్మెల్యే సభ నుంచి బైటికి వెళ్లారు. బయట మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటామో అనవసరం. కానీ సభలో ఉన్నప్పుడు సహా నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదు. ఇవాళ టీ షర్టు వేసుకుని వచ్చారు. రేపు ఏ బనియనో వేసుకుని వస్తారు. ఇలాంటి వాటిని నేను ఒప్పుకోను" అని అప్పుడే సభ నుంచి బయటకు వెళ్లిన చూడాసమా తీరుపై స్పీకర్‌ సోమవారం నాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించినట్లు 'ది ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌' పేర్కొంది.

కాసేపటి తర్వాత చూడాసమా సభలోకి వస్తుండగా ‘‘మీరు షర్ట్‌, కుర్తా, కోట్‌ వేసుకుని రండి’’ అని స్పీకర్‌ సూచించారు. అయితే ఎమ్మెల్యే విమల్‌ చూడాసమా స్పీకర్‌తో వాదనకు దిగి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నియమాలు ఏమీ లేవని అన్నారు.

ఎమ్మెల్యేల డ్రెస్‌ కోడ్‌పై స్పష్టమైన నిబంధనలున్నాయని స్పీకర్‌ త్రివేది ఆయనకు చెప్పారు. "మీరు మీ దుస్తులు మార్చుకుని వచ్చే వరకు మీరు చెప్పేది ఏదీ నేను వినను'' అని స్పీకర్‌ స్పష్టం చేసినట్లు 'ది ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌' వెల్లడించింది.

ఫొటో సోర్స్, Rajendra Trivedi/twitter

ఫొటో క్యాప్షన్,

డ్రెస్‌ కోడ్‌ విషయంలో అందరూ నిబంధనలు పాటించాలని స్పీకర్‌ రాజేంద్ర త్రివేది అన్నారు.

చూడాసమా వాదనేంటి?

ఎన్నికల్లో సోమనాథ్‌ నియోజకవర్గ ప్రజల వద్దకు టీ షర్టులోనే వెళ్లానని, సభకు కూడా ఇలాగే వస్తానని చూడాసమా వ్యాఖ్యానించగా, "మీరు ప్రజలకు దగ్గరకు ఎలా వెళ్లారో నాకు అనవసరం. కానీ మీరు స్పీకర్‌ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. మీకు ఇష్టమొచ్చిన దుస్తులు వేసుకుని రావడానికి ఇది ఆటస్థలం కాదు, మీరు విహారయాత్రలో లేరు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. అసెంబ్లీలో డ్రెస్‌కోడ్‌పై నిబంధనలు ఉన్నాయి" అన్న స్పీకర్‌ త్రివేది, విమల్‌ చూడాసమాను బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆయన్ను సభ వెలుపలికి తీసుకెళ్లారు.

ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చూడాసమాకు మద్దతుగా నినాదాలు చేయగా, ఇందులో అవమానంగా భావించాల్సింది ఏమీ లేదని, సభా మర్యాదలు పాటించడం వల్ల అందరి గౌరవం పెరుగుతుందని కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని అన్నారు.

"ఈ మధ్య మా మంత్రి కూడా ఇలాగే టీ షర్టు ధరించి వస్తే స్పీకర్‌ తప్పుబట్టారు. ఆయన ఇంటికి వెళ్లి వేరే దుస్తులు ధరించి వచ్చారు. ఈ విషయాన్ని సాగదీయకుండా ఇంతటితో వదిలేద్దాం" అని ముఖ్యమంత్రి రూపాని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)