ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో జాతీయ రాజకీయాలు మారిపోతాయా
- విజయన్, మొహమ్మద్ కవోసా
- బీబీసీ మానిటరింగ్

ఫొటో సోర్స్, Getty Images
భారత దేశ జనాభాలోని దాదాపు ఐదో వంతు మంది ప్రజలు మరో రెండు నెలల్లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొని కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు.
ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటుకావడంతో పాటు.. జాతీయ రాజకీయాలపై, ముఖ్యంగా భారత అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల భవిష్యత్తుపైనా ఈ ఎన్నికలు ప్రభావం చూపనున్నాయి.
నాలుగు రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మార్చి 27 నుంచి శాసనసభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఫలితాలు మే 2న ప్రకటిస్తారు.
ఈ ఐదు రాష్ట్రాల నుంచి మొత్తం 116 మంది ఎంపీలు భారత పార్లమెంట్ దిగువ సభలో ఉన్నారు. అంటే, మొత్తం సభ్యుల సంఖ్యలో అది ఐదో భాగం.
ఈ రాష్ట్రాల నుంచి ఎగువ సభలోనూ 51 మంది సభ్యులు(21 శాతం) ఉంటారు.
ఫొటో సోర్స్, TWITTER/AMITSHAH
విస్తరణకు బీజేపీ యత్నాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దాదాపు గత ఏడేళ్లుగా దేశంలో అధికారంలో ఉంది.
భారత పార్లమెంటులోని ఉభయ సభల్లో సంఖ్యాబలం ఉండడంతోపాటూ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను బట్టి చూస్తే, బీజేపీ భారత్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.
2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ భారత పార్లమెంట్ దిగువ సభలో 56 శాతం స్థానాలు గెలుచుకోగలిగింది. గత 35 ఏళ్లలో ఏదైనా ఒక పార్టీకి లభించిన అతిపెద్ద విజయం ఇదే.
అయితే, బీజేపీ మొత్తం దేశమంతా ప్రభావం చూపలేకపోయింది. 2019 ఎన్నికల్లో అది 11 పెద్ద రాష్ట్రాల్లో 75 శాతం పైగా స్థానాలు గెలుచుకున్నా, తమిళనాడు, కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.
ఇప్పుడు అవే రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
బీజేపీ 2019లో పశ్చిమ బెంగాల్లో 43 శాతం సీట్లు సాధించింది. అంతకు ముందు అది ఆ రాష్ట్రంలో ఎప్పుడూ 5 శాతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది.
ఇప్పుడు, బీజేపీ మొదటిసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీ తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో నేరుగా ఎప్పుడూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు అది రానున్న ఎన్నికలను కీలకంగా భావిస్తోంది.
ఫొటో సోర్స్, narendramodi/facebook
ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన అస్సాం కూడా బీజేపీకి అంతే కీలకం. ఆ పార్టీ ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉంది. మెల్లమెల్లగా అది రాష్ట్రంలో తన స్థితిని బలోపేతం కూడా చేసుకుంది. కానీ, ఈ ఎన్నికలకు ఏడాది ముందు అది ఆ రాష్ట్రంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
దేశంలో పౌరసత్వ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలకు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరిగాయి. ఆ సవరణల ప్రకారం మూడు పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు కేంద్రం పౌరసత్వం అందిస్తుంది. అస్సాంలో అలా స్థిరపడినవారు చాలా మంది ఉన్నారు.
పుదుచ్చేరిలో నాలుగేళ్ల నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ గత నెలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయింది. కొంతమంది అధికార పార్టీకి రాజీనామా కూడా ఇచ్చారు.
ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో దక్కే విజయం.. బీజేపీకి తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో, ఆ లోపు జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చూపడానికి ఉపయోగపడడంతోపాటూ రాజ్యసభలో తమ సంఖ్యాబలాన్ని పెంచుకోడానికి కూడా సహకరిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ 40 శాతం స్థానాలతో మైనారిటీలో ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
విపక్షాలకు కఠిన సవాలు
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం భారత పార్లమెంటులో విపక్షాలుగా ఉన్న పార్టీలకూ అంతే ముఖ్యంగా మారాయి. ఈ పార్టీల్లో స్వతంత్ర భారతదేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ కూడా ఉంది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భారత పార్లమెంటు దిగువ సభలో 21 శాతం స్థానాల షేరింగ్ ఉంది.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 421 స్థానాల్లో పోటీ చేసింది. కానీ 52 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. వాటిలో సగానికి పైగా స్థానాలు ఈ రాష్ట్రాల నుంచే వచ్చాయి.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్ని సీట్లు గెలుచుకున్నాయో, వాటిలో 65 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. మరోవైపు బీజేపీ, దాని మిత్రపక్షాలకు వచ్చిన స్థానాల్లో కేవలం 8 శాతం మాత్రమే ఈ రాష్ట్రాల నుంచి దక్కాయి.
పార్లమెంట్ దిగువ సభలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న రెండు పార్టీల్లో(బీజేపీ, కాంగ్రెస్ మినహా) తమిళనాడులోని పెద్ద ప్రాంతీయ పార్టీ డీఎంకే ఉంది. ఇది కాంగ్రెస్ మిత్రపక్షం. మరో పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఇది గత పదేళ్ల నుంచీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉంది.
ఈ రెండు పార్టీలకు పార్లమెంటు ఉభయసభల్లో దాదాపు 8 శాతం స్థానాలు ఉన్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలో వాటి పరిస్థితి అటుఇటు అయితే, పార్లమెంటులో కూడా వారి స్థితి బలహీనపడుతుంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతోంది?
- మోదీ జాబ్ దో, మోదీ రోజ్గార్ దో... ట్విటర్లో మార్మోగిపోతున్న హ్యాష్ట్యాగులు
- పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మీ 'టేక్ హోమ్ సాలరీ' రాబోయే రోజుల్లో తగ్గిపోనుందా... ఎందుకని?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)