ఆత్మహత్య చేసుకోవాలనుందని ఎవరైనా అంటే మనం ఏం చేయాలి?

  • మనీష్ పాండే
  • బీబీసీ ప్రతినిధి
ఒంటరిగా కూర్చున్న వ్యక్తి చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిస్తే... వారి విషయంలో ఎలా స్పందించాలో చాలా మందికి అర్థం కాదు.

ఇలాంటి సందర్భాల్లో బాధితుల చుట్టూ ఉండేవారు స్పందించే తీరు చాలా కీలకమవుతుంది. సరిగ్గా వ్యవహరిస్తే, వారికి ప్రాణం విలువ తెలిసేలా చేయొచ్చు. ఆత్మహత్య గురించిన ఆలోచనలకు దూరంగా తీసుకురావొచ్చు.

మానసిక ఆరోగ్యం విషయంలో కృషి చేస్తున్న సమారిటియన్స్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అలెక్స్ డోడ్ ఈ విషయంలో సలహాలు, సూచనలను బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

టీవీ ప్రజెంటర్ కరోలిన్ ఫ్లాక్ 2020లో ఆత్మహత్య చేసుకున్నారు

‘తేలిగ్గా తీసుకోవద్దు’

‘‘వాళ్ల సమస్యలను మనం పరిష్కరించలేకపోవచ్చు. వాళ్ల బాధ మనకు అర్థం కాకపోవచ్చు. కానీ, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెబితే, మనం అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు’’ అని అలెక్స్ అన్నారు.

ఆత్మహత్య ఆలోచన చేస్తున్నవారికి ధైర్యాన్నిచ్చేలా, వారికి అండగా ఉన్నామని చెప్పేలా చుట్టూ ఉన్నవారు వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అంటున్నారు.

‘‘వాళ్లకు ఏమని అనిపిస్తుందో అడగడం, దాని గురించి చర్చించడం చాలా కష్టమైన పనే. కానీ, అది చాలా అవసరం’’ అని అలెక్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రశాంతంగా ఉండండి’

‘‘ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్న వ్యక్తి సొంత కుటుంబంలోని వ్యక్తే అయితే, వారి పట్ల వ్యవహరించడం చాలా కష్టం. వారికి తమ అంతరంగం చెప్పుకోవాలని ఉంటుంది. ఇంకేదీ ఆలోచించలేని స్థితిలో వారు ఉంటారు. మొదటగా మనం చాలా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం’’ అని అలెక్స్ అభిప్రాయపడ్డారు.

ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నవారికి వారి బాధను బయటకు చెప్పుకునేలా స్వేచ్ఛను ఇవ్వడం చాలా ముఖ్యమని, పదేపదే ప్రశ్నిస్తూ వారి పట్ల ఓ అభిప్రాయానికి వచ్చేయకూడదని ఆమె అన్నారు.

‘‘కొన్ని ప్రశ్నలు అడగకూడదు. ‘నువ్వు లేకపోతే కుటుంబం ఏమవుతుంది?, కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించావా?’... అంటూ ప్రశ్నిస్తే వాళ్లు తమని ఎదుటివారు జడ్జ్ చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. చెప్పాలనుకున్న విషయాలను బయటకు చెప్పకుండా... తమలోనే దాచుకుని ఉండిపోతారు’’ అని అలెక్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘ఇలాంటి ప్రశ్నలు మేలు’

ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నవారికి ముందుగా మనం అండగా ఉన్నామన్న భావన కలిగించడం చాలా ముఖ్యమని అలెక్స్ అంటున్నారు.

వాళ్లు మరిన్ని విషయాలను మనతో పంచుకునేలా చేయాలని ఆమె చెప్పారు.

‘‘వాళ్లను మాట్లాడనిచ్చేలా ప్రశ్నలు అడగాలి. ‘ఎందుకు ఇలా బాధపడుతున్నావో చెబుతావా? ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావు? ఈ విషయంలో సాయం కోసం ఇదివరకు ఏమైనా ప్రయత్నాలు చేశావా?’... ఇలాంటి ప్రశ్నలు అడగాలి’’ అని ఆమె చెప్పారు.

‘‘అలా అని ప్రశ్నలు అడుగుతూనే పోవద్దు. వాళ్లు చెప్పేది ప్రశాంతంగా వినాలి. వాళ్లను గుండెల మీది నుంచి భారం దింపుకోనివ్వాలి’’ అని ఆమె సలహా ఇచ్చారు.

వాళ్ల చేతిలో చేయి వేయడం, ఆలింగనం చేసుకోవడం వంటి చర్యల ద్వారా వారికి అండగా ఉంటామన్న ధైర్యం కల్పించవచ్చని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

‘సాయం వైపు ప్రోత్సహించాలి’

వట్టి సలహాలతోనే ఆగిపోవద్దని... మానసిక వైద్యులను, ఇతర సహాయ కేంద్రాలను సంప్రదించేలా వారిని ప్రోత్సహించాలని అలెక్స్ అన్నారు.

‘‘అవసరమైన సాయం పొందమని మనం సలహా ఇవ్వాలి. ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది’’ అని అలెక్స్ అన్నారు.

‘‘నిజానికి వాళ్లు తమ బాధను బయట పెట్టారంటే, సాయం కోసం చూస్తున్నట్లే లెక్క. ఏ భావనలైనా తాత్కాలికమే. వారిని వాటి నుంచి బయటకు వచ్చేలా చేయడం ముఖ్యం’’ అని ఆమె చెప్పారు.

గమనిక: (మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)